ఆనందమానందమాయనే .......
>> Friday, February 6, 2009
ఆనంద మానందమాయనే.. మా చిన్నారి పెళ్ళికూతురాయనే అని భక్తులు అమ్మవారిని పొగుడుతూ వుండగా జగములనేలే ఆతల్లి పరమేశ్వరుని పాణిని చేపట్టినది. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం వార్షిక వుత్సవముల సందర్భముగా గురువారం రోజున పీఠములో నెలకొని వున్న దుర్గాదేవికి ,రామలింగేశ్వర స్వామి వారితో ను ,శ్రీవారికి శ్రీదేవి,భూదేవి లతో వైభవోపేతముగా వివాహములు జరిగాయి.యధాప్రకారం మాసంకల్పము లేకుండానే వివాహము మేము జరుపుతామని ముందుకొచ్చిన భక్తులు స్వామివారి తరపున ,అమ్మవార్ల తరపున పెద్దలుగా వ్యవహరించి వివాహాలను తమ స్వంతబిడ్దలకు చేసిన భవనతో జరిపి తన్మయులయ్యారు. ఎక్కడో అమెరికాలో ఉన్న అమ్మాయి ఫణిచందన తన తల్లిదండ్రులు బాలగంగాధరతిలక్ దంపతులను ను పంపి అమ్మవారి తల్లిదండ్రిగా వ్యవహరింపజేసినది. అమ్మవారితో ఏజన్మలో సంబంధమోవాళ్ళు హైదరాబాద నుండి ఎంతోశ్రమకోర్చి ఎక్కడున్నదో తెలియనిఈ చోటు కొచ్చి భక్తిభావనతో పరమేశ్వరునకు కన్యాదానం చేసి ఆనందపులకితులయ్యారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్ఆర్వో శ్రీనివాస మూర్తి దంపతులు రామలింగేశ్వర స్వామి వారి తరపున తల్లిదండ్రులుగా పాల్గొన్నారు. ఎంతో కాలంగా వివాహము సమస్యగా వున్న వినుకొండకు చెందిన ఒక అమ్మాయి మొన్న నవరాత్రులలో ఇక్కడ చేసిన సేవకు ఫలితామా అన్నట్లు ఇదేరోజు సంబంధం కుదిరి మాట్లాడుకోవలని వచ్చిన వరుని తరపువారిని ఇంటివద్ద కూర్చోబెట్టి ముందు అమ్మదర్శనానికివెళ్ళివస్తామని చెప్పి వచ్చి అమ్మ ఆశీర్వాదము తీసుకుని వెళ్ళటము అమ్మ మహిమకు,వారి భక్తికి నిదర్శనముగా నిలచినది.
ఇక శ్రీవారి తరపున వాస్తు సిద్దాంతి కాసిరెడ్డిదంపతులు ,శ్రీదేవి తరపున కురిచేడుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొని ఆ కొండలరాయని వైభవాన్ని కన్నులారాగాంచి పెళ్ళి జరిపించి తరించారు.వివాహ భోజనాలతో భగవత్ ప్రసాదాలను అందుకున్న భక్తులు తమ ఇష్టదైవాల మహిమలను మనసారా స్మరిస్తూ తిరుగు ప్రయాణమయ్యారు.మేము మాత్రం ఇక్కడ దాసులము గనుక మిగతా పనులు పూర్తి చేయటానికి అలసిన శరీరములతో ,ఆనందమయమయిన మనసులతో పనులు చేస్తూనే వున్నాము......
0 వ్యాఖ్యలు:
Post a Comment