శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రసోపాసకుడు రాధాబాబాగా _ రాధికాప్రసాద్ మహారాజ్

>> Saturday, September 18, 2010

రసయోగి _ 13

35. రసోపాసకుడు రాధాబాబాగా _ రాధికాప్రసాద్ మహారాజ్

గోరఖపూర్ లో ప్రసిద్ధిగాంచిన రాధా ఉపాసకుడు ఒకరున్నారు. అందరూ "రాధాబాబా" యని పిలిచేవారు. ఆయన ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉండేవారు. ఆయన గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది.

"ఈ రాధాబాబా అసలు పేరు మధుసూధన సరస్వతి. అద్వైతవాది. ఒకసారి ఇతను ప్రముఖ కృష్ణభక్తుడు, బహుగ్రంధకర్త అయిన "హనుమాన్ దాస్ పోద్ధార్" గారి ఇంటికి వెళ్ళెను. "హనుమాన్ దాస్ పోద్ధార్" గొప్ప రాధా ఉపాసకుడు. అద్వితీయ శక్తి సంపన్నుడు. "రాధామాధవ చింతన్" అనే ఒక అమూల్య గ్రంధాన్ని కూడా రచించినాడు. భక్తుల యెడ, మహాత్ములయెడ అపరిమిత ప్రేమ, భక్తి ఉన్నవాడు. అతనికి ఎవరో చెప్పారు _" ఎవరో బాలయోగి మీ ఇంటికి వచ్చాడని". వెంటనే పరుగున ఇంటికి చేరి , బాలయోగియైన మధుసూధన సరస్వతికి అత్యంత వైభవోపేతమైన ఆతిథ్యమిచ్చి సకల మర్యాదలు గావించి అతని చరణములను స్పర్శించెను. అంతే ఏదో విద్యుత్ ఘాతము తగిలినట్లుగా మధుసూధన సరస్వతి సమాధి స్థితిలోకి వెళ్ళెను. నిరంతర రాధాధ్యాన తత్పరుడై యుండెను. రాధారాణి ఆ విధంగా అతనిని కరుణించింది. నిరంతరం రాధా ధ్యానమగ్నుడైన అతని హృదయ ఫలకం పై రెండు అక్షరాలు "రాధా" యనునవి ప్రకటితములయ్యెను.

పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారు గోరఖ్ పూర్ వెళ్ళి రాధా బాబా దర్శనం చేసుకుందామని ఎన్నోసార్లు అనుకున్నారు. కానీ గోరఖ్ పూర్ వెళ్ళలేక పోయారు. రాధాబాబా వ్రాసిన "ప్రణామవల్లరి" పుస్తకాన్ని చదివారు. రాధా విలాస మాధుర్య పూరితమైన ఆ పుస్తకం ఆయన మనసున హత్తుకుపోయింది. ఒక రోజు ధ్యానంలో "తల్లీ ! అమ్మా రాధా ! గోరఖ్ పూర్ వెళ్దామని ఎన్నోసార్లు అనుకున్నాను. రాధాబాబా ను దర్శిద్దామని ఆరాటపడ్డాను. కానీ ఆ అదృష్టం నకున్నట్లు లేదు" అని మధనపడసాగిరి. సాయంత్రం 4 గంటలకు సంకీర్తన జరుగుతూ ఉండగా రాధికాప్రసాద్ ధ్యానంలో ఉండగా వారికి ఒక అనుభూతి కలిగినది._ "ఒక 12 సంవత్సరముల అమ్మాయి ఎవరో దివ్య తేజంతో విరాజిల్లుతూ ఒక వ్యక్తిని తన చేత్తో వెంట తీసుకొని రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చింది. రాధికాప్రసాద్ గారు ఆ అమ్మాయిని పిలిచి మిఠాయిలు పెట్టారు."ఎవరమ్మాయి నీవు?" యని అడిగారు. అంతట ఆ అమ్మాయి"నన్ను లలిత అంటారు. నేను రాధారాణి అష్టసఖీగణములలో ఒకరిని. నిన్న నీవు రాధారాణిని కోరావుట కదా ! రాధాబాబాను చూడాలని ఉంది"అని . రాధారాణియే నన్ను నీ దగ్గరకు పంపించింది. ఇదిగో నా వెంట నీ దగ్గరకు వాచ్చిన వ్యక్తియే "రాధాబాబా" యని పల్కెను. రాధికాప్రసాద్ గారు ఆశ్చర్యచకితులైనారు. తను ఎవరిని దర్శిద్దామని అనుకుంటున్నారో, ఎవరికొరకైతే తను గోరఖ్ పూర్ వెళ్దామని అనుకున్నారో సాక్షాత్ ఆ వ్యక్తి స్వస్వరూపంలో తన ముందు సాక్షాత్కరించి యున్నారు. మనసంతా ఏదో తెలియని ఆనందం సంతరించుకున్నది. అంతలో వారు భావంలోకి వెళ్ళారు. తను కదలలేనని, తనను కష్టపెట్టకూడదని రాధారాణి తన కొరకు ఎంత కష్టపడింది. ఎంత శ్రమ తీసుకున్నది. తన పరిచారికా గణంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన లలితను, రాధాబాబాను తీసుకొని తన వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించిందంటే ఆ తల్లికి నా మీద ఎంత ప్రేమ. రాధాబాబా ఎంతటి పుణ్యాత్ములు. ఎంతటి మహనీయులు. నాలాంటి సామాన్యుడు ఏదో కోరిక కోరాడని ఆ కోరిక తీరుద్దామని ఆయనే స్వయంగా వచ్చారంటే ఇంతకంటే ఆయన మహనీయతకు నిదర్శనం ఏం కావాలీ? రాధికాప్రసాద్ గారికి ఆనంద పారవశ్యంతో కళ్ళ నీళ్ళు తిరిగాయి. వారు రాధాబాబా చరణములను స్పర్శించారు. రాధాబాబా వారిని లేవదీసి _"నాయనా ! నన్ను చూడాలని అనుకున్నావా ? నిన్ను చూద్దామని నేనూ అనుకున్నాను. అందుకే వచ్చాను. రాధారాణి సేవలో నీ జీవితం పునీతమైనది. ధన్యమైనదని పల్కి ఆశీర్వదించి అదృశ్యులైరి.

కొంతమంది భక్త జనం గోరఖ్ పూర్ వెళ్ళి బాబాను దర్శించ బయలుదేరారు. గోరఖ్ పూర్ చేరారు. అయితే క్రితం రోజే రాధాబాబా గారు నిత్యకుంజలో (మరణించారని) ప్రవేశించారని తెలిసి ఇక రాధాబాబా దర్శనం మనకు కలగదు అని చాలా బాధపడ్డారు. తన హృదయగత మనోవేదనను రాధారాణికి విన్నవించుకుందామని వారందరూ గోర్ఖ్ పూర్ నుంచి బృందావనం చేరి "బరసానా" కు వెళ్ళి రాధారాణికి తమ బాధను విన్నవించుకున్నారు. ప్రేమమూర్తి రాధ వారి మొరను ఆలకించింది.

వారందరూ రాధారాణిని దర్శించి తిరిగి గోరఖ్ పూర్ బయలుదేరారు. అందరూ మధుర స్టేషన్ లో బస చేశారు. రైలు కొరకు నిరీక్షించసాగిరి. ఆ సమయంలో రాధికాప్రసాద్ గారు కూడా బృందావనం నుంచి గుంటూరు బయలు దేరుటకు మధుర స్టేషన్ కు వచ్చి యున్నారు. ఒక చోట కుర్చీలో ధ్యానం చేస్తూ కన్నులు మూసుకొనియున్నారు.

గోరఖ్ పూర్ బయలుదేరిన భక్త బృందంలో ఒక యోగిని కూడా ఉన్నది. ఆవిడ దూరంగా ధ్యానమగ్నులై యున్న రాధికాప్రసాద్ గారిని చూసింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. రాధికాప్రసాద్ గారి చుట్టూ ఆవిడకు ఏదో అద్భుత కాంతి వలయాలు కనబడ్డాయి. ఆ యోగిని తదేకంగా రాధికాప్రసాద్ గారిని చూస్తూనే ఉన్నది. ఒక్కసారిగా కన్నుల ముందర మెరుపు మెరిసినట్లయ్యెను. అప్పుడు ఆ కుర్చీలో రాధికాప్రసాద్ గారు కాదు రాధాబాబాయే ఆమె వంక చూస్తూ నవ్వుచుండిరి. ఆ యోగినికి ఆనందానికి అవధుల్లేవు. బిగ్గరగా అందరితో _"రాధాబాబా జీవించియే యున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇదిద్గో వీరే రాధాబాబా"యని అందరికి చెబుతూ, భక్తి పారవశ్యంతో రాధికాప్రసాద్ గారి పాదాలకు నమస్కరించింది. భక్తమండలి వారందరూ రాధికాప్రసాద్ గారి పాదాలపై పడ్డారు. రాధారాణి వారందరికి ఆ విధమగు అనుభూతిని ఇచ్చింది. రాధికాప్రసాద్ గారు ఆమెను, ఆ భక్త మండలిని ఆశీర్వదించి, రసమార్గమున పయనించమని, రాధారాణి సేవకు అంకితమగుమని పల్కిరి. అటు తర్వాత రైలు వచ్చింది. రాధికాప్రసాద్ గారు గుంటూరుకు బయలుదేరారు. భక్త జనం అంతా కూడా ఆనంద పారవశ్యంతో రాధికాప్రసాద్ గారిని వీడలేక వీడలేక అచటి నుండి కదలిరి.

శ్రీ రాధికాప్రసాద్ గారు గుంటూరు చేరారు. ఆ రోజు 1992 డిసెంబర్ ఒకటి. రాధాకృష్ణమందిరంలో రాధికాప్రసాద్ గారు కొలువు తీరి యున్నారు. రాధారాణి విరాట్ రూపమును గురించి ఉపన్యసిస్తున్నారు. స్థానిక టి.జె.పి.యస్. కళాశాల అధ్యాపకులు, ఆ కళాశాలలో అధ్యాపకురాలుగా పని చేస్తున్న పళ్ళె నాగమణి గారు కూడా ఆ రోజు ఉపన్యాసాన్ని వింటున్నారు. ఉపన్యాసం మధ్యలో రాధికాప్రసాద్ గారు _" రాధా ఉపాసకునికి రాధారాణి సేవ తప్ప మరో చింతన ఉండరాదు. మృత్యు సంబంధిత బాధ గాని, భయం గాని అతనికి ఉండరాదు. ఈ క్షణం రాధారాణి నన్ను పిలిస్తే ఈ శరీరాన్ని వదిలి వెళ్తాను. అమ్మ పిలిస్తే పోవటానికి నేను సర్వదా సంసిద్ధుడనే అని పల్కారు. ఈ మాటలన్నీ ఆయన ప్రక్కనే ఉన్న అంజనీమాతతో పాటు అనేక మంది విన్నారు. రాధికాప్రసాద్ గారికి జాతకరిత్యా 93 వఏట అయనకి మృత్యు గండం ఉన్నది. ముఖ్యంగా ఆ సంవత్సరం ఫిబ్రవరి 16, జూన్ 4 దినములు చాలా ప్రమాదకర దినములని జాగ్రత్తగా ఉండవలెనని దైవజ్ఞులు పల్కినారు. కానీ తత్సంబంధిత చింత కాని, దిగులు కాని, భయం కాని ఆయనలో మచ్చుకైనా కనబడవు. ఫిబ్రవరి 16 వహ్చింది. అంజనీమాత నాన్నగారిని అంటిపెట్టుకొనియే యున్నారు. ఉదయం సంకీర్తన జరిగింది. తరువాత రాధికప్రసాద్ గారు ఉపన్యాసం చెప్పారు. సాయంత్రం అయింది. మరల సంకీర్తన జరిగింది. రాధికాప్రసాద్ గారు ఆనందంగానే ఉన్నారు. వారిలో ఎటువంటి మార్పులేదు. రాత్రి 9.30 గంటలు అయింది. ఇక పర్వాలేదు ప్రమాదం తప్పినట్లే యని అందరూ భావించారు. రాత్రి 11 గంటలు దాటింది. అంజనీమాతకు ఎందుకో మెలుకువ వచ్చింది. నాన్నగారి వంక (రాధికాప్రసాద్) చూశారు. ఆయన మంచి నిద్రలో ఉన్నారు. ఆయన ప్రక్కనే ఇరువురు చిన్నపిల్లలు, పట్టు పీతాంబరధారులై దివ్య కాంతులను వెదజల్లుతూ కనిపించారు. ఆ పిల్లలకు దూరంగా ఒక నల్లటి ఆకారం తలవంచుకొని నిలబడి యున్నది. వారు ఆ నల్లని ఆకారంతో ఏదో చెప్పారు. అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు రాధికాప్రసాద్ గారి చుట్టూ ఒక సారి తిరిగి అదృశ్యులైరి. అంజనీమాతకు భయం వేసింది. సమయం తెల్లవారు ఝామున 4 గంటలు అయింది.నిదానంగా నాన్నగారి వద్దకు వెళ్ళి చూశారు. నిద్రలో ఉన్నారు. ఆయనను కదిపారు. నాన్నగారు (రాధికాప్రసాద్) కన్నులు తెరిచారు. 4.30 కి ధ్యానానికి కూర్చున్నారు, 6 గంటల సమయంలో "అమ్మా ! బాగా నీరసంగా వుంది.అడుగు వేయలేకపోతున్నానని"పల్కారు. నిదానంగా 10 గంటలకి మళ్ళీ మామూలు స్థితికి వచ్చారు. మా అందరికీ ఎంతో ఆనందం వేసింది.

ఏప్రియల్ నెల వచ్చింది. రాధికాప్రసాద్ గారు భక్త జనంతో తిరిగి బృందావనం చేరారు. అక్కడ జూన్ 4 న ఒక సంఘటన జరిగింది. ఆశ్రమంలో నాన్నగారు ధ్యానమగ్నులైయున్నారు. ఆ సమయంలో ధ్యానంలో, _"ఆశ్రమ గేటు దగ్గర నిలబడి ఏదో ఆకారం రాధికాప్రసాద్ గారిని తనతో రమ్మని పిలుస్తున్నది. దాని పిలుపుకు ఆకర్షితులై రాధికాప్రసాద్ గారు లేచి బయలుదేర సంసిద్ధులైరి.అప్పుడు ఆయన ఆసనం ప్రక్కనే ఒక స్త్రీ కూర్చొని ఏడ్వసాగెను. ఆమె ఏడుస్తూ _" నాయనా !అప్పుడే వెళ్ళి పోతున్నావా ? ఇంకా నీవు సాధించవలసిన,చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి, నీవు ఇంకా అమ్మ సేవ చేయాల్సి ఉంటే అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్తావా ? యని బిగ్గరగా విలపించసాగెను. అంతట రాధికాప్రసాద్ గారు _" లేదమ్మా ! నేను ఎక్కడికీ వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నా తల్లి రాధారాణిని సేవించుకుంటాను" అని పలికారు. గేటుదగ్గర ఉన్న ఆ ఆకారం కొద్దిసేపు నిరీక్షించి తిరిగి అక్కడినుండి వెడలిపీయింది. ఈ విధంగా రెండు పర్యాయములు రాధికాప్రసాద్ గారు దైవీ ప్రేరణచే మృత్యు కౌగిలి నుండి బయటపడ్డారు.

36. హైదరాబాద్ లో ధ్యాన కుటీర నిర్మాణము

1975_76 లలో రసయోగి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు సికింద్రాబాద్, హైదరాబాద్ లలో ధ్యానయోగమునకు సంబంధించిన అనేక ఉపన్యాసములు ఇచ్చిరి. ఆ ఉపన్యాసములను 13 కేసట్ల రూపంలో పదిలపరచుటయూ జరిగినది. ఈ ఉపన్యాసముల ఫలితముగా సికింద్రాబాద్ లోని భక్తులందరూ కలిసి ఒక రాధాకృష్ణ ఆలయమును నిర్మించిరి. ప్రతి భీష్మ ఏకాదశి రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు అక్కడకు వెళ్ళి మూడు దినములు ఉపన్యాసములు ఇచ్చుచుండును. రసయోగి సౌకర్యమునకై ఆలయములోపల "ధ్యానకుటీర్" అను పేర సుమారు లక్ష రూపాయలతో ఒక విడిది గృహమును ఏర్పాటు చేసిరి. అనేక మంది స్త్రీ పురుషులు ఎటువంటి భవభేదాలు లేకుండా రసయోగి ఉపదేశించుచున్న మార్గమున ధ్యానము చేయుచూ జీవితమును శక్తి వంతముగా గడుపుచున్నారు. రసయోగి ఉపన్యాస సాంగత్య ప్రభావము వల్ల విజయనగరమునకు కొంతదూరములో ఉన్న "వినాయకపల్లి" అనే గ్రామము నందలి వందలాది కుటుంబాలకు ఒకే రోజున రాధాకృష్ణ భక్తి యందు ప్రవేశించి, వారే స్వశక్తితో రాధాకృష్ణ మందిరమునొకటి నిర్మించుకొనిరి. ప్రతి ఇంటిలోనూ శ్రీ రాధా చిత్రపటమును ఆవిష్కరించుకొని తమకు చేతనైన సేవ చేస్తూ అందరూ రసయోగి చూపిన మార్గమున భక్తియుత భావనతో కదలసాగిరి.

37. గురువాయూరప్ప సన్నిధిలో రసయోగి

1983, పూజ్యులు రసయోగులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు తన నిరపమాన భక్తితో, శక్తితో ఆర్తజనులను రక్షిస్తూ జనావళినెల్లవారినీ రాధాకృష్ణభక్తి పథమున ముందుకు నడిపించుచున్న రోజులు,నిరంతర రాధాకృష్ణ సంకీర్తనలతో, దివ్యయోగ సాధనకు కేంద్రమై, గుంటూరులోని రాధాకృష్ణ మందిర కీర్తి నలుదిశలా వ్యాపించసాగింది. సాధకులకు, యోగులకు భక్తులకు రసయోగి సాన్నిధ్యం,సహచర్యం వారి వారి మార్గములను సుగమం చేశాయి. శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు నిరంతర రాధా భావనా తత్పరులు.ఎన్నోదివ్య దర్శనాలకు, దివ్యానుభూతులకు ఆలవాలం ఆయన జీవితం.

ఒకసారి వారికి స్వప్నంలో "కృష్ణుడు" కనబడి _ నేను గురువాయూరప్పని నిన్ను అనుగ్రహించవచ్చాను" అని పల్కెను. గురువాయూర్ కేరళలోని అత్యంత పవిత్రక్షేత్రములలో ఒకటి. కృష్ణ భక్తులకు అది పవిత్ర తీర్థస్థలము. గురువు, వాయువు ఇరువురూ కలిసి కృష్ణుని ప్రతిష్ట చేసిన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రము. దేవేంద్రుడు ఇక్కడే తపస్సు చేసి ఆరోగ్యవంతుడయ్యెనని స్థలపురాణము చెబుతున్నది. అలాగే పరీక్షిత్ మహారాజు మరణానంతరము ఆయన కుమారుడు జనమేజయుడు తన తండ్రికి చావుకు కారణం సర్పం కనుక సర్పయాగం చేసి అనేక సర్పములను అగ్నికి ఆహుతి ఇచ్చెను. ఇట్టి పాపకర్మ వలన అతను కుష్టువ్యాధి పీడితుడయ్యెను. అతను కూడా ఈ క్షేత్రమునకు వచ్చి ధ్యానం చేసి ఆ గురువాయురప్ప కృపచే ఆరోగ్యవంతుడయ్యెను. ఈ విధముగా దర్శనమాత్రముననే సర్వసుఖములను కలుగచేయువాడు శ్రీ గురువాయురప్ప.ఇది హిందువులకు అత్యంత ప్రసిద్ధి కెక్కిన పవిత్ర క్షేత్రములలో మకుటాయమానమైనది. విచిత్రమేమిటంటేఈ గురువాయురప్పను ఎంతమంది హిందువులు ఆరాధిస్తారో, అంతమంది ముస్లింలు, అంతమంది క్రైస్తవులు కూడా ఆరాధిస్తున్నారు. ఈ విధముగా అన్ని ధర్మాలవారిని సమదృష్టితో చూస్తూ తన అమృతమయ దృక్కు లను ప్రసరింపచేసి అందరినీ తన వైపు ఆకర్షించుకొనుచున్నాడు శ్రీ గురువాయురప్ప.

అట్టి స్వామి రసయోగికి స్వప్నంలో సాక్షాత్కారమిచ్చి "నీవు నా క్షేత్రమునకు వచ్చి మూడు రోజులుండుము. నీకు శుభమగుగాక" అని పల్కి అదృశ్యమయ్యెను. రసయోగి గురువాయూర్ కి పయనమైరి. మాత అంజనీదేవి తదితర భక్తబృందం వారిని అనుసరించింది. ఆ భక్త బృందంలో యువకుని తాతగారు పురుషోత్తమరావు గారు నాయనమ్మ గారు శ్రీమతి స్వరాజ్యలక్ష్మీ గారు, పిన తండ్రి పి.వి.కె రామారావు గారు ప్రభృతులు ఉన్నారు. మాతాంజనీదేవి అన్నపూర్ణాదేవివలె అందరికీ అన్నపానాదులన్నీ సమకూర్చింది. అన్నం కలిపి అందరికీ ముద్దలు తినిపించింది. పురుషోత్తమరావు గారు, నిష్ఠాగరిష్టులు. మడితో వండిన పదార్థాలు తప్ప, మరే ఇతర పదార్థాలను తినరు. అంజనీమాత వారితో మీరు ఈ గోరు ముద్దలు తినెదరా అని పలుకగా_" అమ్మ పెడుతుంటే ఎందుకు తినను" అని పల్కి వారు కూడా ఆ ఆనందాన్ని, అదృష్టాన్ని పంచుకొనిరి. యువకుని నాయనమ్మ గారికి రసయోగి పట్ల పుత్రవాత్సల్యం ఉంది. ఆవిడకు కుడి చేతికి పక్షవాతం వచ్చి తగ్గింది_"అటు పిమ్మట ఒక రోజు ఆవిడ తన చేతులతో పిండి నానబెట్టి, రుబ్బి స్వయంగా గారెలు తయారు చేసి మందిరానికి వచ్చి అక్కడ ఉన్న తన కుమారునికి పెట్టక రాధికాప్రసాద్ గారికి ముందర తినిపించింది. ఆ తరువాత కొద్దిరోజులలోనే ఆమె తన శరీరాన్ని చాలించింది. భౌతికదేహం చాలించిన మరుక్షణమే ఆమె బృందావనంలోని రసయోగి వద్దకు వెళ్ళగా ఆయన ధ్యానదృష్టితో చూచి ఆ పవిత్రాత్మను ఊర్ధ్వతపో భూమికలలో ప్రవేశబెట్టిరి. బామ్మగారికి నాన్నగారి పట్ల ఉన్న భక్తి వాత్సల్య భక్తి. అటు పిమ్మట రసయోగి గుంటూరు వచ్చినప్పుడు ఆమె కుమారులకు విషయం చెప్పి మీరు చేయు శ్రద్ధ కర్మలు ఆ జీవికి అవసరం లేదు. ఈ ఆహారంతో అవసరం లేని భూమికలలో ఆమె ఉన్నది" అని పల్కిరి.

"గురువాయూర్" క్షేత్రంలో రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు మూడు రోజులు ఉన్నారు. అక్కడ స్వామి వారు మూడు రూపములతో వివిధ సమయములో భక్తజనులకు దర్శనమిస్తూ కృతార్ధులను చేయుచుండును గురువాయురప్ప ప్రాత:కాలమున వెన్నముద్దలు పట్టుకొన్న బాలకృష్ణుని రూపముతో, మధ్యాహ్నం తలపాగాతో గోవులను కాచే మధురానాధునిగా, రాత్రి దర్భారులో మహారాజుగా ద్వారకాధీశునిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇవి ఆ స్వామిని నిత్యసేవా విశేషాలు.

పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు మూడు రోజులు ఆ పవిత్ర క్షేత్రంలో దీక్షతో ధ్యానం చేశారు. స్వామి కృపకు పాత్రులైనారు. అటు పిమ్మట ఆ గురువాయురప్ప వద్ద సెలవు తీసుకొని తిరిగి గుంటూరు చేరిరి. ఈ రోజుకీ ఆ గురువాయురప్ప చిత్రపటము వారిచే నిత్యపూజాసేవనందుకుంటూ గుంటూరు రాధాకృష్ణ మందిరంలో ఉన్నది. ఇటువంటి దర్శనాలు, సాక్షాత్కారాలు, దివ్యానుభూతులు ఆయన జీవన స్రవంతిలో అత్యంత సహజాలు.ఎందుకంటే సాక్షాత్ కృష్ణ ప్రాణాధిదేవతయగు శ్రీ రాధ ఎన్నుకొన్న భక్తాగ్రగణ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు.

38. బృందావనంలో రాధాలీలా విలాసం

బృందావనంలో రాధారమణ్ జీ మందిరం ఎంతో ప్రఖ్యాతి గాంచిన మందిరాలలో ఒకటి. ఆ ఆలయధర్మకర్త శ్రీ పురుషోత్తమదాస్ గోస్వామి మహారాజ్. గొప్ప రాధికాఉపాసకుడు, గొప్ప ధనికుడు కూడా. బృందావనంలో అధిక భూభాగానికి అధిపతి అతను. అమెరికాలో సైతం రాధాకృష్ణ దేవాలయం నిర్మించి అక్కడి కార్యకలాపాలను సైతం సమీక్షిస్తూ ఉంటాడు. అతనికి ఒక రాసలీలా ప్రదర్శన హాలు (జయసింగ్ డేరా) ఉంది. ఆయన ప్రజా భూమిలోని చిన్నపిల్లలను సేకరించి వారందరికి రాసలీలా ఘట్టాలను వివరించి తగిన శిక్షణ ఇప్పించి రాసలీలను సినిమాగా తీసి కాసెట్ చేసి, దానిని బృందావన వాసులకు మాత్రమే చూపించేవారు. ఆ కాసెట్ ను బయటకు పంపేవారు కూడాకాదు. ఒక రోజు ఆయనకు స్వప్నంలో రాధారాణి దర్శనమిచ్చి _"బడేకుంజ్ లో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఒక యోగి ఉన్నారు. సఖీభావనతో నన్ను ఉపాసన చేయువారు. వారిని దర్శించుకో"యని పల్కిది. పురుషోత్తమదాస్ కళ్ళు తెరిచాడు. బృందావనంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక యోగి వచ్చి యున్నారు. అతను ఎంతో మహత్తు కలవారని, రాధాభక్తులని "ఇంతకు ముందే విని యుండెను. ఇప్పుడు రాధారాణియే ఆ మాటలు పల్కేసరికి ఆ మహాత్ముని దర్శించ కాలినడకన చెప్పులు సైతం వేసుకొనక ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి బడేకుంజ్ లోని "రాధామహాలక్ష్మి ఆశ్రమానికి" వచ్చారు. ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆశ్రమంలో కీర్తన జరుగుతుంది. రాధికాప్రసాద్ గారు వ్రాసిన గేయాన్ని అక్కడి భక్త బృందం గానం చేస్తూ ఉన్నారు.

గీతము :

శ్రీదేవీ _ _ _ _ శ్రీదేవీ_ _ _ _ _శ్రీదేవీ _ _ _ _ _

చరణం :

శ్రీదేవీ నీ దివ్య పాదములె మదినమ్మి

అహరహము నీ కొరకు ఆర్తితో విలపింప

నా ప్రాణమే నిలుచునా నా తల్లి

నిను విడిచి జీవింతునా _ _ _ _ ||| శ్రీదేవీ |||

1. మరువలేనిక నీదు మధుర తరమగు శోభ

నీకు అంకితమాయెగా నాదు జీవితమెల్ల

నీ ప్రేమ వాహినిలో _ _ _ _ నా తల్లి

నను ముంచి వేయవా నా తల్లి

నను ముంచి వేయవా ||| శ్రీదేవీ |||

2. మదన మోహిని నీవే నాదు హృదయము నంత

ప్రీతితో అర్పించి ఆర్తితో నీ కొరకు

కలలు గన్నను గానీ కరువాయనే

కలలు గన్నను గానీ కరువాయనే నీ రూపు ||| శ్రీదేవీ |||

3. భావరూపిణి నీదు ప్రేమయే నా నౌక

ఈ మాయ జలధిలోనే మునిగి పోకుండ

కరుణించి కాపాడవా _ _ _ రాధరో

కనికరము చూపించవా _ _ _ రాధరో

కనికరము చూపించవా _ _ _ _ |||శ్రీదేవీ |||

తనకు తెలుగు భాష రాకపోయినా ఆ కరుణ రస భరితమైన ఆ పాటలోని మాధుర్యానికి, భక్తికి పరవశుడై పోయారు పురుషోత్తమదాస్ గోస్వామి. ఆనందంలో రాధికాప్రసాద్ గారి పాదాలకు నమస్కారం చేశాడు. ఆ అనందంలో రాధికాప్రసాద్ గారి గురించి ఇంగ్లీషులో ఒక మాట పల్కారు (I knaow that your are confidential Sakhi to Radha )_ నాకు తెలుసు రాధాజీ విశ్వాసపాత్రులైన సఖులలో మీరొకరని పల్కారు. అంతేకాక రాధికప్రాసాద్ గారిని దర్శించి మరల ఈ విధముగా పల్కెను _"మహారాజ్ ! మీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ చరితార్థమైనది. నాకు ఒక థియేటర్ ఉంది. అందులో రాధా_కృష్ణుల రాసలీలా ఘట్టాలను సినిమాగా తీసి భక్త జనులకు, కేవలం వ్రజధాములకు మాత్రమే చూపిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను మీకు కానీ మీ మందిర వాసులకు కానీ మీరు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ రాసలీలా ఘట్టాలను సినిమాను ఉచితంగా ప్రదర్శించగలవాడను" అని అత్యంత ప్రేమాస్పదమైన సంభాషణ గావించి అవ్యక్తానందంతో అచటి నుండి కదలినాడు.

శరత్ పూర్ణిమ. బృందావనం ఎంతో అందంగాఅలంకరించబడింది. ఈ తిథి బృందావన వాసులందరికి జీవితంలో ఒక గొప్ప మధురానుభూతిని కలిగించే తిథి. ఈ రోజే రాధాకృష్ణుల రాసోత్సవం ప్రారంభమగుతుంది. ఈ శరత్ పూర్ణిమ ఉత్సవన్ని రంగ రంగ వైభవముగా బృందావన వాసులు జరుపుకుంటారు. బృందావనంలో బిహారిజీ ఆలయ ధర్మకర్త "శ్రీ మృదుల్ కృష్ణ గోస్వామీ మహారాజ్". బృందావనంలో స్వయంభూగా వెలసిన "బిహారిజీ" మూర్తిని (కృష్ణుని) నిరంతరమూ భక్తితో అర్చిస్తూ నిత్య సేవ చేయు అదృష్టశాలి అతను. వారు శరత్ పూర్ణిమ ఉత్సవాన్ని ఏర్పాటు చేసి పూజ్యులు రాధికాప్రసాద్ గారిని ఆ ఉత్సవం తిలకించటానికి రమ్మని ఆహ్వానించారు. రాధికాప్రసాద్ గారు భక్త జన బృందంతో ఉత్సవాన్ని దర్శించ వారి గృహమునకు కదలినారు. మృదుల్ కృష్ణ గోస్వామి తమ గృహమును పావనము చేసిన రాధికాప్రసాద్ గారిని భక్తితో అత్యంత ప్రేమతో గృహములోనికి తీసుకెళ్ళారు.అక్కడ తెల్లని పరుపు పై రాధికాప్రసాద్ గారిని ఆసీనులను గావించారు. తమ గృహములో రాధారాణికి భోగ్ లో సమర్పించిన పాలను రాధికాప్రసాద్ గారికి సమర్పించారు. అక్కడ రాధికాప్రసాద్ గారు "శరత్ పూర్ణిమోత్సవం" తిలకించారు. ఎన్నడూ జరుగనంత అద్భుతరీతిలో ఆ ఉత్సవం జరిగింది. అందరి మనస్సులో ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందం గోచరించాయి. ఆ మహదానందానుభూతిని పొంది అందరూ తమ తమ ఇళ్ళకు మరలినారు. రాధికాప్రసాద్ గారి రాక వల్లనే ఇటువంటి మధురానుభూతి కలిగిందని ఇప్పటికీ మృదుల్ కృష్ణ గోస్వామి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. బృందావనంలో ఏ పండుగ జరిగినా "బిహారిజీ ప్రసాదాన్ని" రాధా మహాలక్ష్మి ఆశ్రమానికి పంపుతూ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పట్ల తనకున్న భక్తి శ్రద్ధలను కనబరుస్తూ ఉన్నారు.

బృందావనంలో సుదామకుటీర్. చిన్న పిల్లలతో రాసలీలా ఘట్టాలను ప్రదర్శనలిస్తూ ఉంటారు. అది కేవలం బృందావనంలో మాత్రమే వారు ఆ ప్రదర్శన ఇస్తూ ఉంటారు. బృందావన భూమిని వదలి బయటకు వెళ్ళరు. ఆ పిల్లలు రాసలీలను ప్రదర్శిస్తున్నప్పుడే సాక్షాత్ శ్యామాశ్యాములే "రాస" జరుపుతున్న అనుభూతి కలుగుతుంది. ఒకసారి రాధికాప్రసాద్ గారు వారిని తమ ఆశ్రమంలో ప్రదర్శన జరపమని కోరారు. వారు ఎంతో ఆనందంతో ఆశ్రమానికి వచ్చిన "రాసలీలా ఘట్టాలను" ప్రదర్శించారు. రాధికాప్రసాద్ గారు ఎంతో ఆనందించారు. ఆ పిల్లలు కూడాఆశ్రమ ప్రాంగణంలోకి అడుగిడగానే తాము పిల్లలమనే మాట మరిచారు. అందరూ సఖీ గణముల వలె మారారు. చుట్టూ సఖీ గణము మధ్యలో శ్యామాశ్యాములు. అద్భుత రీతిలో రాసలీల జరుగుతుంది. ఏదో దివ్య జ్యోతి ఆశ్రమాన్ని ఆవరించింది. శ్యామాశ్యాముల పాత్రధారులు,సఖీ పాత్రదారులందరూ తాము పిల్లలము, రాసలీలని నటిస్తున్నామనే విషయాన్ని మరచిపోయినారు. ఎన్నడూ జరగని విధముగా, అద్భుతముగా సాక్షాత్ శ్యామాశ్యాములే అక్కడ రాస ప్రదర్శన జరుపుతున్నారా అనే విధంగా ప్రదర్శన కొనసాగింది. అందులో రాధ పాత్రధారి రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చి _"రాధికాప్రసాద్ గారి బుగ్గ నిమిరి ఒక ముద్దు ఇచ్చింది. రాధికాప్రసాద్ గారు కూడా అత్యంత ప్రేమతో ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని ముద్దాడారు. పిల్లలందరికి మిఠాయిలు ఇచ్చారు. భక్త జనం ఆ అద్భుత రాస ప్రదర్శనను తిలకించి బాహ్యస్మృతిని కొలది సేపు మరచి మధురానుభూతిని పొందారు. సుదామకుటీర్ కార్యనిర్వాహకులు రాధికాప్రసాద్ మహారాజ్ గారికి నమస్కారం చేస్తూ _"ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాము ఎన్నడూ ఇలాంటి ఆనందాన్ని పొందలేదు. ఈ మందిరంలో, మీలో ఏదో దివ్య తేజస్సు ఉంది" అని పల్కి, రాధికాప్రసాద్ గారి ఆశీర్వాదం తీసుకొని అచటి నుండి మరలినారు.

బరసానా, రాధారాణి నిత్య నివాస ధామం. బరసానా అంటే "కురియుట" అని అర్థం. రాసేశ్వరి రాధాదేవి, అక్కడ అందరిపై అమృత వర్షమును కురిపించును గాన ఆ ప్రదేశమునకు ఆ పేరు. అది రాధాష్టమి పర్వదినం. కొన్ని వందల వేల మంది ఆ రోజు ఆ ధామాన్ని, రాధారాణిని దర్శించి పునీతులవుతూ ఉంటారు. ఆ ఉత్సవాన్ని చూద్దామని అనేకమంది భక్తులు రాధామహాలక్ష్మి ఆశ్రమానికి వచ్చారు. అందరినీ తీసుకొని అంజనీమాత బరసానాకు వెళ్ళారు. ఆశ్రమంలో రాధికాప్రసాద్ గారు మాత్రమే ఉన్నారు. రాధాష్టమీ మహోత్సవం. రాధారాణిని, నా చిట్టి తల్లిని ఎంత అందంగా అలంకరించి ఉంటారో, నా తల్లి ఎంత మురిసిపోతూ ఉంటుందో, ఆ దివ్య సౌందర్యాన్ని ప్రత్యక్షంగా చూడవలసిందే. కానీ ఏమి చేయగలను. అంత దూరం వెళ్ళి కొండనెక్కి నా చిన్నారి ని చూచే శక్తి లేదాయెను కదా !" యని రాధికాప్రసాద్ గారు మనస్సున అనుకొనసాగిరి. ఇంతలోనే ఒక అమ్మాయి సుమారు 12 సంవత్సరములు ఉంటాయి. ఎర్రని పరికిణీ, దాని మీద తెల్లటి పావడా, నడుముకి వడ్డానం, కాళ్ళకు పారాణి, నుదిటిన కళ్యాణ తిలకంతో సర్వాలంకార భూషితయై రాధికప్రసాద్ గారి ముందర సాక్షాత్కరించి _ " బాబా ! ఇదిగో నేను వచ్చేశాను. నీవు చూడాలనుకున్నావు కదా ! అందుకని వచ్చేశాను. నేను " బాగున్నానా ? మా అమ్మ నన్ను బాగా అలంకరించిందా ? నేను నచ్చానా" యని అడిగింది. రాధికాప్రసాద్ గారు ఆ అమ్మాయిని చూశారు. సర్వాంగభూషితయై అద్భుత సౌందర్యంతో ఒప్పారుచున్న ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకున్నారు. సందేహం లేదు. ఈ అమ్మాయి మరెవరో కాదు. చిన్నారియే. రాధారాణియే అని అనుకుంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. అంతట ఆ అమ్మాయి _ " బాబా నేను చిన్న పిల్లను. నీవు పెద్దవాడివి. చిన్న పిల్లలకు ఎవరైనా పెద్దవారు నమస్కారం పెడతారా ? ఇంతకూ నీవు చెప్పనే లేదు _"నా పరికిణి, పావడా బాగున్నాయా ? నేను నీకు నచ్చానా ?" యని అడిగింది. అంతట రాధికాప్రసాద్ గారు _" చాలా బాగున్నావమ్మా! నీవు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు తల్లీ" యని పలికారు. అంతట ఆ అమ్మాయి _" పో బాబా ! నీవు ఎప్పుడూ ఇంతే. ఏదీ సరిగ్గా చెప్పవు. ఇదిగో బాబా నీ కొరకు ప్రసాదం తెచ్చాను " అని అంటూ తను తెచ్చిన ప్రసాదాన్ని రాధికాప్రసాద్ గారి నోటికి స్వయంగా అందించి _"బాబా నేను మళ్ళీ వస్తానని" పల్కి అదృశ్యమైనది. ఇంతలో అంజనీమాత మిగిలిన భక్త బృందాన్నంతా బరసానా దర్శనం చేయించి ఆశ్రమం చేర్కున్నారు. రాధికాప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళి ప్రసాదం ఇద్దామని ప్రసాదం తీశారు. వారు ఏదైతే ప్రసాదం తెచ్చారో అదే ప్రసాదం రాధికాప్రసాద్ గారి చేతుల్లో ఉంది. ఆశ్చర్యంతో అంజనీమాత రాధికాప్రసాద్ గారిని ప్రశ్నించింది _ "నాన్నా ! ప్రసాదం ఎక్కడిది ? ఎవరిచ్చారు ? " దానికి రాధికాప్రసాద్ గారు __ " ఏం మీరెవ్వరూ ఇవ్వకపోతే నాకు ప్రసాదం అందదనుకున్నారా ? మీరెవ్వరూ నన్ను తీసికెళ్ళకపోతే నేను నా తల్లిని, చిన్నారిని చూడలేననుకున్నారా ? నేనూ చూశాను. ఎర్రటి పరికిణీలో, తెల్లటి పావడాతో రత్నాలంకార భూషితయై నా చిట్టి తల్లి ఎంత అందంగా ఉందో" యని కళ్ళకు కట్టినట్లు రాధారాణి సౌందర్యాన్ని వర్ణించారు. అంజనీమాత, భక్తజన బృందం ఆశ్చర్యచకితులైనారు. కారణం రాధికాప్రసాద్ గారు ఏ రూపంలో వర్ణించారో, ఏ దుస్తులు చిన్నారి ధరించిందని చెప్పారో బరసానాలో "రాధారాణి" అవే రంగు దుస్తులతో అలంకరణ చేశారు. వీరంతా రాధారాణిని దర్శిద్దామని బరసానాకు వెళ్తే, ఆ తల్లి రాధారాణి తన బిడ్డను చూడటానికి బరసానా నుండి బృందావ్నం వచ్చింది. రాధికాప్రసాద్ గారు నవ్వుతూ __ " ఏమిటీ ఆలోచిస్తున్నారు. నిజమే చెప్పాను కదూ !" యని ప్రశ్నించారు. వారందరికీ నోటమాటలు కరువైనాయి. వారంతా భక్తితో రాధికాప్రసాద్ గారికి పాద నమస్కారం చేశారు. అప్పటికే వారు ధ్యానమగ్నులైనారు.

పూజ్యులు రాధికాప్రసాద్ గారు గుంటూరు విచ్చేశారు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. రాధికాప్రసాద్ గారు మందిరంలో కొలువుతీరి ఉన్నారు. భక్తజన సందోహం వారి అనుగ్రహ భాషణకై ఎదురుచూస్తూ ఉన్నారు. రాధికాప్రసాద్ గారు అనుగ్రహ భాషణ గావించారు _" పరమాత్మ నుండి వెలువడిన ఈ జీవుని నిరంతర యానం తిరిగి ముగిసేది మరల ఆ పరమాత్ముని కలిసినప్పుడే. అంతవరకూ ఈ యానం కొనసాగుతూనే ఉంటుంది. భగవంతుని భక్తునకు సన్నిహితం గావించేది, భక్తును భగవంతుని దగ్గరకు చేసేది "ప్రేమ ఒక్కటే". ప్రేమకల్గిన భక్తితో భగవంతుని ధ్యానింపవలెను. ఇదియే రసోపాసన. ఈ ఉపాసన యందు సాధకుడు విధిగా పాటించవలసిన విధులు ఐదు ముఖ్యముగా ఉన్నవి. అందులో మొదటిది మంత్రం. ప్రతి జీవుడు రాధా మంత్రాన్ని గురుముఖంగా తీసుకోవాలి. మంత్ర పఠనం వల్ల మనస్సుకున్న అజ్ఞానం తొలగి జీవుడు వివేకవంతుడగును. రెండవది బృందావన వాసం. రాధామాధవ నిత్య రాసలీలా ధామం బృందావన ధామం. బృందావనమున జీవులు నివశించాలి. యనగా "ధామనిష్ఠ" కల్గి యుండవలెను. దీని వల్ల జీవునిలోని జడ బుద్ధి నశించును. మూడవది యమునా స్నానం. పరమాత్మ స్పర్శతో పునీతమైన నదీమ తల్లి యమున. యమునా స్నానం వల్ల హృదయ కల్మషం తొలగి జీవుడు పరిశుద్ధుడగును. నాల్గవది సత్సాంగత్యము. రసికుల, రసికాచార్యుల, మహాత్ముల సాంగత్యము చేస్తూ వారి సాన్నిహిత్యమును సదా వాంఛిస్తూ వారు నడుచు మార్గమున జీవుడు నడవ వలయును. ఐదవది సఖీ భావనతో రాధా చింతన. మానవుని నీట ముంచిననూ, పాల ముంచిననూ ప్రేమయే కారణము. ప్రేమను భౌతిక సుఖముల వైపు మరలించిన జీవుడు పతనము చెందును. అదియే రాసేశ్వరి రాధారాణికి ఇచ్చిన రాధాజీ యొక్క నిత్యరాసలో నీవు చేరిపోతావు ! శ్రీ కృష్ణుడే లభించగలడు యని ప్రేమ తత్వాన్ని భక్తులకు విశదీకరించిరి. అనుగ్రహ భాషణ పూర్తి అయిన తర్వాత అంజనీ మాతను ఒక గీతాన్ని ఆలాపించమని కోరిరి.

గీతము :

చరణం :

మానవ ప్రేమయే ముక్తి మార్గము

మానవ ప్రేమయే మాయా కూపము

పరమ గూఢమౌ ప్రేమ రహస్యము

ప్రేమ యోగులకు ప్రీతి సుమా || మానవ ||

1. సర్సము కొసగిన క్షీరమే విషమై

జీవుల నెల్లా చంపు విధంబున

ప్రకృతి కొసగిన ప్రేమయె సూటిగ

భవసాగరమై జీవుల ముంచును. || మానవ ||

2. గోవుల కొసగెడి గ్రాసమె నీటుగ

మధుర క్షీరమైమనకు లభించును

రాసేశ్వరి యౌ రాధాదేవికి

ప్రేమ నొసంగిన మాధవునిచ్చును || మానవ ||

ప్రేమ తత్వాన్ని సరళమైన పదాలతో పొందు పరచి అందరికీ అర్థమయ్యే రీతిలో పాట ద్వారా తెలియజేశారు పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు. ఒక ప్రక్క జీవుని హెచ్చరిస్తు, మరొక ప్రక్క జీవునికి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఈ గీతం మనవ జీవిత పరమార్థం ఏమిటో విశదీకరిస్తుంది. రాసేశ్వరుడైన శ్రీ కృష్ణుని పొందు మార్గాన్ని సూచిస్తున్నది.

39. సనాతన ధర్మ రక్షకునిగా

ఒక సారి గుంటూరులో థియోసాఫికల్ సొసైటీ వారు ధార్మిక ఉపన్యాసాల కొరకై అనేకమంది ప్రముఖులను ఆహ్వానించారు. ఒక క్రిస్టియన్ మతాచార్యుడు తన మతమేగొప్పది. హిందూ మతము పతనమై పోయినది అని ఉదాహరణకు శ్రీ కృష్ణుడు వారి ఆరాధ్య దైవమట. అతనేమో ఆడవారు స్నానం చేస్తూ ఉంటే చీరలనెత్తుకెళ్ళువాడు. అతను వారి దేవుడట" యని హేళన గావించాడు. అది ఎవరో, పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారికి చెప్పారు. వారి మాటలకి రాధికాప్రసాద్ గారు చాలా బాధపడ్డారు. ఆ మరునాడు ఆ థియోసాఫికల్ సొసైటీలో రాధికాప్రసాద్ గారి ఉపన్యాసం జరిగింది. ఆ రోజు వారిచ్చిన ఉపన్యాసం భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. ఆ ఉపన్యాసం సర్వధర్మసారమనే చెప్పవచ్చు _"హైందవ ధర్మము అతి ప్రాచీనమైనది. అతి పవిత్రమైనది" అని అంటేమిగిలిన ధర్మాల అపవిత్రమైనవని తలపవద్దు. దేని విశిష్టత దానిదే. కానీ అన్ని ధర్మాల లక్ష్యం, ధ్యేయం ఒక్కటే. అదియే భగవత్ ప్రాప్తి. జ్ఞానమనగా ఆత్మ _ పరమాత్మ బెధమును తలపకుండుటయే. మనస్సు విషయ భోగములకు దూరంగా నుంచుటయే ధ్యానము. మనస్సు నందలి మలినమును విడుచుటయే స్నానమనగా, ఇంద్రియములను తన వశమగునట్లుచేసుకొని, సమస్త కోర్కెలను విడుచుటయే పవిత్రత యనగా. ఇదియే ఏ ధర్మమైననూ పల్కునది. ఇదియే సత్యము. హైందవ మతము గాని, క్రైస్తవ మతము గాని, మహమ్మదీయ మతము గాని పల్కునది ఒక్కటే _ భగవంతుని పొందవలెనన్న జీవునకున్న ఏకైక సాధనము _ "ప్రేమయే".

ఈ చిత్రపఠమును చూడుడు. ఒక కొమ్మ పై బాలకృష్ణుడు కూర్చొని యున్నాడు. కొన్ని కొమ్మలపై చీరలు వేలాడుతూ ఉన్నాయి. వృక్షానికి కొంతదూరంలో నీటిలో అర్ధనగ్న స్థితిలో స్త్రీలు కృష్ణుని వంక చూస్తూ నమస్కరిస్తూ నిలబడి యున్నారు. హిందూ జనులు ఆరాధిస్తూ ఉండే ఈ చిత్రపఠం సూచిస్తూ ఉండే తత్వం ఏమిటి ? దిగంబరులైన స్త్రీలు, వారిని చూస్తున్న గోపాల కృష్ణుని తత్వం ఏమిటి ? అనేది మీకు వివరిస్తాను. అయితే ముందుగా క్రైస్తవ మత రహస్యాన్ని చెప్పి దీని గురించి మాట్లాడతాను _

క్రైస్తవ మతంలో దేవుని వద్ద మొదట ఒక పురుషుడు, స్త్రీ దిగంబరులై దేవారాధన చేస్తూ ఉంటారు. వారికి సమీపంలో పళ్ళతో కూడిన ఒక వృక్షం ఉంది. ఒక రోజు భగవంతుడు ఎక్కడో పయనమగుచూ దిగంబరులుగా ఉన్న "యాడమ్ _ ఏవ్" లతో ఇలా పల్కెను _ " చెట్ల పండ్లను మీరు తినవలదు. అట్లు తినుటచే అరిష్టము కలుగునని సూచించెను. దేవుడు వెళ్ళి పోయిన పిదప దేవుని ఆజ్ఞకు భిన్నంగా "యాడమ్ _ ఏవ్ " అను స్త్రీ_పురుషులు తినకూడని ఈ పండ్లను తినినారు. ఉత్తర క్షణంలోనే వారికి దేహభావము ఉదయించింది. మేము దిగంబరులుగా ఉన్నామని భావించుకుంటూ సిగ్గు పడుచుండిరి. అంతకు పూర్వం వాళ్ళకు దిగంబర శరీర భావము లేదు. సిగ్గునూ లేదు. స్త్రీ పురుష భావమూ లేదు. అదే హిందూ భావము. మాయ వల్ల జీవాత్మలకు ఈ దేహమే "నేను" అను భావన కల్గుతున్నది. అంతేకాదు వీడు పురుషుడు, అది స్త్రీయను భావన కూడా కల్గుచున్నది. అదియే భగవంతుని మాయ. ప్రతి జీవాత్మ దిగంబరంగానే ఉంటుంది. అది పతనమై భూలోకానికి వచ్చినప్పుడు ఆ జీవాత్మకు స్త్రీ, పురుష భావమును సిగ్గును ప్రారంభమగుతాయి. ఈ దివ్య తత్వాన్ని పై పఠం ప్రకటిస్తున్నది. ఈ పఠము బూతు పఠము కాదు. జీవునుకి తన వాస్తవిక స్వరూపాన్ని గుర్తు చేస్తూ, తను ఎట్టి స్థితి నుండి ఎట్టి స్థితికి వచ్చినాడో తెలియపరిచే దివ్యతత్వ సంబంధిత చిత్రమిది. ఇదే భావాన్ని తత్వాన్ని మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు". ఈ ఉపన్యాసం ముగియగానే అనేక మంది క్రైస్తవులు, మహమ్మదీయులు రాధికాప్రసాద్ గారి వద్దకు వచ్చి వారికి పూలమాలలు సమర్పించి అంజలి ఘటించారు.

అంతట రాధికాప్రసాద్ గారు "వస్త్రాపహరణ లీల " యొక్క నిగూఢ రహస్యమును వివరిస్తూ_

సమస్త విశ్వమున ఆత్మ రూపమై భగవానుడు వ్యాపించి యున్నాడు. ప్రాణులందరూ అతని ఇచ్ఛానుసారమే నడుచుచుందురు. ఆత్మ _ పరమాత్మ అబేధ తత్వమును యోగులు పల్కుచుందురు. గోపికలు పరమాత్ముని పతిగా భావించిరి. అతనే పరమ పతి. దేహ భావన ఉన్నంత వరకు పరమాత్మ వేరు, నేను వేరు యను భావముండును. కానీ ఆ భావన దూరమైనప్పుడు నేను వేరు, పరమాత్మ వేరు అను భావన గాని, సిగ్గు, అభిమానము మొదలగు ఆలోచనలకు మనసున స్థానముండదు. అంతటా పరమాత్మయే గోచరించును. కానీ అనుభవము పరిపక్వమైనప్పుడు గాని అట్టి స్థితి కలుగదు. భగవానుడు ఈ లీల ద్వారా గోపికలు ఈ పరిపక్వావస్థ స్థితిని పొందినారో లేదో పరీక్షించినాడు. ఈ పరీక్ష ద్వారా వారిలో ఆ పరిపక్వ స్థితిని కల్గించి యోగ్య అధికారులను చేసినాడు. కనుక ప్రతి జీవుడూ అటువంటి పరిపక్వ స్థితిని పొందినప్పుడే పరమాత్మను సందర్శించగలడని భావము" అని హైందవ ధర్మ విశిష్టతను, కృష్ణలీలా రహస్యాలను విశదీకరిస్తూ ఈ నిగూఢ రహస్యములను గ్రహించగల శక్తి లేని వారు అజ్ఞానుల వలె మాట్లాడుచుందురు. వారికి భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించు గాక :

పూజ్యులు రాధికాప్రసాద్ గారి ప్రవచనములతో తమ జీవన విధానన్ని భక్తి మార్గం వైపు మరలించుకొని, తమ జీవితాన్ని సార్ధకపరుచుకున్నవారు ఎంతో మంది ఉనారు. విజయవాడలో "సుశీల" అను భక్తురాలు ఉండెను. ఆవిడ అనేక మార్లు గుంటూరు రాధాకృష్ణ మందిరమునకు వచ్చి రాధాకృష్ణులను, పూజ్యులు రాధికాప్రసాద్ గారిని దర్శించింది. వారికి రాధికాప్రసాద్ గారు చిన్నారి పటమును ఇచ్చి పూజించుకొమ్మని, సేవ చేసుకోమని పల్కినారు. ఆనాటి నుండి ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్నారిని పూజిస్తూ ఉండేది. చిన్నారి పటము ప్రక్కనే రాధికాప్రసాద్ గారి పటమును కూడా గురుస్థానంలో ఉంచి ధ్యానించేది. ఆవిడకు ఒక రోజు ఒక అద్భుతమైన అనుభూతి కల్గింది _

"పూజ్యులు రాధికప్రసాద్ గారు ఆవిడ గృహమునకు వేంచేశారు. అక్కడే ఉన్న ఒక పడక కుర్చీలో పడుకున్నారు. ఆవిడ ఆ సమయంలో "చిన్నారి రాధ" ను పూజిస్తున్నది. పూజ ముగించుకొని ఇంటి వరండాలోకి వచ్చేసరికి పూజ్యులు రాధికాప్రసాద్ గారు కనిపించారు. వారి హృదయం పై "శ్రీ రాధా" అనే అక్షరాలు కన్పడ్డాయి. మరి కొద్దిగ దగ్గరకు వెళ్ళేసరికి రసయోగి స్థానంలో ఒక స్త్రీ మూర్తి కన్పడింది. అవిడ ఆనందంతో ఆయన దగ్గరకు జేరింది. రాధికాప్రసాద్ గారు ధ్యానంలో ఉన్నారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి "రాధే రాధే" నామం వెలువడుతున్నది. ఆవిడకు ఆశ్చర్యం వేసింది. తదేకంగా రాధికాప్రసాద్ గారిని చూస్తూనే ఉన్నది. ఇంతలో రాధికాప్రసాద్ గారికి, తనకు మధ్య ఏదో అడ్డుగా ఉన్న ఒక పొర తొలగినట్లయ్యెను. అంతే కన్నులు మిరిమిట్లు గొలిపే ఒక కాంతి. ఒక్కసారిగా ఆవిడ ఆ కాంతిని చూడలేక కన్నులు మూసుకున్నది. మెల్లగా కన్నులు తెరిచింది. రాధికాప్రసాద్ గారు ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నారు. కానీ వారి హృదయ స్థానంలో "ఒక చిన్న పాప పరుండి యున్నది" రాధికాప్రసాద్ గారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు "రాధే రాధే" యని పిలుస్తూ ఉంటే, ఆ పాప "ఊ...ఊ" యని బదులు పలుకుతున్నది. ఆమెకు ఆ దృశ్యం చూసేసరికి ఆశ్చర్యం వేసింది. భక్తి పారవశ్యంతో ఆ మహానీయుని పాదాలను స్పర్శించింది.

ఇటువంటి అనుభూతిని పొందిన సుశీల గారు మరునాడు గుంటూరు బయలు దేరి రాధాకృష్ణ మందిరాన్ని దర్శించి రాధికాప్రసాద్ గారిని కలిసి రాత్రి తనకు కలిగిన అనుభూతిని వివరించారు. ఒక చీర రసయోగికి సమర్పించారు. అప్పుడు రాధికాప్రసాద్ గారు ఒక అద్వితీయమైన నిర్వచనమును సూచించారు _

"Every man has his Radha with his body who is sleeping. Radha is awakened when these spiritual senses are awakened and then along a communion waith supreme Rasa is possible".

ప్రతి జీవి శరీరంలోనూ రాధాదేవి సుప్తవస్థలో ఉంటుంది. ఆధ్యాత్మిక వాసనలు మేల్కొన్నప్పుడు రాధాదేవి మేల్కొంటుంది. అప్పుడు మాత్రమే మహారాసతో అనుసంధానం సాధ్యమౌతుంది జీవికి.

ఇలాంటి సంఘటనే ఒకటి రాధికాప్రసాద్ గారు గుంటూరు నుంచి బృందావనం బయలు దేరుతున్నప్పుడు జరిగింది. రైలు భోపోల్ స్టేషన్ దాటి బీనా స్టేషన్ దాటి ముందుకు పరుగులు తీస్తున్నది. రాధికాప్రసాద్ గారు ఒకరైలు భోగీలో కూర్చునియున్నారు. ఆయన ప్రక్కనే ఆయన రచించిన "రాధాపరతత్వం" పుస్తకముండెను. ఆయన ఎదురుగా ఎవరో ఒక మహమ్మదీయుడు, అతని మిత్రబృందం కూర్చొనియున్నారు. రాధికాప్రసాద్ గారి కాలి దగ్గర ఎవరో ఒకతను కూర్చొని "సిగరెట్" కాలుస్తున్నాడు. రాధికాప్రసాద్ గారు ఆ సిగరెట్ వాసనను భరించలేకున్నారు. ఇంతలో రాధికాప్రసాద్ గారికి ఎదురుగా కూర్చున్న ఆ మహమ్మదీయ యువకుడు, కింద కూర్చొని సిగరెట్ కాలుస్తున్న వ్యక్తిని మందలిస్తూ _ " రైలులో సిగరెట్ కాల్చటం మొదటి తప్పు. అదియునూ కాక ప్రక్కన గొప్ప మహాత్ముడు కూర్చొని యున్నారు. వారికి ఇబ్బంది కలిగించటం రెండో తప్పు" యని ఆ వ్యక్తిని అక్కడి నుండి మరియొక భోగీలోకి తరిమెను. అటు తర్వాత ఆ మహమ్మదీయ యువకుడు రాధికాప్రసాద్ గారితో "స్వామీ ! మీరు గొప్ప మహాత్ముల వలె యున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ విధంగా అనిపిస్తున్నది. నేను మహమ్మదీయుడను. అయినా ఒకసారి నేను నా స్నేహితునితో బృందావనం చూశాను అక్కడి విశేషాలు, అక్కడి మహాత్ములను చూచిన తర్వాత నాకూ రాధాకృష్ణుల పట్ల భక్తి భావన కల్గింది. "బీనా" స్టేషన్ దగ్గర ఒక రాధాకృష్ణ మందిరం ఉంది. అక్కడ "నామత్రయాహ్నం" (మూడు రోజుల అఖండ సంకీర్తనోత్సవం) జరిగింది. నా మిత్రులతో కలిసి అందులో పాల్గొని తిరిగి స్వగృహమునకు వెళ్తున్నాము. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం కల్గుతున్నది. మీ శరీరాంగములన్నిటియందు రాధారాణియే గోచరించుచున్నది"యని పల్కి భక్తి పారవశ్యంతో రాధికాప్రసాద్ గారి పాదములకు నమస్కరించెను. తను బీనా లోని రాధాకృష్ణ మందిరము నుండి తనతో తీసుకొని వచ్చిన శ్రీ జీ (రాధారాణి) ప్రసాదమును రాధికాప్రసాద్ గారికి సమర్పించి వారి ఆశీర్వాదమును పొందెను. అంతట రాధికాప్రసాద్ గారు _ " నాయనా ! నీవు ధన్యుడవు. రాధారాణి పట్ల భక్తి కల్గియున్నావు. నీవు ఏమతము వాడవైననేమి నా చిన్నారి ఎంతో ప్రేమతో ఆదరించును. మీ మహమ్మదీయులెందరో "చిన్నారి రాధ" సేవలో తరించి చరితార్ధులైనారు _ రహీమ్, రసఖాన్ మొదలగు వారందరూ ఈ కోవకు చెందిన వారే. నీవు వారి వలెనె రాధారాణి పట్ల నిశ్చల భక్తి భావన కల్గి సేవ చేయుచుండుమని" పల్కెను.

రాధికాప్రసాద్ గారు బృందావనం చేరారు. వారు ఏమి చెబుతున్నా, ఏమి చేస్తున్నా అది రాధా సేవయే. నిరంతరం ఆయన రాధాధ్యాన తత్పరులై ఉంటారు. ఆయన జీవితమే రాధారాణికి అంకితం. ఆ రోజు వసంత పంచమి. ఆశ్రమంలో శ్యామాశ్యాములను చక్కగా అలంకరించారు. రాధారాణి సౌందర్యాన్ని, లావణ్యాన్ని చూచి రాధికాప్రసాద్ గారు ముగ్దులైనారు. భక్తి పారవశ్యంతో ఆయన నోట ఒక గీతం వెలువడింది.

గీతము :

చరణం : నిరుపమానము కాదా నీ దివ్య శోభా

నిన్ పొగడ లేక శృతుల్ నేతినేతని పలికె || నిరుప ||

1. ఐశ్వర్య మాధుర్య జ్ఞాన శక్తుల గూడి

సర్వేశ్వరివైన సౌభాగ్య రాధరో || నిరుప ||

2. జగదీశ్వరివి అయిన చనువుతో నిను చేరి

అమ్మరో యని పిలువ ఆనంద మొసగితివి || నిరుప ||

అటు తర్వాత ఎందుకనో పాట ముందుకు సాగలేదు. ఎంతో ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. రాధికాప్రసాద్ గారు ధ్యానంలో మునిగిపోయారు. ధ్యానంలో _ " రాధారాణి వారి కనులముందర సాక్షాత్కరించింది. ఎన్నో కబుర్లు చెప్పింది. ఆటలాడింది. అంతలోనే అదృశ్యమయింది." రాధికాప్రసాద్ గారు కనులు తెరిచారు. ఆగిన పాట మరల అందుకున్నది, ముందుకు సాగింది.

గేయము

3. ఎట్టి సిద్ధుల కైన ఎట్టిసురులకైన

గోచరింపని దేవి వచ్చినావా తల్లి || నిరుప ||

4. భక్త జన మందార ముక్తి వలదమ్మ నాకు

భావ దేహము పొంది సేవింతునో తల్లి || నిరుప ||

ఈ విధంగా రాధారాణి కృపచే పాట పూర్తి అయినది. ఈ విధంగా స్వామిని అయిన రాధారాణి వారిని ప్రభావితం చేస్తూ, వారిచే సేవలు చేయించుకుంటూ అద్భుత ఆనంద లీలలను జరుపుతూ వారిని, వారి ద్వారా భక్త జనాన్ని ఆనంద డోలికలలో తేలియాడించుచూ ఉన్నారు.

మాత అంజనీదేవి, పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.

ఆ మహానీయుని జీవిత గాధను విన్న యువకునికి ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఆనంద పారవశ్యంలో తేలియాడుతూ ఆ యువకుడు అంజనీ మాతతో _ " అమ్మా ! నా జన్మ కృతార్ధమైనది. మా ముందర కూర్చొని, నవ్వుతూ అందరినీ పరామర్శిస్తూ అత్యంత సాధారణ వ్యక్తిగా కన్పడే పూజ్యులు రాధికాప్రసాద్ గారు సామాన్యులు కాదు. గొప్ప ధ్యానయోగులు, అంతకు మించి రసికాచార్యులు, వారి దర్శనం కల్గటం నా పూర్వ జన్మ సుకృతం. వారి గురించి మీ ముఖత అనేక విషయాలను తెలుసుకున్నాను. ఇంతసేపు ఓపికతో నాకు వారి జీవితాన్ని వారిలోని భక్తి భావ భరిత హృదయాన్ని, ఆర్తజన రక్షక రూపాన్ని మాకు దర్శింప చేశారు. మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియటంలేదు" యని అంటూ ఆమె పాదాలకు నమస్కరించాడు. అంతట అంజనీమాత _ " నాయనా ! ఇందులో నా గొప్పతనమేమి యున్నది. ఆ మహానీయుని గురించి నాకు తెలిసిన విషయాలను మాత్రం నీకు చెప్పాను. ఇవి అక్షర సత్యాలు. నీలోని ఉత్సాహం, ఆరాటమే నా చేత ఆ పల్కులు పల్కించాయి" యని యువకుని ఆశీర్వదించెను. ఇంతలో సంకీర్తనకు సమయమయ్యెను. అందరూ రాధికాప్రసాద్ గారి వద్దకు చేరిరి. రాధికాప్రసాద్ గారి పాదములకు యువకుడు నమస్కరించెను. యువకుడు మిక్కిలి ఉత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను.

8

మరుసటి ఉదయం యువకుడు తన సోదరునితో, బాబాయి గారితో కలిసి బృందావన ధామాన్ని దర్శించి అక్కడి వింతలూ, విశేషాలు తెలుసుకొన పూజ్యులు రాధికాప్రసాద్ గారికి, మాత అంజనీమాతకు నమస్కరించి బయలుదేరెను. ముగ్గురూ బృందావన పరిక్రమణ గావించారు. పరిక్రమణ మార్గంలో యువకునికి ఒక వింత సంఘటన గోచరించింది. పరిక్రమణ మార్గంలో తియటి పానీయములను కుండలలో నింపి కొంత మంది భక్తులు పరిక్రమణ చేయు వారికి, దప్పిక గొన్న వారికి ఆనందంతో పోటీ పడుతూ అందించుచున్నారు. యువకుడు, అతని బాబాయి, తమ్ముడు కూడా ఆ పానీయమును త్రాగిరి. అంతట ఆ యువకుడు వారి _ " మీరు ఈ విధముగా కుండలలో తియ్యని పానీయమును నింపి పరిక్రమణ చేయు వారందరికి త్రావించుచున్నారు. పోటీ పడుచున్నారు. దీనికి కారణమేమిటి? "యని ప్రశ్నించెను. అంతట వారు _ " ఇది మా గురువు గారు మాకు చెప్పిన, సూచించిన సాధనా మార్గము. మాకు చదువు రాదు. మంత్రములు, తంత్రములు తెలియవు. మాకు తెలిసినదల్లా ఒక్కటే రెండు చేతులతో రాధాజీకి నమస్కరించటం. వైభవముగా పూజలు చేయలేము, ధనధాన్యాదులను దానము చేయు శక్తియూ లేదు. అందుకని మా గురువు గారు మాకు చెప్పిన సాధన ఇది. రోజూ సుగంధ భరిత మధుర పానీయమును తయారుచేసి బృందావన పరిక్రమణ గావించు భక్త జనులకు ఇచ్చి వారి దప్పికను తీర్చి వారి ఆశీస్సులను అందుకొనుటయే మేము చేయు సాధన. అయితే మేము మా కుండలోని నీరు పూర్తి అగునంతవరకూ "అన్నపానీయములను" ముట్టము. ఇది మా నియమము. దప్పిక గొన్న భక్తులకు దప్[ఇక తీర్చితే "రాధారాణి" ఎంతో సంతోషిస్తుంది. రాధారాణికి సంతోషం కల్గించే పని కనుక ఇది మాకు ఎంతో ఆనందం. ఇది రాధారాణికి మేము చేసే సేవ" యని పల్కిరి. వారి నిర్మల, నిష్కల్మష హృదయానికి యువకుడు ఎంతో ఆనందించాడు. బృందావనంలో పండితులలోనూ, పామరులలోనూ నిరంతర రాధారాణి చింతనయే కొనసాగుతున్నదను విషయము గ్రహించెను.

9

రాధారాణి కృప లేనిదే బృందావన దర్శనం లభించదు. నారదాది మునులు, బ్రహ్మాది దేవతలు సైతం బృందావనంలో ఒక లతగానో, ఒక వృక్షం గానో, కనీసం ఒక రేణువుగానైనా జీవించాలని తహతహలాడుతూ ఉంటారు. కారణం నిరంతర కేళీ విలాసమును అక్కడ సలుపుచుండును. కనుకనే ఎందరో భక్తులు ఈ ధామాన్ని కేంద్రంగా చేసుకొని ధామనిష్ఠ కలిగి రాసేశ్వరిని సఖీభవనలో ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధనా విధానమును ముఖ్యంగా మూడు రూపాలలో మనం దర్శించవచ్చు. సాక్షిగా ఉండే జీవుడు ప్రేమ భక్తి తేజముతో నిండి నిర్గంధుడై గోపికా భావాన్ని పొంది, తన నిత్యుఅ నికుంజలో ప్రవేశించి యుగళమూర్తియగు రాధాకృష్ణులను ఈ విధంగా సేవించుకొనును. _

1. తాను రాధతో తాదాత్మ్యము పొంది అనగా భావమును పొంది శ్రీ కృష్ణుని సేవించుకొనును. శ్రీ కృష్ణ సుఖము కొరకై తనను తాను సమర్పించుకొనును. అట్టి స్థితిలో యోగమాయ ప్రభావమున కృష్ణ వియోగమును పొంది తన పూర్వ సాక్షీస్థితిలో ప్రవేశించును.

2. గోపీ భావము నందున్న జీవుడు గోపాలునితో తాదాత్మ్యము పొంది గోపాల భావముతో రాధాజీని సేవించుకొనును. రాధికా సుఖము కొరకై తనను తాను సమర్పించుకొనును. తిరిగి యోగమాయ ప్రభావమున రాధికా వియోగమును పొందిన తటస్థ చైతన్య స్థితిలో ఉండును.

3. మరియొకప్పుడు జీవుడు తను గోపికా భావముతో, వియోగస్థ్థ్లో నుండు రాధా గోపాలుని ఒకటిగా చేర్చి ఆ యుగళ మూర్తికి తనను తాను సమర్పించుకొనుచు సేవించుకొనును. కానీ ఎట్టి స్థితిలో తాను రాధను విడిచి కృష్ణునితో ఏకాంతముగా క్రీడించవలెనన్న కోరిక వాసనగా కూడా పొందడు.

"ఇది కుంజలీలా రసిక భక్తి స్వరూపము. కేవలము సంయోగాత్మకము కాదు. కేవలము వియోగాత్మకము గాదు. అది అచింత్యమగు భేదాబేధముతో కూడిన సంయోగ వియోగాత్మకమైన క్రీడ". అని ఒక రోజు ప్రాత:కాలమున రాధికాప్రసాద్ గారు బృందావన మహత్మ్యం, కుంజలీలా రహస్యాన్ని సరళమైన రీతిలో, భక్తులకు అర్ధమయ్యే రీతిలో ఉపన్యసించారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP