శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పిండప్రదానాలు ఎవరు చేయాలి?*

>> Wednesday, December 26, 2018

*పిండప్రదానాలు ఎవరు చేయాలి?*

*అనంతసాహితి -పితృదేవతారాధనా రహస్యాలు-007*

హైందవ ధర్మానికి కిరస్తానీయులూ, మహ్మదీయులూ చేయని అపకారం ప్రవాచకుల వల్ల కలుగుతోంది. ధర్మప్రచారం చేయడం వేరు, ధర్మాధర్మనిర్ణయశక్తి వేరు. ముఖ్యంగా ధర్మసందేహనివృత్తి శక్తి, అర్హత వేరు. ఈ తేడాలు నేటి ప్రవాచకులు గమనించడంలేదు. తమకున్న వాగాడంబరంతో, తిమ్మిని బమ్మిని చేసే చెప్పగలిగే సామర్ధ్యంతో, శ్రోతలకు వినసొంపుగా చెప్పే కళ మాత్రమే ఆధారం చేసుకొని, మీడియా విస్ఫోటనం అదునుగా తీసుకుని, తమంతటి వారు లేరనే భ్రమతో సనాతన ధర్మానికి తీరని అపకారం చేస్తున్నారు. ఇటువంటి అపకారాలలో చాలా తీవ్రమైనవి కూడా ఉంటున్నాయి. వాటికి చెందిన ఒక ఉదాహరణను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక భక్తుడు ఈ విధంగా ఒక ప్రవాచకుడిని ప్రశ్నించాడు?
‘‘ అయ్యా! తీర్థ విధి ఎవరు పెట్టాలి?‘‘ 

దీనికి సదరు ప్రవాచకుడు లోతైన విషయజ్ఞానం లేకుండా చెప్పిన సమాధానం ఇది.

‘‘పెద్దకుమారుడే పెట్టాలి. అతడు చేసిన పిండప్రదానాలే పెద్దలకు చెందుతాయి.‘‘

ఇది అత్యంత కిరాతకమైన సమాధానం. బాధ్యతారాహిత్యమైన సమాధానం. సనాతన ధర్మంలో ఓనమాలు కూడా తెలియని బుడుతడు ఇచ్చిన సమాధానం.

ఇదే ప్రశ్నకు ఆంధ్రవ్యాసుల వారు ఇచ్చిన సమాధానం ఇది.

‘‘హైందవ ధర్మంలో కుమారులకు ఉన్న స్థానం మహోన్నతమైనది. అందులోనూ మొదటి కుమారునికి ఉన్న స్థానం ఇంకా గొప్పది. మొదటి కుమారుని ధర్మసంతానం అంటారు. అన్ని ధర్మకార్యాలకు అతడు కర్త. తరువాత పుట్టిన వారు కామ్య సంతానం. ముఖ్యంగా తల్లితండ్రులకు కర్మకాండ, ఉత్తరక్రియలు చేసే అధికారం, బాధ్యత పెద్దకుమారుడికి ఇచ్చింది ధర్మశాస్త్రం. కనుకనే ఆస్తిలో కూడా పెద్దకుమారుడు అగ్రభాగం ఇస్తుంది.

ఇక్కడ ఒక సందేహం అందరికీ వస్తుంది. పెద్దకుమారుడే ప్రధానం అయితే మిగిలిన కుమారులు ఎందుకు? వారి బాధ్యత ఏమిటి? వారంతా జందెం తప్పుకొనడానికి తప్ప ఇంకెందుకూ పనికి రారా? అనే సందేహం కలుగుతుంది.

దీనికి సమాధానం కూడా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

పెద్దకుమారునికి పితృకర్మలు చేసే అధికారం ఇచ్చినా, ఇతర కుమారులను ధర్మశాస్త్రాలు అలక్ష్యం చేయమని చెప్పలేదు. అలాగే అన్నీ అన్నే చేస్తాడని వీరు అలక్ష్యం చేయాలని కూడా చెప్పలేదు. పెద్దకుమారుడికి ఆ పదిరోజుల కర్మ, దాని తరువాత నెలమాసికాలు, తద్దినాలలో అతని పాత్ర ప్రధానమే అయినా మిగిలిన కార్యాలలో తమ్ములకు కూడా ప్రధాన పాత్ర ఉంది.

ముఖ్యంగా తీర్థయాత్రలు చేసినప్పుడు, పర్వదినాలప్పుడు, పితృపక్షాలప్పుడు, అమావాస్యాది తిథులప్పుడు, పుష్కరాది స్నానాలకు వెళ్ళినప్పుడు తమ్ములకు ప్రధాన పాత్ర వస్తుంది. ఎందుకుంటే తీర్థవిధులు ఎవరు తీర్ధయాత్ర చేస్తే వారు చేయాలి. అంటే ఒక పుణ్యక్షేత్రానికో, నదీస్నానానికో వెళితే, ఎవరు వెళితే వారు విధిగా చనిపోయిన వారికి పిండప్రదానాలు చేయాలి. అంటే తమ్ముడు ఒక్కడూ గయాక్షేత్రానికి వెళితే, అక్కడ పిండప్రదానం  అతడే చేయాలి. అలాగే పుష్కర స్నానానికి వెళితే అక్కడ కూడా తమ్ముడు పిండప్రదానాలు చేయాలి. అన్నతో కలసి వెళితే అన్నచేసేటప్పుడు ప్రక్కన కూర్చోవడం వేరు. ఒంటరిగా వెళితే మాత్రం ఎవరు వెడితే వారు పిండప్రదానం చేసే తీరాలి. దీనికి పెద్దన్నే చేయాలి అనే నియమం లేదు.

మనం దక్షిణాపథంలో ఉన్నాము. ఉత్తరభారతయాత్ర చేసే ఓపిక, తీరికా, అవకాశం అన్నకు లేకపోవచ్చు. తమ్ముడికి కలగవచ్చు. కనుక ధర్మశాస్త్రాలు తమ్ముడిని కూడా పిండప్రదానార్హత కలవాడిగానే చెప్పాయి. దీనికి ప్రమాణమే పితృగీతలు.

పితృగీతలు అంటే స్వర్గంలో ఉన్న తండ్రి, తాత, ముత్తాతలు. వీరు ఈ విధంగా పాడుకుంటూ ఉంటారని అనేక సందర్భాలలో పురాణాలలో చెప్పారు.

విష్ణుపురాణంలో యమునా నది గురించి చెబితే, మరో పురాణంలో గయాక్షేత్రం గురించి చెప్పింది. ఇలా అనేక క్షేత్రాల గురించి, తీర్థాల గురించి పితృదేవతలు పాడుకునే పాట ఈ విధంగా ఉంటుంది.

‘‘మా వంశంలో పుట్టిన వారు కాళిందీ జలంలో స్నానం చేసి, ఉపవసించి, మధురలో గోవిందుని జ్యేష్ఠశుద్ధ ద్వాదశినాడు అర్చిస్తాడా? అందువల్ల మేము కూడా ఇలాగే సమృద్ధులమై మా కులంలో పుట్టినవారి వల్ల  ఉద్ధరింపబడిన వారమవుతాము‘‘
అని పాడుకుంటూ ఉంటారు.
ఆలోక్యర్ధి మథాన్యేషామున్నీతానాం స్వవంశజైః 1
ఏతత్కిలోచురన్యేషాం పితరస్సపితామహాః11

ఇలాగే గయా క్షేత్రాన్ని కూడా స్మరిస్తూ పాడుకుంటూ ఉంటారు. అలాగే కురుక్షేత్రం వంటి దివ్యక్షేత్రాలలో, గంగాయమునా వంటి పుణ్యనదులు నదుల సంగమాల మాహాత్మ్యాల గురించి కూడా పితృదేవతలు పాటలుగా పాడుకుంటూ ఉంటారు.

ఈ పాటల్లో వారు చెప్పేది గమనిస్తే ‘‘మా వంశంలో ఎవడో ఒక్కడైనా సరే‘‘ అనే భావం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఎక్కువ మంది మగసంతానం కనడానికి కూడా కారణం ఇదే. అంత మందిలో ఎవరైనా ఒక్కరైనా ఫలానా క్షేత్రానికి వెళ్ళకపోతాడా? ఫలానా తీర్థంలో స్నానం చేయకపోతాడా? అక్కడ మాకు పిండప్రదానం చేయకపోతాడా అని పాడుకుంటారు. అంతేకానీ, పెద్దకుమారుడు వెళ్ళకపోతాడా అని వారు పాడడం లేదని గమనించాలి.

కనుక తీర్థవిధుల, పిండప్రదానాలు ఎవరు తీర్థయాత్రలు చేస్తే వారు చేయాలి. ఇక్కడ పెద్ద చిన్న కుమారుల అనే భేదం ఉండద‘‘ని ఆంధ్రవ్యాసుల వారు స్పష్టంగా చెప్పారు.

ఇది శాస్త్రప్రమాణమైన సమాధానం.

దీన్ని బట్టీ ఏది సత్యమే చదువరులు నిర్ణయించుకోవచ్చు.

ధర్మానికీ, ధర్మసూక్ష్మానికీ ఇంత తేడా ఉంటుంది. ఎంతో పరిశ్రమ చేసి పురాణాలు, ధర్మశాస్త్రాలు మథించి, సూక్ష్మాలు రహస్యాలు కనుగొన్నవారు మాత్రమే ధర్మసందేహాలు తీర్చాలి. కేవలం టివీ మైకు దొరికింది కదాని వాగాడంబరంతో సాగతీతస్వరంతో హ్రస్వదృష్టితో  చెబితే, అది విని శ్రోతలు ధర్మాచరణమార్గం వీడితే, అలా చెప్పిన వారికి సకలపాపాలూ చుట్టుకొని పతనం చెందుతారని వేరే ప్రత్యేకంగా హెచ్చరించాల్సిన అవసరం లేదు.
 
మరిన్ని విశేషాలు ముందుముందు తెలుసుకుందాం.
--------------------------------------
From. WhatsApp

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP