భగవంతున్ని నమ్మేవాళ్ళు సోమరిపోతులా? ఇదేమి విమర్శ?
>> Wednesday, June 18, 2008
భగవంతుని నమ్మేవాళ్ళు సోమరిపోతులంటూ indianminarva గారువ్రాసిన కామెంట్ చూసాక భగవంతుడు వాదనలకందే వాడు కాకపోయినా ,వాదనలతో ఆయన వునికిని చూపాలనుకోవడము సముద్రజలాన్ని దోసిల్లతో కొలవాలని ప్రయత్నించటము లాంటి వెర్రిపనని పెద్దలు చెబుతున్నా, విమర్శకు కారణం నేనేకనుక నావాదనను వినిపించాలని వ్రాస్తున్నాను. ఏమన్నారు ,అరుణ్ కుమార్ గారూ ఒకపదార్ధ వునికికి ప్రమాణము ఛూడలేకున్నా ఆస్తిత్వాన్ని ఎరుకపరచగలగడం అనికదా..సరే ఇప్పుడు మీమనసులో బాధ కలిగింది, లేకసంతోషము కలిగింది దాన్ని మీరు మీరన్నట్లుగా చూపగలరా కనీసం దాని ఆస్తిత్వాన్ని ఎలా చూపగలుగుతారు. బహుశా మీచర్యలద్వారా అవతలివారికి ఏదన్నాచేసి చూపినప్పుడు వాళ్ళూ ఇలాజరిగివుంటుందని అనుకోగలుగుతారంతే. పదార్ధాలనన్నింటినీ సృష్టించినవానిని ఆపదార్ధాలప్రమాణములతో కొలవాలనుకోవడం అవివేకము. వుదాహరణకు మీరు 100కిలో మీటర్లదూరాన్నయినా కొంచెం కష్టమయినాఅ ప్రత్యక్షముగా చూపగలరు. సూర్యుని దాకానో లేకమధ్యలోనో దూరాన్ని చూపమంటే ప్రత్యక్షముగా చూపగలరా. ఏదో సిధ్ధాంతాలతోతప్ప. మీరుచూపలేనంతమాత్రాన అది అసత్యముకాదుకదా . అలాగే భగవంతుని తత్వాన్నయినా. ఇక భగవంతుని నమ్మేవాళ్ళు తమ శ్రమతో సంపాదించినది సమర్పణ భావంతో ఖర్చుచేసుకుంటారేగాని సులభముగా సంపాదించడానికి భక్తులుగామారరు. దానికోసం అలానటించేవాళ్ళు వుండవచ్చు అది అందరికీ అన్వయించకూడదు . ఇక సోమరిపోతులే భగవంతుని నమ్ముతారని అన్నారు. శ్రమించకుండా కాలాన్నిగడపేవారు సోమరిపోతులు ఈనెల 15వ తేదీ ఆదివారము ఆంధ్రజ్యోతి దినపత్రిక 10వ పేజీలో వున్న వార్త చూడండి, సృష్టికర్త దేవుడే మేము కేవలము ఆవిష్క్ర్తర్తలము మాత్రమేనని 130 విస్వవిద్యాలయాలకు చెందిన ప్రసిధ్ధశాస్త్రవేత్తలు అమెరికా యూనివర్శిటీ "ట్రినిటీ" చేపట్టిన ఒక సర్వేలో వెళ్ళడించారు. అది చదవండి . ప్రసిధ్ధ శాస్త్రవేత్తలు ఐన్ స్టీన్, న్యూటన్ లాంటివారే భగవంతుని సంపూర్ణ ముగా నమ్మారు. ఇప్పుడు చెప్పండి , వీళ్ళందరూ సోమరిపోతులా కాదే వీరంతా నిరంతరము మేధో మధనముసాగిస్తూ మానవ అభ్యుదయానికి పాటుపడుతున్నవారే? నాస్తికవాదమ్లోపుట్టి దాన్ని జీవితములో ఆచరిం చిచివరకు తనబిడ్డప్రాణాలు కాపాడుకోవటము సాధ్యంకాక తండ్రీ! ఈబిడ్డను బ్రతికించి కాపాడమని బిడ్డను సాయిబాబా పటము ముందు పెట్టిరోదిస్తే ఆయన కరుణతో దక్కినబిడ్డకు సాయిచంద్ అనిపేరుపెట్టుకున్న త్రిపురనేని గోపీచంద్ గురించి తెలుసామీకు? మీరంతకన్నా నాస్తికవాదులా? ఈవిషయాన్ని ప్రముఖ సినీ నటుడు, ఆర్ట్ఫిల్మ్ దర్శకుడూ సాయిచంద్ గారే పత్రికలద్వారా వెల్లడించారు. తనబిడ్డకు కాళ్ళుపనిచేయవని బాగుచేయటం తమవల్లకాదని చేతులెత్తేస్తే, ఆతల్లి మంత్రాలయము వెళ్ళి తండ్రీ వీడు బ్రతకకుంటే బ్రతికినా అన్నీసవ్యముగలేకుంటే తుంగభద్రలో పారవేసివెళ్ళి నీకరుణను అందరికీ తెలియజేస్తానని వ్యాజ్యభక్తితో విలపించి ప్రదక్షణములు చేయగా నేడు మెరుపులా నృత్యం చేస్తున్న రాఘవేంద్రలారె న్స్ గురించి మీకూ తెలుసనుకుంటాను. తనరచనలతో ఆంధ్రను వుర్రూతలూగించి భగవద్భ్హావాన్ని నిరశించి చివరకు అరుణాచలంచేరి భగవాన్ రమణ మహర్షుల పాదాలచెంత తనజీవితమంతా వృధాచేసుకున్నానని విలపించిన "చలం"గారి జీవిత చరిత్రలో మీకు భగ వద్ లీలలు కనిపించలేదా? లేక చదవటానికి బధ్ధకించారా? అంతెందుకు శాస్త్ర విషయాలపట్ల, భగవంతుని వునికి పట్ల విశ్వాసము లేక నిరశించిన ఆచార్య భరద్వాజగారు సాయిప్రచారకులై తరించి మీ ఒంగోలు లో సాగించిన ధర్మప్రచారము మీకుతెలియనిది కాదు. మీరు ఆయన రచనలను కూడా చదవండి. మానవసేవకు వున్నత గుణాన్ని ఆపాదించి మనుషులను అటువేపుతిప్పడానికి మాధవసేవతోసమానముగా చూపారు. దానివలన లోకకళ్యాణము జరిగినదేకాని చెడుజరగలేదే. ?
ఒంగోలుగిత్తకు ప్రౌఢవయస్సులో యుక్తాయక్తములు తెలియవు బండి మొద్దుపట్టుతోలాగాలని చూస్తుంది. కాడి బరువు మోసీ మోసీ మెడలు విరగగొట్టుకున్నతరువాత రైతు చెప్పెసూచనలప్రకారం ప్రమాదరహితముగా ప్రయాణిస్తుంది . వయస్సురావాలి దానికి వాస్తవంబోధపడాలంటే. మీరైనా నేనయినా అంతే . ఇంటర్ చదివేటప్పుడు రాడికల్స్ యూనియన్లో చేరి వంగపండు పాటలు, బాలగోపాల్ మాటలు ప్రభావంతో దేవుడేక్కడనే వాదన చేసిన మూర్ఖుడనే నేనుకూడా. మా వినుకొండ పోరాటాలపుఱిటిగడ్డ. పులుపుశివయ్య గారిగురించి విన్నావా? ఆంధ్రలో గొప్పకమ్యూనిష్ట్ నాయకుడు. చివరిరోజులలో శ్రీశైలంవెళ్ళి శివదర్శనాన్ని చేసుకున్న విషయం సన్నిహితులకు తెలుసు.. 18సంవత్సరాలకే సోవియట్లాండ్ పత్రికకు సంపాదకుడై జీవితాంతం సిధ్ధాంతాలకు నిబధ్ధుడైఆంధ్రలో ప్రముఖ పాత్రికేయుడనిపించుకుంటున్న వేలాదిమంది విలేఖరులను తయారుచేసిన వారొకరు ఇక్కడ పీఠం ప్రతిస్తలో భార్యాసమేతులై అత్యంత శ్రధ్ధాశక్తులతోపాల్గొన్నారు. రండి మీకు ఆధారాలు చూపిస్తాను. వారంతా మేధావులు నాకంటే శ్రామికులని నావిశ్వాసం ఎదుటివారిలో వున్నత గుణాలను గుర్తించగలిగే సంస్కారం నాసంస్కృతి నాకు నేర్పింది. తమసోమా జ్యోతిర్గమయ ?
9 వ్యాఖ్యలు:
మహానుభావా.... స్వశక్తితో పైకి వచ్చిన వారుకూడా భగవదనుగ్రహం అని మాట్లాడటం వాళ్ళ వాళ్ళ hunmbleness ని చూపిస్తుంది అనుకొంటున్నారుగాని గతజన్మ కర్మ ఫలాలను, దేవుని అనుగ్రహాన్ని యెక్కువగా చేసిచూఫటం ఏపనీ చేయక దైవానుగ్రహం కోసం మాత్రమే జీవించే కొత్త సోమరి తండాలకు ఓపిరు లూదుతుందని తెలుసుకోలేకపోతున్నారు. అంతేనా... వ్యోమగామి రాకేష్ శర్మ గారు అన్న మాటలుకూడా ఉదహరించలేకపోయారా... మీరన్న సాయిబాబా సాక్షాత్తూ నేను దేవుడ్ని కాదు బాబొయ్ కేవలం మహాను భావుడ్నే అని అనలేదా. దేవుడు అనే భావన కేవలం మనసుకు ఊతంగా నిలచి మనిషిని మహోన్నత తీరాలవైపుకు మరలిస్తే ఉనికితో సంబంధం లేకుండా స్వాగతించవలసిందే కానీ జరుగుతోందేమిటి రాజకీయాలు, రక్తపాతాలూను.
యెరుక పరచడం అంటే మళ్ళా మీరు చూపించడం అనే అర్ధం చేసుకునంట్లున్నారు. దేవుడు అనేది భ్రమ అది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవటం మాత్రమే. చిన్న పిల్లలకు చెప్పడానికి, కవితలు రాసుకోవటానికీ తప్ప practical reasons కి యెందుకూ పనికిరాని ఒక పాత భావన. మనం జీవించేది మనుష్యులు జీవించే సమాజంలో మన చేష్టలు, మన భావాలు అన్నీ మన పరిసరాల ద్వారా మన చుట్టూ వున్న మనుష్యులద్వారా ప్రభావిత మయ్యేవేగానీ దేవుడో లేక దయ్యమో మనల్ని నడిపించదు.
మహిమ వల్ల వ్యాధులు నయమవండి undocumented (ఇంకా కనుగునబడని) భౌతిక లేదా పారభౌతికం (అంటే దైవికమే కానఖ్ఖరలేదు) కారణం యేదో వుండి వుండాలి రేకీ గురించి మీరు విని వున్నట్లైతే ఇది కొంచెం అర్ధం చేసుకోగలం. మరి మీరిచ్చిన ఉదాహరణ వైద్యులతో పనిలేదన్నట్లు వుంది. అదే మీరుపాటిస్తున్నట్లైతే మంచిదే అలాగే కానివ్వండి. ఒకప్పుడు వాధులన్నీ దైవ శాపవిహితమ్మనీ
నమ్మేవారు ఇప్పుడు మనం మన పరిధిలో మనం నయం చేసుకో గలుగుతున్నామా లేదా ఈ మాత్రం దానికి "దైవం" కావాలా?
దేవుడి గురించి మాట్లాడే ముందు మనం వేదాంతం గురించి చూద్దాం.
సైన్సుకీ, వేదాంతానికీ పెద్ద తేడా లేదు. రెండూ ఈ సృష్టి మూలాలను అన్వేషించేవే. వేదాంతం స్థూలంగా చెప్పేదాన్నే సైన్సు విపులీకరిస్తుంది. కాలక్రమంలో సైన్సు పరిధి పెరుగుతుంది, ఆ వారా వేదాంతం పరిధి కుదించుకుపోతుంది. అయితే, విశ్వంలోని అనంతకోటి రహస్యాలను సైన్సు ఛేదించేకొద్దీ మరిన్ని ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. అవన్నీ కలిసి వేదాంతం తెరమరుగు కాకుండా ఎల్లప్పటికీ కాపాడుతూనే ఉంటాయి. సైన్సుకీ వేదాంతానికీ పోరాటం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సైంటిస్టులు చెప్పేదీ ఈ సంగతే. 'దేవుడు అన్నిటికీ కర్త' అనే శాస్త్రవేత్తల మాటల వెనుక అసలర్ధం తాము ఇంకా సూత్రీకరించలేని శక్తి ఏదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందనే కానీ ఆ శక్తికి పూజలు చేస్తే మన మాట వింటుందని కాదు. ఐన్ స్టైన్ లాంటి మేధావులు దేవుడిని ఉనికిని గుర్తించింది పైన చెప్పిన కోణంలోనుండేగానీ 'యెహోవా ఆరు రోజుల్లో విశ్వ సృష్టి చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు' అనే కోణంలో కాదు.
ఇతర మార్గాలు మూసుకు పోయినప్పుడు ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు అని దేవుడిని వేడుకున్న నాస్తికులు కోరుకుంది జరిగాక ఆస్తికులుగా మారటంలో వింతేమీ లేదు. అయితే, దేవుడు విశ్వాంతర్యామి అయినప్పుడు ఆయన్ని 'నాకు ఇది కావాలి, అది కావాలి' అని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరమేమిటి?
నేను నాస్తికులనీ, ఆస్తికులనీ ఎవరినీ బలపర్చటం లేదు, వ్యతిరేకించటమూ లేదు. దేవుడనేది ఓ నమ్మకం, ఓ ఫీలింగ్. అది ఎవరికి వారు అనుభవించాల్సిన విషయం. పక్కవారికి తమ నమ్మకాలతో ఇబ్బంది కలగనంతవరకూ అదే స్థాయిలో ఉన్నా ఫరవాలేదు. హిందూ మతానికి ముక్కోటి దేవతలున్నారు, క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్లు (ట్రినిటీ), మహమ్మదీయులకు అల్లా ఒక్కడే దేవుడు.... నాస్తికులకు ఏ దేవుడూ లేదు. ఆ రకంగా చూస్తే నాస్తికత్వమూ ఓ మతమే - దేవుడు లేని మతం. హేతువాదం వాళ్ల వేదాంతం. ఆస్తికులు ఈ విషయాన్ని గ్రహిస్తే ఇతర మతస్తులతో సర్దుకుపోయినట్లే నాస్తికులతోనూ సర్దుకుపోవచ్చు.
దుర్గేశ్వరా గారు,
యద్భావం తద్భవతి అంతారు.ఎవరి దృష్టిని బట్టి వారి ప్రపంచం.ఒకరికి నీటిలో చేపలు కనిపిస్తే మరొకరికి నీటిలో విద్యుత్ కనిపిస్తుంది.ఒకరికి హైడ్రోజెన్,ఆక్సిజెన్ అణువులు కనిపిస్తే మరొకరికి నాచు కనిపిస్తుంది.మనసు చూడాలనుకొన్నది మెదడు చూపిస్తుంది.మన అభిప్రాయాన్ని మనం ప్రకతించాలి.విమర్శలను స్వీకరించాలి.
విఞాన శాస్త్రం,వేదాంతం ఒకే నాణేనికి రెండువైపులు.విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తుంది,ఆధ్యాత్మికత కుచించుకు పోతుంది అన్నది పొరపాటు.విజ్ఞాన శాస్త్రం చీకతి గుహలో కాగడా ప్రయాణంలాంటిది.వెలుతురు పడ్డంత మేరకు కనిపిస్తుంది.కనిపించిన దాని ఆధారంగా సిద్ధాంతాలు ఏర్పదతాయి.మరింత ముందుకు వెళ్తే దృష్యం మారుతుంది.సిద్ధాంతం మారుతుంది.ఆధ్యాత్మికం అనంతం.విజ్ఞాన శాస్త్రవేత్తలు అతొకష్టపది ఒక సత్యమనే కొండ ఎక్కితే,వారికి అక్కడ ఎన్నో ఏళ్ళముందే చేరి విశ్రాంతి తీసుకుంటున్న ఆధ్యాత్మిక వాదులు కనిపించారట.
ఇక ఆస్తికులు,ఎవ్వరినీ దూసించరు.తామే గొప్ప విజ్ఞానవంతులమన్న అహంకారంతో నాస్తికులే ఆస్తికులను హేళన చేస్తారు.వెక్కిరిస్తారు.దానికి ఆస్తికులు స్పందిస్తే అసహనం అంటారు.కనీ,ఆనోభద్రాహ క్రతవో యంతు విశ్వతహా(అన్నివైపులనుంచీ ఉన్నత మైన ఆలోచనలకు ఆహ్వానం )అనేది ఆస్తికులే.
ఆస్తికులూ నాస్తికులూ అనే రెండు శ్రేణుల జనం ఎప్పుడూ సమాజంలో ఉంటూనే ఉంటారు. సాధారణంగా జాతకంలో గురుచండాలయోగాలు పట్టినవారు నాస్తికులవుతారు. గురుచండాలయోగమంటే గురురాహువులు ఒకే రాశిలో ఉండడం. ఒకే రాశిలో లేకపోయినా, పరస్పరం బలమైన దృష్టులు ఉన్నా కూడా గురుచండాల ఫలితాలు అనుభవంలోకొస్తాయి.
కొంతమంది పళ్ళ వ్యాపారులు సరుకు కుళ్ళిపోయినా, నష్టం వచ్చినా ఫర్వాలేదు గానీ కొనేవాడు అడుగుతున్న ధరకి మాత్రం సుతరామూ ఇవ్వరు. అలాగే నాస్తికులు కూడా పరమకారణం (కారణ కారణం) ఏదో ఒకరోజు తమ చేతికి చిక్కుతుందనే మూఢవిశ్వాసంలోనే బతుకంతా గడిపెయ్యడానికి సిద్ధపడతారు తప్ప ఆ పరమ కారణం భగవంతుడేనని అంగీకరించరు. వాళ్ళ ఖర్మ. వాళ్ళనలా వదిలేద్దాం.
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఆస్తికులూ, నాస్తికులూ కూడా ! మానవులు భూమిమీద వ్యాపించిన వైరస్సే తప్ప అంతకన్నా గొప్పవాళ్ళు కారు. వీళ్ళు ఒకప్పుడు ఈ భూమిమీద లేరు. ఇకముందు ఉండరు. ఈ అల్పులు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దేవుడికీ, దేవతలకీ వచ్చిన నష్టమేమీ లేదు.
సుబ్రమణ్యంగారూ: ప్రయత్నాన్ని కూడా ఆరంభించకుండా కారణాన్ని ఒకే "మహా శక్తికే" ఆపాదించడం గొప్పపనా లేక నిజనిర్ధారణ కోసం స్రమించి సాధించడం గొప్పపనా చెప్పండి. అన్నీ దేవుడే అనుకుంటే మన నాగరికత అక్కడే ఆగిపోయివుండేది. ఆస్తికులు ఏనాడూ కారణాన్వేషణలో తరించిన వారు కారు. మీ వివరణ బాగుంది :-) ఒక అశాస్త్రీయమైన విషయాన్ని మరొక అశాస్త్రీయమైన విషయంతో(జాతక శాస్త్రం) వివరించే పని కించిదాశ్చర్యాన్ని కలిగించింది. కానీ మీరు వివరణలోకన్నా మీ అసహనాన్ని వ్యక్తీకరించడంలో బాగా క్రుతక్రుత్యులయ్యారు.
చాలా మంచి చర్చ జరుగుతోది...ఇప్పట్లో తెగేదీ కాదు, ఒకరి అబిప్రాయాలు ఒకరు ఒప్పేవీ కావు. ఇదొక eternal debate.
నా మట్టుకు మనిషికి ఎప్పుడూ ఒక ‘నమ్మకం’ కావాలి. అన్నీ సరిగ్గా జరుగుతుండే అంతా నావల్లే అని, తనమీద తనకు నమ్మకం అన్నట్టు వ్యవహరిస్తాడు. ఒక్కసారి తను భరించలేని కష్టం వస్తే అర్జంటుగా ఒక సపోర్ట్ కావాలి కాబట్టి అప్పుడు దేవుడు కావాలి అనిపిస్తుంది. ఏది ఏమైనా దేవుడు ఒక నమ్మకం. He is a center outside our own self.కాబట్టి man created God.
భగవంతుడు ఒక అవసరం, అవసరానికి పనికొచ్చే ఒక నమ్మకం. ఉంటే మంచిదే...let Him exist,but that is surely not my business.
dhanyavaadamulu mii amdarikii diinipei kottapOst peTTaanu chooDamDidayachEsi
మంచి చర్చ.
ఇలాంటి చర్చలు చేసీ చేసీ చివరికి నేను నేర్చుకుంది ఏమిటంటే మొడివాన్ని వాదనలో గెలవలేమన్నది. అయితే ఇక్కడ ఎదుటివాడు మొండివాడు. ఎన్ని కారణాలు చూపినా ఎవరికి వారికి ఆ ఘడియ రాకుంటే ఎదుటివాడి వాదనలో పస పట్టుకోలేరు. ఒక్కొక్కరు ఒక్కో వాదన వైపు వైపు వుండటంలో వారు పెరిగిన పరిస్థితుల ప్రభావం బలంగా వుంటుంది. దాని ప్రభావం నుండీ బయటపడి ఎటు వైపూ తూగకుండా వాదనను అర్థం చేసుకోగలగడం కష్టం.
అందువల్లే పూజల్లో పుట్టి, పూజల్లో పెరిగి, మంత్రాలు వింటూ, చదువుతూ, భగవంతుడి లీలావిలాసాల కథలు వింటూ పెరిగిన వారికి హేతువాదం అర్థం కావడం అంత సులభం కాదు.
అబ్రకదబ్ర, ఇండియన్‌మినెర్వాలతో నేను ఏకీభవిస్తున్నాను. దేవుడైనా, దయ్యమయినా మనిషి మెదడులో పుట్టిందేనన్నది నా మతం. దేవుడ్ని కించపరిస్తే ఆస్తికుడికి ఎంత భాధా, వేదనా కలుగుతుందో నా మతాన్ని కించపరిస్తే, నా నమ్మకాన్ని కాదంటే నాకు అంతే కాలుతుంది. నమ్మని వాన్ని నమ్మేవాడు మూర్ఖుడనుకుంటే, నమ్మని వాడు నమ్మేవాన్నీ అదే అనుకుంటున్నాడన్నది స్మృతిలో వుంచుకోవాలి.
--ప్రసాద్
http://blog.charasala.com
ప్రసాద్ గారూ!
స్వంతాభిప్రాయాల పట్ల ఎంతనమ్మకముంచుతామో ఇతరులాభిప్రాయాలను అంతే గౌరవిస్తున్నది భరతజాతి. అదిమనరక్తములో వున్న సద్గుణము. మనగురువులు మనకుచెప్పినపాఠం .కస్తూరిమురళిగారువుదహరించిన వేదవాఖ్యం" ఆనో భద్రాహ క్రతవోయంతు విస్వతహా" [ అన్నివైపులనుండి వున్నతమైన ఆలోచనలకు ఆహ్వానం ] ఇదిమన సంస్క్రుతి చూపినబాట. తండ్రికి దూరముగా పెరిగిన పిల్లవానికి ఆతండ్రి తమబిడ్డలకోసందాచివుంచిన నిధిగురించి తెలియక పోవచ్చు. అంతమాత్రంచేత అతనికి హక్కులేకుండా పోతుందా? అలాగే ఇదిమీదికూడా!. మీవాదనను ఇందులో పాల్గొన్న వారెవరూ వ్యతిరేకించటము లేదు. ప్రపంచానికి జ్ఞాన భిXఅపెట్టిన జగద్గురువుల వారసులము మనము. అభిప్రాయాలుప్రేమతో పంచుకుంటాం . అనుబంధాలు గర్వంతో తుంచుకోము మనము. ఏదిసత్యమో దానిని భగవంతుడు ఎవరికి ఏ సమయంలో ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడని ప్రగాఢముగా నమ్మే మనోధైర్యం ,సత్యము పట్ల అచంచల విస్వాసం మనసొత్తు. అందువలననే ఈదేశం ప్రతి వాదాన్ని శ్రద్దగా విన్నది. ప్రతి సిధ్ధాంతాన్ని ఆహ్వానించింది. కాలానుగుణముగా కొన్ని వాదాలు విజృంభించినా కాలపరీక్షకు తట్టుకోలేక అవి కనుమరుగయ్యాయి సత్యము మాత్రం నిత్యమై నిలుస్తూనేవుంది. అసతోమా సద్గమయా.
Post a Comment