లలితాసహస్రనామము ఏకార్యం సాధించటానికి ఎలా పారాయణం చేయాలి.1
>> Friday, September 26, 2008
కలియుగములో సులభతరముగా భక్తుల కామ్యములను సిద్ధింప జేసే లలితా సహస్రనామ పారాయణము ఏవిధముగా చేస్తే ఏవిధమయిన ఫలితం వస్తుందో బ్రహ్మాండ పురాణములో హయగ్రీవభగవానులు అగస్త్యులవారికి ఉపదేశించారు.దానిని తెలుసుకుందాము.
[లలితా సహస్రనామ మహాత్మ్యము తృతీయాధ్యాయము.]
-------------------------------------------------------------------
ఇత్యేతన్నామ సహస్ర0 కథితం తేఘటోద్భవ
రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం "
ఓ అగస్త్యమునీంద్రా లలితాంబకు సంతోషాన్ని చేకూర్చే ఈస్తోత్రం రహస్యాలన్నింటిలోనూ రహస్యంగా ఉంటోంది. అటువంటి ఈ సహస్రనామావళిని నీకోసం చెప్పబడినది. ఈ స్తోత్రమ్ అకాల మృత్యువును శాంతింపజేస్తుంది.,కాలమృత్యువును పోగొడుతుంది. అన్నిరకాలైన జ్వరాలను తగ్గించగలుగుతుంది. ఆయుర్ధాయమును విశేషంగా పెంచుతుంది.
ఈస్తోత్రమునకు సాటియైనది ఇంతవరకు లేదు ఇకముందు కూడా ఉండబోదు. దీనిని చదవడం వల్ల వ్యాధులు నయమవుతున్నాయి. ఇంకా దీని పఠనం వల్ల అన్ని సంపదలు వృద్దవుతున్నాయి. సంతానం లేనివారికి పుత్రులను ప్రసాదించగలదు. ధర్మార్ధ కామ మోక్షాలను పొందగలుగుతారు. ఈదేవీ స్తోత్రము ఆమెకు సంతోషకారక మవుతున్నది.
లలితా దేవియొక్క ఉపాసన యందు ఆసక్తి కలవారు నిత్యం ప్రయత్నించి చదవాలి. శాస్త్రానుసారం వేకువనే లేచి స్నానమాచరించి సంధ్యావందనాదులు ముగించాలి. అనంతరం ఆరాధనాశాలకు వెళ్ళి శ్రీచక్రాన్ని శాస్త్రోక్త రీతిగా పూజించాలి. శ్రీవిద్యను, అంటే షోడశినయినా ,పంచదశినయినా అధవా త్ర్యక్షరి నయినా సహస్రము, మూడువందల మార్లుగాని కనీసం నూట ఎనిమిది సార్లైనా జపించాలి.
మంత్రాన్ని జపించిన తరువాత సహస్రనామం చెయ్యాలి నరులు వారిజన్మలో ఒక్కసారయినా ఇలా పఠిస్తే పొందేఫలితాన్ని చెబుతాను విను. ఓ అగస్త్యమునీంద్రా! గంగాది మహాపవిత్ర తీర్థాలలో కోటిజన్మలలో ఆచరించిన స్నాన ఫలము లభిస్తున్నది. వారణాసి యందు కోటిలింగాలను ప్రతిష్టించిన పుణ్యఫలితాన్ని, కురుక్షేత్రమందు సూర్యగ్రహణవేళ కోటిసార్లు దానాలు చేసిన ఫలితాన్ని పొందగలుగుతున్నారు. బ్రాహ్మణులకు కోట్లకొలది బంగారు దానం చేసిన ఫలితాన్ని,గంగానది ఒడ్డున కోటి అశ్వమేధ యాగములను చేసిన ఫలితాన్ని పొందగలరు.
జలం లేని మరుభూమియందు, కోట్లసంఖ్యలో నూతులుతవ్విన ఫలితాన్ని,దుర్భిక్ష దినాలలో రోజూ కోట్ల సంఖ్యలో అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. శ్రధ్ధగా వేయేళ్ళు అన్నదానం చేస్తే పొందగల ఫలితాన్ని కంటే కోటిరెట్లు ఎక్కువ ఫలితం లభిస్తున్నది. వేయి రహస్యనామాలలో ఒక్కటయినా పఠిస్తే వెనుక చెప్పిన పుణ్యము పొందవచ్చు. రహస్యనామాలలో ఒక్కదాన్నయినా త్రికరణశుద్ధిగా జపించినచో ఎటువంటి మహాపాతకాలూ నిస్సంసయంగా నశిస్తాయి. నిత్యకర్మలు ఆచరించకపోవడమువల్ల ,కూడని పనులు చేయడమువలన,ఏఏ పాపాలు సంభవిస్తాయో అటువంటివన్నీ మనుషుల లో నశించిపోతాయి.
ఓ అగస్త్య మునీంద్రా ఇన్ని చెప్పి ఏమి ఫలం? అసలు సంగతి చెబుతున్నావిను. పాపాలను పోగొట్టటములో ఈ సహస్ర నామాలకు గలశక్తి ఎట్టిదంటే పదునాలుగు లోకాలలోని వారంతా కలసి చేసినా ఒక్క లతా సహస్రనామంతో పోగొట్టలేనంత పాపం చేయలేరు.
ఈ సహస్రనామాలనువదలి తనకిల్భిషాలను పోగొట్టుకోవాలని ప్రయత్నించేవాడు శీతబాధను బాపుకోవడానికి హిమవత్పర్వతమునకు పోయినట్లుంటుంది. పరమ పవిత్రమయిన ఈ నామావళిని పఠించే భక్తునిపట్ల సంతోషముతో లలితాదేవి అన్ని కోరికలను ఈడేర్చును. ఈ స్తోత్రాన్ని అనగా దేవీ గుణగణాలను స్తుతించనివారు ఎలా భక్తులు కాగలరు? కాలేరుకదా ! దేవిఅనుగ్రహం పొందటానికి అనుదినం స్తోత్రాన్ని పఠించాలి అవకాశం లేనివారు పర్వదినాల లోనైనా పఠించాలి సంక్రాంతి, కాని విశువత్ కాలములయందుకానీ తనవారియొక్క అనగా భార్యా పుత్రాదుల జనం నక్షత్ర తిథులయందుగానీ,నవమి,చతుర్ధశి,శుక్లపక్షశుక్రవారాలు యందు విశేషించి పఠించాలి.
"కీర్తయేనామసహస్రం" పౌర్ణమాస్యాం విశేషత:
పౌర్ణమాస్యాంచంద్రబింబే ధ్యాత్యా శ్రీ లలితాంబికాం
పౌర్ణమినాడు చంద్రబింబాన్ని దర్శించి శ్రీ దేవినిధ్యానించటం ,సహస్ర నామాలను పారాయణం చేయటం చాలా మంచిది .
పంచోపచారాలను మనస్సులో అనుకున్న మీదట సహస్రనామం పఠించిన అన్ని వ్యాధులు తగ్గి దీర్ఘాయుష్మంతులవుతారు. జ్వర పడిన వారి తలను సృశిస్తూ పఠనం చేసిన శీఘ్రంగా వుపశమించును. కల్పమందు ఇది ఆయుర్వృద్దికరమని తెలుపబడినది. ఇందుమూలముగా శిరోబాధతో వున్న జ్వరం కూడా తగ్గును. అన్ని రోగాలు తగ్గటానికి విభూతి మంత్రించి ఇచ్చిన తీవ్రత తగ్గును. అలా మంత్రించిన భస్మాన్ని తాల్చినంతనే సర్వ రోగాలూ నయమవుతాయి .
నిండివున్న కలశాన్ని స్పృశిస్తూ సహస్రనామం పఠించి మంత్రించిన నీటితో స్నానం చేపిస్తే గ్రహ పీడితులకు ఆబాధ వెంటనే తొలగిపోతుంది. అమృతసాగరం నడుమ వుంటున్న అతల్లిని ధ్యానించి పఠించేవారిని ఏ విషమూ ఏమీ చెయ్యలేదు.
వెన్నను మంత్రించి గొడ్రాలితో తినిపించిన అచిర కాలం లోనే అమె పుత్రవంతురాలవును. ఇదిసత్యంఅనిచెప్పుచున్నారుహయగ్రీవులవారు
ద్యాత్వా. భీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం
ఆయాతి స్వసమీప0సా యద్యప్యంత:పురం గతా
రాజా కర్షణ కామేశ్చే ద్రాజాన వధ దిజ్ఞ్ముఖ :
త్రిరాత్రం య: పఠేత్ శ్రీదేవీ ధ్యాన తత్పర:
రాజును వశపరచుకో గోరువారు ఆ రాజు వుండే నివాసానికి ఎదురుగా కూర్చుండి మూడురాత్రులు దేవిని ధ్యానిస్తూ
మూడురాత్రులు సహస్రనామం పఠిస్తే...... ఆరాజు వశంతప్పినవాడై వుపాసకునకు దాసునిలా ప్రణామం చేసి నిలబడి అతను వాంచించిన దానిని సమర్పించును.
ఈ సహస్ర నామాలను సర్వదా పఠించే వాని ముఖం చూసినంత మాత్రముననే మూడులోకాలూ సమ్మోహితులగును. శత్రు సంహారం కోరి ఏ భక్తుడయినా సహస్ర నామాలను పఠిస్తే శరభేశ్వరుడు ఆశత్రువులను సంహరించును. వానిమీద ఎవరన్నా అభిచారాది దుష్ట ప్రయోగాలను చేస్తే అట్టి వారిని ప్రత్యంగిరా దేవి స్వయంగా సంహరించును.
[ 1 నుండి 34 శ్లోకాలకు అనువాదం ] ...
[ ఇంకా వుంది ]
1 వ్యాఖ్యలు:
చాలా బాగుంది దుర్గేశ్వర గారు!
Post a Comment