500 మార్కులుతెచ్చుకున్నారు కానీ ఆస్థాయిలో సంస్కారాలు లేని ఈ చదువులెందుకు ?
>> Sunday, September 12, 2010
500 మార్కులు తెచ్చుకుంటున్నారు కానీ ఆ స్థాయిలో సంస్కారాలు పెంచలేని ఈ చదువులెందుకు ?
నిన్న పండుగకు పిల్లలు ఇంటికొచ్చారు. మా చిన్నవాడు నూజివీడులో iiit లో మూడవ సంవత్సరం లో కొచ్చాడు . పిల్లలు వాళ్ల చదువులు కాలేజీ ల విషయాలు మాట్లాడుతూ చెప్పిన ఒక సంఘటన మనసును వికలం చేసింది . వాళ్ల కాలేజీలో జూనియర్ అయిన ఒక పిల్లవానికి తండ్రిలేడు ,తల్లి కష్టపడి చదివిస్తున్నది. పిల్లవాడుకూడా బాధ్యతగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుని త్రిబుల్ ఐటిలో సీటు తెచ్చుకున్నాడు . మొన్న వీడు చెల్లించవలసిన ఫీజు నిమిత్తం వాళ్లమ్మ ఏడువేలరూపాయలు పంపినదట . కూలికెళ్ళి సంపాదించిన డబ్బది .బిడ్దకోసం ఆతల్లి ఎంత శ్రమపడిందో ! మిగతా డబ్బును పంపుతానని అంతవరకు ఇక్కడుంటే ఖర్చవుతాయి నీదగ్గరే జాగ్రత్తగా ఉంచుకోమని పంపినదట . వాడు చాలా జాగ్రత్తగా భద్రపరచుకున్నాడు . వాడు క్లాసులో ఉన్నప్పుడు తోటి స్టూడెంట్ ఎవడో వాడి రాక్ తాళం ఎలా తీశాడొ గాని తీసి డబ్బు కాజేశాడు . పాపం ఆపిల్లవాడు వచి ఒకటే ఏడ్వటం . హాస్టల్ పర్యవేక్షక ఉద్యోగులు కూడా మేమేమి చేయగలం ? మీ లోనే దొంగలుంటే !అని నిస్సహాయత వ్యక్తం చేశారట . మా అమ్మ ఎంత కష్టపడితే ఈ డబ్బుపంపినదో అన్నా ! అని ఏడుస్తున్నాడట వాడు .
నాన్నా వాడికి ఇంటికెళ్లటానికి కూడా డబ్బులు లేవు . మా ఫ్రెండ్స్ అందరం కలసి మూడువేలువసూలు చేసి వానికిచ్చాము . ఇంటికెళ్లటానికి చార్జీలు కూడా ఇచ్చిపంపాము అని మావాడు చెబుతుంటే నాచిన్నతనాన బీసీ హాస్టలో ఉండి చదువుకున్నరోజులు గుర్తొచ్చాయి .
వాళ్లరూమ్ లో వాల్లలో ఒకడు క్లాసుమధ్యలో బాగాలేదని లేచి వచ్చాడట ఆరోజు . మాకు వాడి మీద అనుమానం . పండుగ రోజుకల్లా వాడి డబ్బు వాడి దగ్గరపెట్టకపోతే తరువాత కంప్లైంట్ చేసి సంగతి తేలుస్తామని వాళ్లరూమ్ కెళ్ళి వార్నింగ్ ఇచ్చివచ్చాము నాన్నా అని చెప్పాడు మావాడు.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం . ఈ కాలేజీలో సీటురావాలంటే పదవతరగతిలో ఐదు వందల మార్కులపైన రావాలి.మేం చదువుకునేప్పుడు అన్ని మార్కులంటే అవిసంపాదించినవాడు అసాధారణ విద్యార్థి అనుకునేవారు.ఇప్పుడు అలాంటి పిల్లలు బాగాపెరిగారు. అంటే ఆస్థాయిలో మార్కులు తెచ్చుకున్నవాడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు కాదు . బాగా చదివేవాడే .మరి ఇంత కష్టపడి చదివేవానికి ,దేన్నైనా నిజాయితీగా మాత్రమే పొందాలనే మంచిసంస్కార వంతమైన ఆలోచనలు ఎందుకబ్బలేదు ? పరాయి సొమ్ము దోచుకోవటం పాపమని ఎందుకు అనిపించలేదు ? తనదొంగతనం వలన ఎదుటివానికి ఎంత బాధకలుగుతుందో ఆనే ఆలోచన ఎందుకు రాలేదు ? పోగొట్టుకున్నవాని దు:ఖాన్ని చూసైనా ఎందుకు బాధ కలగలేదు ? ఐదువందల మార్కులు సాధించగల శక్తిని ఇచ్చిన మన విద్యావ్యవస్థ సాధారణ మానవత్వాన్ని ఎందుకు పెంపొందించలలేకపొతున్నది ? ఒక ఉపాధ్యాయునిగా నా వృత్తిలో ఉన్న లోపాలేమిటి ? ఈ ఆలోచనలు నన్ను నిదురపోనివ్వటం లేదు . ఏడుస్తున్న ఆపసివాని మొహం కళ్ళుమూస్తే అస్పష్టంగా కనిపిస్తూ ఆందోళన కలిగిస్తున్నది.
ఇంతమంది విద్యార్థులను పాస్ చేస్తున్న మేము [ఉపాద్యాయులందరము] ఎందుకిలా సంస్కార హీనులుతయారయ్యేలాచేసి ఫెయిల్ అవుతున్నాము ? ఇది మా తప్పిదమేనా ?
[ఇక్కడ నా పరిశీలనలో స్వీయ అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాను . నిరుటిదాకా మన పీఠం తరపున నడిపిన పాఠశాల కు చుట్టుపక్కల పది గ్రామాలనుంచి పిల్లలు వచ్చేవారు . సాధారణంగా చిన్నచిన్న దొంగతనాలు తప్పులు చేసే పిల్లలు ఒకరిద్దరుంటారు ఎక్కడైనా . కానీ వీళ్లలో ఒక ఊరినుంచి వచ్చే పిల్లల్లో ఎక్కువమంది దొగతనం అంటే భయం లేనివాళ్ళు .దొరికినా తిట్టినా సిగ్గుపడనివాళ్ళు .ఆవకాశమొస్తే పెన్నులు పెన్సిల్లేకాదు బ్యాగుల్లో డబ్బు కూడా తీసేవాళ్లు ఎక్కువమంది కనపడేవారు . వీళ్ళేం లేనివాళ్లు కాదు వేరేప్రాంతం నుంచి మా ప్రాంతానికొచ్చి బీళ్ళను సస్యస్యామలం చేసిన రైతులు .బాగా సంపాదించినవాల్లే . వీళ్ల తోటివారు కొదరు మరికొన్ని గ్రామాలవాల్లున్నారు ఆపిల్లలు మాత్రం దొంగతనం లాంటివంటె భయపడతారు . ఎన్ని నీతి కథలు చెప్పినా ? తప్పుచేయటం పాపమని ఎంత చెప్పినా అవకాశం వస్తే మాత్రం వదలరు అని నిరూపితమైనది . ఇంకా లోతుగా పరిశీలిస్తే వీళ్ల ఊర్లోకి కూరగాయల బండివాడుగానీ ,ఏదైనా సామాన్లమ్ముకునే వాడుగానీ వెళ్తే కొందరు బేరమాడుతుంటెనే మరికొందరాడవాళ్ళు కాయలు, సామాన్లు కొంగుచాటుగా సర్దుతారని ఆవ్యాపారస్తులు తిట్టుకోవటం విన్నాను. పిల్లలు చెప్పుకుంటుంటేకూడా విన్నాను .]
ఇలా దొంగతనాలు చెడుపనులు అలవాటైవాడు బాగాచదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించినా వాని ద్వారా సమాజానికి జరిగేదేమిటి ? మార్కులుపెంచటమే తప్ప మానవత్వాన్ని పెంపొందించలేని మా విద్యాబోధనెందుకు ? ఇక్కడ ఫెయిల్ అవుతున్నది మేమే[ఉపాద్యాయులం]నా లేక మిగతావారికి బాధ్యతుందా ? దీని పరిష్కారానికి మార్గమేమిటి ? ఏ వ్యవస్థ ఫెయిల్ అయినా ఇబ్బమ్ది లేదు కానీ గురువులు ఫెయిల్ అయితే సర్వనాశనమేనని నమ్మే వాడిని నేను . పండుగరోజుకూడా మనశ్శాంతి లేకుండా ఆలోచిస్తూ గడుపుతున్నాను నేను పాస్ అవ్వగాలనా అని ................
8 వ్యాఖ్యలు:
మార్కుల తొ పాటు వాల్ల ఖర్చులు,సరదాలు,జల్సాలు కూడా పెరుగుతున్నాయి ,,ఇంట్లొ వాల్లు ఇచ్చెది చాలక ,,ఇలా చిన్న చిన్న దొంగతనాలు అలవాటు పడుతున్నారు ,,ఇంట్లొ వాల్లను భాద్యులు చెయలేము ,,పాపం వాల్లకెమి తెలుసు పిల్లలు ఇలా తయారు అవుతున్నారు అని...
చదువులు కొంటున్న ఈ కాలంలో మీవి archaic thoughts!
okkade kada tappu chesindi..
ఉప్పధాయులే కాదండి, తల్లితండ్రుల పెంపకాలు అంతే కాక వారు ఉంటున్న చుట్టుప్రక్కల ఇళ్లవాళ్ల (సమాజం) దృక్పధం, ఇక స్నేహితులు లాంటివి చాలా factors ఉంటాయి.
కొన్ని ఊర్లలో (కొన్ని బజారులలో) ప్రక్కవాడిది వీలయితే కాజేయటం తప్పు కాదు (మనకు అవసరం ఉన్నా లేకపోయినా) అనేది, వాళ్ల సంస్కృతి లో భాగమై ఉంటుంది, దానిని మార్చటం అంత సులభం కాదు, కాస్త తగ్గించ గలం అంతే!!
మీరు చెప్పిన విషయం సముచితమైనదే. పిల్లలు ఈ కాలంలో పాడవటానికి సమాజమంతా కృషి చేస్తోందా అనిపిస్తుంది నాకు.
- మా తేచెర్ పనికిమాలినవాడు అని అంటే, తల్లిదండ్రులు "ఛ! అదేం మాటరా" అనడం మానేసి, "పనికిమాలినవాడా? భలే పదం వాడావురా..." అని పిల్లలను ప్రోత్సహించడం.
- చిత్రాల్లో ఉపాధ్యాయవృత్తిని అతినీచంగా చూపించడం, దానికి ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మొ. వాళ్ళని వాడుకోవడం. దాని ద్వారా హాస్యాన్ని పండించాలనుకోవడం.
- ఉపాధ్యాయులు కూడా వ్యాపారాత్మకంగా మారడం. కేవలం మాకు జీతాలు ఇస్తున్న మేరకు చదువు చెప్తాము అనుకోవడం.
- పిల్లల్లో క్రమశిక్షణను నెలకొల్పాలని ఆలోచించేవాళ్ళను వెటకారం చెయ్యడం, వాళ్ళను హిట్లర్లుగా చిత్రీకరించడం మొ. జరుగుతున్నాయి.
ఒక్క మనదేశంలోనే కాదు. ప్రపంచమంతటా నీతిశాస్త్రాన్ని (moral science) ఏ డిగ్రీకైనా ఒక సబ్జెక్టుగా పెట్టాలన్నది నా అభిప్రాయం. చిన్నవయస్సులో ఐతే దొంగతనం తప్పు, బద్ధకం ఉండకూడదు, ఎవరి పని వారు చేసుకోవాలి మొ. నీతికథలతో బోధించాలి. పెద్దవారికి వృత్తిపరమైన నైతికవిలువలని (professional ethics) కోర్సులుగా పెట్టాలనేది నా అభిప్రాయం.
విద్య (Education) అంటే చదువు మాత్రమే అవుతోంది ఈ కాలంలో. అది జ్ఞానసముపార్జనకు మార్గమని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఇది మన ప్రపంచదౌర్భాగ్యం, కలికాలంలో బ్రతుకుతున్నాము అనడానికి ఒక ఋజువు.
పైన వ్రాసిన వ్యాఖ్యలన్నీ కొంచెం అటూ ఇటూగా నిజాలే.
మాతృదేవోభవ, పితృదేవోభవ, తరవాతే ఆచార్య దేవోభవ.
వీళ్లకి తోడు వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు, సమాజం. నిజమే.
బోధనకి సంబంధించి ప్రతీ వుపాధ్యాయుడికీ ఒక్కో పధ్ధతి యెలా వుంటుందో, అలాగే క్రమశిక్షణ నేర్పడం లోనూ, శిక్షించడం లోనూ. కొన్ని నాగరీకం, కొన్ని అనాగరీకం.
ఓ వుపాధ్యాయుణ్ణి, మీ తరగతిలో యెవరూ తెలుగులో మాట్లాడకూడదు--మన స్కూలు విద్యార్థులందరూ ఇంగ్లీషులోనే మాట్లాడాలి, లేకపోతే మీ జీతం కట్టు--అని యాజమాన్యం బెదిరించిందనుకోండి, ఆ వుపాధ్యాయుడు తన పధ్ధతిలో తప్పుచేసిన (తెలుగు మాట్లాడిన) వాళ్ళ మెడల్లో, "ఈ స్కూల్లో నేను తెలుగు మాట్లాడను--ఇంగ్లీషే మాట్లాడతాను" అని బోర్డులు తగిలించుకోమన్నాడే అనుకోండి, మన భాషాభిమానులూ, పత్రికలూ, టీవీలూ అంతగా ప్రతిస్పందించవలసిన అవసరం వుందా?
(వీళ్లనికూడా పొట్టకూటికోసం ఆ వుద్యోగాలు చెయ్యమనండి--తెలుస్తుంది!)
మీరు మనోవేదన చెందవలసిన అవసరం లేదంటాన్నేను!
ఒక ఉపాధ్యాయుని గా మీరు చాలా బాగ ఆలోచిస్తున్నారు అందుకు మీకు నా ధన్యవాదములు. మీ సందేహానికి నా ఈ "విద్య" టపా సమాదానం అవుతుంది అని బావిస్తున్నాను. www.bangaraiahh.blogspot.com
Post a Comment