కొత్తకోడల్లూ ! కాస్త అత్తకాపురం కూడా చేయండమ్మా
>> Wednesday, September 8, 2010
మాస్టర్ గారండీ ఇంట్లో తలనొప్పయిపోయింది . మా అమ్మ బీపీ పెరిగినట్లు అరుస్తుంది వచ్చి కంప్లైంట్ చేశాడు .,మా శిష్యుడు అంజిరెడ్డి .
అదేమిట్రా పెళ్లయి పది రోజులు కాలేదు అప్పుడే గొడవేమిటి కొత్త కోడలి ముందు ? వాళ్లటీచర్ గారు [మా ఆవిడ ] అంది .
అదేనండి పెద్దగా అరుస్తుంటే ఎందుకలా అని నేను ఎదురు మాట్లాడితే ఇంకా ఎక్కువచేస్తుంది . నాకళ్ళముందు వద్దు వెళ్ళిపో అంటుంది . ఇది చూసి ఆ అమ్మాయి [వాడి పెళ్లాం] ఏడుస్తుంది .,నేనొచ్చాక మీ ఇంట్లో గొడవలనుకుంటారు చూచేవాళ్ళు అని ,వాడు చెప్పుకుపోతున్నాడు .
అయ్యో ! ఏవిటండి ఆవిడ చాదస్తం మీ రెళ్ళి కాస్త కేకలేసి రండి .... మా ఆవిడ స్వరం లో వాడిపై సానుభూతి పెరుగుతున్నది .
నువ్వాగు ..... వాడిని అసలు విషయమ్ బయట పెట్టనీ ముందు .......నిలువరించాను మా ఆవిడని .
ఒరే ఈ కథలు ఆపి అసలు సంగతేమిటో చెప్పు . పెళ్లయి పది రోజులకే మీ అమ్మగారు నీమీద ఇంత కోపపడటానికి
కారణమేమిటంటావు ? ఏంజరిగింది అడిగాను వాడ్ని .
ఏం లేదు సార్ ! మేము హైదరాబాద్ వెళ్లటం ఇష్టం లేదు . ఇక్కడే ఉంటే అక్కడ ఉద్యోగం పోతుంది . నేను ఇక్కడ ఉండి ఏంచేయాలి ? ఉద్యోగం కోసం అక్కడకు వెళ్ళేప్పుడే చెబి్తే మానుకునే వాడ్ని కదా ? ఇప్పుడు మాకుంది నువ్వొక్కడివి ? నువ్వు వెళ్లిపోతే ? మే మెలా ? నిన్నొదిలి పెట్టి ఉండలేం . అని ఏడుస్తుంది మా అమ్మ మా నాన్నేమో ఏమీ మాట్ళాడడు . నేను ఉంటానని చెప్పలేదని .అదిమనసులో ఉంచుకుని అన్నింటికీ విసుక్కుంటుంది .ప్రతి దానికీ విపరీతార్ధాలు తీసి. తగవు పెట్టుకుంటుంది..అసలు విషయం బయటపెట్టాడు .
ఒరే అంజీ ! నువ్వు వాళ్లకు ఒక్కగానొక్క కొడుకువు . ఆడపిల్లంటే పెళ్ళిచేసి ఒక అయ్యచేతిలో పెట్టిపంపారు .అది సహజం కాబట్టి తట్టుకున్నారు . వాళ్ల ఆశలంతా నీమీదే .నువ్వు అప్పుచేయమంటే చేశారు . చేసిన పనుల్లో నష్టమొచ్చి డబ్బు పోగొట్టినా పల్లెత్తుమాటనలేదు . నువ్వు విజయవాడ హైదరాబాద్ లు తిరుగుతూ హాయిగా ఉంటే ఇక్కడ రేయనకా పగలనకా కష్టపడుతూ పొలంగొడ్డూ గోదా చూసుకుంటూ నీకు డబ్బు అందించారు . పెళ్ళివిషయం లోకూడా నీమాటమీదే నడిచారు . ఇప్పుడు పెళ్లయి పది రోజులకే వెళ్ళిపోతానంటే ! వాళ్లబాధ ఎలా ఉంటుందో ఆలోచించు . ?
అదీ పెళ్ళిచేసుకుని పెళ్లాం వెంటబెట్టుకుని వెళుతుంటే తమనుంచి దూరంగా వెళ్లిపోతున్నావని వాళ్లెంత వేదనపడుతున్నారో అర్ధం చేసుకున్నావా? అడిగాను వాణ్ణి .
పెళ్ళయ్యాక ,హైదరాబాద్ వెల్లి అక్కడేఉడాల్సొస్తుందని ముందే చెప్పానండి ...వాడు వివరణ ఇవ్వబోయాడు.
బిడ్డ హాయిగా బ్రతకాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది . కానీ తనముందే బిడ్డలు తిరుగుతూ ఉండాలని గాఢంగా ఉంటుంది .నాలుగు రోజులాగాక ఉద్యోగం కదా .పిల్లలు వెళ్లకపోతే ఎలా ? వాళ్ల ఎదుగుదలను అడ్డుకుంటె ఎలా ?అనే ఆలోచన వచ్చాక వాల్లే పంపుతారు . నువ్వు పెళ్ళికాకముందే అక్కడ ఇళ్ళు అద్దెకు మాట్లాడుకుని వచ్చావట కదా ! [ఈవిషయం వీడి ఫ్రెండ్ మాలకొండారెడ్డి నాకు మొన్ననే చెప్పాడు] పెళ్ళిచేసుకోగానే ఇక నీవు నీగురించే ఆలోచిస్తావా ? తల్లిదండ్రులు ఏమంటారో ? వాళ్ల అభిప్రాయమెలా ఉంటుందో తెలుసుకునే పనిలేదా ?
అసలు వచ్చిన కొత్తకోడలు ఇంట్లో అత్తామామా అంటే గౌరవం భక్తి పెరగాలంటే కొంతకాలమన్నా అత్తగారి పర్యవేక్షణలో కాపురం చెయ్యాలి . అప్పుడే కదా తన భర్తవైపున ఎవరెవరు? .ఎలా ఎవరిని గౌరవించాలి .అత్తమామలను ఎలాచుసుకోవాలి ? కుటుంబ గౌరవమర్యాదలను తాను ఎలా కాపాడుకోవాలి అని నేర్చుకునేది ? పెళ్లికాగానే ఎవడి పెళ్లాన్ని వాడు చంకనేసుకుని వెళ్లిపోతే మరి వాళ్లసంగతేంటి ? ఇప్పుడే ఇలా ఉన్నారు ,రేపు కాళ్ళుచేతులు ఉడిగాకైనా తమ మంచి చెడ్డా చూస్తారా ? అని మీ తల్లిదండ్రులు బాధపడరా ? ఇవేం ఆలోచించలేదటరా అడ్దగాడిదా .....[ నాస్వరంలో కాస్త తీవ్రత పెరగగనే మావిడ అడ్డుకుంది]
మీరుండండి . ఇప్పుడు వాడు చిన్నపిల్లాడు కాదు . పెళ్లయినవాడు అలా తిడతారేంటి ? పిల్లలకసలే మీరంటే భయం . ఈసారి ఇటువైపుక్కూడా రాడు వీడు ,,నేను చెబుతాలే మీరెళ్లండి పూజకు టైమయింది అని మధ్యలోఆపింది నన్ను.
సర్లే నేను చెప్పింది అర్ధం చేసుకో అని చెప్పి గుడిలోకి వెళ్లాను సాయం సంధ్యాహారతి సమయం అవటం తో .
నిన్నరాత్రి ఏదో పనిఉండి వానికి ఫోన్ చేశాను . సార్ !నేనిప్పుడు హైదరాబాద్ లోఉన్నానండి...... వాడినుండి సమాధానం .
ఎప్పుడెల్లావురా ?
మొన్నరాత్రి వచ్చానండి. మీరడిగిన వస్తువు మీకు పంపమని అమ్మావాల్లకు చెప్పివచ్చానండి . మాఆవిడదగ్గరే ఉందది పొద్దుటే పంపమని ఫోన్ చేసి చెప్పానుకూడా ........వాడు చెప్పుకు పోతున్నాడు.
వెరీగుడ్ ......... [పరవాలేదు వీడు ఇంకా పెద్దల మాటంటే గౌరవం చూపుతున్నాడు .సంతోషం వేసింది నేచెప్పిన చదువు వీడికి కాస్త ఒంటపట్టింది . భార్యను తల్లీదండ్రులదగ్గరే ఉంచి వెల్లాడు .] ఎలాగూ నాలుగు రోజులాగాక అక్కడ పిల్లవాడు తిండి తిప్పలకు ఇబ్బంది పడుతున్నాడని కోడల్ని వాల్లే హైదరాబాద్ పంపుతారు . ఈలోపల వాల్లమురిపెంకూడా తీరుతుంది . ఎటునుంచి సమస్య ఉండదు .
కాబట్టికొత్తగా కాపురానికొచ్చే ఆడపిల్లలకు నేను చెప్పేదేమిటంటే . ముందు మీ అత్తామామలను గౌరవించండి . అత్తగారింట్లో అడుగు పెట్టారంటే ఆకుటుంబగౌరవప్రతిష్టలను కాపాడే బాధ్యత మీరు తలకెత్తుకున్నారని గుర్తుంచుకోండి . మీకుటుంబమంటే కేవలం భర్త,మీకు పుట్టబోయే పిల్లలేకాదు ,అత్తా మామా ఆడపడుచు లు బావలు మరుదులుకూడా
వీళ్లందరి ఆప్యాయతలను ప్రేమలను మీరు పొందాలంటే పెద్దపనేంకాదు ,కాస్త వినయంగా వాళ్లను గౌరవించండి చాలు .
ముందుగా అత్తామామలు చెప్పినట్లుగా వింటూ వాళ్ల అనుమతితో ఏపనైనా చేయండి చాలు .అబ్బా ! మా కోడలు బంగారం అని మురసిపోతారు. అంతేగాని మనమెప్పుడు వేరే వెళ్ళెది అని ఆలోచించకండి . మన సుఖమంతా త్యాగం లోనే ఉంది ఒకరికోసం ఒకరం తమ సుఖాలను పక్కనపెట్టి ఆలోచించే కుటుం వ్యవస్థ మనది . మంచైనా చెడైనా కలసి పంచుకునే వ్యవస్థ మనది . ఇంత కుటుంబం ,ఇంతమంది అప్యాయత దొరకటం కుటుంబ పరంగా మీకు గొప్ప బలం .రేపు ఏసమస్యవచ్చినా అండగా నిలబడేది వీళ్ళే .
కాకుంటే అత్తగారు కాస్త చాదస్తంగా అనిపించవచ్చు. ఎందుకంటే చిన్నతనం నుంచి అమ్మా ! అమ్మా ! అంటూ కొంగుపట్టుకు తిరిగిన కొడుకు ఒక్కసారిగా పెళ్లాణ్ణే అన్ని విషయాలూ అడుగుతూ ఉంటే బిడ్డను తననుంచి దూరం చేస్తున్నది ఈ అమ్మాయి అనే భావన వస్తుంది మొదట్లో ఏ తల్లికైనా . అది సహజం . ఇక్కడే మీరు కొద్దిగా సహనం వహించి తెలివిగా [మా ఆయనకెదిష్టమో నాకు తెలుసు అనుకోకుండా ] అత్తయ్యా ! మీ అబ్బాయి కేది్ష్టం ? ఏంచేయమంటారు ? ఈపని చేయమంటారా ? మా అమ్మానాన్నావాళ్ళు మీగూర్చే చెప్పేవాల్లు వాల్లత్తగారు చాలా మంచిదని . ఇలా కాస్త వాల్లు సంతోషపడేలా మాట్లాడండి చాలు . మీ ఇల్లు స్వర్గమే . ఆదిక్కుమాలిన టీ్వీ లలో చెత్తసీరియల్ లోలాగా ఉండరు అత్తా కోడల్లు .ఒకరిమీద ద్వేషం చూపాల్సిన అవసరం లేదు .
తమపిల్లల సంతోషంగా ఉండాలనే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అల్లుడికి మీ అమ్మా నాన్నలనడుగు బాబూ అని సలహా ఇవ్వండి . అంతేగానీ ఏమిటీ టౌన్లో కాపురం పెడతారా ? ఏం పరవాలేదు .ఏదన్నా ఇబ్బందయితే మేము సర్దుతాములే డబ్బు ....అని వేరు కాపురానికి ప్రోత్సాహం ఇవ్వకండి . ఏమిటమ్మాయ్ మీరు అందరికీ అడ్డమైన చాకిరీ చేయాల్సిన పనిలేదు . అని పెళ్లికి ముందే ఆడపిల్లలకు నూరిపోయకండి . అమ్మా అత్తగారింట్లో ఎంత మంచి పేరు తెచ్చుకుంటే మనకుకూడా అంతవిలువ అని బోధించండి . అత్తగారింట్లో గుట్టుమట్లన్నీ ఎవరికీ చివరకు కన్నవారికి కూడా ప్రతి విషయం చెప్పాల్సిన పనిలేదని సలహా నివ్వండి . లేకుంటే వాల్ల బాధేమిటో రేపు మీకు కోడలొచ్చినప్పుడు తెలుస్తుంది .
మన ఇంటి కొచ్చిన కోడలు మన కూతురులాంటిదే కనుక కూతురు సుఖం గూర్చి ఎలా ఆలోచిస్తామో ,కోడలివిషయం లోనూ అలానే ఆలోచించాలి అత్తామామ కూడా >
కాబట్టి అమ్మయిలూ పెళ్లయిన కొత్తలో ఒంటరిగా భార్యభర్తలు ఉండాలనుకోవద్దు . అత్తకాపురం మీకు జీవితంలో ప్రతిసమస్యను ఎదుర్కునే శిక్షణ నిస్తుందని నమ్మండి . అత్తకాపురం చేయండి . మీ జీవితాన సకలశుభాలు కలగాలని ఆశీర్వదిస్తున్నాను
4 వ్యాఖ్యలు:
బాగుందండీ మీరు చెప్పింది.
Good One Sir.
నిజమేనండి. అత్తమామల ప్రేమ అదో విధం, పైకి కనిపించదు. అది రుచి చూసినవాళ్లకు తెలుస్తుంది. కొందరు కూతుళ్ళను కాదని కోడళ్ళను నెత్తిన పెట్టుకున్న అత్తగార్లూ ఉంటారు.
durgeswara గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
హారం
Post a Comment