శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దండం దశగుణం భవేత్ అంటే ఏమిటి ?

>> Thursday, January 14, 2010


ఈ వాక్యానికి మూడు అర్థాలు స్ఫురిస్తాయి. మొదటి అర్థం. దండం(కర్ర)లాగా నేల మీద పడి, సాష్టాంగ నమస్కారం చేస్తే, ఎదుటి వారిలో పది మంచి గుణాలు కలిగి, కార్యం సానుకూలం అయ్యే అవకాశం ఉంది. అలా ప్రణిపాతం చెయ్యక, తల వంచి దండం(నమస్కారం) పెట్టినా, ఎదుటివారు, దండం పెట్టిన వారిని ఆదరించి పనులు చక్కపెట్టవచ్చు. ఇక రెండవ అర్థంలో దండం(కర్ర) పట్టుకొని నాలుగు వడ్డిస్తే, అలా శిక్ష పడిన వాడిలో వినయం, భయం, భక్తి వంటి పది గుణాలు ఆవిర్భవించి, పనులు చకచకా పూర్తయ్యే అవకాశం ఉండవచ్చు. చాలా మంది ఈ అర్థంలోనే ఈ వాక్యాన్ని ఉపయోగిస్తుంటారు. ఇక మూడవ అర్థం వచ్చే శ్లోకం ఒకటుంది. విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చఅంధ్యే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్‌.

ఈ శ్లోకం ప్రతి పదార్థం చూద్దాం.

వి=పక్షి, శ్వ=కుక్క, అమిత్ర=శత్రువు, అహి=పాము, పశుషు=పశువులను కట్టడి చెయ్యడంలోను, కర్దమేషు=బురదలోను, జలేషుచ=నీటిలోను, అంధ్వే=గ్రుడ్డితనంలోను, తమసి=చీకటిలోను, వార్థక్యే=ముసలితనంలోను, దండం=కర్ర, దశగుణం భవేత్‌=ఈ పది విధాలుగా పనికి వస్తుంది. అందువల్ల కర్ర ఒకటి చేతిలో పట్టుకుంటే, ఆహారం ఎండ బెట్టుకుంటే దాని మీద వాలే కాకుల వంటి పక్షుల్ని కొట్టవచ్చు. వీధి కుక్కల్ని తరిమి కొట్టవచ్చు. శత్రువులను భయపెట్టవచ్చు. పాములను, పశువులను కొట్టవచ్చు. బురదలోను, వరద నీటిలోను నడిచి వెళ్లడానికి ఉపయోగించుకోవచ్చు.

అంతేనా, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలో కూడా కర్రతో నడిచి వెళ్లవచ్చు. మహాకవి కాళిదాసు అంతఃపుర ఉద్యోగులు చేతిలో పట్టుకొనే దండంతో ధర్మాన్ని పోల్చాడు. దానితో అన్ని వయసుల్లో, అన్ని కాలాల్లో పని ఉన్నా లేకపోయినా, దాన్ని చేతిలో ధరిస్తే, అది తమ అవసరమైన సమయాల్లోను, ముసలితనంలోను మనల్ని కాపాడుతుంది. అలాగే ధర్మం కూడా! ధర్మాన్ని ఆచరించే వాడిని, ఆ ధర్మమే రక్షిస్తుంది.

-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

ఆంధ్రజ్యోతి దినపత్రికనుండి




6 వ్యాఖ్యలు:

Pradeep January 14, 2010 at 8:24 AM  

bagaa chepparu

రవి January 14, 2010 at 6:54 PM  

బావుంది.

Unknown January 14, 2010 at 10:00 PM  

మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు

JP January 15, 2010 at 12:49 AM  
This comment has been removed by the author.
చింతా రామ కృష్ణా రావు. January 15, 2010 at 9:24 PM  

ఆర్యా! చక్కని విషయాన్ని చెపారు.ధన్యవాదాలు.
ఇదే విషయాన్ని ఆంధ్రామృతంలో కూడా ఇదివరకు వ్రాసితిని. మీరు చూడడం కొఱకు మీ ముందుంచుతున్నాను.
మంగళవారం 8 డిసెంబర్ 2009
దండం దశ గుణం భవేత్.
6 COMMENTS

దండం దశ గుణం భవేత్. అంటారుకదా! ఆ దశ గుణాలూ ఏవో మీకు తెలుసా? తెలుసుకోవాలనుందా?
ఐతే చూడండి.

శ్లో:-
విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్థక్యే - దండం దశగుణం భవేత్.

ఆ:-
పక్షి, కుక్క, శత్రు, పాము, పశులఁ ద్రోల,
చేతి కర్ర మిగుల చేవఁ జూపు.
బురద, నీరు, రేయి, ముసలి, గ్రుడ్డియుఁ గల్గ
చేతికర్ర దాటఁ జేయు మనల?

భావము:-
పక్షులు, కుక్కలు, అమిత్రులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డితనంలో, ముసలితనంలో అవలంబనంగానున్ను, చేతి కర్ర పనికివస్తుంది. అందుచేతనే దండం దశ గుణం భవేత్ అంటారు.

జైహింద్.
రాసింది చింతా రామకృష్ణారావు. AT TUESDAY, DECEMBER 08, 2009

durgeswara January 16, 2010 at 1:34 AM  

మితృలకు ధన్యవాదములు .నేను ఈ వ్యాసమును ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి సేకరించాను .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP