శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఓడమీద కాకి లాంటివాడు పరమాత్మ ప్రేమికుడు

>> Monday, February 8, 2010


ఓ సాధువు గొప్ప దైవభక్తుడు । ఆయనొకనాడు తనమనస్సులో ఇలా అనుకున్నాడు ।"నేనే భగవంతునకు ప్రీతిపాత్రుడను।భగవంతుడు నాయెడల ఎంతో సంతోషం గా ఉన్నాడు । నిత్యం పూజ జపధ్యానాదులతో ఆయనను సేవించే నాకన్న గొ్ప్ప భక్తుడు వేరొకరుండుట అసాధ్యము . " అతడీవిధం గా తలపోసి భగవంతుని ఇలా ప్రార్ధించాడు / హే ! పరమాత్మా ! నాకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు లేక ఎక్కువగా ధ్యానిమ్చేవారు వేరొకరులేరుకదా ?ఉంటే వారిని నాకు చూపించు " దానికి భవంతుడిలా పలికాడు .ఓయీ ! నీకన్న నన్ను ఎక్కువగా ప్రేమించువారీ సృష్టిలో చాలామంది వున్నారు. " అప్పుడతను అయితే ఒక్కరిని చూపండి చాలు అని రోషంగా అడిగాడు. మనుష్యులెందుకు నీకొక పక్షిని చూపిస్తాను అదిగో ఆచెట్టుమీద కూచున్నదే అదే . దాని వద్దకు వెళ్ళు అని భగవంతుని వాణి వినిపించింది. అపుడాసాధువు నాకు పక్షిభాషరాదుకదా అని వేడుకొనగా అతనికి ఆపక్షిభాష అర్ధమయ్యే వరమీయబడినది.

భగవంతుడు చెప్పినప్రకారం సాధువు చెట్టు వద్దకు చేరుకుని ఆచెట్టుపై నున్న ఆపక్షిని సంబోధిస్తూ పరమాత్మ గూర్చి ఏదైనా చెప్పమని అడిగాడు . దానికాపక్షి "ఓయీ నాకు మాటాడటానికి సమయము , రవ్వంత తీరిక లేదు. ఐనా నా ప్రియతమ ప్రభువు పంపాడుగనుక నీతో ఈమాత్రం మాటాడగలుగుతున్నాను అన్నది. అదివిని అతడాశ్చర్యం తో నీకు తీరిక లేదంటున్నావు .ఇంతకూ నీవుచేసే పని ఏమిటి ? అని అడిగాడు. దానికాపక్షి ఇలా జవాబు చెప్పింది. నేనహోరాత్రములు ఆపరమపురుషుడైన శ్రీహరి ని ధ్యానిస్తున్నాను. ఐనా నన్నొక విషయము బాధిస్తున్నది " ఏమిటాబాధ సాధువడిగాడు . దానికా పక్షి " ఇక్కడకు కొంచెం దూరం లో ఒక సెలయేరున్నది .అక్కడకు వెళ్ళి నీరుత్రాగవలసి వస్తున్నది ............ "ఆ సెలయేరెంత దూరం లో ఉంది ? అడిగాడు సాధువు .
"అదిగో ఆఎదురుగా కనిపిస్తున్నదే గోధుమచేను .ఆపొలమునకావలి వైపున ఉన్నది".
అదివిని సాధువు ఆశ్చర్యపోయి అది ఏమంత దూరం కాదే ! దగ్గరేకదా అన్నాడు.

" ఓయీ నీకేమి చెప్పను ? నాకీ కాస్తదూరం వెళ్లివచ్చుట బాధాకరముగా నున్నది. ఎందుకందువా ! నేను నీటికోసం ఆకాస్తంత దూరం ఎగురునప్పుడు పరమాత్మ ధ్యానాన్ని మానుకోవలసి వస్తున్నది . నా ప్రియతముడైన హరి నామాన్ని క్షణం సేపు వదలాలన్నా నాకు భరింపరానిదవుతున్నది.

దానికాసాధువు విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. అతడాపక్షితో " నేను నీకేమన్నా సాయం చేయగలనా అని అడిగాడు. అప్పుడాపక్షి మరేం లేదు ఆసెలయేటిని నావద్దకు తెచ్చి పెట్టగలవా ? అని అడిగినది.
సెలయేరును అలా తీసుకురావటం సాధ్యపడని విషయం అన్నాడా సాధువు.
అయితే మీనుంచి మరే సాయ మక్కరలేదు అని పక్షి భగవధ్యానం లో మునిగిపోయింది.
సాధువు తలవంచుకుని వెళ్ళిపోయాడు .

ఈ కథలోసారాంశమేమనగా . పరమాత్మను కాంక్షించేవారు ఆయనను ఎంతగాప్రేమిస్తారంటే ఒక్కక్షణం కూడా ఆయన నామాన్ని వదలి పెట్టి ఉండలేరు. ఆయన ధ్యానానికి దూరమైతే బ్రతకలేమన్న స్థితిలో ఉంటారు.
సముద్రం లో ప్రయాణిస్తున్న ఓడపైనగల కాకి ఆఓడను వదలక ఎల్లప్పుడూ దానిపనే కూర్చుని ఉంటుంది. అది కాసేపు గాలిలోకెగిరినా మరలా వచ్చి ఓడపైనే వాలుతుంది. పైన ఆకాశం క్రింద సముద్రం ఉండగా దానికి ఓడతప్ప మరో ఆశ్రయం కనిపించదు. పరమాత్మ ప్రేమికులు కూడా ఆకాకి ఏవిధంగానైతే ఓడను వదలదో అదేవిధంగా పరమాత్మను ధ్యానించటం ఎట్తి పరిస్థితులలోనూ మానుకోరు.





3 వ్యాఖ్యలు:

Sunita.R February 9, 2010 at 7:11 PM  

ఓం నమో నారాయణాయ,
చాలా బాగుంది కధ. హరి ధ్యానం లో లోకాన్ని మర్చిపోవటం! ఎంత అందమైన తలంపు.
-సునీత

రాజేశ్వరి నేదునూరి April 20, 2010 at 8:52 AM  

నమస్కారములు.
బాగుంది కధ." నిజమే [ఒక్క క్షణం మనస్సు ఎటుతిరిగినా ] " బంధాలకతీతంగా మనసును భగవంతుని పాదాల చెంత ఉంచి నిమగ్నమైతె అంతకంటె అదృష్టం మరేముంది ? మధురమైన భావన చక్కగా చెప్పారు.ధన్య వాదములు.

danee August 8, 2011 at 2:13 AM  

k.Dasu: గురువు గారికీ నమస్కారం:
చాల బాగుంది....మీ పోలిక ఎ భక్తుడు తానయి శ్రీ హరి కీ గొప్ప భక్తుడిని అనీ అనుకోవదు..నైస్

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP