శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాన్నగారి జీవితంలో నమ్మలేనంత నిజాలు శ్యామాశ్యాములు జరిపిన లీలలు [రసయోగి ..12]

>> Monday, September 13, 2010

రసయోగి _ 12

30. రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్

ఆ రోజు బిహారీచరణ దర్శన మహోత్సవం. రాధికాప్రసాద్ గారు బృదావనంలో కొత్తగా ఆశ్రమం నిర్మించిన రోజులు. బాంకే బిహార్జీ మందిరంలో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది ఆయనకు అప్పటి వయస్సు 86 సంవత్సరములు. వేల, లక్షల సంఖ్యలో ఆ రోజు భక్త బృందము బిహారీజీని దర్శించటానికి వచ్చారు. రాధికాప్రసాద్ గారు కూడా బిహారీజీని దర్శించాలని బయలుదేరినారు. వయస్సు మీద పడింది. ఓపిక తగ్గింది. కానీ రాధాకృష్ణుల విషయం అంటే చాలు ఆయన యువకుడై పోతారు. ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆయన వెంట అంజనీ మాత కూడా బయలుదేరారు. దేవాలయానికి ఒక అరకిలోమీటరు దూరంనుండే కిటకిట లాడుతున్న జనసందోహం కనిపించింది. ఆ జనాన్ని చూచిన అంజనీదేవికి భయం వేసింది. "నాన్నగారికి ఎలా బిహారిజీ దర్శనం చేయించాలి" అని ఆలోచించసాగింది. ఇంతలో ఇరువురు యువకులు వారి వద్దకు వచ్చారు. _ " ఏమమ్మా ! మహారాజ్ ను మందిరానికి చేర్చాలా ? మీరు వదిలివేయండి. మేము వారిని పట్టుకొని మందిరానికి నడిపిస్తాము" అని పల్కారు. వారు ఎవరో తెలియదు. అంతకు ముందెన్నడూ వాళ్ళను చూడలేదు. వారిలో ఒకరు నల్లగా ఉన్నాడు, ఒకరి బంగారు ఛాయలో ఉండెను. వారు రాధికాప్రసాద్ గారి చేతులను చెరొక ప్రక్క పట్టుకొని అడ్డుగా ఉన్న వారిని ప్రక్కకు నెడుతూ _" దారివ్వండి" అని కేకలు వేస్తూ రాధికాప్రసాద్ గారిని తీసుకొని మందిర ద్వారము దాకా తీసుకొచ్చి అక్కడ అంజనీమాతతో మహారాజ్ ను మందిరానికి చేర్చాము. ఇక మీరు మహారాజ్ బాధ్యత వహించండి అని పల్కిరి. వారికి పండ్లు ఇద్దామని సంచిలోనుంచి పండ్లు తీసి తల ఎత్తే లోపలలోనే వారిద్దరూ అదృశ్యులైనారు. చాలాసేపు వారికొరకు చూశారు కానీ వారు కన్పడలేదు. నాన్నగారిని జాగ్రత్తగా మందిరంలోకి తీసుకెళ్ళి స్వామి దర్శనం చేయించి జాగ్రత్తగా ఆశ్రమానికి తీసుకొని వచ్చారు. శ్యామాశ్యాములే ఆ రూపంలో వచ్చారేమో !

బృందావన ధామమున "రాధాకుండ్" అను ఒక పవిత్ర తీర్ధమున్నది. దాని ప్రక్కనే శ్యామకుండ్ యను మరొక తీర్ధమున్నూ యున్నది. ఒకసారి శ్యాముడు కంసుడు తన మీదకు పంపించిన ఒక రాక్షసుని సంహరించెను. అతను గోరూపము ధరించి కృష్ణుడితో పోరాడి అశువులు బాసెను. దానికి రాధారాణి కృష్ణునితో _ " నీవు రాక్షసుని చంపి మంచి పని చేసినావు. కానీ గోరూప ధారియైన వానిని చంపినావు. నీవు గోహత్య చేసినట్లే. ఆ పాపము నుండి విముక్తి నీకి కలుగవలెనన్న నీవు సమస్త తీర్థములలోని జలమును తెచ్చి ఇక్కడ ఒక "కుండము "ను నిర్మింపుమని పల్కెను. శ్యాముడు అటులనే ఒక కుండమును నిర్మించెను. అదే సమయమున రాధాదేవియు ఆ కుండ్ కి ప్రక్కనే తనూ ఒక కుండ్ ని నిర్మించి సమస్త తీర్థజలమును యందు ఆవాహింపచేసెను" అని స్థల పురాణము తెలుపుచున్నది. ప్రతి సంవత్సరము ఆ శ్యామ్కుండ్, రాధాకుండ్ ల ఆవిర్భావము జరిగిన రోజు ఆ తీర్థములకు వచ్చి స్నానము చేసిన వారికి మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసము. అందుకని ముఖ్యంగా ఆ రోజు అనేకమంది అక్కడకు వచ్చి ఆ తీర్థములలో స్నానము చేసి పునీతులగుచుందురు. అంతేకాక ఆ రోజున అక్కడికి అనేకమంది మహాత్ములు, సాధువులు వచ్చెదరు. వారి దర్శన భాగ్యము కూడా ఒక విశేషము. రాధికాప్రసాద్ గారు కూడా రాధాకుండ్, శ్యామ్కుండ్ లలో స్నానమాచరించుటకు అక్కడకు చేరిరి. స్నానమాచరించిరి.

ఆ సమయంలో ఆ పవిత్ర తీర్థంలో స్నానమాచరించుటకు మాంఫీర్ మహారాణి కొంతమంది మహాత్ములతో అక్కడకు వచ్చింది. ఆమె గొప్ప సాధకురాలు. రాధామాధవ చింతనలో తన జీవితాన్ని పునీతం చేసుకుంటున్న వనితా శిరోమణి. సమస్తమూ పరిత్యజించి సాధు జీవితమును గడుపుతున్న యోగిని. ఆమెను దర్శించటానికి జనం తండోపతండాలుగా గుమికూడారు. అనేకమంది ఆమె పాదాలకు నమస్కారం చేశారు. రాధికాప్రసాద్ గారు కూడా ఆ మహాత్మురాలిని దర్శించాలని వెళ్ళారు. ఆమెను సమీపించి పాదాలకు నమస్కరించారు. అంతట ఆ యోగిని ఒక్క ఉదుటన లేచి రాధికాప్రసాద్ గారి చేతులను తనచేతులలోకి తీసుకొని _" నాయనా ! నీవు నాకు నమస్కారం చేయుట ఏమిటి ? ఆ రాధారాణియే నిన్నంటియున్నది. నేను నీకు నమస్కారం చేయాలి" అని ఆవిడ రాధికాప్రసాద్ గారికి నమస్కారం చేసింది. చుట్టూ చేరిన ప్రజలు ఈ సంఘటన చూచి ఆశ్చర్య చకితులైనారు. ఇరువురూ మహాత్ములే. ఎంతో శక్తి సంపన్నులే. అయినా ఎవరిలోనూ అహంకారము, గర్వము లేశమాత్రమునైననూ లేవు. రాధామాధవులంటే వారికి ఎంతో భక్తి, ప్రేమ. సాధు మహాత్ములన్న వారిరువురి హృదయాలలో ఎంతో నిష్ఠ, విశ్వాసం, సేవాభావన నెలకొనియుండెను. వారిరువురినీ దర్శించి ప్రజలు పరవశులైనారు.

బృందావన భూమి మాధుర్య భూమి. రాధారాణి విలాసభూమి. అక్కడ రాధారాణి భక్తబృందమును ఆనంద భావ లహరిలో ఓలలాడిస్తూ ఉంటుంది. అనేక లీలావిన్యాసాలు జరుపుతూ ఉంటుంది.

ఒకసారి బృందావనంలోని రాధామహాలక్ష్మి ఆశ్రమానికి అనేకమంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. వారందరికి తెలుగు భాష తప్పితే మరొకటి రాదు. వారందరికి బృందావన ప్రదేశాలు, వింతలు చూపించటానికి ఎవరో ఒకరు అన్నీ తెలిసిన వారు వాళ్ళతో వెళ్ళాలి. అందరూ అంజనీమాతను రమ్మని అడిగారు. ఆమె రాధికాప్రసాద్ గారికి చెప్పి వాళ్ళతో బయలుదేరారు. నాన్నగారు (రాధికాప్రసాద్ గారు) నేనూ వస్తానని పల్కారు. మీరు మాతో నడవలేరు.మీరు అక్కడే విశ్రాంతి తీసుకోండి" అని చెప్పి బయలుదేరారు. దానికి రాధికాప్రసాద్ గారు _ "అవును తల్లీ ! నేను మీతో సమానముగా నడువలేను కదా ! ఏం చేద్దాం ? మీరు వెళ్ళి రండి నేను ఇక్కడే ఉంటానులే" అని పల్కారు. వాళ్ళు వెళ్తుంటే రాధికాప్రసాద్ గారు వారి వంకే చూస్తూ ఉన్నారు. అంజనీమాతకు నాన్నగారిని చూస్తుంటే, అలా ఆయనను వదిలి వెళ్ళాలంటే చాలా బాధ వేసింది. కానీ తప్పదు. వచ్చిన భక్తులందరూ రెండు మూడు రోజులక్ంటే అక్కడ ఉండలేరు. కారణం వాళ్ళూ ఏవో ఉద్యోగాలు చేస్తూ సెలవులు పెట్టుకొని వచ్చారు. వీలైనంత ఎక్కువ ప్రదేశాలు చూడాలని వారి ఆకాంక్ష. తప్పనిసరై ఆమె వాళ్ళతో బయలుదేరారు. ఆ రోజు బృందావనంలో "బిహారిజీ" పుట్టినరోజు.

ఆశ్రమంలో రాధికాప్రసాద్ గారు ఏకాంతంగాకూర్చొని యున్నారు. ఆయనకు ఎదురుగా రాధా_మాధవుల సుందరమూర్తులు. నాన్నగారు (రాధికాప్రసాద్) తదేకంగా ఆ మూర్తులను చూశారు. శ్యాముని విగ్రహం వంక చూసి _" నాయనా ! నిన్ను చూడాలని ఉంది. కానీ ఏమి చేయను ? నీ దగ్గరకు ఎవరు తీసుకెళ్తారు? " అని పల్కారు. మరికొద్ది నిమిషములలో ధ్యానంలో మునిగిపోయారు. ఇంతలో ఒక 13, 14 సంవత్సరముల కుర్రవాడు అక్కడ్కు వచ్చి "మహారాజ్, మహారాజ్" అని కేకలు వేయగా రాధికాప్రసాద్ గారు బయటకు వచ్చి చూసిరి. ఒక నల్లని కుర్రవాడు నవ్వుతూ కనబడెను. వాడి చేతిలో ఏవో పదార్థములుండెను. అంతట రాధికాప్రసాద్ గారికి నమస్కరించి _ " బాబా ! ఇదిగో ఇది బిహారిజీ ప్రసాదం. మీరు ఇక్కడ ఉంటారని,ఇది మీకు అందజేయమని బిహారిజీ మందిర ధర్మకర్త దీనిని మీకు పంపించారు" అని పల్కాడు. నాన్నగారు దానిని అందుకొని పిల్లవానికి తన వద్దకు ఆంధ్రప్రదే్శ్ నుంచి వచ్చిన తియ్యని మామిడి పండుని ఒకటి ఇచ్చెను. వాడు ఆనందంగా గంతులు వేస్తూ వెళ్ళిపోయెను. రాధికాప్రసాద్ గారు మరల ధ్యానంలో మునిగిరి. ఇంతలో బిహారిజీ మందిర ధర్మకర్త అక్కడకు వచ్చి _ " ఈ రోజు బీహారిజీ పుట్టినరోజు. మీకు మిఠాయిలు ఇద్దామని వచ్చాను" అని పల్కెను. దానికి నాన్నగారు _ " ఇంతకు ముందరేగా మీరు పంపించారని ఒక కుర్రవాడు మిఠాయిలు తెచ్చి ఇచ్చాడని" పల్కారు. దానికి ఆధర్మకర్త _" నేను పంపించానా ? నేను ఎవరినీ పంపించలేదే" అని ఆశ్చర్యపడెను. అంతట రాధికాప్రసాద్ గారు _" మరి నాదగ్గరకు వచ్చినదెవరు? నేను అతనికి మామిడి పండు కూడా ఇచ్చానే" అని పల్కిరి. ధర్మకర్త కొలదిసేపు రాధికాప్రసాద్ గారితో ముచ్చట్లాడి అక్కడనుండి వెళ్ళిపోయెను. నాన్నగారి దృష్టి మరల శ్రీ కృష్ణుని విగ్రహం మీద పడింది. అక్కడ ఇప్పుడు విగ్రహంలేదు. ఆ పిల్లవాడు మామిడి పండు తింటూ దర్శనమిచ్చాడు.

ఒకసారి "హరికుంజ్" లో రాసలీల ప్రదర్శన జరుగుతున్నది . రాధికాప్రసాద్ గారి కొంతమంది భక్త బృందంతో కలసి ఆ ప్రదర్శన చూడటానికి ఆ స్థలమునకు వెళ్ళిరి. అంజనీమాత కూడా వారితో వెళ్ళెను. ప్రదర్శన అద్భుతంగా ఉంది. గోపేశ్వరలీల. ప్రదర్శన ముగిసే సరికి బాగా చీకటి పడింది. వారు బృందావనానికి వచ్చి కొద్ది రోజులే అయ్యింది. దార్లు సరిగా ఇంకా బాగా గుర్తు పట్టలేని స్థితి. వచ్చిన భక్త బృందం ప్రదర్శన మధ్యలోనే ఆశ్రమానికి చేరుకున్నారు. ప్రదర్శన ముగిసేసరికి రాధికాప్రసాద్ గారు, అంజనీమాత తప్పితే ఎవరూ లేరు. వారికి దారి సరిగా తెలియదు. ప్రదర్శనలో మునిగి చీకటి పడుతున్న విషయాన్ని మరిచిపోయారు. రాధికాప్రసాద్ గారిని తీసుకొని చీకటిలో ఎలా ఆశ్రమానికి చేరాలా అని అంజనీమాత గాబరా చెందసాగారు.

ఇంతలో ఒక నల్లపిల్లవాడు ఒక రిక్షా తొక్కుతూ అక్కడకు వచ్చాడు. నాన్నగారు రిక్షాను పిలిచి "వస్తావా" అని అడిగారు. " ఓవస్తాను" అని పిల్లవాడు సమాధానమిచ్చెను. వాడ్ని చూస్తే 13, 14 సం| | లు మించి వయస్సు ఉండదు. చిన్న పిల్లవాడు. వాడు రాధికాప్రసాద్ గారిని, అంజనీమాతను ఎక్కించుకొని రిక్షా ఎలా త్రొక్కగలడు అనే సందేహము కలిగి అంజనీమాత ఆ పిల్లవానితో "చూస్తే చిన్న పిల్లవాడిలా ఉన్నావు. మమ్మల్ని ఎక్కించుకొని రిక్షా నడపగలవా ?" అని ప్రశ్నించెను. దానికి వాడు _" ఓ మీ ఇద్దరినేమిటి ? ఎంతమందినైనా ఎక్కించుకోగలను, నడపగలను" అని పల్కెను. అంజనీమాత అడ్రస్ చెప్పి రిక్షా పోనివ్వమని పల్కెను. దానికి వాడు నేనూ ఇక్కడికి కొత్తగా వచ్చాను, నాకూ దారి సరిగా తెలియదు. మీరు ఎటు వెళ్ళాలో చెబితే మిమ్మల్ని అటు తీసుకెళ్తాను" అని పల్కెను. ఊరికి కొత్త కావటం వల్ల దారి సరిగా కనిక్కోవటం కష్టం. అక్కడ ఈ రిక్షా తప్పితే మరొక రిక్షా ఏదీ లేదు. ఏం చేయాలా? అని ఆలోచనలో పడ్డారు. ఇంతలో బంగారు వన్నె గల పిల్లవాడు అక్కడకు వచ్చాడు. అతనికి సుమారు అదే వయస్సు ఉంటుంది. అతను వచ్చి నల్ల పిల్లవానితో "నేను దారి చూపిస్తాను. వారి ఆశ్రమం నాకు తెలుసు. నాతో రా" అని పల్కి తను ముందర దారి చూపించసాగెను. ఎవరినీ అడగకనే రిక్షా ఆశ్రమం చేరెను. నాన్నగారిని జాగ్రత్తగా రిక్షాలో నుంచి ఆ పిల్లలు క్రిందికిదింపారు. అంజనీమాత వారికి లడ్లను ఇచ్చింది. వారికి డబ్బులు ఇచ్చుటకై డబ్బుల కొరకు మందిరంలోకి వెళ్తూ "నాయనా డబ్బులు తెస్తాను ఉండండి" యని లోపలికి వెళ్ళె డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసరికి అక్కడ పిల్లలూ లేరు. రిక్షా లేదు. డబ్బులు తీసుకోకుండా పిల్లలు ఎటుపోయారు ? వారి కొరకు కొద్దిసేపు చూసి వారు కనబడపోయేసరికి ఆశ్రమం లోపలకు వచ్చేశారు. లోపలకి వచ్చి నాన్నగారికి విషయం చెప్పారు. రాధికాప్రసాద్ గారు శ్యామాశ్యాముని విగ్రహాలవంక చూశారు. అక్కడ వాళ్ళ దగ్గర లడ్డూ కనబడింది. లడ్డు అక్కడ ఎవరు పెట్టారు ? ఆశ్రమంలో అందరినీ అడిగారు. ఎవరూ మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. మరి లడ్డూ అక్కడకు ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోయారు. శ్యామాశ్యాములే ఆ రిక్షా వాని రూపంలో వచ్చి ఆశ్రమం దాకా తోడుండి తోడ్కొని వచ్చారా? అనే ఆలోచనతోనే అంజనీమాతకు తెలియకుండానే కన్నుల నీరు వచ్చింది. శ్యామాశ్యాములకు భక్తులన్న ఎంత ప్రేమ. ఎంత వాత్సల్యం. అదే విషయం రాధికాప్రసాద్ గారిని అడుగుదామని ఆయన వంక చూశారు. ఆయన ధ్యానంలో ఉన్నారు. వారు నవ్వుతూ ఏదో పారవశ్యంలో మునిగి యున్నారు.

31. అష్టసఖీ పరివేష్టితయైన శ్రీ రాధ

సరిగ్గా ఆ రోజుకి బృందావనంలో ఆశ్రమం స్థాపించి ఒక సంవత్సరం అయింది. రాధికాప్రసాద్ గారు కన్నులు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. దగ్గర్లో అంజనీమాత శ్యామాశ్యాములకు అలంకరణ చేస్తున్నారు. రాధికాప్రసాద్ గారు రెండు రోజుల ముందే చెప్పారు _" ఎల్లుండికి ఆశ్రమం స్థాపించి సంవత్సరం అవుతుంది. శ్యామాశ్యాములకు మంచి దుస్తులు కొని చక్కగా అలంకరించాలి". అంజనీమాత శ్యామాశ్యాములకు దుస్తులు కొనుక్కొని వచ్చారు కానీ అవి ఇంకా రాధికాప్రసాద్ గారికి చూపించలేదు. ఏవో పనులలో ఉండి మరచిపోయారు. ఆ దుస్తులే ఇప్పుడు శ్యామాశ్యాములకు ధారణ గావించి వారిని సర్వాంగ సుందరముగా అలంకరణ చేస్తున్నారు. అలంకరణ పూర్తి అయిన తరువాతే రాధికాప్రసాద్ గారికి చూపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. వారికి దగ్గరలోనే సూరి, శాంతమ్మ, ఆండాళ్ళమ్మ మొదలగు ఆశ్రమవాసులు ఉన్నారు. రాధికాప్రసాద్ గారు ధ్యానంలో ఉన్నారు. ధ్యానం అలా కొనసాగుతూనే యున్నది_" (ధ్యానంలోనే) రాధికాప్రసాద్ గారు కళ్ళు తెరిచారు . ఎదురుగా 8 సంవత్సరముల పిల్ల బంగారు వర్ణంతో, పట్టుపరికిణీ, పావడా ధరించి సర్వాంగ సుందరంగా నవ్వుతూ కన్పించింది. రాధికాప్రసాద్ గారు ఆ అమ్మాయిని చూశారు. ఇందుకు ముందెప్పుడు ఆ అమ్మాయిని చూసినట్టు లేదు. అందువల్ల ఆ అమ్మాయిని దగ్గరకు రమ్మని పిలిచారు. ఆ అమ్మాయి అడుగులో అడుగు వేస్తూ రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చి ఎంతో సిగ్గు పడుతూ తలదించుకొని నిల్చుంది. రాధికాప్రసాద్ గారి ఆపాపను దగ్గరకు తీసుకొని, తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని "ఎవరి అమ్మాయివమ్మా నీవు? నీ పేరేమిటి?" అని అడిగారు. దానికా ఆ అమ్మాయి _ " నేనా ! మీ అమ్మాయినే. ఇక్కడ దగ్గరే నా ఇల్లు. నన్ను "కిశోరి" అని అంటారు. రోజూ ఇక్కడకు వస్తూనే వున్నాను. రోజూ నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు. రోజూ నాకు మిఠాయిలు ఇస్తూనే ఉన్నావు. ఏమీ ఎరుగనట్లు మళ్ళీ అడుగుతావెందుకు ? అని వడి వడిగా ప్రశ్నలు కురిపించింది. అంతవరకు సిగ్గుపడుతూ అమాయకంగా నించున్న అమ్మాయేనా ఈ అమ్మాయి ? ఇలా ప్రశ్నల వర్షం కురిపించింది? రాధికాప్రసాద్ గారు ఆశ్చర్యపోయారు. అంతట ఆ అమ్మాయి _ "నేను రోజూ వస్తూనే ఉన్నాను. నీవు రోజూ చూస్తూ ఏమీ తెలియనట్లు అడుగుతావే? అనెడి మాటలు వారి చెవులలో గింగురుమనసాగెను. దానికి రాధికాప్రసాద్ గారు _ " నీవు రోజూ వస్తున్నావా ? నేను రోజూ నీకు మిఠాయిలు ఇస్తున్నానా ? అసలు గుర్తుకు రావటంలేదమ్మా" అని పల్కెను. దానికి ఆ అమ్మాయి "బాబా ! నీవు పెద్దవాడివై పోయావు. నీకు ఈ మధ్య అసలు ఏమీ గుర్తుండటంలేదు. ఇలా అయితే ఎలా ? అని పల్కి _ " ఇదిగో ఈ పరికిణీ బాగుందా ?" యని ప్రశ్నించెను. "చాలా బాగుందమ్మా ! ఎవరిచ్చారు ? అని రాధికాప్రసాద్ గారు ఆ అమ్మాయిని ప్రశ్నించెను దానికా ఆ అమ్మాయి _" అయ్యో ! బాబా ! ఇది కూడా గుర్తు లేదా ? నీవే కదా నాకు కొనిపెట్టింది" అని పల్కెను. దానికి రాధికాప్రసాద్ గారు _ " నేను కొనిపెట్టానా ? ఎప్పుడు కొని పెట్టాను? అని ప్రశ్నించి ఆలోచనలో పడిపోయెను. ఇంతలో అ అమ్మాయి _" బాబా నేను వెళ్ళాలి. ఆడుకోవాలి. స్నేహితులు నాకోసం బయట నిలబడి యున్నారు" అని పల్కెను. అంతట రాధికాప్రసాద్ గారు _ "నీ స్నేహితులందరినీ లోపలకు రమ్మని పిలు తల్లీ ! అందరికీ మిఠాయిలు ఇస్తాను " అని పల్కారు. అంతట ఆ అమ్మాయి తన స్నేహితురాండ్రు లోపలకు వచహ్చారు. అందరికీ 7, 8 సంవత్సరములు మించి వయస్సు ఉండదు. అందరూ చిన్న పిల్లలే. ఎంతో అందంగా ఉన్నారు. చక్కని అలంకరణ చేసుకొని యున్నారు. వారందరూ రాధికాప్రసాద్ గారి చుట్టూ నిలబడ్డారు. అంతట ఆ చిన్నారి తన స్నేహితురాండ్రను పేరు పేరునా రాధికాప్రసాద్ గారికి పరిచయం చేసింది. రాధికాప్రసాద్ గారు వారందరికీ మిఠాయిలు పెట్టారు. వారందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. అందరూ తిరిగి ఆడుకోవటానికి బయటకు పరిగెత్తారు. "కిశోరి" కూడా బయటకు వెళ్తూ _ " బాబా నీవు ఒట్టి అమాయకుడివి. ఏమి చెప్పినా విటావు. అందుకే నీవంటే నాకు చాలా ఇష్టం" అని రాధికాప్రసాద్ గారి బుగ్గపై ఒక ముద్దు పెట్టి _" మళ్ళీ వస్తాను" అని పల్కి అక్కడనుండి కదిలింది". ఇంతలో రాధికాప్రసాద్ గారు వెళ్తున్న కిశోరిని చూచి _ "కిశోరీ అమ్మా కిశోరీ" అని పిలువసాగెను. రాధికాప్రసాద్ గారు "కిశోరీ ! కిశోరీ ! " అని పిలవటం చూచి గాభరా పడిన సూరి, శాంతక్క, అంజనీమాత ఒక్కసారిగా రాధికాప్రసాద్ గారిని తాకి కదిలించి "ఏమిటి నాన్నా ? కిశోరీ కిశోరీ" అని పిలిచారు అని అడిగారు. రాధికాప్రసాద్ గారు కళ్ళు తెరిచి _ " ఆ అమ్మాయిలు ఏరి? ఎక్కడకు వెళ్ళారు" అని ప్రశ్నించెను. అమ్మాయిలా ?ఎ వ్వరు ? ఎవరొచ్చారు ? ఇక్కడకు ఎవరూ రాలేదే " అని వారు పల్కగా _ "ఇప్పుడు వచ్చారే. ఆ అమ్మాయిలు" అని మరల ప్రశ్నించిరి. అంతట వారు _" ఎవరూ రాలేదు. మీరు కలగన్నారా?" యని పల్కారు. రాధికాప్రసాద్ గారు మౌనంగా ఆలోచనలో పడ్డారు ఇంతలో అంజనీమాత క్రొత్తదుస్తులతో రాధారాణిని అలంకరించి, ఆ రాధారాణి విగ్రహాన్ని నాన్నగారికి చూపిస్తూ _ " నాన్నా ! మీరు కొనమన్నట్లు రాధారాణికి పటు పరికిణి, పావడా కొన్నాను. అలంకరణ చేశాను. బాగున్నదా?" అని ప్రశ్నించెను. రాధికాప్రసాద్ గారు రాధారాణి విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకొని చూశారు.ఇంతకు ముందర తన వద్దకు వచ్చిన అమ్మాయి (కిశోరి) ఏ పరికిణీ, పావడా ధరించిందో, విగ్రహానికి కూడా అదేరంగు పరికిణి, పావాడా అలంకరింపబడి ఉన్నాయి. రాధికాప్రసాద్ గారు వాస్తవం గ్రహించారు. కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి_" తల్లీ పెద్దవాడినై పోయాను. నేను నీ దగ్గరకు (బరసానా) రాలేనని, నన్ను కష్టపెట్టటం ఇష్టంలేక నీవే వచ్చావా "చిన్నారీ" ? అంతదూరం నుండి నాకోసం వచ్చావా? నన్ను చూద్దామని వచ్చావా? అమ్మాకిశోరీ !" అని ఆ విగ్రహాన్ని గుండెలకు హత్తుకున్నారు. ఇదంతా చూస్తున్న భక్త బృందానికి విషయం అర్థంగాక గాభరా పడసాగారు. తర్వాత కొంతసేపటికి మరల మరల ప్రశ్నించగా విషయము చెప్పిరి. విషయం విన్న భక్త బృందం ఏదో తెలియని అవ్యక్తానందానికి లోనైనారు. ఆ విధంగా రాధారాణి " అష్టసఖీ పరివేష్టితయై" ఆశ్రమానికి వచ్చి రాధికాప్రసాద్ గారికి దర్శనమిచ్చింది.

32. భావము రాగమై గీతమైన వేళ

శ్యామాశ్యాములు రసస్వరూపులు. ఆశ్రమంలోని మూర్తులనెంతో భక్తితో, ప్రేమతో ఆశ్రమవాసులందరూ సేవించేవారు. రాధికాప్రసాద్ గారిచే పూజింపబడే (మూర్తులు) శ్యామాశ్యాములిరువురూ ఎంతో కొంటెవారు. తరచూ రాధికాప్రసాద్ గారికి స్వప్నంలో దర్శనమిచ్చి తమకు కావలసినవన్నీ చేయించుకునేవారు. వాళ్ళు ఏది కావాలంటే రాధికాప్రసాద్ గారు అవి సమకూర్చేవారు. ఆయనకు వాళ్ళంటే ప్రాణం. వాళ్ళకూ రాధికాప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం.

ఒకసారి రాధారాణి రాధికాప్రసాద్ గారికి స్వప్నంలో దర్శనమిచ్చి "నాకు అందరూ గుడ్డలు కుట్టిస్తున్నారు కానీ ఎవరూ అత్తరు(సెంట్) రాయటం లేదు. సుగంధ పరిమళాలు వెదజల్లే అత్తరు నీవుకొను. నేను నీ దగ్గరకు వచ్చి నీ చేత్తో రాయించుకుంటాను" అని పల్కింది. రాధికాప్రసాద్ గారు వెంటనే మంచి ఖరీదు పెట్టి సుగంధ పరిమళాలు వెదజల్లే అత్తరు తెప్పించారు. ఒకరోజు రాధారాణి 8 సంవత్సరాల పిల్లలా రాధికాప్రసాద్ గారిని సమీపించి అత్తరు వ్రాయమంది. అంతట రాధికాప్రసాద్ గారు అత్తరుని చేతిలోకి తీసుకొని రాధారాణిని దగ్గరకు పిలిచారు. అంతట రాధారాణి _"బాబా ! నన్ను పట్టుకోగలవా?" అని ప్రశ్నించింది. దానికి రాధికాప్రసాద్ గారు _" ఏం ఎందుకు ఎందుకు పట్టుకోలేను. పట్టుకోగలను"అని పల్కారు. అంతట రాధారాణి _ " అయితే బాబా నన్ను పట్టుకో"యని పరుగెత్తసాగెను. రాధికాప్రసాద్ గారు రాధారాణిని పట్టుకొన వెంటపడ్డారు. ఆ గదిలోనే దొరికినట్లే దొరికి చేతికి అందక పరిగెత్తసాగెను_ " బాబా ! నీవు పెద్దవాడివైపోయావు. నన్ను పట్టుకోలేవు. నన్ను పట్టుకోలేనని ఒప్పేసుకో" యని అనగా రాధికాప్రసాద్ గారు _ససేమిరా దానికి అంగీకరించక రాధారాణిని పట్టుకొన ప్రయత్నించుచునేయుండిరి. ఇంతలో గదిలోకి ఎవరో వస్తున్న చప్పుడయ్యేసరికి "రాధారాణి" అదృశ్యమయ్యెను. రాధికాప్రసాద్ గారి చేతిలో అత్తరు అలాగే ఉండిపోయింది. అంతట రాధికాప్రసాద్ గారు _"చిన్నారి నోరు తెరిచి అత్తరు రాయమని అడిగితే రాయలేకపోయాను. చిన్నారి అడిగిన ఈ చిన్న కోర్కెను కూడా నెరవేర్చలేకపోయాను" అనే విరహ వేదనలో మూడు రోజుల పాటు అన్నపానీయాలు కూడా మానివేశారు. చిన్నారి విగ్రహాన్ని తన గుండెలకు హత్తుకొని విలపించసాగిరి. ఆవేదనాభరితమైన ఆయన హృదయం పల్కిన భావమే రాగమై గేయమైనది.



గీతము :

చరణము : ఎట్లా లాలించు కొందునమ్మ బృందావనరాణి

ఎట్లా సేవించుకొందునమ్మా | | ఎట్లా| |

బాలా రూపంబు దాల్చి పసిడి బుగ్గలు మెరయ

మెల్లాగ నా చేతుల్లో వాలీ నిన్ ముద్దిడకున్న | | ఎట్లా | |

అంబా రూపంబు దాల్చి అభయా ముద్రను చూసి

చిరునవ్వులు చిందించుచు నన్ను కరుణతో లాలింపనిచో | |ఎట్లా | |

సఖియా రూపంబు దాల్చి చక్కా దరశనమిచ్చి

కరుణతో నన్నుగూడి కౌగిట చేర్పకనున్న | |ఎట్లా| |

సరిగా మూడవ రోజు రాత్రి మరల రాధారాణి దర్శనమిచ్చి రాధికాప్రసాద్ గారిని నిదురలేపుతూ " బాబా ! నేను వచ్చేశాను. నిను విడిచి ఇక వెళ్ళనుగా. ఇప్పుడు అత్తరు వ్రాయి" అని పల్కింది. రాధికాప్రసాద్ గారి ఆనందానికి అవధుల్లేవు. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వెంటనే కూర్చొని చిన్నారిని దగ్గరకు తీసుకొని ముద్దాడి చిన్నారికి ముందర మిఠాయిలు చేతిలో పెట్టి, పాలు త్రాగించి, తర్వాత అత్తరు వ్రాసిరి. చిన్నారి రాధ ఆ విధంగా రాధికాప్రసాద్ గారిచే సేవలను అందుకుంటూ తాను ఆనందిస్తూ, వారిని ఆనందపరుస్తూ ఉండేది.

రాధారాణియే కాదు శ్యామసుందరుడు కూడా వట్టి అల్లరి పిల్లవాడు. వాడు కూడా తరచూ రాధికాప్రసాద్ గారికి దర్శనమిస్తూ తనకు కావలసినవి జరిపించుకునేవాడు. తనకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే రాధికాప్రసాద్ గారికి ఫిర్యాదు చేసేవాడు.

రాధికాప్రసాద్ గారు బృందావనంలో ఆశ్రమంలో ఉంటూ గుంటూరులో రాధాకృష్ణ మందిర నిర్వహణా బాధ్యతలను కూడా చక్కగా పర్యవేక్షించేవారు. గుంటూరులో రాధాకృష్ణ మందిరంలో రాధాకృష్ణ విగ్రహమూర్తులు ప్రతిదినమూ అక్కడి భక్తుల సేవలను, నీరాజనాలను అందుకుంటూ ఉండేవారు. ఒకసారి ఒక పిల్లవాడు మందిరానికి వచ్చి రాధాకృష్ణులకు నమస్కరించి ఒక "పావలా" మందిరంలో పడవేశాడు. మందిరంలోని విగ్రహాలలో "కన్నయ్య విగ్రహం" ఉంది. ఆ విగ్రహం ఆశ్రమ స్థాపకురాలైన రాధామహాలక్ష్మి గారి ఆరాధనలను కూడా అందుకున్నది. అంటే బాల రూపధారియైన కృష్ణుని విగ్రహం అది. పిల్లవాడు విసిరిన డబ్బులు ఆ విగ్రహం దగ్గర పడ్డాయి. ఆశ్రమంలో ఒక బామ్మగారు ఉన్నారు. ఆవిడ పేరు సీతారామమ్మ గారు. అనేక సంవత్సరములనుంచి మందిరంలోనే ఉంటూ, మందిరవాసులకు వండి పెడుతూ రాధాకృష్ణుల సేవ చేస్తూ ఉండేది. అయితే ఆమెకు ఒక అలవాటు ఉంది "కిళ్ళీ" బాగా తినేది. ఒకసారి ఆవిడ దగ్గర డబ్బులు లేకపోతే మందిరంలో కన్నయ్య విగ్రహం దగ్గర పడివున్న పావలా తీసుకొని కిళ్ళీ కొని వేసుకుంది. కానీ ఆ రోజు రాత్రే "కన్నయ్య" ఈ విషయం బృందావనంలో ఉన్న రాధికాప్రసాద్ గారికి ఫిర్యాదు చేస్తూ _ "సీతారామమ్మ నాడబ్బులు లాక్కుంది. నాకు ఏమీ కొని పెట్టకుండా తను కిళ్ళి కొనుక్కుంది. అంతేకాదు నీవు అక్కడ లేకపోయేసరికి నాకు రోజూ "భోగ్" కూడా సరిగా పెట్టడం లేదు. పప్పు అసలు వేయడం లేదు. పచ్చళ్ళు పెడుతున్నారు. అవి చాలా కారంగా ఉంటున్నాయి. నేను చిన్నపిల్లవాడిని కదా ! అంత కారం ఎలా తింటాను?" అని పల్కాడు. వెంటనే రాధికాప్రసాద్ గారు గుంటూరు ప్రయాణమై గుంటూరుకు వచ్చి పరిస్థితిని సమీక్షించగా "కన్నయ్య చేసిన ఫిర్యాదు నిజమే" యని నిర్ధారణ అయింది. సీతారామమ్మ డబ్బులు తీసుకొని కిళ్ళీ కొనుక్కున్నానని అంగీకరించి తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడింది. అంతట రాధికాప్రసాద్ గారు "భోగ్" విషయంలో కూడా జరిగిన అవకతవకలు కూడా సరిదిద్ది కన్నయ్యకు ఎటువంటి లోటూ రానివ్వవద్దు అని వారందరినీ హెచ్చరించి తిరిగి బృందావనమునకు చేరిరి.

33. పెరంబూరు సంఘటన

ఒకసారి నగరానికి సమీపమున "పెరంబూర్" ప్రదేశమునందు పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారి ఉపన్యాసం ఏర్పాటు చేశారు అక్కడి భక్తులు. రాధికాప్రసాద్ గారు "పెరంబూర్" చేరారు. పెరంబూర్ నందు రైల్వే ఇనిస్టిట్యూట్ సి.సి హైస్కూల్ నందు రాధికాప్రసాద్ గారి ఉపన్యాసం ఏర్పాటయింది. సభ ప్రారంభమైనది. అధిక సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు. రాధికాప్రసాద్ గారు తన ప్రసంగాన్ని కొనసాగించారు _ ప్రేమతత్వం గురించి, రాధా_మాధవ స్వరూపం గురించి ఉపన్యసించారు _ "ధర్మ, అర్ధ, కామ, మోక్షాదులు చతుర్విధ పురుషార్థములు. అయితే ఐదవది ప్రేమ. ప్రేమ వలన మాత్రమే భగవానుడు భక్తులకు దాసుడగును. రసధామం బృందావన ధామం. రసధామంలో విరాజిల్లే ప్రేమైక మూర్తులే శ్యామాశ్యాములు. వారిని అర్చించండి, ధ్యానం చేయండి. మీ జీవితాన్ని సార్ధక పరచుకోండి." ఈ విధంగా ప్రసంగం కొనసాగింది. భక్తజనం మంత్రముగ్ధులై ఆ మహాయోగి పలుకులను వింటున్నారు. వారి రసమయ భాషణను నేనూ వింటున్నాను అనేదానికి "సాక్షి" యన్నట్లుగా ప్రసంగం జరిగే చోట ఇనిస్టిట్యూట్ పై కప్పు నుంచి "కన్నయ్య వెన్న ముద్దలు " కురిసెను. భగవానుడే ఆ లీల జరిపెనని మద్రాసు దైనందిన పత్రికలో ఆ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది. ఆ లీలను ప్రత్యక్షంగా కాంచిన భక్తజనులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయిరి.

34. మాలపల్లిలో మహాత్ముడు

ఒకసారి పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారి ఉపన్యాసాన్ని "మాలపల్లి"లో ఏర్పాటు చేశారు అచ్చటి భక్త బృందం. ఊరంతా ప్రచారం సాగింది. _" గొప్ప యోగ పురుషులు, సిద్ధ పురుషులు, రాధాకృష్ణ భక్తులు వస్తున్నారని వారు గొప్ప మహిమ గలవారని" అందరూ వారి రాకకై ఎదురు చూడసాగిరి.

ఆ ఊరిలో ఒక చిన్న పూరి గుడిసె. అందులో 8 సంవత్సరాల బాలిక. ఆ అమ్మాయి ఎలా సంపాదించిందో కాని రాధాకృష్ణుల చిత్రం ఒకటి సంపాదించింది. ఆ పటాన్ని తన ఇంట్లో పూజా మందిరంలో ఉంచి ఎంతో ప్రేమతో భక్తితో ఆ మూర్తులను అర్చించసాగింది. ఆ పాప కూడా మహాత్ముని రాక గురించి విన్నది. ఆ పాప తన మనసులో _ ఏ విధంగానైనా సరే ఆ మహాత్ముని మన ఇంటికి తీసుకురావాలి. నా మూర్తులను ఆయనకు చూపించాలి. నేను రోజూ రాధాకృష్ణులకు సమర్పించే భోగ్ (నైవేద్యం) ఆయనకు పెట్టాలి" అని అనుకున్నది. అదే విషయం తన తండ్రికి చెప్పి ఆ మహాత్ముని ఇంటికి తీసుకురమ్మని కోరింది. తల్లిలేని పిల్ల. కోరక కోరక ఒక్క కోర్కె కోరింది. అప్పుడు ఆ తండ్రి ఆ అమ్మాయితో "అమ్మా ! ఆయన గొప్ప మహాత్ముడు, బ్రాహ్మణుడు. మనం బ్రాహ్మణులం కాదు కదా ! అదియునూ కాక ఆయన చాలా నిష్ఠా గరిష్ఠులని విన్నాను. మరి వారిని మనం మన ఇంటికి రమ్మని పిలిస్తే వస్తారా ? మనం ఇచ్చేది స్వీకరిస్తారా ? ఆయన దర్శనం కల్గినా చాలు తల్లీ ! మనం ధన్యులమైనట్లే. ఎంతో మంది ధనికులు, గొప్ప గొప్ప వారు ఊరిలో ఉన్నారు. వారందరూ ఆ మహాత్ముని తమ ఇండ్లలో ఆతిథ్యమివ్వబారులు తీరి యున్నారు" అని పల్కెను. కానీ ఆ పాప తన పట్టుదల వదలక _ "అయినా సరే నీవు స్వామిని మన ఇంటికి రమ్మని ప్రార్థించు" అని పల్కెను. కూతురి పట్టుదల చూచి కాదనలేక "అలాగే పిలుస్తాను" అని పల్కి బయలుదేరెను.

"రాధికాప్రసాద్ మహారాజ్" ఊరికి విచ్చేశారు. ముందుగా ఒక దేవాలయంలో దిగారు. ఆయనకు నమస్కరించేవారు, దండలు సమర్పించేవారు, తమ గృహమును పావనము చేయమని ప్రార్థించేవారు, అందరూ ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. పాప తండ్రి కూడా దేవాలయానికి వచ్చాడు. దూరంగా నిలబడి స్వామిని (రాధికాప్రసాద్) గారిని దర్శించాడు. నమస్కరించాడు. కోటీశ్వరులు, కుబేరులు వారిని తమ ఇంటికి రమ్మంటే తమ ఇంటికి రమ్మని ఆహ్వనిస్తున్న ఆ దృశ్యం చూశాడు. మనస్సున ఆలోచించసాగెను. _ "ఈ మహాత్ముని మా ఇంటికి రమ్మని ఎలా అడగాలి ? ఒకవేళ ఆ మహానీయుడు అంగీకరించి, దయచూపి వచ్చినా ఆయనకు తగు రీతిలో మర్యాదలౌ, సత్కారములు జరిపించేశక్తి నాకు లేదే. కనీసం ఏవేని మిఠాయిలుతీసుకొద్దామన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదే. మహాత్ముని అడగకుండ వెళితే కూతురికి ఎలా సమాధానం చెప్పాలి ? మహాత్ముని నేను నాతో ఇంటికి తీసుకు వస్తానని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది. పాపం పిచ్చి తల్లీ ! ఇప్పుడు నేనేం చేయాలి ?" ఈ విధమగు ఆలోచనలతో పాప తండ్రి సతమతమగుతూ తనలో తనౌ మధనపడసాగెను. ఆ వ్యక్తిని రాధికాప్రసాద్ గారి దూరం నుండియే చూచి దగ్గరకు రమ్మని పిలిచెను. పాప తండ్రి స్వామి దగ్గరకు చేరి నమస్కరించెను. అప్పుడు స్వామి (రాధికాప్రసాద్) గారు పాప తండ్రిని ఏమిటి నాయనా ! ఏదో బాధ పడుతున్నట్లున్నావు. ఎవరు నీవు ? నీ బాధ ఏమిటి? నాతో చెప్పు. నేను తీర్చగలవాడినైన తీరుస్తాను" అని ప్రశ్నించెను. అప్పుడు పాప తండ్రి _ " స్వామీ ! అదృష్టం కొద్దీ మీ దర్శన భాగ్యం కల్గింది. ఈ జీవికి ఇంతకు మించిన కోర్కె మరొకటి లేదు. కానీ ........" అని సందేహించెను. అప్పుడు రాధికాప్రసాద్ గారు _ " సందేహింపకు. అడుగుము" అని పల్కెను. అప్పుడు పాప తండ్రి _"స్వామీ ! నాకు ఒక కూతురు ఉన్నది. అది కోరక కోరక నన్ను ఒక కోరికి కోరింది. మిమ్మల్ని ఎలాగైనా తన దగ్గరకు తీసుకు రమ్మని, తను రాధాకృష్ణులకు సమర్పించే భోగ్ (నైవేద్యం) మీకు సమర్పించాలని దాని కోర్కె. కానీ నేను పేదవాడిని. కులం మాల. మీకు తగిన విధంగా సపర్యలు చేయగల శక్తి లేని వాడిని" అని పల్కెను. అప్పుడు రాధికాప్రసాద్ గారు _"దీనికి బాధపడవలసిన పని యేమి. విచారింపవలదు. నేను మీతో వస్తున్నాను. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు" అని పల్కిరి. అతని ఆనందానికి అవధుల్లేవు. చూస్తున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఎవరో అనామకుడు పిలిస్తే "స్వామి వెళ్తున్నారని" గుసగుసలాడసాగిరి. కానీ వరికేం తెలుసుస్ _ " భగవంతుడు భావానికి ప్రాధాన్యత ఇస్తాడు కానీ భోగాలకు కాదని" రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ వ్యక్తి వెంట అతని కుటీరానికి వెళ్ళారు. స్వామి కుటీరం ముందు నిలబడి యున్నారు. ఆ పాప లోపల రాధాకృష్ణుల ముందర కూర్చొని "స్వామిని ఎలాగైనా మా ఇంటికి పంపమని" రాధాకృష్ణులను వేడుకుంటున్నది.

పాప తండ్రి బయట నుండియే పిలిచెను_ " తల్లీ ! స్వామి వేంచేశారు" అని పిలుపు వినినంతనే ఆ పాప పరుగు పరుగున బయటకు వచ్చెను. తెల్లని ధవళవస్త్రములతో, నగుమోముతో దివ్య తేజంతో స్వామి దర్శనం లభించింది. పాపకు, పాపకు ఆనందంతో నోట మాట రావటంలేదు. కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. పరుగున స్వామి కాళ్ళపై పడి నమస్కరించింది. స్వామి పాపను లేవదీస్తూ _" నన్ను నీ ఇంటిలోనికి తీసుకెళ్ళవా ?" యని ప్రశ్నించెను స్వామిని చూసిన ఆనందంలో లోపలకు రమ్మని పిలవాలనే సంగతే ఆ అమ్మాయి మరచిపోయింది. ఒక్క క్షణం ఉండండి స్వామీ ! అంటూ పరుగు పరుగున లోపలకు వెళ్ళి ఒక పళ్ళెం, చెంబుతో నీళ్ళు తెచ్చి స్వామి కాళ్ళను కడిగి ఆ నీళ్ళను తన తలపై జల్లుకున్నది. సాదరంగా ఎంతో భక్తితో స్వామి చేయి పట్టుకొని ఇంటి లోపలకు తీసుకెళ్ళింది. కుటుంబం చాలా పేదకుటుంబం. లోపలకు ఎవరైనా వస్తే కూర్చోమనటానికి ఒక కుర్చీ కూడా లేదు. పాప లోపలకు వెళ్ళి ఒక పీట తీసుకు వచ్చి స్వామిని కూర్చోపెట్టింది. అంతట స్వామి రాధికాప్రసాద్ గారు పాపను దగ్గరకు పిలిచి _ "ఏం చేస్తున్నావమ్మా"యని ప్రశ్నించెను. దానికి ఆ పాప రాధాకృష్ణుల మూర్తులను చూపించి _"మిమ్మాల్ని మా ఇంటికి పంపమని వారితో చెబుతున్నాను" అని పల్కింది. "నీవు పిలిస్తే నేను రాననుకున్నావా తల్లీ !" యని స్వామి ప్రశ్నించెను. నేను అనుకోలేదు మానాన్న అనుకున్నాడు. మీరు బ్రాహ్మణులట కదా. మా ఇంటికి రాకూడదటకదా ! మేం ఏం ఇచ్చినా తాకకూడదట కదా !"యని ఆ పాప ప్రశ్నలమీ ప్రశ్నల వర్షం కురిపించింది. స్వామి అన్నింటికి చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు. పాప తన చేతులతో అల్లిన పూల దండ ఒకటి రాధాకృష్ణులకు, మరొకటి స్వామి మెడలో వేసెను. స్వామి పాపతో పల్కెను_ "నాకు ఆకలిగా ఉంది ఏమైనా పెట్టవూ" పాప పరుగు పరుగున వెళ్ళి రాధాకృష్ణులకు భోగ్ లో సమర్పించిన పండ్లు, పాలు తీసుకు వచ్చి స్వామికి సమర్పించెను. స్వామి వాటిని స్వీకరించెను. పాపకు ఎంతో ఆనందం వేసింది. ఇదంతా చూస్తున్న పాప తండ్రికి __"ఇది కలయా ? లేక నిజమా ?" అనే సందేహము కలిగినది. అంతట స్వామి రాధాకృష్ణులను పాపకు చూపిస్తూ "వాళ్ళకు ఏ లోటూ రాకుండా చూసుకో తల్లీ ! వారికి భక్తితో సేవ చేయి" యని పల్కెను. దానికి పాప "రోజూ వాళ్ళకి భోగ్ పెడుతున్నాను. వాళ్ళకి ఆకలి అసలు వేయదు" అని పల్కెను. స్వామి ఆ పాప మాటలకు నవ్వుతూ పాపను ఆశీర్వదించెను. తిరిగి ఉపన్యాస స్థలమునకు చేరెను. ఆ రోజు వారి ప్రసంగం "ప్రేమ భక్తి" మీద సాగింది _

"భగవంతుడు భక్త వత్సలుడు. భక్తుల హృదయాలలో అతని నివాసం, కుల, మత భేదాలకు అతీతుడు. అతడు జీవులలో చూచునది "కేవల ప్రేమను" మాత్రమే. భగవానుడు ప్రేమకు దాసుడు. ప్రేమభక్తి వల్లనే శ్రీ కృష్ణ పరమాత్మతను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన యుండి కూడా పాలు, మీగడల కొరకు అర్రులు జాచువాని వలె గోపికలు ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా ఆడెను. ప్రేమభక్తి వల్లనే కటిక పేదరికంతో తనను చేరిన కుచేలుని ఆదరించి అతను అందించిన అటుకులను స్వీకరించి కుచేలునికి అష్టైశ్వర్యములను ప్రసాదించెను. ఈ ప్రేమ భక్తి వల్లనే హస్తినాపురమున ధుర్యోధనుని మాధుర్య రసభరితమగు మృష్టాన్న భోజనమును విడనాడి, విదురుని ఇంట్లో పారవశ్యంతో అతను సమర్పించే అరటి తొక్కలను భగవానుడు స్వీకరించినాడు. కనుక ప్రతి జీవుడు భగవంతుని యెడల ఇటువంటి ప్రేమ భక్తి కలిగి యుండవలెను". ఈ విధంగా కొనసాగిన ఆయన ఉపన్యాసం భక్తజనులను ఎంతో ప్రభావితం గావించింది. ప్రేమభక్తి మార్గాన నడుచు స్పూర్తిని కలిగించింది.

2 వ్యాఖ్యలు:

భావన September 13, 2010 at 4:18 PM  

చాలా మంచి విషయాలు పంచుకున్నారు. నాన్నగారి గురించిఎన్ని విన్నా వినాలనిపిస్తుంది. ధన్యవాదాలు చెప్పినందుకు.

చిలమకూరు విజయమోహన్ September 13, 2010 at 4:37 PM  

మాష్టారూ! ధన్యవాదాలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP