శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సౌశీల్యం అంటే ఏమిటో అర్థం కాక,

>> Tuesday, March 13, 2018

సౌశీల్యం అంటే ఏమిటో అర్థం కాక, దానికుండాల్సిన లక్షణాలెలా వుంటాయో దానికోసం  ఏ ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలనో అని అనుకునే వాడిని, కాని సౌశీల్యం అనేది ఒకే ఒక్క లక్షణం మీద ఆధారపడి వుంటుందన్న విషయం అదృష్టం కొద్దీ తెలిసింది.
ఆ ఒక్క లక్షణమే "మాట మీద నిలబడడం".
రాముడి తర్వాత చక్కగా సౌశీల్యం కనపడేది ఒక్క భీష్ముడిలోనే.
ధర్మ పరిరక్షణం కోసం  ’నిత్య సంఘర్షణ’ భీష్మునిది .
జీవితమంతా కష్టాలే.  అయినా ఎక్కడా నిరాశని, కర్తవ్యవిముఖతని దరిజేరనీయక, విరక్తికీ, వైరాగ్యానికి ఉండే తేడాని స్పష్టంగా చూపిన అవిశ్రాంత వైరాగ్యం భీష్మునిది.
అంతా తనవారైనా, తామరాకుపై నీటిబిందువులా ’సమూహంలో ఏకాంతం ’ భీష్మునిది.
తనవారు తనకేం చేసారన్న కనీస స్పృహ కూడా లేకుండా, నిరంతరం తనేంచేయాలో ఆలోచించే ’నిజమైన పెద్దరికం ’ భీష్మునిది.
కనీసం తన ఆక్రందనని కూడా ఎవ్వరిదగ్గరా వెలిబుచ్చుకోని సంపూర్ణ ’ఆత్మనిర్భరత’ భీష్మునిది.
ప్రతిజ్ఞ అంటే  'భీష్మప్రతిజ్ఞ' అనేలా ప్రతిజ్ఞకే వన్నెతెచ్చిన ఆదర్శం జీవితం భీష్మునిది.
అయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణున్ని సైతం ఆయుధం పట్టేలా చేసిన ’ధీరత్వం ’ భీష్మునిది.
భగవాన్ పరశురాముని శిష్యునిగా కదనరంగం లో సాక్షాత్ శివునిసైతం ఎదురొడ్డి నిలబడగల ’పరాక్రమం’ భీష్మునిది.
ధర్మం కోసం గురువు పరశురామునితోనే తలపడి విలువిద్యలో గురువుతోనే మెప్పు పొందిన ’గొప్పతనం’  భీష్మునిది.

అర్జునుడంతటి వాడు తనని చంపలేక, శారీరకంగా, మానసికంగా అలిసి, తననే శరణు వేడిన అర్జునినికి తన మరణరహస్యాన్ని, వాత్సల్యం తో తనే చెప్పుకున్న ’త్యాగం’ భీష్మునిది.
ధర్మరాజే  ఉత్కృష్టమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవడానికి భీష్మున్నే శరణు వేడిన ఉత్తమమైన ’ధర్మ పరాయణత్వం’ భీష్మునిది..
స్త్రీ ని శతృవుగా చేసుకున్నాకూడా ’చిరంజీవి గా మృత్యువుని శాసించి, మృత్యువుని వాయిదా వేయగలిగిన ’ వీరత్వం భీష్మునిది.

కుళ్ళిన శవాలతో ,
స్మశాన సమానంగా మారిన కురుక్షేత్రంలో,
దుమ్ము ధూలిలో,
పగలూ  రేయిలో,
ఆపాదమస్తకం ఆయిధ గాయాలతో,
శరీరమంతా శరాలతో,
ఆరునెలల అంతిమ గడియలు,
పశ్చాత్తాపం తో పరితపించిన ’పరిణతి’ భీష్మునిది.

విష్ణువు ముందే  విష్ణువు  ఆధ్వర్యంలోనే పాండవులకి  ’విష్ణుసహాస్రనామాన్ని’ భొధించిన ’ఘనత’ భీష్మునిది.
ఎలా జీవించాలో మాత్రమే కాకుండా ఎలా మరణించాలో కూడా నేర్పిన ’సచ్చరిత్ర ’ భీష్మునిది.

ఆ విశిష్ట ధర్మ పరాయణుని అడుగుజాడలు సదా నా మదిలో.... అలాంటి పెద్దల పాద ధూలి సదా నా శిరస్సు పై ఉండును గాక.

-సత్య

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం March 14, 2018 at 8:41 PM  

"రాముడి తర్వాత చక్కగా సౌశీల్యం కనపడేది ఒక్క భీష్ముడిలోనే."

చాలా పెద్దగంతు వేసారే!

రామాయణం లోనే మీకు భరతలక్ష్మణులలో సౌశీల్యం కనిపించలేదా?
వానరుడు కాబట్టి మీరు పరిత్యజించకపోతే హనుమంతుడి సౌశీల్యం ఎన్నదగినది కాదా?
లింగవివక్ష చూపకపోతే సీతమ్మవారి సౌశీల్యం కూడా మీరు చెప్పుకోవాలి కదా. అసలు రామాయణమే సీతాయా శ్చరితం మహత్ అన్నారు వాల్మీకుల వారు.

భారత కాలంలోని వచ్చినా భీశఃముడొక్కడే అనటం కొంచెం అతిశయోక్తి అనే చెప్పాలి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP