శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆడవారు నమకచమక మంత్రాలు, గాయత్రీ జపించవచ్చునా?

>> Sunday, April 15, 2018

ఆడవారు నమకచమక మంత్రాలు, గాయత్రీ జపించవచ్చునా?

ఇది నేటి ప్రశ్నకాదు. తరతరాలుగా అడుగుతున్న ప్రశ్నే, అదే పంధాలో ఎందరో మహానుభావులు సమాధాన పరిచారు కూడా. నేటి సాంకేతిక విజ్ఞానం వచ్చాక ఆ జ్ఞానవెలుగులో మరొక్కసారి మనవారు చెప్పిన విషయాన్ని పరిశీలిద్దాము.

ముందుగా మన శాస్త్రం ఏమి చెప్పింది అటుపై వచ్చిన మార్పులేమిటి అన్న విషయం చూద్దాము. మధ్యలో కొన్ని విపరీత వాదనలు కూడా వచ్చి అసలు విషయం మరుగునపడి అనవసర విషయాలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. అటునుండి స్త్రీవాదులు తయారయి ఈ మొత్తం తతంగానికి వారి వారి వక్రభాష్యాలు చెప్పి రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఉపనయన సంస్కారం ఉన్న బ్రహ్మవాదినులు ఉండేవారు, వారికి ఇవన్నీ అనుమతింపబడ్డాయి కానీ ఈ కలియుగంలో వారికి, వారి శారీరక స్థితికి నిషేధించింది శాస్త్రం. శాస్త్రం చెప్పిన కొన్ని తార్కిక  కారణాలు:

1. వేదాలు స్వర, మాత్రానుగుణంగా ఉచ్చరింపబడాలి వాటి పూర్తి ప్రభావం ప్రకటింపబడాలి అంటే. పురుషదేహ నిర్మాణానికి, స్త్రీ దేహ నిర్మాణానికి తప్పక తేడా వుంది. వారికున్న నాడీమండల వ్యవస్థ ఆడవారికి సరైన స్వరోచ్చారణకు పూర్తిగా సహకరించదు. పురుషుల వోకల్ ఫోల్డ్స్/కార్డ్స్ 17mm-25mm పొడవు వుండగా, స్త్రీలకు 12.5-17.5mm వుంటుంది, దీనివల్ల వారి pitch లో తేడా వుంటుంది. వేద మంత్రాలన్నీ ఉదాత్త, అనుదాత్త, స్వరానుగుణంగా ఆయా స్థాయిలో ఉచ్చరించడం ఈ నిర్మాణం వలన స్త్రీలకు పూర్తిగా సాధ్యపడదు.

2. ఈ వేదమంత్రాల స్వరాలు నాభినుండి పలకవలసి వస్తుంది. కావున నమకచమక మంత్రాలలో ఇటువంటి ప్రయోగాలు ఎక్కువ వుండడం వలన వాటికి పొత్తికడుపు మీద ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. వారి శరీరనిర్మాణం ప్రకారం వారికి ఇటువంటి ఒత్తిడి పెట్టడం వలన ఉచ్చారణ చెయ్యగా చెయ్యగా వారి ఋతుకాలం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

3. నేడు మనం చూస్తున్న సంగీత థెరపీ వలన రోగులలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడమూ, తక్కువ చెయ్యబడడమూ శాస్త్రీయంగా నిరూపింపబడినది. వేదము, వేదమునందలి ఈ నమక చమక మంత్రాలు ప్రధానంగా శబ్దప్రధానం. వీటి శబ్దప్రకంపనల వలన ఈస్ట్రోజెన్ తదితర హార్మోన్లపై ప్రభావం అధికంగా వుండి కాలక్రమేణా కొన్ని కొన్ని మంత్రాల వలన గర్భస్రావం కూడా జరుగుతుందని ఆడవారు ఆ మంత్రాలు వినరాదు చదవరాదు అని నియమం పెట్టారు.

4. వేదమంత్రాన్ని కొంచెం తప్పుగా చదివితే  రావలసిన ఫలితాలకు వ్యతిరిక్తంగా దుష్ఫలితాలు కలుగుతాయి. ఆడవారికి గురూపదేశం లేకుండా సరైన ఉచ్చారణ అబ్బదు, కాబట్టి వారికి వేదపఠనం, అందునా మరింత శక్తివంతమైన రుద్రాధ్యాయ, ఆదిత్య, సౌర సూక్తాలు వద్దని చెప్పారు.

5. నేటి సాంకేతిక పరిజ్ఞానం చెబుతున్న దాని ప్రకారం ఆడవారికి మెనోపాజ్ వరకు వారిని చాలా శక్తివంతమైన హార్మోన్లు కాపాడతాయి, ఒకసారి ఆ సమయం వచ్చాక వారికి ఒక్కసారి వ్యాధినిరోధక శక్తి తక్కువ అవుతుందని పరిశోధనల ద్వారా నిరూపించారు. వారికున్న రక్షణాత్మక కవచాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం కొద్దీ వారికి కొన్ని పనులు నిషేధించారు, అందులో ముఖ్యంగా ఇటువంటి వేదనాదాన్ని ఉచ్చరించడం.

6. నేటి యుగధర్మ ప్రకారం ఆడవారికి ద్విజత్వం సిద్ధించదు, ఎందుకంటె వారికి ఉపనయన సంస్కారం లేదు కనుక. కావున వారికి గాయత్రి మంత్రోచ్చారణ కానీ వేదపఠన కానీ వద్దని చెప్పారు. ద్విజులంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అన్న విషయం అందరికీ తెలుసు కదా.

7. వేదం పఠించడం వలన శరీరంలో చక్ర ఉత్తేజితం వలన, ఉచ్చారణాక్రమం వలన ఎక్కువగా ఉష్ణం ఉత్పన్నమవుతుంది. అది ఆడవారి శరీరానికి మంచిది కాదని వారిని చదవద్దని వారిస్తారు.

కొందరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినట్టు ఇందులో ఆడవారిని తక్కువగా ఎక్కడా చూడమని చెప్పలేదు. ఆడదంటే ఆదిశక్తి అని కొలిచిన ధర్మం మనది. వేదం చదవద్దని చెప్పిన  మన ధర్మశాస్త్రాలు వారికి మరెన్నో సౌలభ్యాలు కలుగచేసాయి.
1. వారు వేద వ్యాఖ్యానాలు పూర్తిగా చదివి తత్త్వం తెలుసుకోవచ్చును. మనకు పూర్వం కూడా ఎందరో నారీమణులు వేదార్ధాన్ని, వేదంగాలను నేర్చిన వైనం వినే ఉన్నాము.
2. వారు సౌందర్యలహరి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంటి ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు, వివిధ దేవతల శ్లోకాలు, దివ్యప్రబంధాలు, పురాణ ఇతిహాసాలు, భజనలు, కీర్తనలు తప్పక చదవమని చెబుతుంది శాస్త్రం
3. వారు మాత్రమె చెయ్యగలిగిన ఎన్నో శక్తివంతమైన ఫలవంతములైన వ్రతాలు చెప్పబడి ఉన్నాయి.
4. ఆత్మ విచారం ఇత్యాది గొప్ప ఆధ్యాత్మిక సాధనలు నిషిద్ధం కావు. ఇలా ఎన్నో దైవపూజలకు వారికి అధికారం వుంది.

కేవలం వేదం చదవరాదన్న నియమం వలన వారు ఏ రకంగాను కూడా పురుషులకన్నా తక్కువ స్థాయిలో చూడలేదు.  వారి శరీర భౌతిక నిర్మాణం వారికి కొన్నింటికి అధికారులుగా చేసింది, వారిని రక్షించుకోవడానికి కొన్నింటిని నిషేధించింది. ఏ రకంగా చూసుకున్నా పురుషుడు పురుడు పోసుకోలేడు, స్త్రీ పునరోత్పత్తి చెయ్యలేదు సహజంగా. కావున వారి శరీర తత్త్వం వేరు వేరని గుర్తెరగాలి, వారికి చెప్పిన పనులు చెయ్యాలి, అనువు కానివి కూడదు, కాదు కూడదని శాస్త్రం చెప్పిన దానికి విరుద్ధంగా ఎవరైనా మూర్ఖంగా ముందుకు పోతే వారి ఖర్మకు వారే బాధ్యులు కదా !!

1 వ్యాఖ్యలు:

బుచికి April 16, 2018 at 4:52 AM  

గురువుగారు స్త్రీలు దేవాలయంలో పూజలు చేయవచ్చా.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP