శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కంచి కామకోటి పీఠం నూతన పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఈరోజు

>> Wednesday, March 14, 2018

కంచి కామకోటి పీఠం నూతన పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వ్రాసిన వ్యాసం(ఆంధ్రజ్యోతి 02-03-2018 సౌజన్యం)

అఖిలం మధురం

మీ లానే... మీ పిల్లలు!
మన భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ ఆశ్రమ ధర్మం ప్రకారం దంపతులు ఒకే మాట, ఒకే బాటగా జీవితం సాగించాలి. వాళ్ళను బట్టే, వాళ్ళకు కలిగే పిల్లలూ తయారవుతారు. ఇవాళ్టి పిల్లలే రేపటి మన భవిష్యత్తు. మనకు అనాది కాలంగా వస్తున్న సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలున్నాయి. వాటిని ఈనాటి పిల్లలకు బోధిస్తూ, ధర్మం చెప్పడం ఎంతో అవసరమనేది అందుకే! అది ఎలాంటి ధర్మం అంటే- అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం ఉన్న ధర్మం. ఈ అయిదూ అందరికీ అవసరం. అయితే, వాటిని ముందుగా తల్లితండ్రులు ఆచరించాలి.


తల్లితండ్రుల ప్రవర్తనే పిల్లలకు గురువుగా మార్గదర్శనం చేస్తుంది. అలా పిల్లలకు తమ ప్రవర్తన ద్వారా నేర్పాలి. ఇలా జాతి అంతా ఐకమత్యంగా ధర్మమార్గంలో వెళితే, అప్పుడే దేశ సౌభాగ్యం. జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఇదే మార్గం. ధర్మం విషయంలో ఎప్పుడైనా, ఏదైనా సందేహం కలిగితే, ఉత్తముడైన గురువును ఆశ్రయించాలి. మామూలు మాటల్లో చెప్పాలంటే, పరోపకారమే పరమ ధర్మం. వృద్ధులను సేవించడం, తోటివారిని ప్రేమించడం, ఆపదలో... అవసరంలో... ఉన్నవారిని ఆదుకొనడం... ఇంతకు మించి వేరే ధర్మం ఏముంటుంది! ఇలాంటి ధర్మాచరణ వల్ల మనుషులు బాగుంటారు. మనుషులు బాగుంటే, జీవితం బాగుంటుంది. చుట్టుపక్కల అందరి జీవితం బాగుంటే, సమాజం బాగుంటుంది. అంటే మన దేశం బాగుంటుంది.

చిరస్మరణీయం
ప్రతి ఒక్కరికీ, వారి జీవితంలో మేలిమలుపుగా నిలిచిపోయే, బాగా గుర్తుండిపోయే రోజు ఒకటి ఉంటుంది. నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అలాంటి రోజు 1983 మే 29వ తేదీ. ఆ రోజున మా గురుదేవులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీ చేతుల మీదుగా నేను సన్న్యాస దీక్ష తీసుకున్నాను. దివ్యస్వరూపులైన నా గురువు నన్ను అక్కున చేర్చుకొని, పక్షి తన పిల్లను సాకినట్టు నన్ను సాకడం నా భాగ్యం! వెనక్కి తిరిగి చూసుకుంటే మా గురువుగారి సన్నిహిత సాహచర్యంలో నేను గడిపిన సంవత్సరాలు కనిపిస్తున్నాయి.

అయస్కాంతం ఇనుప రజనును లాగినట్టు నన్ను ఆయన తన వైపు ఆకర్షించుకున్నారు. చాలా సన్నిహితంగా ఉంటూ నేను ఆయనలో గమనించిన గొప్ప గుణాల గురించి వ్యక్తపరచడానికి నా దగ్గరున్న మాటలు సరిపోవు. ‘‘‘శ్రీమఠం’ (కంచి కామకోటి పీఠం) కోసం మీ గురువు (జయేంద్ర సరస్వతి) చేసిన సేవలు మరెవరూ చెయ్యలేరు’’ అంటూ పరమాచార్య (శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి) నాతో అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. అవి ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. నా గురువు బహుముఖీనమైన వ్యక్తి. శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ వల్లభాచార్య రచించిన శ్లోకం ఒకటుంది.

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురం

ఇదే విధంగా మా గురువుగారి ప్రతి లక్షణాన్నీ నేను గణించినట్టయితే, ఆయన సర్వ సద్గుణాల రాశిగా దర్శనమిస్తారు. ఆయనను విశ్వంలో విశిష్ట వ్యక్తిగా చేసిన కొన్ని లక్షణాలను చెప్పాలనుకుంటున్నాను.

శ్రీ ఆది శంకర భగవత్పాదులు రెండువేల అయిదువందల సంవత్సరాల కిందట స్థాపించిన ‘శ్రీ కంచి కామకోటి పీఠం’ అధిపతిగా అత్యున్నతమైన పదవిని నిర్వహిస్తున్నప్పటికీ పూజ్య గురువులు చాలా నిరాడంబరంగా, ఎల్లప్పుడూ చిరునవ్వు తొణికిసలాడే మోముతో ఉండేవారు. ఎవరైనా ఆయనను చాలా సులభంగా కలుసుకోవచ్చు. తన భక్తుల జీవితాల్లో సమస్యలను ఆయన చాలా ఓపికగా వింటారు. పరిహారాలతో పరిష్కారాలు సూచిస్తారు. వారిని ఆశీర్వదిస్తారు. తనకు అసౌకర్యం కలిగినా లెక్క చెయ్యకుండా దర్శనం వారికి ప్రసాదిస్తారు. తన దగ్గరకు వచ్చినవారెవరినీ ఆశాభంగంతో తిరిగి వెళ్ళనివ్వరు. భగవంతుడికి అనేక నామాల్లో అచ్యుతుడనేది ఒకటి, ‘తన దగ్గరకు చేరిన వారిని తన చేతుల నుంచీ విడవని వాడు’ అని దాని అర్థం. సరిగ్గా మా గురుదేవులు అలాంటివారే!

మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌కు పాఠం
మా పూజ్య గురువులు నడిచే విజ్ఞాన సర్వస్వం. సూర్యుడి వెలుగు పడేవాటిలో ఆయనకు తెలియని విషయం ఏదీ లేదు. మంచి విషయాలను ఆయన గౌరవించేవారు. అవి ఎక్కడున్నా వాటిని గుర్తించేవారు, అభినందించేవారు. ఆయన నైపుణ్య నిర్వహణ (స్కిల్‌ మేనేజ్‌మెంట్‌) మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విద్యార్థులకు ఒక పాఠ్య పుస్తకం లాంటిది. ఆయన కచ్చితమైన ప్రణాళిక, దేనినైనా జాగ్రత్తగా అమలు చేయడం లాంటివి అనుసరించాల్సిన పాఠాలు. అలాగే సాగతీతలేవీ లేకుండా, ఆయన త్వరగా నిర్ణయాలు తీసుకొనేవారు. ఉదాసీనత, ఉపేక్ష అనేవి ఆయన నిఘంటువులో లేని పదాలు. సరైన ఫలితాల కోసం సరైన పనిని సరైన వ్యక్తికే ఎప్పుడూ ఆయన అప్పగించేవారు. గురువు గారి కరుణకు ఎల్లలు లేవు.

ఆది శంకరుల అడుగుజాడల్లో...
‘వేదో నిత్యం అధీయతామ్‌!’ - వేదాలను ప్రతిరోజూ అధ్యయనం చేయాలని ఆదిశంకరులు చెప్పారు. వేదాలపైనా, వేద విద్యార్థులపైనా మా గురువుగారి అనురాగం మాటలకు అందనిది. అధ్యయనం గురించీ, చదువుల్లో వారు నిమగ్నం కావడానికి ప్రోత్సాహకంగా సమకూర్చే సౌకర్యాలూ, ఇతర అవసరాల గురించీ విద్యార్థులను ఆయన వాకబు చేసేవారు. వేద పండితులను సత్కరించేవారు. వేద భాష్యం అధ్యయనం చేయా లని వారిని ప్రోత్సహించేవారు. ఆది శంకరుల అడుగు జాడలను పూజ్య గురువులు మనసా వాచా కర్మణా అనుసరించారు. ఆది శంకరులు తన కాలంలోని అన్ని శక్తులనూ ఏకం చేశారు. మా గురుదేవులు వివిధ వర్గాల ఐక్యతకు కేంద్రశక్తిగా నిలిచారు. దేశంలో భిన్నత్వంలోని ఏకత్వాన్ని స్థిరంగా నిలపడానికి కృషి చేశారు. ఆది శంకరుల తరువాత కైలాస పర్వతం దగ్గరకు పీఠం నుంచి వెళ్ళింది మా గురువుగారే! ఆ పర్వత పాదాల దగ్గర ఆది శంకరుల విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. 51 శక్తి పీఠాలు, ఏడు మోక్ష పురాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు... ఇలా దేశంలోని పుణ్య స్థలాలన్నిటినీ ఆయన దర్శించారు. ఏడు పవిత్ర నదులతో సహా పుణ్య నదులన్నిటిలో స్నానం చేశారు.

ఆయన అంచనా అద్భుతం!
ఆయన గురుభక్తి సుప్రసిద్ధం. తన గురువు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామీజీ ఏది కోరినా, దాన్ని తప్పనిసరిగా నెరవేర్చారు. మా గురుదేవులు రచించిన వేదాంత గ్రంథం ‘గురుప్రియ’ అత్యుత్తమమైనది. పరిస్థితులను మదింపు చేయడంలో, ఒక వ్యక్తిని అంచనా వేయడంలో, రాబోయే వాటిని గ్రహించడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. ఆయన అనుసరించదగిన ఆదర్శప్రాయులు. ఇతర మతాల గురువులు ఆయన పట్ల చూపించే గౌరవం, మన్నన ఆయన గొప్పతనానికి రుజువు. ఆయన దృక్పథం ఏ ఒక్క ప్రాంతానికో సంకుచితం కాలేదు. అది ప్రపంచానికీ, ప్రత్యేకించి ఈ దేశానికీ సంబంధించినది. గురుదేవుల ఆలోచన, కార్యక్రమాలూ ఎల్లప్పుడూ దేశ సమగ్రత కోసం ఉద్దేశించినవే.

అదే నాకు భిక్షా వందనం!
కంచి పీఠం పెద్ద స్వామీజీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇప్పటికి 64 ఏళ్ల క్రితం తన ఉత్తరాధికారిగా జయేంద్ర సరస్వతిని ఎంపిక చేశారు. అప్పటికి జయేంద్ర సరస్వతి (పూర్వాశ్రమ నామం సుబ్రమణియం మహదేవ అయ్యర్‌) వయసు 19 ఏళ్ళే! అది జరిగింది 1954లో! ఆ ఏడాది మార్చి 22వ తేదీన పెద్ద స్వామి తన శిష్యుడికి సన్న్యాస దీక్ష నిచ్చి, కంచి కామకోటి పీఠానికి తన ఉత్తరాధికారిగా, చిన్న స్వామీజీగా పీఠారోహణ జరిపించారు. కాంచీపురంలోని సర్వతీర్థ కుళం (ఆలయ కోనేరు) ఒడ్డున విశ్వేశ్వర ఆలయంలో ఉత్సవం చేశారు. సరిగ్గా ఆ ఉత్సవం జరిగి, 54 పూర్తి అవుతున్న సందర్భంగా 2003లో భక్తులందరూ కలసి ‘పీఠారోహణ స్వర్ణజయంతి మహోత్సవం’ ప్రారంభించారు. అయితే, వారందరూ బలవంతాన జయేంద్ర సరస్వతీ స్వామిని ఆ ఉత్సవానికి అంగీకరింపజేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు... ‘‘నేను 50 ఏళ్ళుగా ఉన్నాను అనేది పెద్ద విషయం కాదు. ప్రజల కోసం ఏం చేశామన్నదే ముఖ్యం.’’ జనం కోసం ఏదైనా చేయాలనే ఆయన తపన అలాంటిది. అలాగే, పీఠారోహణ జరిపి 60 ఏళ్ళయిన సందర్భంగా 2014లో భక్తులు వజ్ర మహోత్సవం జరపాలని అనుకున్నారు. అప్పుడు కూడా జయేంద్ర సరస్వతీ స్వామి ఒకటే షరతు పెట్టారు. ‘‘బీదసాదల ఆకలి తీర్చాలి. అవసరంలో ఉన్నవారి బాగోగులు చూడాలి. నిరక్షరాస్యులకు విద్యను అందించాలి. ఎవరికి వారు రోజూ తమ జీవనానికి కావాల్సిన సంపాదన ఆర్జించేలా, వారిని స్వశక్తులను చేయాలి. గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడాలి. మీ కృషి, ప్రయత్నాల ద్వారా అలా వారు తినే ప్రతి అన్నం ముద్దా మీరు నాకు సమర్పించే భిక్షా వందనం!’

గణపతి అంశ
మరో సందర్భంలో కొందరు తాము ప్రారంభించే నూతన కార్యక్రమానికి ఆశీస్సుల కోసం మహా స్వామి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన, ‘పుదు పెరియవాళ్‌’ వద్దకు వెళ్ళి, ఆశీస్సులు తీసుకోండని చెప్పారు. జయేంద్ర సరస్వతీ స్వామి... సాక్షాత్తూ గణపతి అంశ. అందుకని మీరు కనీసం ఓ రూపాయి అయినా ఆయనకు అందించి, ఆయన చేతుల మీదుగా ఆ రూపాయి తీసుకొని, ఆశీస్సులు పొందండి. అందువల్ల మీకు విఘ్నాలన్నీ తొలగిపోతాయిు అని మహా స్వామి చెప్పారు.

దశావధాని
కంచి మహా స్వామీజీ తన శిష్యులైన జయేంద్ర సరస్వతీ స్వామి శక్తిసామర్థ్యాలను వివిధ సందర్భాల్లో మెచ్చుకున్నారు. ఓ సందర్భంలో ఓ భక్తుడితో మాట్లాడుతూ, ‘‘నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వస్తే, నీతో మాటలు ఆపేసి, వాళ్ళతో మాట్లాడడం మొదలుపెడతా. అలా చాలాసేపు మాట్లాడుతుండే సరికి, దర్శనం కోసం నిరీక్షించే భక్తుల క్యూ పెరిగిపోతుంది. కానీ, ‘పుదు పెరియవాళ్‌’ (కొత్త పెద్ద స్వామిజీ... అంటే జయేంద్ర సరస్వతి) మాత్రం ఏకకాలంలో పది వేర్వేరు పనులు చేయగల ‘దశావధాని’. ఆయన ఒక పక్కన భక్తులకు ప్రసాదం ఇస్తూనే, మరోపక్క కొందరు భక్తులు వేసే ప్రశ్నలకు సమాధానం చెబుతారు. నేను అలా చేయలేకపోతున్నా’’ అన్నారు. అలా మహా స్వామి తన శిష్యుడి సామర్థ్యాలను మెచ్చుకున్నారు.గురుప్రియులు
గురుభక్తికి ఉత్తమ నిదర్శనంగా నిలుస్తారు... బుధవారం నాడు సిద్ధి పొందిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామిజీ. గురువు గారైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామీజీ (కంచి మహా స్వామి) పట్ల ఆయనకున్న భక్తి అంతా ఇంతా కాదు. పెద్ద స్వామీజీ ఎప్పుడూ... తాను ‘ఇచ్ఛాశక్తి’ అయితే, తన శిష్యుడైన జయేంద్ర సరస్వతీ స్వామీజీ ‘క్రియాశక్తి’ అని పేర్కొనేవారు. అచంచల శ్రద్ధాభక్తులున్న శిష్యుడిగా గురువు గారి ప్రతి ఇచ్ఛనూ జయేంద్ర సరస్వతీ స్వామి నెరవేర్చారు. అందుకే, పెద్ద స్వామీజీ అలా ప్రస్తావించేవారు. పీఠాధిపతి అయిన తరువాత జయేంద్ర సరస్వతి తమ గురువు గారి కోరిక మేరకు బ్రహ్మసూత్ర భాష్యంపై ఒక గ్రంథం రాశారు. దానికి ‘గురుప్రియ’ అని పేరు పెట్టారు. బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యంలోని సత్యాలను వివరిస్తూ సాగిన ఆ వ్యాఖ్య అత్యద్భుతమైనదని మహా పండితులు సైతం ప్రశంసించారు. ఎంతో స్పష్టంగా, క్లుప్తంగా, సముచితంగా సాగే గ్రంథం అది. మననం (ధ్యానం)లో గడిపే విద్యార్థులకు ఆ గ్రంథం ఒక మంచి పునశ్చరణగా ఉపకరించే రచన.

ఆ ఘనత ఆయనదే!
మన సంప్రదాయం, సంస్కృతి పట్ల ఆయన విశ్వాసం లోతైనది. మన సంస్కృతిని ప్రచారం చెయ్యడానికి అధునాతన శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించేవారు. ఇది ఆయనను పాతకూ, కొత్తకూ మధ్య ఒక గొప్ప వారధిగా నిలబెట్టింది. ప్రధానంగా చెప్పుకోవలసింది- సామాజిక పునరేకీకరణ పట్ల ఆయన దృక్పథం. గతంలో హిందూయిజం వ్యక్తి ఆధారితంగా ఉండేది. పునర్జన్మ లేని ఒక స్థితిని అందుకోవడానికి ఆధ్యాత్మిక పరంగా వ్యక్తి ఎదగాలని చెప్పేది. ‘జనకల్యాణ్‌-జనజాగరణ్‌’ ఉద్యమం ద్వారా జన సముద్ధరణ కోసం సమాజం గుమ్మం దగ్గరకు హిందూ మతాన్ని తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ‘మానవసేవే మాధవ సేవ’ అని హృదయపూర్వకంగా నమ్మి, అన్ని వర్గాలకూ, సమాజానికీ సేవలు అందించడం ముఖ్యమని ప్రజలు గ్రహించేట్టు చేయాలని ఆయన ప్రయత్నించారు. ఇది ఆయన సేవల్లో శిఖరాయమానం!

1 వ్యాఖ్యలు:

sam March 15, 2018 at 12:04 AM  

dear sir very good blog and very good content
Latest Telugu Cinema News

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP