శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కంచె దాటిన ఐలయ్య

>> Saturday, September 23, 2017

కంచె దాటిన ఐలయ్య

కంచె ఐలయ్య రాసే రాతలు చూస్తుంటే భారత జాతీయ సమగ్రతను
దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ రాతలు రాస్తున్నాడా అనే అనుమానం
కలుగుతోంది. భారత్ కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు పన్నే కుట్రల్లో
ఆయనో పావుగా మారాడా? ప్రముఖ రచయిత రాజీవ్
మల్హోత్రా...అమెరికా-యూరోప్ కేంద్రంగా భారత్ కు వ్యతిరేకంగా
జరుగుతున్న కుట్రలపై ఆయన గత కొన్నేళ్లుగా పరిశోధనలు
చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటి తాలూకు సమగ్ర వ్యాసాలను
ప్రచురిస్తూనే ఉన్నారు. ద్రావిడ, దళిత ఉద్యమాల్లో పాశ్చాత్య
దేశాలకు చెందిన సంస్థల జోక్యాలు, క్రైస్తవ మిషనరీలకు
ధనసాయంపై ఆయన విస్తృత పరిశోధనలే చేశారు. తన పరిశోధనకు
సంబంధించిన అన్ని వివరాలపై ఆంగ్లంలో బ్రేకింగ్ ఇండియా
పేరుతో ఓ గ్రంథం కూడా ప్రచురితమైంది. ఇదే గ్రంథాన్ని
తెలుగులో భారత దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాల పేరుతో
తెలుగులో ఎమెస్కో వారు ప్రచురించారు కూడా..! ఈ పుస్తకాన్ని
అధ్యయనం చేస్తే..., వర్శిటీల్లో తిష్టవేసిన కొంతమంది
ప్రొఫెసర్లు..., ఈ ప్రొఫెసర్లను అపార మేధావులుగా ప్రమోట్ చేస్తూ
వారికి ఫెలోషిప్పులు పడేసే సోకాల్డ్ ఎన్జీవో సంఘాలు, వారికి
వంతపాడే కొన్ని చానెళ్లు..., పత్రికలు, పబ్లిషర్లు, ఇదంతా ఓ చైన్
సిస్టమ్ లా  మన దేశంలో పెనవేసుకుపోయిందనే భావన
కలుగుతోంది.

ఇప్పటికే మన దేశంలో ఆఫ్రో దళిత్ ప్రాజెక్ట్ పేరుతో మిషనరీ
ఎన్జీవోలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయని తెలుస్తోంది.
ఇప్పుడు విదేశాల్లో క్రమంగా చర్చికి వెళ్తున్నవారి సంఖ్య రోజు
రోజుకి తగ్గిపోతూనే ఉంది. దాంతో పాటు చాలా మంది పాశ్చాత్య
మేధావులు సైతం హిందూ ఆలోచన విధానానికి ఆకర్షితులు
అవుతున్నారు. ఇది మిషనరీలకు మింగుడుపడని అంశం..! దాంతో
క్రైస్తవ మిషనరీలు..., ఈ మధ్య కాలంలో చేపట్టిన చర్యలు
చూస్తుంటే మొత్తం హిందూ ధార్మిక జీవన విధానాన్నే పెకిలించి
వేసేలా కుట్రలు మొదలు పెట్టాయనిపిస్తోంది. ఇలాంటి కుట్రలకు మన
దేశంలోని మార్క్స్, మెకాలేవాద మేధావులతోపాటు, వర్శిటీల్లో
తిష్టవేసిన కొంతమంది ప్రొఫెసర్లను వాడుకుంటున్నారనే
అనుమానాలు ఉన్నాయి. వారి రచనలను స్పాన్సర్డ్ చేయడం
చూస్తూంటే ఇలాంటి డౌట్ రావడం సహజం. అలాంటి మిషనరీల
స్పానర్డ్ రచయితల్లో కంచె ఐలయ్య కూడా ఒకడిగా
అనుమానించాల్సి వస్తోంది.

దళిత్ ఫ్రీడం నెట్ వర్క్ ( డీఎఫ్ యన్)

ఇది అమెరికాలో కొలొరాడో నుంచి పనిచేసే సంస్థ. దీన్ని భారతీయ
దళితుల పక్షాన పోరడటానికి , అమెరికా అధికార కేంద్రాల విధాన
నిర్ణయాలు ఏర్పడటానికీ నడిపే సంస్థలకు దీన్ని ఉదాహరణగా
పేర్కొనవచ్చు! ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధిపతి డాక్టర్
జోసెఫ్ డిసౌజా దీనిని 2002లో స్థాపించారు. ఇందులో ట్రెంట్
ఫ్రాంక్స్ అనే మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు , ఇంకొకరు మూడీ
బైబిల్ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యక్షుడు, అలాగే క్రిస్టియన్ రాక్ గ్రూప్ కాడ్
మాన్స్ కాల్ కు చెందిన లాడ్ సింగర్. ఈ బృందం పాడే ఒక పాట
మదర్ ఇండియా..., బైబిల్ లో చెప్పిన ఈడెన్ ఉద్యానవనంలోని
సర్పం భారతదేశంలోని కష్టాలకు కారణమని చెబుతుంది. ఇంకా
చాలా మందే ఉన్నారు. వీరంతా క్రైస్తవ మిషనరీ నెట్ వర్క్ లో
పనిచేసేవారే..! ( భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు. పేజీ
157-175)

దళిత్ ఫ్రీడం నెట్ వర్క్ చేసే పనులు చాలానే ఉన్నాయి. వాటిలో
ఒకటి దళిత కార్డును ఉపయోగించుకుని క్రైస్తవ మతం ప్రచారం
చేయడం. ఇంకా సేవ చేసే ముసుగులో ఎన్జీవోలను ఏర్పాటు
చేయడం...వాటి ద్వారా దేశంలోని  వివిధ రంగాల్లో ప్రవేశించడం.
మిషనరీల కుట్రలకు అనుబంధంగానే...కంచె ఐలయ్య పని
చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతాయి. మొదట్లో ఆయన
నేను హిందువునెట్లయిత? అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశాడు. ఆ
తర్వాత దాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఈ పుస్తకానికి విదేశీ
నిధులతో నడిచే ఎన్జీవో సంఘాలు, ఇంకా వర్శిటీల్లోని కొంతమంది
ప్రొఫెసర్లు పనిగట్టుకుని ప్రచారం కల్పించారు. దళిత్ ఫ్రీడం నెట్
వర్క్ అయితే తన పరపతిని ఉపయోగించి
ఐలయ్య రాసిన ఈ పుస్తకానికి అమెరికాలోని చాలా
విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథం చేసింది. అంతేకాదు పోస్ట్
డాక్టోరల్ ఫెలోషిప్ ను కూడా ప్రదానం చేసింది.  ఇంకా క్రిస్టియన్
టుడే అనే పత్రిక అయితే కంచె ఐలయ్య ను గొప్పమేధావంటూ
ప్రపంచానికి చాటింది. టెక్సాస్ లోని క్రైస్తవ సంస్థ గాస్ఫెల్ ఫర్
ఏషియా అనే సంస్థ... ఐలయ్యను అమెరికాకు ఆహ్వానించింది.
అలాగే విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సౌత్ ఏషియా
కాన్ఫరెన్స్ ఆయన చేత మాట్లాడించారు. ఈ మధ్యకాలంలో
ఐలయ్య మరొక పుస్తకాన్ని కూడా రాశాడు. అది
"హిందూమతానంతర భారత దేశం". హిందూ ధర్మానికి
బ్రాహ్మణులకు ముడివేసి... వారి ఆచారాలను తూలనాడుతూ,
అవహేళన చేస్తూ..., ఈ ప్రపంచంలో సమస్యలన్నింటికి
హిందుత్వమే కారణమని తప్పుడు వాదనలు చేశాడు...ఇంకా
చేస్తూనే ఉన్నాడు కూడా..!  

ఇప్పుడు తాజాగా రూటు మార్చిన ఐలయ్య...బ్రాహ్మణులను
వదిలి ఆర్య వైశ్యులపై పడ్డాడు. వారిని స్మగ్లర్లుగా పోల్చాడు.
"సామాజిక స్మగ్లర్లు.. కొమటోళ్లు" అనే పుస్తకాన్ని రాశాడు.
దాంతోపాటే హిందూ జీవన విధానంలోని బీసీ, ఎస్సీ వర్గాలను
దూరం చేసేందుకు పొంతనలేని కట్టుకధలు సృష్టిస్తున్నాడు. వాటిని
వర్శిటీల్లోని తన అనుచర గణం చేత ప్రచారం చేయిస్తున్నాడు. పైకి
ఐలయ్య..., దళిత బహుజనవాదం పేరు చెప్పినా...ఆయన
అంతర్గత అజెండా మాత్రం..., ఈ వర్గాలు అన్నింటిని క్రైస్తవానికి
దగ్గరగా చేయడం, వారిని మాతంతాతీకరణ చేయడమనే కుట్ర
దాగుందనిపిస్తోంది.

గతంలో ఐలయ్య తను ఒక కురుమ గొల్లగా..., యాదవ్ గా
పరిచయం చేసుకునేవాడు. ఈ మధ్యకాలంలో తెరపైకి షఫర్డ్ అనే
కొత్త పదం వెలుగులోకి తెచ్చాడు. గొల్ల కురుమలు అందరూ తమ
పేరు చివరన షఫర్డ్ పెట్టుకోవాలని ఈయనగారు చెబుతున్నారు.
షఫర్డ్ అని పాశ్చాత్య దేశాల్లో ఎవరిని పిలుస్తారో అందరికి బాగా
తెలుసు..! ఎందుకంటే కంచె ఐలయ్య తన సొంత ఊళ్లో కట్టించిన
ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరు కూడా గుడ్ షెఫర్డే..! గుడ్ ఫెఫర్డ్
అంటే జీసస్ క్రైస్ట్..! ఇది స్వయంగా క్రైస్తవ మిషనరీలు
చెప్పేమాట..!

అంతేకాదు సరిగ్గా హిందూ పండుగల రోజున వివాదాలు
సృష్టించడం వెనుక కూడా ఐలయ్య సృష్టించిన తప్పుడు
వితండవాదాలే ఎక్కువగా కనిపిస్తాయి. దీవపాళి, దసరా,
శరన్నవరాత్రి, గణేశ్, రామనవమి ఉత్సవాలను సైతం ఆయన
వివాదాస్పదం చేశారు.దళిత్స్ వర్సెస్ హిందూ పండుగలు మార్చే
ఈ కుట్రలో ఎన్జీవో సంఘాలతోపాటు కొన్ని మీడియా సంస్థలు
కూడా భాగం అయ్యాయాని వాటి చర్యలను చూస్తుంటే ఇట్టే అర్థం
అయిపోతుంది. హిందువుల్లోని అన్ని వర్గాల ప్రజలు కలిసి
మెలసి..., సంతోషంతో పండుగలు జరుపుకునే రోజునే.. కావాలని
వివాదాస్పదం చేస్తున్నారు. దాంతోపాటు ఆయన వాదనలకు
వంతపాడే కొన్ని మీడియా సంస్థలు కూడా అదే రోజునే
వివాదాస్పద బిజీలు, టైటిల్స్  పెడుతూ.., చర్చలు చేస్తూ
హిందువుల సెంటిమెంట్ తో ఆడుకుంటున్నాయి. అంతేకాదు ఈ
చర్చల్లో ప్రముఖంగా పాల్గొనేది కూడా కంచె ఐలయ్యనే..!

తనపై వస్తున్న విదేశీ క్రైస్తవ మిషనరీల ఏజెంట్ ముద్రను
తొలగించుకునేందుకా అన్నట్లుగా... ఈ మధ్యకాలంలో ఆయన
బౌద్ధాన్ని తెరపైకి తెస్తున్నాడు. తనకు బుద్ధుడు అంటే చాలా
ఇష్టమని కూడా పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు.
బుద్ధభగవానుడు చెప్పిన ఏ సూత్రాన్ని కూడా ఆయన పాటించడని
అనిపిస్తుంది. బుద్ధుడు దయాసముద్రుడు. సర్వ మానవాళిని
సమానంగా భావించాడు. అష్టాంగ మార్గంతో కోరికలను
జయించవచ్చని చెప్పాడు. అహింస, దయ, ప్రేమ, సత్యం వంటి
నీతి నియమాలతో మానవుడు తనను తాను ఉద్ధరించుకోవాలని
తెలిపాడు. సర్వం దుఃఖం.., సర్వం అనంతం..., సర్వం శూన్యం-
అనేవి బౌద్ధమత ప్రధాన సూత్రాలు..! కానీ ఈ ఐలయ్యగారు జీవ
హింసను ప్రోత్సహిస్తాడు. అందులో గోవధ, బీఫ్ ఫెస్టివల్స్ కు
వంతపాడుతాడు...!  ఇది ఐలయ్య అసలు నైజం.! ఇప్పటికైనా
హిందూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇలాంటి వారిపట్ల
అప్రమత్తంగా ఉండాలి.

- వనకళ్ల బీరప్ప కురుమ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP