శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాది .... అనుకున్నప్పుడు

>> Friday, November 29, 2019

నా మిత్రుడి బంధువు ఒకాయనకి ఒక్కడే కొడుకు. వాడికీ ఒకడే కొడుకు. అమెరికాలో శాశ్వతంగా సెటిలై అక్కడే కోట్లు సంపాదిస్తున్నాడు. అక్కడి నుంచి వాడు పంపే డబ్బుతో ఇక్కడ ఇతడు భూములు కొంటూ ఉంటాడు. భార్య మరణించింది. ఇండియాలో ఒక్కడే ఉంటాడు. డెబ్భై ఏళ్ళు.

 ఒక రోజు రాత్రి తమ ఎకరం భూమిని ఎవరో పొలిటీషియన్ తాలుకు మనుష్యులు ఆక్రమించుకున్నారని తెలిసింది. ఆ రాత్రి గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. పాతిక లక్షలు ఖర్చు. ఆ పైన ఆర్నెల్లకి మరణించాడు. తండ్రికి గుండె జబ్బు వచ్చి మరణించినప్పుడు మాత్రం కొడుకు విదేశాల్నుంచి వచ్చి ఓ నాలుగు రోజులు వెళ్ళాడు.

ఈ సందర్భంగా బుద్ధుడి కథ ఒకటి చెపుతాను. ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరoగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు. అందుకే దుఃఖం.

 ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నీకు తెలీదా నాన్నా? మూడు రెట్లు ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు. చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు.

ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!

అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్‌మెంట్ పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, కా... స్త ఆనందిస్తున్నాడు కూడా.

ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది. ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.

‘ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది. నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP