శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అభీష్టాలను తీర్చే అహోబిళ మహా క్షేత్రం

>> Saturday, January 16, 2010

ahobilamఅహోబిలం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో ఉంది. ఈ ఆలయం నంద్యాలకు 40 కి.మి దూరంలో ఉంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహ ఆలయం, ఆళ్వారు కోనేరు, 9 విభిన్న రూపాలలో నరసింహ ఆలయాలు చూడదగినవి. దీనిని సింగవేల్‌ కుండ్రం అని కూడా అంటారు. హిరణ్యకశిపుని వధించిన శ్రీ మహావిష్ణువ్ఞ నరసింహరూపంలో అహోబిలంలో దర్శనమిస్తాడు.

నల్లమల పర్వత సానువ్ఞలను శేషపర్వతంగా భావిస్తారు. ఆదిశేషుని శిరోభాగం శృంగేరి, మధ్యభాగం వేదగిరి, అగ్రభాగం గరుడగిరి అని చెబుతారు. ప్రహ్లాదుని కరుణించిన నరసింహుని దర్శిస్తే సకల అభీష్టాలూ సిద్ధిస్తాయనే భావనతో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ ఆలయ సందర్శనకు వస్తుంటారు.అహోబిలం రెండు భాగాలుగా ఉంటుంది. పర్వతంపైగల భాగాన్ని ఎగువ అహోబిలంగా, పర్వతక్రిందగల భాగాన్ని దిగువ అహోబిలంగా పిలుస్తారు.

ఎగువ అహోబిలం
ఎగువ అహోబిలంలో అహోబలేశ్వర ఆలయం ఉంది. 9 కి.మీ ఎత్తున పర్వతంపై ఈ ఆలయం నెలకొని ఉంది. ఆలయానికి వేళ్ళే మార్గంలో పరిసరాల్లో ఎన్నో జలపాతాలు, పచ్చని ప్రకృతి సౌందర్యం పర్యాటకులకు నేత్రానందం కలిగి స్తుంది. గుండ్రని రాళ్ళతోనిండిన ఎగువ అహోబిలంలో ఎన్నో మండలాలు ఉన్నాయి. ఇక్కడ కోనేరు ఉంది. ఈ నీటిని ఇక్కడ నివసించేవారికి త్రాగునీరుగా సరఫరా అవ్ఞతుంది.ఆలయంలోని అహోబలేశ్వరునికి అర్చన నిమిత్తం పూలకోసం ప్రధానంగా ఈ నీటిని వాడతారు. ఇదే హిరణ్యకశిపుడు పరిపాలించిన ప్రాంతం. స్థంభాన్ని చీల్చుకుని భీకర రూపంతో నారసిం హుడు ఈ దుష్టరాక్షసుని సంహరించిన దివ్య ప్రదేశం ఇదే.

దిగువ అహోబిలం
ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహాలయం ఉంది. విజయనగర శిల్పశైలితో మూడు ప్రాకారాల మధ్యన ఆలయం చూపరుల్ని తన్మయుల్ని చేస్తుంది. ఈ ఆలయ సమీపంలోనే ఆళ్వారుకోనేరు ఉంది. ఎగువ, దిగువ అహోబిలాల్లోని అర్చకులు ఇక్కడే నివాసముంటారు. యాత్రికుల వసతి సౌకర్యార్థం ఎన్నో మండపాలను అభివృద్ధి చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో 9 నరసింహ ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు కొండల నెక్కి చేరాలి, కొన్ని గుహల్లో, కొన్ని అతికష్టంపై పర్వతాలను ఎక్కి దర్శించాల్సి వస్తుంది.

అహోబిల మఠం 45వ జియ్యర్‌ ఆధ్వర్యంలో నడుపుతున్నారు. నరసింహ రూపంలో శ్రీ మహావిష్ణువ్ఞ భీకర రూపాన్ని దర్శించిన దేవతలు 'అహోబిలం, అహోబిలం అని స్వామిని కీర్తించారు. పెద్ద గుహల ప్రదేశం కనుక అహోబిలం అయ్యింది. మరోగాధ ప్రకారం శ్రీ మహావిష్ణువ్ఞను నరసింహరూపంలో చూడాలనే కోరికతో గరుడుతపస్సు చేశాడు.అందుకే స్వామి కరుణించి నవనరసింహ రూపాలతో తొమ్మిది ఆలయాలలో కొలువై ఉన్నాడు.

నవనరసింహాలయాలు
1. వరహ 2.మాలోల 3.యోగానంద 4.పావన 5. కారంచ 6. ఛత్రపట 7. భార్గవ 8. జ్వాలా 9. అహోబిల నరసింహ దేవాలయాలు.ప్రతి ఆలయానికీ చరిత్ర ఉంది. పావన నరసింహ ఆలయంల్లో వివిధ రూపాల్లోగల స్వామి ఉగ్ర, శాంత, యోగ, కళ్యాణ మూర్తిగా భాసిస్తున్నాడు.హిరణ్యకశిపుని వధ అనంతరం శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా అవతరించి నల్లమల అడవ్ఞల్లో ఉగ్రరూపంతో సంచరిస్తున్న నరహరిని వలచి వివాహమాడుతుంది. ఆ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో చెంచులక్ష్మితో నరసింహుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. మాలోల నరసింహుని ఆలయం, గ్రామం దగ్గరలో ఉంది ఈ ఆలయంలోని స్వామి శాంత స్వరూపంతో దర్శనమిస్తాడు. చాళుక్య వంశస్తుడైన విక్రమాదిత్య రాజు కాలంనాటి శిలా ఫలకాలు అహోబిలంలో బయటపడినాయి.

దిగువ అహోబిలంలో సహజ శిలలో నరసింహుడు కొలువైవ్ఞన్నాడు. స్తంభాలపై అద్భుత శిల్పకళా సౌందర్యంతో దిగువ ఆలయంలో ముఖమండపం, ప్రధాన ఆలయం, రంగమండపం, కనువిందు చేస్తాయి. రంగమండపంలో గుర్రాలపై ఎక్కిఉన్న యక్షులు, విజయనగర శిల్పకళా వైభవంతో అలరారే వివిధ వాద్యకారులు, అతివలు, రామలక్ష్మణుల శిల్పాలు, నరసనాయక విగ్రహాలు శోభాయమానంగా కనిపిస్తాయి.

హంపి శిల్పకళా రీతిలో ఎగువ ఆలయం అలరారుతుంది.1953 వరకు అహోబిలంలో ఎన్నో చెంచుకుటుంబాలు నివసించేవి.కాని ఇపుడు ఐదారు కుటుంబాలవారు ఆత్మకూరులోని బన్నూరు, బైలూటి, బనకచర్ల, మహానంది, నందికొట్కూరు, పగిడాల, పచ్చర్ల ప్రాంతాలకు తరలి వెళ్ళారు. వైష్ణవ సాంప్రదాయ ప్రసాదాలను,భక్తులు తెచ్చిన వివిధ రకాల ఫలాలను నరసింహునికి నివేదన చేస్తారు. నరసింహ జయంతిని, చెంచులక్ష్మితో నరసింహుని కళ్యాణాన్ని ఇక్కడ భక్తి ప్రపత్తులతో వైభవంగా నిర్వహిస్తారు.

ఎలా చేరాలి ?
నంద్యాల, కర్నూలు, హైదరాబాద్‌ నుండి ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. బెంగుళూరు- వైజాగ్‌ మార్గంలో, నంద్యాల రైల్వేస్టేషన్‌ ఉంది. ఈ ఆలయం హైదరాబాద్‌కు 363 కి.మీ, తిరుపతికి 262 కి.మీ, నంద్యాలకు 74 కి.మీ దూరంలో ఉంది. లక్ష్మీ నిలయం టూరిస్ట్‌ రెస్ట్‌హౌస్‌, తిరుమల తిరుపతి దేవస్థాన సత్రం, ఆర్యవైశ్య సత్రం దిగువ అహోబిలంలో యాత్రికుల బస నిమిత్తం ఏర్పాటు చేశారు.

[మల్లాది రామలక్ష్మి] from vartha daily

4 వ్యాఖ్యలు:

Anonymous January 16, 2010 at 10:57 AM  

Good info, only confusion is that it was mentioned that 40 KMS from Nandyal at the beginning and at the end it says 74 KMS from Nandyal. Which one is correct?

~sUryuDu

Truely January 16, 2010 at 12:33 PM  

ఈ సమాచారం చాల బాగుంది . కొంచెం నాకు తెలిసిన విషయాలు మీతో పంచు కోవాలి అనుకుంటున్నా . నవ నారసింహ క్షేత్రాల తో పాటు ముఖ్యెం గా చూడవలిసింది వుఘ్రస్తంభం , ఇది ఒక ఎత్తైన కొండ , స్తంబం లాగ వుంటుంది . దీని నుంచే నరసింహ స్వామి బయటకు వచ్చి హిరణ్య కసిపుదుని సంహరించాడని చెప్తారు. కాని వుఘ్రస్తంభం కి వెళ్ళటానికి స్థానికుల సహాయం తీసుకువటం మంచిది. అడవి మార్గం లో దారి తప్పే అవకాసం వుంటుంది.
వుఘ్రస్తంభం ఎక్కటం కొంచెం కష్టం. కాని సంకల్పం వుంటే తప్పకుండ ఎక్క వచ్చు.
నవ నరసింహ రూపం లో స్వయం భూ గా వెలసిన స్వామి వారిని అహోబిలం లో తప్పక చూడవలసినదే.

Anonymous January 17, 2010 at 5:28 AM  
This comment has been removed by a blog administrator.
రాజు January 17, 2010 at 5:29 AM  

@ Anonymous
అహోబిలం నంద్యాల నుండి దాదాపు 65 కి.మి. ఉంటుంది. నంద్యాల నుండి 40 కి.మి. దూరంలో ఆళ్ళగడ్డ పట్టణం ఉంది. అక్కడి నుండి కూడా అహోబిలానికి బోలెడన్ని బస్సులు ఉన్నాయి. ఎగువ అహోబిల క్షేత్రం, అడివి, అడివిలో పాదచారుల కోసం కట్టిన సత్రాలు చూడవలసిన ప్రదేశాలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP