భాయి బుడ్డా
>> Monday, February 8, 2010
గురునానక్ గారి కాలము నాటి విషయము . ఆయన అనుచరులు ప్రతిదినము ఆయనముందు కూర్చుని భక్తిగీతములు పాడెడివారు. వారితోపాటు ఒకబాలుడుకూడా వచ్చి వారందరి వెనుక వినమ్రుడైకూర్చుని వింటుండేవాడు . ఈ విషయమును నానక్ గారు కనిపెట్టారు. ఆయన ఆబాలునివైపు చిరునవ్వుతో చూస్తూ "నాయనా ! ఇప్పుడు నీవు నిద్రించవలసిన సమయము . వీరందరితో ఇంత ఉదయముననే ఏల వచ్చుచున్నావు? ఆటలయందు ఆసక్తి చూపవలసిన వయస్సునీది. ఈ భక్తి పాటలతో నీకేమి పని ? అని అడిగెను.
గురుదేవునివైపు గౌరవంగా చూస్తూ ఆబాలుడు " అయ్యా ! ఒకనాడు మాతల్లిగారు కొన్ని కట్టెలు తెచ్చి పొయ్యిలో వేయుము అని ఆజ్ఞాపించారు. నేను ఆలాగుననఏ చేసి చూచుచుంటిని .వాటిలో సన్నగా ,చిన్నగా ఉన్న కట్టెముక్కలు త్వరత్వరగా మండి భస్మమైపోయినవి. లావుగా పొడవుగావున్నవి ఆలస్యం గా భస్మమయినవి. వాటిని చూస్తూ నాకొక ఆలోచనతో చావు భయము వచ్చినది. నేను చిన్నవాడనే ,నాకంటే పెద్దవారెందరో వున్నారు. వారికంటే ముందుగా నాకే చావు వచ్చునేమో ! నని తోచినది .కావుననే ఈ సమయము వృధాకాకుండా ఎల్లవేలలా మీ చెంతనే ఉండాలనిపించినది. అందుకే అందరితో పాటు కలసి ప్రార్ధనకొచ్చుచున్నాను అని పలికాడు.
బాలుడు చెప్పినది విని నానక్ గురుదేవులు చాలా సంతోషించారు . ఆత్మోన్నతికి అతనికి గల పట్టుదలను మెచ్చుకునెను. బిడ్డా! వయస్సులో చిన్నవాడవైనా వివేకంలో ,జ్ఞానం లో వృద్ధుడవు .అనిదీవించాడు. నాటినుండి ఆపిల్లవాడు భాయీ బుడ్డా అని పేరొందాడు.
ఆతర్వాత కాలపు శిఖ్ఖు గురువులు సైతం అతనికి గౌరవమర్యాదలను ఇచ్చేవారు . గురు అంగదులు,అమరదాసు,రామదాసు ,గురు అర్జునదేవులు ,గురుగోబిందసింగు లకు గురు పీఠాధిపత్యము భాయీ బుడ్డా స్వయంగా తనచేతులతో జరిపాడు.
0 వ్యాఖ్యలు:
Post a Comment