శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దెబ్బతిన్న కుటుంబవ్యవస్థ*

>> Wednesday, December 12, 2018

* దెబ్బతిన్న కుటుంబవ్యవస్థ*

అనంతసాహితి -శ్రీకూర్మపురాణం -024

ప్రార్థన:
నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్||
నమస్కృత్వాప్రమేయాయ విష్ణవే కూర్మరూపిణే|
పురాణం సంప్రవక్ష్యామి యదుక్తం విశ్వయోనినా|| (అప్రమేయుడై కూర్మరూపధారి అయిన విష్ణువుకు నమస్కరించి, విశ్వకారణుడైన (విష్ణువు) చెప్పిన పురాణం చెపుతున్నాను.)
---------------------------------
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ఉన్నత జీవన వ్యవస్థ భారతదేశంలో సనాతనులు నిర్మించారు. అదే ఆశ్రమపద్ధతి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సంన్యాసాశ్రమాలు. అద్భుతమైన ఈ వ్యవస్థ నేటి ఆధునిక కాలంలో దారుణంగా దెబ్బతింది. నేటి సకల జీవనవిధ్వంసాలకు మూలం ఈ కుటుంబవ్యవస్థ దెబ్బతినడమే. ఈ నాలుగు ఆశ్రమాలు ఏర్పరచడం వెనుక సనాతనుల దూరదృష్టి నేడు మందగించడమే సకల అనర్ధాలు కలిగిస్తోంది. యుగాలు మారినా ఈ ఆశ్రమాలు నేటికీ అత్యంత ఆవశ్యకాలు అవునా కాదా అనేది మనకు మనంగా తెలుసుకోవాలంటే కూర్మపురాణంలో చెప్పిన ఈ ఆశ్రమాల్లోని రకాలు తెలుసుకోవాలి.

బ్రహ్మచర్యం అనేది మొట్టమొదటి ఆశ్రమం. అంటే చదువుకునే కాలం. భూమి మీద ఉన్న అన్ని మానవజాతులకూ ఇది తప్పనిసరి. విజ్ఞాన శాస్త్రాలు చదువుకున్నా శిల్పకళా, చిత్రలేఖనం, చేతిపనుల వంటివి నేర్చుకున్నా ఈ సమయంలోనే నేర్చుకోవాలి. ఈ బ్రహ్మచర్యాశ్రమం ఎన్ని సంవత్సరాలు అనేదానికి ఒక సామెత ఉంది. తల్లి  చనుబాలు వదలి భార్యను చేరే లోపల చదివుకునే చదువే చదువు. కచ్చితంగా చెప్పాలంటే 21 ఏళ్ళు దాటిన తరువాత చదివేది ఏమీ ఉండదు. కేవలం మేధావులు, పరమనిష్ఠతో బ్రహ్మచర్యం అవలంబించేవారు 26 ఏళ్ళ వరకూ చదువుకోగలరు. ఆ తరువాత చదివేది కేవలం ముక్కు చివర అంటించుకుని పరీక్షల్లో చీదేసే చదువే. ఇందులోనూ 14 ఏళ్ళ లోపల చదివినది జీవితాంతం ఉంటుంది. దీని తరువాత 15 నుంచీ 21 ఏళ్ళ వరకూ చదివేది ప్రతిరోజూ మననం చేసుకుంటూ ఉంటే జీవితాంతం నిలుస్తుంది. కనుకనే చదివిన చదువును, యవ్వనంలో ఉన్న ఆడదాన్ని, సంపాదించిన డబ్బును ఏమరు పాటు లేకుండా కాపాడుకోవాలని అన్నారు.

ఇక్కడ అతి ముఖ్యమైనది భారతీయ విద్యా విధానం. పూర్వం అందరికీ 26 ఏళ్ళ వరకూ చదువులు ఉండేవి కావు. వారి వారి శక్తి, ధారణను బట్టీ చదువులు చెప్పేవారు. దాదాపు 12 నుంచీ 16 ఏళ్ళు వచ్చే సరికి వారికి తండ్రి చేసే వృత్తిలోని మెళకువలు వచ్చేసి స్వతంత్రంగా జీవించే శక్తి వచ్చేది.

దీని తరువాత వారు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేవారు. భార్యకు పిల్లలు కలిగాక వారు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక ఇటు ఇంటి జీవితానికీ అటు సంన్యాస జీవితానికీ మధ్యన ఉన్న వానప్రస్థంలోకి ప్రవేశించేవారు.

ఆ తరువాత ఆధ్యాత్మికతలో ఏర్పడిన స్థాయిని బట్టీ గురువు అనుగ్రహం దొరికితే సంన్యాసాశ్రమంలోకి వెళ్ళేవారు.

నేడు ఈ చివరి రెండు ఆశ్రమాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఆస్తులు ప్రధానం అయిపోయి, వెర్రితలల ఆస్తిహక్కులు రావడంతో కుమారుడికి 60 ఏళ్ళు వచ్చినా ఇల్లు వదలక తరువాత తరాలకు నరకం చూపించేవారు ఉన్నారు. కార్పొరోట్ కల్చర్ లోని వారికైతే షేర్ గొడవల వల్ల కుటుంబసంబంధాలు కూడా ధనాత్మకసంబంధాలు అయిపోయాయి.  ‘‘మాకు తెలుసులేవయ్యా! నువ్వు కూర్చో!‘‘ అనిపించుకుంటున్నారు. ‘‘అమ్మకు ఏం తెలుసు?‘‘ అనే కుమార్తెలు తయారు అవుతున్నారు.

నిజానికి వయసు పైబడిన వారి దగ్గర అనుభవజ్ఞానం ఉంటుంది. అందువలన వారు ప్రేమతో పిల్లలకు కష్టం కలుగకూడదని అన్నింటిలోనూ కల్పించుకుంటూ ఉంటారు. కానీ పూర్వం ఇది ఉండేది కాదు. పిల్లలు తమ జీవితాలు తాము జీవించుకోగలరు అని నిర్ధారణ అయ్యాక, గ్రామానికి దూరంగా వెళ్ళి అక్కడ నివసించేవారు. పిల్లలకు అవసరమైతే అందుబాటులో ఉండేవారు. లేదంటే తమ ఆధ్యాత్మిక సాధనల్లో తాము ఉండేవారు.

ఇక్కడ అతిముఖ్యమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. ఇదే సకల సమాజానికీ ఆధారం అయినది. బ్రహ్మచారులకు, సంన్యాసులకూ, వానప్రస్థులకు భిక్ష ఇచ్చే ఆశ్రమం.
 
త్రమాణామాశ్రమాణాం తు గృహస్థో యోనిరుచ్యతే|
అన్యే తముపజీవన్తి తస్మాచ్ఛ్రేయాన్న గృహాశ్రమీ|| అని కూర్మపురాణం అంటోంది.

అయితే నేడు దాన గుణం దారుణంగా కోల్పోయిందీ ఆశ్రమం. భిక్షకు వచ్చే విద్యార్థులు లేరు కనుక మారిన విద్యావ్యవస్థలో అది పెద్దగా లోటుగా అనిపించడం లేదు. కానీ సంన్యాసులకు కూడా భిక్ష ఇచ్చే వారు కరువు అయ్యారు. ఇందువలన సంన్యాసాశ్రమాలు పోయి బ్రాండెడ్ సంన్యాసాలు వచ్చాయి. నిజానికి ఇవి సనాతనులు ఒప్పుకొనేవారు కాదు. కానీ  కుటుంబవ్యవస్థ దెబ్బతిని గుమ్మం ముందుకు వచ్చిన భిక్షకునికి బిచ్చం వేసేవారు కూడా కరువు కావడంతో విధిలేని పరిస్థితుల్లో సంన్యాసాశ్రమాల్లో ఉండాల్సి వచ్చేది. ఇది నవీన కాలంలో మరింతగా దెబ్బతినిపోయింది. పూర్వం దానగుణం ఉన్నవారు ఆశ్రమాలకు వెళ్ళి సంన్యాసులకు దానాలు చేసేవారు. నేడు అది పూర్తిగా మరిచిపోయారు. దీంతో నేడు సంన్యాసాశ్రమాలు కూడా ఆదాయమార్గాలు చూసుకోవాల్సిన దారుణపరిస్థితులు తలెత్తుతున్నాయి. సామెత చెప్పినట్టు కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః అనేది నిజం అవుతోంది. 

కన్నతల్లితండ్రులకే ముద్దపెట్టని వారు వచ్చాక సొంతబంధువులను ఇంటిలోనికి రానిచ్చే అకాశాలు పోయాయు. కనుక ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరంగా ప్రక్కప్రక్కనే ఉన్న ఇళ్ళు తయారయ్యాయి.  ఇక భిక్షకులను కాకులు కుక్కలు కన్నా దారుణంగా చూస్తున్నారు. వీరికి తోడు అడుక్కుతినే వృత్తి ముష్టిమాఫియా చేతిలోకి వెళ్ళడంతో సమాజానికి కూడా ప్రమాదకరంగా మారిపోయింది.

నిజానికి గృహస్థాశ్రమంలోనే మూడు ఆశ్రమాలూ ఉన్నాయి. సంసారంలో ఉన్నవారు  కావాలంటే విద్యాభ్యాసం చేసే బ్రహ్మచర్యం, వానప్రస్థం మాదిరిగా ఉండడమే కాకుండా, సంన్యాసం తీసుకోకుండా వైరాగ్యాభ్యాసం చేసే సౌకర్యాలు ఉన్నాయి. కనుకనే పూర్వం గృహస్థు అంటే అందరూ పూజించేవారు. నేడు నాలుగు ఆశ్రమాలు విడిపోవడంతో ఒకరంటే ఒకరికి లక్ష్యం లేని తరాలు మొదలయ్యాయి. దీంతో వేటికి అవిగా ఈ జీవనాలు విడిపోయాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిణామం. సమాజంలో ఉన్న పరస్పరాధారమైన గొలుసులు తెగిపోయాయి.

విద్యార్ధులకు హాస్టళ్ళు, వృద్ధులకు వృద్ధాశ్రమాలు. సంన్యాసులకు బ్రాండెడ్ సంన్యాసాశ్రమాలు రావడంతో ఎవరికి వారుగా విడిపోయి ఒకేచోట ఒంటరిగా నివసిస్తున్నారు.

కేవలం కులాలతోనే గతితప్పింది అని అనుకుంటున్నవారు, జీవనపద్ధతుల్లో కూడా వచ్చిన మార్పులు గమనిస్తే మంచిది. ఇది ఎప్పటి కైనా ప్రమాదకరమైన పరిణామమే. పిల్లల హాస్టళ్ళలో మొదలైన జీవితాలు వృద్ధాశ్రమాల్లో అనాథలుగా జీవితాలు రాలిపోతున్నాయి.
జీవితాన్ని ఒక యద్ధంగా భావిస్తే, యుద్ధం చేసేవారు గృహస్థులు, శిక్షణలోని సైనికులు బ్రహ్మచారులు. యుద్ధాలలో వ్యూహాత్మకసలహాదారులు వానప్రస్థులు. ముగ్గురుకీ అతీతంగా ఉండి అందరికీ దగ్గరి వారు సంన్యాసులు. సనాతనమైన ఈ కట్టడి చెడిపోవడంతో భారతదేశం గతితప్పుతోంది.

సనాతన ధర్మంలో ఉన్న ఆశ్రమధర్మాలు మరిన్ని ముందుముందు తెలుసుకుందాం.


ఆధారం: మా గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య తెలుగులోకి అనువక్తీకరించిన శ్రీకూర్మపురాణ మూల ప్రతి.

అంకితం:  కందుకూరి శివానందమూర్తి సద్గురువులకు.

స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు
--------------------------------------------------

నిత్యభిక్షాయాచన

పురాణవిద్యాధ్యయనం, ప్రచారాన్ని వ్యాసపౌర్ణిమనాడు, మా గురుదేవులు వ్యాసునిలో ఐక్యమైన రోజు, మా మొదటి చాతుర్మాస్యదీక్ష మొదలైన రోజు అయిన ఆషాఢపౌర్ణమినాడు వారాణసిలో ప్రారంభించాము. ఇందులో భాగంగా మొదటగా వామనమహాపురాణాన్ని స్వీకరించి సామాజిక మాధ్యమం లోని పరిమితుల మేరకు సభ్యులకు అందచేయడం జరిగింది. ఈ పురాణవిద్యా ప్రచారం ఖరీదైనది. ఈ ప్రచారం వల్ల ప్రయోజనం ఉంది అనుకుంటే, సామాజిక మాధ్యమం ద్వారా కొనసాగించడానికి అనువుగా వదాన్యులను గురుదక్షిణ కోరుతున్నాము. కనుక ఆసక్తి, ఇచ్ఛ, శక్తి ఉన్నవారు గురుదక్షిణగా దానం చేసి ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించమని కోరుతున్నాము.

దానాన్ని భారతప్రభుత్వము ప్రారంభించిన భీమ్ ఆర్థిక మాధ్యమం ద్వారా చేయవచ్చును.

Anantananda@UPI
9247821505@UPI

g pay app:
swamiANANTAananda@okicici (92478 21505)
అనే అనుసంధానం ద్వారా చరవాణి ఉపయోగించి తమ విరాళములు అందచేయమని కోరు న్నాము.
దాతలు దయచేసి 9247821505కి తమ దాన వివరాలు ఎస్ ఎం ఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము.
--------------------------------------

(అనంతసాహితి వాట్సప్ బృందంలో 784 222 4469 అనే నెంబరు ద్వారా చేరి పురాణవిద్యా ప్రచారం చేయండి )
--------------------------------------------

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP