ఈ దు:ఖాలన్నింటికీ కారణం దేవుడేనంటారా ?!
>> Tuesday, February 2, 2010
దు:ఖానికి కారణాలు మనకంటికి కనిపించేవేకాక కనిపించని లోతులేవో ఉంటాయంటారు పెద్దలు . మానవసహజమైన భావోద్వేగాలు ,ప్రేమద్వేషాలను పక్కనపెట్టి పరిశీలించగలిగితే గాని అవి అవగాహనకు రావు. సహజంగా మనం దు:ఖంరాగానే భగవంతున్నో ,కంటికి కనిపించే ప్రపంచ దృశ్యాన్నో నిందిస్తాము. చిత్రమేమిటంటే మనకు శుభాలు,సుఖాలు ప్రాప్తించినప్పుడు మాత్రం మనసమర్ధతను శ్రమను , కష్టాన్ని మాత్రమే గుర్తుతెచ్చుకుని మనలను మనమే గౌరవించుకుంటాము. లేదా పొగుడుకుంటాము. వాస్తవమేమిటంటే శుభాలకు అశుభాలకు కారణం మన కర్మలే అనే విషయం లోతుగా ఆలోచించితే తెలుస్తుందని చెబుతారు పెద్దలు.
నేనొక ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా హెడ్మాస్టర్ గారు ఒకాయనుండేవారు . భార్యాభర్తలిద్దరు ఉద్యోగస్తులే .ఒక అబ్బాయి ,ఒక అమ్మాయి . సంపద బాగావుంది .బంధువర్గం లో బాగావున్నవాడుగా పేరు. ఎవరికీ హానిచేసే తత్వంకూడా కాదు .పెద్దగా వివాదాలమనిషికాదు. ఈయనకున్న ఒకే ఒక్క అలవాటు పేకాట . మందు అలవాటుకూడా ఉన్నదట చాటుగా. ఆయనకున్న ఓ పెద్దసమస్య ఆయన కొడుకే .అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు .వాడికి చిన్నప్పటినుంచీ చదువబ్బలేదుగాని అన్ని కళలు వంట పట్టాయి . తల్లిదండ్రులను బెదిరించి డబ్బు తీసుకెళ్ళి ఖర్చుచేయటం ,అప్పులుచేసి ఇంటిమీదకు తేవటం ,ఇంట్లో గొడవ. మాకందరికీ ఆవిషయం తెలుసు . ఓరోజు ఆయన విచారంగా కూర్చుని దు:ఖపడుతున్నట్లనిపించింది. ఏం !సార్ ఏమైంది . ఎందుకలా ఉన్నారు ? ఏదో బాధలో ఉన్నారు అని ఆప్యాయంగా అడిగేసరికి ఆయన ఆవేదనను ఇక దాచుకోలేక బోరుమన్నాడు . నాసమస్య తీరేదికాదు మాస్టారు. ఏదో ఒక రైలుకింద తలబెడితేగాని నాకు శాంతి రాదు అని బాధపడ్దాడు.
ఇచ్చిన డబ్బు చాలక ,అప్పులు చేసి ఇంటిమీదకు తెస్తున్నాడు జనాన్ని . పెళ్ళిచేసాక ఇంకా ఎక్కువైంది మాబాధ . అమ్మా ! నువ్వు నాన్న నిదురబోయేప్పుడు గాస్ లీక్ చేసి నిప్పు పెడతానని బెదిరిస్తుంటాడు . నిద్రబోయేప్పుడు ఏ రోకలబండతో నో తలమీద బాదుతానని అంటున్నాడు . వాడు అన్నంతపని చేస్తాడు , అంత దుర్మార్గుడే వాడు .
అన్నం తినేప్పుడు కూడా ప్రశాంతతలేదు అప్పుడుగొడవే . కలబడుతున్నాడు . బజార్లో తిట్లకు లేస్తున్నాడు డబ్బివ్వకపోతే .పరువు పోతుంది . నిద్రలేదు వీడినుంచి . మధ్యలో నాకు గిట్టని బంధువులు వీడికి ఎక్కిస్తున్నారింకా .
నేనెప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదు . ఏమిటి నాకీబాధ ? దేముడుంటే నాకీ బాధేమిటి ? నాకెందుకు కలిగిస్తాడు ఈబాధ .అని విచారపడ్డాడు.
ఆయన ఆవేదన అర్ధం అయ్యాక . నేనో మాటన్నాను . మాస్టర్ గారు నేనో మాట చెబుతాను ఏమనుకోనంటే ,అని అన్నాను. దానిదేముంది చెప్పండి అన్నాడాయన.
సార్ ! మీకు పేకాట లో బాగా అనుభవం ఉందని అంటారు జనం . పేకాటలో డబ్బు పోగొట్టుకోవటం అరుదని మీరు చేయితిరిగిన ఆటగాడని అంటారు అవునా ? ప్రశ్నించాను .
అవునండి . కాని నేను ఎప్పుడు మోసం తో ఆడలేదే / న్యాయంగా ఆడి గెలుస్తాను .ఎవరిదగ్గర మోసం చేయలేదు. ఇందులో తప్పేమిటి? ఎదురు ప్రశ్నించాడాయన .
మీరు ఇంతవరకే ఆలోచిస్తే అంతే ! కాని ఇంకొంచెం ఆలోచించి చూడండి . నాకు తెలిసినది చెబుతాను వినండి . ముప్పారాజు వారి పాలెం లో పేకాటలో డబ్బు పోగొట్టుకుని వచ్చిన భర్త తో గొడవజరిగి ఒక మహిళ పురుగు మందుతాగి చనిపోయింది . అలాగే అదే గ్రామం లోఇంకోసారి పేకాటలో పొలం పుట్రాఅమ్మిన డబ్బుకూడా పోగొట్టుకుని వచ్చి భార్యను కొట్టి న దౌర్భాగ్యుడి చర్యకు అవమానానికి తట్టుకోలేక ఓ ఇల్లాలు బావిలోదూకి ఆత్మహత్య చేసుకుంది . ఈ సంఘటనలకు కారణమైన పేకాటలో మీరు ఉన్నారు .
ఇక్కడ ఆఇల్లాల్లు కార్చిన ప్రతికన్నీటి బొట్టు ఆడబ్బువెంట అంటిఉంటుంది. దిక్కులేకుండాపోయిన ఆపిల్లల ఆవేదన బంధువుల శాపనార్ధాలు ఎవరు భరించాలనుకున్నారు? అది తప్పనిసరిగా ఆడబ్బు దక్కించుకున్నవారే వడ్డీతో సహా చెల్లించాలి . ఇది కర్మ సిద్ధాతం. ఆతల్లులు కార్చిన ప్రతి కన్నీటిబొట్టు వందలశాతం పాపరాశిలా వచ్చి ఆశ్రయించుకుంటుంది. ఇవి నాకు తెలిసిన సన్నివేశాలు మాత్రమే .ఇంకా ఇలాంటి సంఘటనలెన్ని ఉన్నాయో తెలియదుకదా ! అన్నాను . ఆయన మౌనం వహించాడు ఏమీ చెప్పలేక .
తరువాత ఆకుర్రవానికి మాతోపాటు హనుమత్ దీక్షనిచ్చి రెండుసంవత్సరాలు చేపించటం నాలుగైదు సంవత్సరాలు సంతోషంగా వున్నా ఆకుటుంబం లో ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది స్థితి . [రెండుమూడు సంవత్సరాలు ఆ ఆటలకు చేష్టలకు దూరంగా వున్న మాస్టర్ గారు ,అబ్బాయిగారు తమ పాతలవాట్లను వదలుకోలేరని తేలి పోయాక]
బుద్ధి కర్మాను సారణి ...... అని పెద్దలన్నది నిజమేనని నమ్మాల్సినసన్నివేశమిది.
ఇక రెండవది.
--------------
మాప్రాంతం లో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు . ఇద్దరు బిడ్డలు . ఆమధ్య ఒక యాక్సిడెంట్ లో కొత్తగా పెళ్లయిన కుమారుడు చనిపోయాడు . ఆసమయం లో ఆయన ఏడుస్తున్న ఫోటోలు చూసి గుండె తరుక్కు పోయింది .రాజకీయాలలో తిరుగులేని నేతగా , ఎదిగి విధి చేతిలో ఘోరంగా ఓడి గుండెలవిసేలా ఏడుస్తున్న ఆయన ను చూస్తే మనిషన్నవాని కెవరికైనా దు:ఖం వస్తుంది. ఆయన ఒక పుణ్యక్షేత్రాన్నే అభివృద్ది పరచినవాడు .ఎందుకీశిక్ష ? అని వేదన పడ్దప్పుడు , ఈ యన ఎలక్షన్లలో బాంబుదాడులు కొట్లాటల్లో మరణించిన వారి ఇల్లాల్లు ,బంధువులు ఫోటోలు కూడా [పేపర్లలో చూసినవి]ఒకసారి మనోఫలకం మీద కదలాడాయి .
ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ’ పసిపిల్లలంటే నాకు చాలా ఇష్టం .భగవంతుడు నాఇంట్లో పసినవ్వులు లేకుండా చేశాడు అని ఆవేదనపడ్డప్పుడు . ఈ ఎన్నికలహింసాపర్వం లో చచ్చిన వాని తల్లుల కడుపుశోకం,నాఇంట్లో నేకాదు వాడింట్లో దీపమెప్పుడారిపోతుందో ? వాని వంశం ఎప్పుడు నాశనమవుతుందో ! అని శోకండాలు పెడుతూ దుమ్మెత్తిపోసిన తల్లుల శాపాలు కర్మఫలితాలై వెన్నంటుతాయని నమ్మాల్సి వస్తున్నది.
ఇతరులకు దు:ఖాన్ని కలిగించే మన ప్రత్యక్ష,పరోక్షచర్యలేవైనా అవి మనవంతు బాధను మనకు తప్పనిసరిగా అనుభవం లోకి తెస్తాయని పెద్దలంటారు.
మొన్న నారాయణ శరణాగతి యాగానికొక భక్తుడొచ్చాడు . ఏమిచేస్తున్నవంటే . చీమకుర్తి ప్రాంతం లో మద్యం వ్యాపారం లో భాగస్వామ్యమన్నాడు. వెంటనే మానెయ్యమని చెప్పాను . ఇంకొకపనిచేసుకుని బ్రతుకు కానీ ఇలాంటివద్దని చెప్పాను.
చిల్లరకొట్టు పెట్టి నువ్వొక వస్తువు ఎక్కువధరకమ్మితే అందులో నీకు లాభం వస్తుంది . అదే నువ్వు మద్యం వ్యాపారం చేస్తే నీకు లాభం రావటమేకాదు తాగినవాని కుటుంబానికి దు:ఖమొస్తుంది . అది నీకు అశుభాన్ని వెంట తెస్తుంది .అని వివరించాను/ ఇప్పుడు రాష్ట్రం లో కోట్లకు పడగలెత్తిన మధ్యం వ్యాపారుల కుటుంబాల లోతు రహస్యాలు తెలిస్తేగాని అదివారికి వరమో శాపమో మనకర్ధంకాదు అని వివరించాను. అప్పటిదాకా అంతా పైన పటారమే కనపడుతుంది అన్నాను.
కాబట్టి మనపెద్దలు ఊరికే చెప్పలేదు ,సప్తవ్యసనాలతో వ్యాపారం చేసి బాగుపడదామని ప్రయత్నించటం ఎంత ప్రమాదమో ! అర్ధం చేసుకుందాం .. ఆచరణలో జాగ్రత్తలు తీసుకుందాం. మనచర్య ధర్మబద్దంగా వుండేట్టు . ఎవరి కంట కన్నీరొలకకుండా చూసేట్టు.
4 వ్యాఖ్యలు:
Interesting perspective!
పేకాటరాయుళ్ళకు చాలామందికి నేను కూడా చెప్పి చూసాను అయినా వినరే బుద్ధి కర్మానుసారిణి
meeru cheppindi aksharaalaa nijam
చాలా బాగుంది!!
Post a Comment