లలితా సహస్ర నామ రహస్యాలు
>> Wednesday, September 24, 2008
భక్తులపై అమ్మ వారి కరుణ కలగటానికై నామపారాయణం సులభతరము ,శక్తివంతమయిన మార్గము. అందులోనూ లలితా సహస్రనామము సాక్షాత్తు,హయగ్రీవభగవానులు అగస్త్యులవారికి ఉపదేశించిన మహాశక్తిపూరితమయిన మంత్రరాజము. దీనిని జపించినవారు తరించుట తథ్యమని మహర్షుల శాసనము. దీనిని, నమ్మకము లేనివారికి, అవిశ్వాసులకు,అడగనివారికి ,శఠులకు చెప్పరాదని శాసనం. కానీ కష్టాల కడలిలో కలిప్రభావము వలన బాధలు పడుతున్న కొదరుజీవులకైనాదీనిని ఆశ్రయించిశుభం కలగాలనే కోరికతో ఈరహస్యాలను దీనిలో వుంచుతున్నాను. యోగినీ బృందము,నన్నుమన్నించుగాక. పరమగురువులునాపైకృపజూపుదురుగాక.
లలితా రహస్యనామ మహాత్మ్యము
................................................................................
" శ్రీవిద్యాం జగతాం ధాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం
నమామి లలితా నిత్యాం మహాత్రిపురసుందరీం.
సర్వజగత్తులకు తల్లియైనదీ ,సృష్టిస్థితిలయములకు కారకురాలగునదీ ,గొప్ప త్రిపురసుందరీ రూపమునవుండే శ్రీవిద్య అనబడే లలితాంబకు నేను భక్తితో నమస్కరిస్తున్నాను.
అగస్త్య ఉవాచ :-
" అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద
కథితం లలితా దేవ్యా శ్చరితం పరమాద్భుతం
సమస్త శాస్త్రములనూ పూర్తిగా తెలుసుకున్నవాడా గొప్ప బుద్ధి వైభవంతో ప్రకాశిస్తున్న ఓ హయగ్రీవ దేవా అత్యంతమూ, ఆశ్చర్యాన్ని కలిగించే శ్రీ లలితాంబయొక్క దివ్యమయిన పవిత్రమయిన చరితము చెప్పబడియున్నది.
.....
తొలుదొల్తగా శ్రీదేవి జన్మప్రకారమును చెప్పారు. ఆతరువాత ఆమహాదేవియొక్క త్రైలోక్య పట్టాభిషేకమును గురించిచెప్పారు. ఇంకా భండాసుర సంహారాన్ని కూడా వివరించారు. .
మనోహరమైనదీ గొప్ప వైభవముతో కూడినదీ విస్తారమయినదిగా శ్రీపురం వర్ణించబడినది.అలాగే శ్రీ పంచదశాక్షర మంత్రమహిమ కూడా విస్తారంగా వర్ణింపబడినది.
షోడశాన్యాసాలూ వ్యాసఖండమున బాగుగా వర్ణించబడ్డాయి. అంతర్యాగ ,బహిర్యాగ పద్దతి కూడా చెప్పబడ్డాయి.
పూజా ఖండమున మహాయాగ పద్దతి చక్కగా వివరింపబడినది. పునశ్చరణ ఖండమున జపలక్షణాన్ని వివరించారు.హోమ
ఖండమున సాధన సామాగ్రుల బేధాలను గూర్చిచెప్పినారు.
రహస్య ఖండమున శ్రీచక్రానికీ ,శ్రీవిద్యకూ, మరియు శ్రీ విద్యకు గురుశిష్యులకు ఉండవలసిన తాదాత్మ్య భావాలు చెప్పబడ్డాయి. స్తోత్ర ఖండములో బహువిధములయిన స్తోత్రరాజములను తెలియబరచారు.
"
మంత్రిణీ దండినీ దేవ్యో : ప్రోక్తేనామ సహస్రకే .. నతు శీలలితా దేవ్యా : ప్రోక్తం నామ సహస్రకం "
మంత్రిణీ యొక్క దండినీ దేవియొక్క వేయినామాలు చెప్పారు. శ్రీలలితా సహస్రనామములు మాత్రం చెప్పబడి యుండలేదు.
తత్రమే సంశయోజాతో హయగ్రీవ దయానిధే
కింవాత్వయా విస్మృతం తత్ జ్ఞాత్వావా సముపేక్షితం.
కరుణా సాగరుడవయిన ఓ హయగ్రీవదేవా ఆవిషయాన్ని మీరుమరచారా? లేక వూరుకున్నారా అని నాకు సంశయము కలిగినది. అలా కాకుంటే లలితా దేవియొక్క వేయినామాలు నాకు వినే యోగ్యత లేక పోవుచున్నదా ? అలా మీరు చెప్పక పోవుటలొ గల ఆంతర్యం చెప్పండి స్వామీ
సూత ఉవాచ:-
"ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మనా
ప్రహృష్టోవచనం ప్రాహ తాపసం కుంభ సంభవం.
సూతుడు చెప్పుచున్నాడు:-
ఈవిధంగా కుంభ సంభవుడైన అగస్త్యుడు, భగవంతుడయిన హయగ్రీవుని అడుగగా అందుకు ఆయన సంతోషపడి. ఇలా అన్నాడు.
హయగ్రీవ ఉవాచ:-
లోపాముద్రాపతేఅగస్త్య సావధాన మనా శ్శ్రుణు
నామ్నా సహస్రం యన్నోక్తం కారణం తద్వదామిదే
లోపాముద్ర సహచారిణిగాగల ఓ అగస్త్యా నేచెప్పే సంగతి శ్రద్ధగావిను. లోగడ నీకు లలితా సహస్రనామం చెప్పని కారణం ఉన్నది. విను. శ్రీ లలితా దేవియొక్క వేయినామాలు చాలా రహస్యమయినవి. అంతకంటే వేరేవిధమయిన కారణమేమీలేదు. ఇప్పుడు నీవు సవినయంగా భక్తి భావంతో నన్ను మళ్ళీక అడిగావు కనుక నీకు ఉపదేశిస్తున్నాను.
ఉత్తముడయిన గురువు ఎటువంటి మంత్ర రహస్యాన్నయినా వినయ
సంపదా ,భక్తి తత్పరత గల శిష్యునకు మాత్రమే తెలుపవలెను. ప్రస్తుతం నేను నీకు ఉపదేశించబోయే లలితా సహస్రనామావళిని భక్తుడు కానివానికి ఎన్నడు చెప్పరాదు. శఠునకు, దుష్తునకు ,విశ్వాస రహితునకు ఈవిద్యను కొద్దిపాటికూడా చెప్పరాదు.
[శఠుడు = గురువు ఉపదేశించిన గూఢ విషయాన్ని తెలుసుకుని తనకు ఇంతమాత్రమే తెలుసునని ,తెలిసినా తెలియదని గురువును తిరస్కరించువాడు. దుష్టుడు:= గురువు చెప్పిన రహస్యాన్ని తెలుసుకుని దానిని ఇతరులకు చెప్పి వేళాకోలము చేసేవాడు.
అవిశ్వాసుడు= గురువు ఉపదేసం పొందిన తరువాత ఆ రహస్యం మీదగాని,గురువు మీద నమ్మకం లేక చరించువాడు. ]
శ్రీదేవియందు భక్తి తాత్పర్యం గలవాడూ శ్రీవిద్య ఉపదేశం పొందినవాడూ,ఉపాసకుడు, పవిత్రుడు అయిన వానికి ఈ నామావళిని ఉపదేశించాలి. శ్రీదేవియొక్క వేయిపేరులూ చదివినంతనే ఫలదాయకాలని శ్రీవిద్యా తంత్రములలో పేర్కొనబడినది. వాటిలో లలితా సహస్రనామాలు అతి ముఖ్యమయినవి.
మంత్రరాజములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమయినదో, పురములన్నింటిలో శ్రీపురం ఎంతముఖ్యమో శక్తులన్నింటిలో శ్రీలలితా దేవి ఎంత ప్రధానమో ,శ్రీ విద్యోపాసకులలో హరుడెంత ముఖ్యుడో లలితా సహస్ర నామాలు అంతముఖ్యము .
ఈ సహస్రనామములను పఠించితే ఆ తల్లి ఎంతసంతోషిస్తుందో చెప్పనలవికాకున్నది. లలితా దేవి దయనికోరుకునే భక్తుడు ఎల్ల వేళలా ఈలలితా సహస్రాన్ని పఠిస్తుండాలి.
శ్రీచక్ర రాజమందు లలితా దేవిని మారేడు పత్రాల చేతగాని, వికసిత పద్మాల చేతగానీ ఈ సహస్ర నామాలు చెబుతూ ఎవరు అర్చిస్తారో ? వానియందు ఆపరాశక్తియైన లలితాంబ తక్షణమే ప్రసన్న మవుతుంది.
శ్రీచక్రారాధన పూర్తిచేసి పంచదశాక్షరీ మంత్రరాజమును జపించి అనంతరం సహస్రనామ పఠనం గావించవలెను. పూజ,జపం చేయడానికి శక్తిలేనప్పుడు ఈ సహస్ర నామావళిని పఠించిన చాలును.
భక్తుడు పరిపూర్ణపూజ చేసికాని,సంపూర్ణ జపంచేసికాని ఏ ఫలితాన్ని పొందుతున్నారో ? ఈ నామావళిని పఠించి ఆఫలితాన్ని పొందగలుగుతున్నాడు. ఉపాసన తరువాత నామపారాయణం చేస్తే విశేష శ్రేయం.
శ్రీ విద్యారాధకులకు పూజాజపం మరియు సహస్రనామ సంకీర్తన చేయటం అత్యంతావస్యకములు. శ్రీ చక్రారాధనం, శ్రీవిద్యజపం సహస్రనామావళి పఠనం సంధ్యావందనాదులలా చేస్తూండాలి . కనీసం నామపారాయణాన్నయినా చేస్తుండాలి. చెప్పేదేమిటంటేభక్తుడు సహస్రనామ సంకీర్తనం తప్పక చేయాలి.
ఓ అగస్త్య మునీంద్రా అందుకుగల కారణాన్ని చెబుతున్నాను విను.
"వాగ్దేవీ వశినీ ముఖ్యాస్సమాహూదయేదమబ్రవీత్
వాగ్దేవతా వశిన్యా ద్యా శ్శృణుధ్వం వచనం మమ "
పూర్వ భక్తుల శ్రేయస్సుగోరిన జగజ్జనని ,సరస్వతివశినీ మున్నగు దేవతా శక్తులనుబిలచి ఇలా ఆజ్ఞాపించింది. నాదయవలన మీరు సమస్త వాక్సంపత్తిని పొందారు. నా ఆరాధకుల వాక్సంపదికొరకు నాచే ఆజ్ఞాపించబడుతున్నారు. మీరందరూ నాతాలూకూ శ్రీచక్ర రహస్యమును బాగుగా తెలిసికొన్నవారూ,నా నామ పఠనమునందు ఆరితేరిన వారు అయినందున స్తోత్రం చెసేపద్దతికొరకు మిమ్ము ఆజ్ఞాపిస్తున్నాను . రహస్యా ర్ధాలతో నిండిన నా వేలకొఅలది నామాలతో స్తోత్రాలను చేయండి. భక్తులు వాటిని పఠిస్తే నాకు కొంగొత్త ప్రీతికలిగేలా స్తోత్రాలను అమర్చండి.
ఇలా వశిన్యాది దేవతలు ఆజ్ఞాపింపబడ్దవారై శ్రీ లలితా పరంగా రహస్య గర్భితంగా నామావళులను శ్రీదేవీ స్తోత్రాలను ఘటించారు. ఆస్తుతే రహస్యనామ సహస్రంగా అత్యుత్తమమైనదిగా ఈలోకములో వ్యాప్తిలోకివచ్చినది. ఓ అగస్త్యమునీంద్రా! ఒకానొక వేళ శ్రీదేవి సిమ్హాసనాధిష్టయై ఉండగా ,ఆదేవి ఆరాధనకై వేచివున్న భక్తులకు దర్శనమొసగుటకై ఆజ్ఞఇచ్చినది. ఆసమయములో అక్కడికి ఎందరో బ్రహ్మలు ,సరస్వతులూ నిలచివున్నారు.
లక్ష్మీ నారాయణానాం చ కోటయ స్సముపాగతా:
గౌరీకోటి సమేతానాం రుద్రాణా మపికోటయ:
ఇంకా విశేష మేమిటంటే మంత్రిణిగా విన్నదగిన శ్యామలాంబ మరియు దండిని మొదలైన నానా రూపాలలో బహుశక్తులు సమూహాలుగా తద్దర్శనార్ధం వచ్చారు. అయితే ఆ శక్తులసంఖ్య చెప్పటం కూడా కష్టమే.
ఆ మహా పరిషత్తుకు బ్రహ్మ మొదలుగా గల దేవతా సమూహాలు,మానవ సంఘాలు,సనకాదులతోగూడిన సిద్ధుల గుంపులూ. వ్యాసుడు ఆదిగాగల మనుష్యసంఘాలూ రాగా అందరికీ ఆదేవిదర్శనమిచ్చినది. ఆమహా సభకు వచ్చిన వారందరూ లలితాదేవిని దర్శించి తమ చోట్లలో ఆశీనులు కాగా శ్రీదేవి కటాక్ష వీక్షణాలతో తిలకిస్తున్నది.
అలాంటి సమయములో వశిన్యాది గీర్వాణీ దేవతలు ముకుళిత హస్తాలతో వారు రచించిన లలితాంబ పేరుగా సహస్ర నామావళులను కీర్తించసాగారు. ఆస్తుతులను విని శ్రీదేవి చాలా సంతోషించింది. అందులకు పరిషత్తు లోని వారందరూ విస్మయం చెందారు.
ఓ అగస్త్య మునీంద్రా ! అప్పటినుంది లలితా దేవి ఆజ్ఞప్రకారంగా బ్రహ్మ ,హరిహరులు, శ్యామలాంబాది శక్తులు మంత్రిణీత్యాది దేవతలు ఈ సహస్రనామావళిని భక్తిబద్ధ హృదయముతో పఠిస్తున్నారు. ఈ నామాధ్యయనం భక్తునికి అత్యంతమూ ఆవస్యకంగా పఠనీయము.
ఓ మహర్షీ ! ఈ సహస్రనామాన్ని అత్యంతావస్యకంగా ఎందుకు పఠించాలో నీకు ఇదివరకేచెప్పాను. ఇప్పుడు సహస్రనామాలను చెబుతాను శ్రద్ధగావిను.
[ఇది శ్రీ బ్రహ్మాండ పురాణమునందు గల హయగ్రీవాగస్త్యులవారి సంవాదమనబడు లలితా సహస్రనామ పూర్వభాగము. ప్రథమ అధ్యాయము. ఓమ్ శాంతి: శాంతి:శాంతి:: ]
2 వ్యాఖ్యలు:
మంచి ప్రయత్నం.అభినందనీయం.మా బోంట్లకు అవశ్యం తెలుసుకోవలసిన విషయాల్ని అందంగా అందిస్తున్నందులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
జ్ఞాన నిధులు, భక్తాగ్రేసరులు బాల కృష్ణ మూర్తిగారికి నమస్కారములు. భాగవతోత్తములయిన మీవంటి పెద్దల ఆశీర్వాదములే మాకు శక్తిదాయకములు. ధన్యవాదములు.
Post a Comment