శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూజ ఎవరు చేయాలి ? ఎందుకు చేయాలి ?:

>> Sunday, December 18, 2016

పూజ ఎవరు చేయాలి ? ఎందుకు చేయాలి ?:  [పూజ్యగురువుల ప్రవచనాలనుండి ]

వారు వీరను బేధములేక, వర్ణ, వర్గము తేడాలేక, వయసు లింగబేధము లేక కుల, మత బేధములేక ఎవరైనా గురుముఖతః పూజా విధానమును అభ్యసించి కానీ లేదా వారి వారి గృహములలో వారి పెద్దలు చేయుచున్న విధముగా కానీ పూజాది కార్యక్రమములను చేసుకొనవచ్చును. పరమాత్మ(భగవంతుడు) అందరివాడు ఇందులో ఎలాంటి సందేహమూలేదు.

చూచే వారికొరకు వారి ప్రశంసల కొరకు (అబ్భ వారు ఒక గంట లేదా రెండు గంటలసేపు ఎంత సేపైనా,ఏకధాటిగా పూజ చేస్తారండి) చేయు పూజ నిరుపయోగము. అందుకే శ్రీ త్యాగరాజస్వామి గారు “ మమతా బంధనయుత నరస్తుతి సుఖామా, రాముని సన్నిధి చాలా సుఖమా, నిజముగతెల్పుమో మనసా” అని ప్రార్ధన చేస్తారు. కావున పూజను త్రికరణశుద్ధిగా, మనో, వాక్కాయ, కర్మలతో, అనగా మనస్సును, నోటిమాటను, మరియు చేతలను, ఒకటిగా అనుసంధా నము చేసి పూజ చేయాలి. మన ఉద్ధతి కొరకు భగవంతుని ప్రీతి కొరకు చేయాలి కానీ ఇతరుల ప్రశంసలకొరకు కాదు. నరులమెప్పు కొరకు ఏది చేసిన ఎన్ని చేసినా వృధానే, అదే నారాయణునిమెప్పు కొరకు ఒక్కటిచేసినా ఆ జీవితము ధన్యము. నరులుమెచ్చే పూజ, భక్తి నరకముకు మార్గము, నారాయణుడు మెచ్చే పూజ, భక్తి, స్వర్గమునకుమార్గము. త్రికరణశుద్ధితో పూజ చేసిన ప్పుడు వారు పొందు అనుభవము, అనుభూతి, ఆ దివ్యానుభూతి వర్ణనాతీతము. ఆమధురానుభూతిని, దివ్యానుభూతిని తెలియ చేసే భాష ఈ ప్రపంచములో ఇంతవరకూ ఏదీ లేదు.

ఉదాహరణకు మామిడి పండు చాలా తీయగా ఉంటుంది. ఆ తీపులో బంగినపల్లి మామిడి పండు రుచివేరు,మలగూబా మామిడిపండు రుచివేరు, బేనీషా పండు రుచివేరు, రసాలు (ఖాదరు, కాళేపాడు) పళ్ల రుచులు వేరు. ఈపళ్ల రుచులను ఫలానా పండు రుచి (అన్నీ తీపే, తీపిపళ్లే) ఇది అని చెప్పుటకు భాష ఉందా? బాగాఆలోచన చేయండి

త్రికరణశుద్ధితో పూజ నారాయణుడు మెచ్చే పూజ ఎలా ఉండాలంటే కొంతమంది సినిమాలలో ,ఇంటిలో టివిలో సీరియల్స్ చూచుచూ ఆ సినిమా, సీరియల్ పాత్రలలో పూర్తిగా లీనమైపోయి ఎక్కడలేని ఉద్రేకమునకు వీరు లోనై వీరు ఏకధాటిగా బిగ్గరగా ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తారు, అందులో కొన్ని సంఘటనలలో మమేకమై హృదయము తాదాత్ప్య్మము చెంది, తన్మయత్వముతో (అందులోని త్యాగములకు, కొన్ని అనుభూతులకు, కొన్నికొన్ని సంఘటనలకు ప్రతిస్పందనగా) హృదయము ద్రవించి ఆనందభాష్ఫములు కళ్ళు చమర్చడము, కన్నీరు ధారాపాతము కావడము గమనించారా. అలా మనము చేయు పూజలో మనము మమేకమై, తాదాత్ప్య్మము, తన్మయత్వము చెంది,అనన్య భావములులేక ఏకాగ్రతతో, పూజా కార్యక్రమము చేసిన, స్వామి ప్రీతిచెంది మన భక్తికి స్వామి దాసుడై అబ్భ ఎంతభక్తి, ఎంత ఏకాగ్రత, ఏమిపూజ అని, మన స్వామి కళ్ళలో, మన కళ్ళలో ఆనందభాష్ఫములు రాలాలి. అది పూజంటే. మనకు అదీక్ష ఏది? మనకు తాదాత్ప్య్మము ఏది? మనకు ఆతన్మయత్వము ఏది? మనదంతా తంతు పూజ. భక్త కన్నప్ప భక్తికి శివుని కంటిలో రక్తము కారలా? కన్నప్ప తనకన్నును తీసి స్వామికి ఇవ్వలా? ఆ భక్తి పారవశ్యము ఉండలేకానీ భగవంతుడు ఒక కన్నప్పకేకాదు అందరికీ ఆభగవంతుడు దాసాను దాసుడే.

ఉదా:- మనము ఏ వర్ణము వారైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయాలంటే మనము మన పురోహితులవారు (మన ఇంటి బ్రహ్మ గారు) వచ్చి వ్రతమునకు కావలసిన సామగ్రీల వివరములు మనకు తెలియచేసి,ఆ సామగ్రిని సిద్దము చేయమని తెలుపుతారు. వాటిని మనము సిద్ధముచేసిన తర్వాత, భార్య భర్తలను పీటలమీద కూర్చో పెట్టి మనచే పురోహితులవారు (ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా) అని ఆచమనము చేయించి మనచేత పూజ, వ్రతముచేయిస్తారు కదా? కావున వర్ణవర్గ బేధములేక వారివారి గృహములలో వారివారి ఇష్ట దైవములకు పూజా విధిని భక్తి, శ్రద్దలతో, భయ భక్తులతో నిర్వహించవచ్చు.

1.మనము ఉదయం కాగానే నిద్ర లేస్తాము. నిద్ర లేచాము అంటే అందులో మన ప్రమేయము ఏమాత్రమో ఆలోచించండి. నిద్ర పోయిన తరువాత నిద్ర లేస్తామని మనకు పడుకునే ముందు ఏదైనా గ్యారంటీ ఉందా? భగవంతుడు నిద్రలో (మనము నిద్రించుచున్నప్పుడు) మన శ్వాసను ఆగి పోనీకుండా మనకు మరునాడు ఉదయమును చూచే భాగ్యమును ప్రసాదించినందుకు పూజ చెయ్యాలి.

2.ఉదయాన నిద్ర లేచినది మొదలు మరలా సాయంకాలం (రాత్రి) నిద్రకు ఉపక్రమించేంత వరకు (పగలంతా) ఈ మానవ ఉపాధిలో శ్వాసను అలాగే ఉంచి ఈ ఉపాధికి మంచి బుద్ధిని, మనస్సును ఇచ్చి పుణ్య కర్మలు, సత్ కర్మలు చేయించి నందుకు, త్రికరణ శుద్దిగా భగవంతునికి పూజ చెయ్యాలి.

3.మనము అందరమూ చాలా ధర్మ నిష్ఠాపరులము, భగవంతుని మీద అపారమైన నమ్మకము కలిగియున్నవారము. మనకు భక్తి ఉంది, సనాతన ధర్మముల మీద గౌరవం ఉంది. నమ్మకమూ ఉంది. రోజూ కాక పోయినా సందర్భములు,పండుగలు సమయములను బట్టి ఆలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లుచున్నవారము కదా! అయినా నిత్య పూజ అవసరమా? అనే సందేహం అవునా? ఆలోచించండి:-భాగవతములో అజామిళుడు ఏమయ్యాడు? అజామిళుడు ఎంతటి భక్తిపరాయణుడు. ఎంతో పరమ నిష్టాగరిష్ఠుడు. సకల శాస్త్రకోవిదుడు, వేదవేదాంగములు అవపోసనపట్టిన మహాజ్ఞాని కదా? మరి ఒక్క క్షణంలో చూడ కూడని దృశ్యమును చూచి దానికి బానిసై పతనమయ్యాడా లేదా? అరిషడ్వర్గములకు లోనై పతనమయ్యాడు. ఎంత నిష్టాగరిష్ఠుడైనా అరిషడ్వర్గములకు లోనైతే ఏమవుతాడో అజామిళో పాఖ్యానము మనకు దృష్టాంతము. అందుకే నారాయణ శతకంలో “ఒక వేళ నున్న బుద్ధి యొక వేళ నుండ దింక నేమి సేతూ విశదంబుగా జేయవే నీవు నాచిత్తమును నారాయణా”... అని ప్రార్థిస్తారు.

4.ఇంద్రియాలు పరమాత్మవేపుకు చూడడానికి అటు వైపు వెళ్ళడానికి సహకరించవు. ససేమిరా ఒప్పుకోవు. అవి ఎంత సేపూ తాత్కాలిక సుఖ, భోగముల వైపు మన మనస్సును ఉంచడానికే ప్రయత్నిస్తాయి. శాశ్వతానందము వైపు మరలవు. మనసును అటువైపుకు మరల్చటానికి సహకరించవు. వాటిని అటు వైపు నుండి శాశ్వతానందము వైపుకు త్రిప్పడమే పూజ. అజామిళుని లాగా ఏక్షణములోనైనా ఈ బుద్ధి పాడు కావచ్చు. అందుకే ఈ బుద్ధిని క్రమ బద్దీకరించి నిత్యము నిరంతరమూ పరమాత్మ వైపు త్రిప్పడానికి పూజ.
నిత్య సత్ కర్మల వలన అంతః శుద్ధి ఏర్పడుతుంది.

5.పరమేశ్వరుడు మనకు పంచేంద్రియములను ప్రసాదించి తద్వారా మనకు సుఖదుఃఖములను ప్రసాదించాడు. అందుకొరకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు వ్యక్తము చేయడం మన కనీస విధి. ఒక్కో ఇంద్రియంతో కొన్ని కోట్ల సుఖములను మనకు ప్రసాదించాడు. భగవంతుడు ఎంత గొప్ప శిల్పి. మనకు నోరును పైన పెట్టి కడుపును క్రింద పెట్టినాడు. నోటిలో ఏది పడినా శ్రమ లేకుండా కడుపులోకి జారీ పోతుంది. ప్రతి మానవుని చేతులలో ఎన్నో గీతలు గీశాడు. ఆ శిల్పి ఏ సిరాతో గీశాడో కానీ ఎన్ని మార్లు కడిగినా ఆగీతలు జీవితకాలం చెక్కు చెదరడంలేదు.

6. నిద్ర అనే సుఖమును ప్రసాదించాడు. ఆ నిద్రలో ఇంద్రియాలను మనసులోకి, ఆ మనస్సును ఆత్మలోకి తీసుకెళ్ళి రాత్రంతా ఇంద్రియాలకు శక్తిని ప్రసాదించి మరలా ఉదయం కాగానే ఇంద్రియములు పనిచేయుటకు అవకాశం శక్తి కల్పిస్తు న్నవాడు పరమేశ్వరుడు.

7. సాధారణముగ 108 నామములతో పూజ చేస్తారు. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి అనగా 84 కోట్ల జీవ రాసులు క్షేమంగా ఉండాలని. ఎలాగంటే ప్రతి ప్రాణి ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తుంది. నక్షత్రములేని సమయం ఉండదు. (ఒక్క రోజుకి 86,400 సెకన్లు ఏ ప్రాణి ఐనా ఏదో ఒక సెకనులో జన్మించాలి) ఒక నక్షత్రమునకు 4 పాదములు. 27 నక్షత్రములకు 27x4=108 పాదములు. కాబట్టి ప్రతి ప్రాణి ఆయురారోగ్యములతో ఉండవలయునని పూజ చేస్తాము. అందుకే అత్యవసర మైతే 108 ఫోన్ చేస్తాము 108 వాహనము వచ్చి మన ప్రాణములను కాపాడుటకు ICU లో మనలను ఉంచితే మనవారంద రూ ICU అద్దాల దగ్గర I see you అంటూ చూచేవారే కానీ ఏమీ చేయలేరు. బాగా ఆలోచించండి. అపుడు భగవంతుడనే వైద్యుడు “వైద్య నారాయణో హరిః” కదా, కాబట్టి భగవంతుడే Doctor గారి రూపములో ICU లో మనలను కాపాడుతాడు. బాగా ఆలోచించండి. 108 కు ఫోను చేయడం జరుగుతుందే కానీ 108 నామాలలో (భగవంతుని నామాలతో) ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి గుర్తుకు వస్తుందా? పలుకుతామా? పిలుస్తామా?ఏవండీ, ఎవరండి, అయ్యో, అయ్యయ్యో, కుయ్యో, మొర్రో, “ఏవండీ ఎవరైనా 108 కు phone చేయండి” అంతే గాని గోవిందా, నారాయణ, రామ, శివా, సాయిబాబా ఎవరూ గుర్తుకురారు. అందుకే నిరంతర స్మరణ, నిరంతర స్మరణ అలవరుట కొరకే పూజ.

8. పంచేంద్రియములకు ఒక భయం. ఏమంటే ఆత్మకు భగవంతునికి సంబంధించిన విషయములు ఎక్కడ ఈ మనసు గ్రహించి శరీర భ్రాంతిని విడిచి పరమాత్మవైపుకు వెళుతుందో, అని, నిరంతరమూ అత్యంత జాగరూకతతో భగవంతునికి సంబంధిoచిన విషయ వాసనలను, దరి దాపులకు రానీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఎంత సేపూ ప్రాపంచిక విషయాలపై, ధ్యాసను, ఆసక్తిని, అనురక్తిని పెంచి పోషిస్తాయి. కాబట్టి ఐదు కర్మేంద్రియాలు+ఐదు జ్ఞానేంద్రియాలు+బుద్ది =11 ఇంద్రియములను తన ఆధీనములో ఉంచుకొని మనస్సు నిరంతరం భగవత్ చింతనకు మనలను దూరంగా ఉంచుతుంది. దాని ఆధీనము నుండి 11 ఇంద్రియములను తప్పించి నిత్యమూ నిరంతరమూ సర్వకాల సర్వావస్థలయందు భగవంతునివైపుకు త్రిప్పుట కొరకే పూజ.

9.ఒక నాలుగు రోజుల పాటు మనము తెచ్చిన కూరగాయలను తిను బండారములను ఉపయోగించకుండా అలా బయట ఉంచితే ఏమవుతాయో ఆలోచించండి. క్రుళ్లిపోయి దుర్గంధం వెదజల్లడమేకాక క్రిమికీటకాదులకు ఆశ్రయమిచ్చి మనలను అనారోగ్యం పాలు చేస్తాయి. అవునా? మరి మనము ఈ ఉపాధి (శరీరం) లో షడ్రుచులతో కూడిన ఎన్ని ఆహార పదార్థము లను ఎంత ఆహారాన్ని ఎంత కాలంగా ఇందులో వేస్తున్నామో కదా! మరి చెడు వాసన రాదేo? క్రిమికీటకములు ఉత్పన్న ము కావటం లేదేం? ఆలోచించండి. మనము వండిన ఆహారమును అలా బయట నాలుగు రోజులు ఉంచితే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈశ్వరుడు జఠరాగ్ని స్వరూపంలో ఈ శరీరంలో పడవేసిన దేనినైనా పచనం(జీర్ణం) చేయకపోతే మనము జీవించగలమా? ఈ శరీరం పరస్థితి ఏమిటి? పరమేశ్వరుడు మనకెందుకు ఇంత ఉపకారం చేయాలి? అంత ఉపకారం ఒక రోజు కాదు రోజుకు మూడు పూటలా, ఇన్ని సంవత్సరములుగా చేయుచున్న ఈశ్వరునకు కనీసం పూజ ఐనా చేసి మన కృతజ్ఞతను ఆవిష్కరించాలా లేదా? మీరే ఆలోచించండి. ప్రతి రోజు మూడు పర్యాయములు తినడానికి సమయం ఉంది. మరియు “ప్రొద్దు పోవక యున్నను, వేసరక పొరుగిండ్ల, తిరుగుగానీ, బుద్ధి మాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణా”... అన్నారు. అయినా పరమేశ్వరునికి పూజ చేయడానికి రోజుకు కనీసంలో కనీసం ఒక అరగంట సమయం లేదా? ఎంత కృతఘ్నల మండీ మనము. ఒక్కసారి ఆలోచించండి.

10. సొంతముగా ఒక ఇల్లు కట్టుకోవా? ఎంత కాలం ఈ బాడుగ ఇళ్ళలోబ్రతుకుతావు? పరమాత్మ ప్రతి ఒకరికీ సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశము కేవలం ఈ ఒక్క మానవ ఉపాధికి మాత్రమే ఇచ్చాడు. మిగతా ఏ ఒక్క ఉపాధికి ఈ సౌలభ్యము ను భగవంతుడు ప్రసాదించలేదు. ఈ మానవ ఉపాధిలోనికి వచ్చిన తర్వాత సొంత ఇంటిలోకి వెళ్ళవలయును కానీ మరలా ఏదో ఒక ఉపాధి తీసుకొని బ్రతక కూడదని భగవంతుడు మానవ ఉపాధిని ప్రసాదించాడు.

ధర్మవర్తన అనే పునాదులపై భక్తి అనే ఇటుకలతో, జ్ఞానము అనే ఇసుక, తపన అనే నీళ్ళు, దానధర్మము లనే సిమెంటుతో వైరాగ్యమనే (కప్పు) శ్లాబుతో ఇల్లు నిర్మించాలి. దానికి సాధన అనే మెట్లు(తాపలు) కట్టి, నిత్య పూజ అనే ద్వారములు, నిరంతర ధర్మకర్మానుష్ఠానమనే కిటికీలు ఉంచి, సాధకుడు జీవాత్మను ఆ ఇంటిలో గురువు సహాయంతో ప్రవేశించాలి. తేనెలో పడ్డ ఈగ లాగా భక్తి మకరందాన్ని త్రాగి త్రాగి మత్తెక్కి ఇక అందులోనుంచి లేవలేని లేవలేక అందులో పడిన ఈగ లాగ కావడానికే పూజ.

11. సుడి గాలి వచ్చిందంటే దుమ్ము ధూళి పైకి లేచి కళ్ళలో పడి మనము కళ్ళు తెరవలేక అలా కళ్ళు మూసుకొని కళ్ళు నలుపుకుంటూ ఆ గాలి యొక్క ధాటికి తాళలేక ఎలా వెళుచున్నామో తెలియక ఎలా బాధపడతామో కదా. అపుడు ఆ సమయంలో వర్షం పడిందనుకోండి అపుడు ఎంత బలమైన గాలి వచ్చినా దుమ్ము ధూళి పైకి లేవగలదా మనలను ఇబ్బంది పెట్టగలదా? ఆలోచించండి. అలాగే మనము గత జన్మలలో చేసుకున్న ఈ జన్మలో చేసిన చేస్తున్న అకృత్యములకు, అధర్మవర్తనకు, పాపములకు ఈ ఈతి బాధలు, అకాల మరణాలు, అశాంతి ఇలాంటి రుగ్మతలను మరియు అరిషడ్వర్గాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాలంటే భగవంతుని అపార కృపా వర్షము మన మీద కురవాలి. అవునా ఆలోచోంచండి అందుకే పూజ.

12.మన అంగీకారం లేనిదే అహం స్వార్థం మనలో ప్రవేశిoచిందా? మనం ఆశతో చూచే చూపులే కదా దానికి ఆధారం. మన కోరికలు బలహీనతలే కదా స్వార్థం యొక్క గుర్రాలు. ఈ ఆసరాలతోనే అహం అనే ఏనుగును చేసి కోరికలు అనే అంబారీ పై ఊరేగుచున్నాము. అవునా ఆలోచించండి.

ఒక మహాత్ముడు ఏమన్నాడు డబ్బుల కుంపటి మీద కోరికలు అనే ఎసరు పెట్టుకున్నది మనం. దాహంతో,వ్యామోహంతో అవకాశాల కోసం అంగలార్చుచు చున్నది మనం కాదా? ఆశ, ఆర్భాటములు, స్వార్థముల వలన కలి మనలో పరకాయ ప్రవేశం చేయడానికి మనమే అనుమతిoచాం. అది మన వేలితో మన కన్నే పొడి చేస్తుంటే ఈ కలిమాయలో పడ్డ మనకు కర్తవ్యం బోధపడటం లేదు. ఈ మృగతృష్ణ తీరడం లేదు. అరిషడ్వర్గాలను జయించలేక సంసార సాగరమును ఈదుచున్నాము. అందుకే ఈ సంసార సాగరమును, ధర్మబదద్ధముగా, వేద హితముగా ఈది, ఆవలి వొడ్డు చేరాలంటే వేదములు తెలియాలి ధర్మా ధర్మములు తెలియాలి ఆశ్రమ ధర్మాలు తెలియాలి అందుకే నిత్యం పూజ, పురాణ ప్రవచనాలు వినడం ఈ ఉపాధికి అత్యంత అవసరము.

13. మనలని మనం ప్రమదాల నుండి కాపాడుకోవడo ఎలా? మనము రాత్రి పూట పడుకుంటాo. పడుకునే ముందుFan తిరుగుతోంది చిన్న Zero light (తక్కువ కాంతిగల) వేసుకుని పడుకున్నాం. రాత్రి ఎప్పుడో ఆ zero lightకాలిపోయింది. అందు వలన గది అంతా చిమ్మ చీకటి. ఏమీ కనిపించనంత చీకటి. ఆ చీకటిలో, మధ్యలో మనకు మెలుకువ కలిగింది. లేచి బాత్రూంకి వెళ్లాలి. వెళ్లాలంటే వెలుతురు కావాలి.

అరెరె కరెంట్ పోయినట్లుంది అని అనుకున్నాము. కానీ Fan తిరుగుతోంది అంటే కరెంట్ ఉంది మరి చీకటి ఎలా వచ్చింది ఓ హొ బల్బు మాడిపోయింది అనుకొని వేరొక పెద్ద light వేయడానికి స్విచ్ బోర్డు కొరకు తడుము తుంటే ఒక చిన్న వ్రేలు ప్లగ్లోకి దూరింది. వెంటనే షాక్ కొట్టి క్రింద పడిపోయాము. ఎంత వారికైనా అజ్ఞానము అనే చీకటి ఆవహించినపుడు జ్ఞానము అనే కాంతిని దగ్గరకు రానీయదు. కోరికలు, స్వార్థం, సంసారం లోని అరిషడ్వర్గముల అనే చీకటులు ఆవహించి ఉన్నపుడు గురువు (భగవంతుడు) అనే (జ్ఞానము) వెలుతురు కావాలి. గురువు (భగవంతుడు) అనే స్విచ్ దొరకాలి. అపుడు స్విచ్ నొక్కితే వెనువెంటనే చీకట్లు మాయమై వెలుతురు ప్రకాశిస్తుంది. వెలుతురు వస్తే గాని ఏ వస్తువు ఎక్కడుoదో, ఎవ్వరూ ఎక్కడున్నారో, ఎవ్వరు ఏమిటో తెలుస్తుంది. ఎప్పుడైతే నిత్య పూజ, ధర్మానుష్ఠానము,నిరంతర స్మరణ ఉంటాయో, అప్పుడు ఎంత చీకటిలో నైనా స్వీచ్ మన చేతికి అందుతుంది. అందుకే నిత్య పూజ.

14.పరమాత్ముడు ఈ ఉపాధికి నవ రంధ్రములు కళ్ళు-2, మలమూత్ర విసర్జనా స్థానములు-2, ముక్కు-2, ఒక నోరు పెట్టి ఇందులో పది వాయువులను, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త అనే ఈ పది వాయువులను సప్తధాతువులు చర్మము, రక్తము, క్రొవ్వు, మాంసము, అస్తి, శుక్ల, మేధ ఇందులో ఉంచి

ఆ పది వాయువులను బయటకు పోకుండా సప్తధాతువులు పాడుకాకుండా తయారు చేసి జీవన్ముక్తిని చతుర్విధ పురుషార్థములు సాధించమని ఈ ఉపాధిని మనకు ఇచ్చాడు. అందుకు నిరంతర కృతజ్ఞతావిష్కరణకు పూజ అవసరము. 15. ఈ ఉపాధిని ఆశ్రయించిన జీవాత్మ ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ నుండి. మరలా ఈ ఉపాధిలోని జీవుడు (జీవాత్మ) ఎక్కడికి వెళ్లాలి పరమాత్మలోకి అవునా. అందుకు ఈ ఉపాధిని ఉపయోగించాలి.

ఉదా:- మనము ఇంటి నుండి బయలు దేరి ఆఫీసుకు, బజారుకు, ఒక పని చేయడానికి, పొరుగూరికి, ఒక గుడికి,విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళతాము. మరి అక్కడే ఉండి పోతామా? లేదే తిరిగి మరలా మన ఊరికి (అది సొంత ఇల్లు కానీ, అద్దె ఇల్లు కానీ) మనము వచ్చేస్తున్నాము. ఆఫీసుకు, బజారుకు, లేదా ఒక పనికో వెళ్ళినపుడు ఆ రోజు సాయంకాలనికి ఇల్లు చేరుచున్నాము. విహారయాత్రలు, తీర్థయాత్రలు, మరో పోరుగూరో వెళితే కొన్ని రోజుల తరువాతైనా మన ఇంటికే మనం వస్తున్నాం. ఔనా? అంటే ఎక్కడి నుండి (ఇల్లు) బయలుదేరినామో అక్కడికే వచ్చి చేరుతున్నాం. కదా! మరి పరమాత్మ నుండి విడివడి బయలు దేరిన ఈజీవుడు (జీవాత్మ) మరి పరమాత్మ వద్దకు చేర్చవలసిన బాధ్యత మనది కాదా? ఉదా:- ఒక పిల్లవాడు తల్లి తండ్రులతో విహారయాత్రకు, తీర్థయాత్రకో వచ్చి దారి తప్పుతాడు. (తల్లి తండ్రులను వదిలి తప్పుతాడు). అపుడు విజ్ఞులయిన మనము అతనిని చేరదీసీ వారి యొక్క విలాస వివరములు తల్లితండ్రుల విలాస వివరములు తెలుసుకుని ఆ తల్లి తండ్రులకు తెలియజేసి వారి కడకు వారి బిడ్డను చేర్చడానికి ప్రయత్నము చేస్తాము. లేదా రక్షణ విభాగము (పోలీసు) వారి దగ్గరకైన చేరుస్తాము. మరి ఈ ఉపాధిలో ఉన్న జీవుని (జీవాత్మ) పట్ల మన కెందుకు ఇంత వివక్షత? ఇంత నిర్లక్ష్యము? ఆలోచించండి. అందుకే పూజ అవసరము.

16. ఒక కుటుంబం విహారయాత్రకో, తీర్థయాత్రకో వచ్చారు. అందులో ఒక 5 సం|| బాబు తప్పిపోయాడు. విజ్ఞులైన మనము ఏమీ చేస్తాము. ఆ బాబుని దగ్గరకు తీసుకొని వివరాలు విలాసాలు విచారిస్తాం. పిల్లవాడు గోలగోల చేస్తుంటాడు. ఎక్కి ఎక్కి ఎక్కుళ్లు పెడుతూ ఏడుస్తుంటాడు. మధ్యమధ్యలో మా అమ్మకావాలి, నాన్నకావాలి అని ఏడుస్తుంటాడు. మనము వానిని బుజ్జగించి బాబు ఈ పాలు త్రాగు అంటాము. నాకు వద్దు మా అమ్మకావాలి! ఈ బిస్కట్ తినరా వద్దు మా అమ్మకావాలి! పోనీ ఈ చాక్లెట్లు తినరా వద్దు మా అమ్మకావాలి! నాన్న కావాలి! పిల్లలు బిస్కట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు అనిన చాలా ఇష్ట పడుతుంటారు. అంత పరమ ఇష్టమైన పదార్థాలు ఇచ్చినా, నాకు వద్దు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని భీష్మించుకొని ఏడ్చి ఏడ్చి శోష వచ్చి పడిపోతాడు. ఇది తినరా మీ అమ్మ దగ్గరకు తీసుకెళతాను అంటే,ముందు తీసుకెళ్లు తరువాత తింటాను అని అంటాడు. తల్లి తండ్రులను చేరే వరకు ఏమి ముట్టడు. ఎంత తపన? ఎంత బాధ? ఎంత ఆర్తి? అమ్మను నాన్నను చేరడానికి మరి ఇన్నేళ్లు వచ్చాయి మనకేదీ ఆ ఆర్తి, ఏది ఆ తపన, ఎక్కడ ఆ బాధ. ఇంకా అరిషడ్వర్గాలనే బిస్కట్లు చాక్లెట్లు, పండ్లు రకరకాల షడ్రుచులు కావాలనే భావనే కానీ అమ్మ నాన్నలను చేరాలనే కోరిక ఎక్కడ? ఆ కోరిక పుట్టిoచడానికే పూజ. ఈ ఉపాధిలోని జీవుడు (పరమాత్మనుండి విడివడిన) తన అమ్మ నాన్నలతో కలవాలని ఎంత తపన పడుతోందో? ఎంత పొర్లి పొర్లి ఏడుస్తుందో? ఎలా అల్లాడిపోతుందో? దాని గోడు మనకు వినబడుతోందా? వినబడినా కూడా విననట్లు నటిస్తున్నామా? అని మనము విజ్ఞతతో ఆలోచించుకోవాలి. ఈ తప్పిపోయిన బాలుడికి (జీవునికి) కార్లు చూపిస్తాము, బంగారము చూపిస్తాము, సుఖాలను చూపిస్తాము నిజంగా ఆనంద పడుచున్నాడా? లేక ఏడ్చి ఏడ్చి శోషతో పడిపోతున్నాడా? ఎందుకు ఆవిధంగా ఆలోచింపరు? అక్కడ బిడ్డను పోగొట్టుకున్న తల్లితండ్రుల పరిస్థితి ఏమిటి. ఆ తల్లి నా బిడ్డో, నా బిడ్డో అని నేలబడి ద్రొల్లుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. అన్న పానీయాలు ముట్టదు. భర్త మిగిలిన బంధువులు చెబుతారు, బిడ్డ దొరుకుతాడు లేమ్మా కాస్త ఎంగిలి పడు అంటారు. అయినా ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఎవరు చెప్పినా ఆ తల్లి వెర్రి చూపులతో బిడ్డకోసం ఆర్తితో అంటుంది, అందరూ ఇక్కడ నాకు చెప్పేవారే కానీ మీలో ఒక్కరైనా వెళ్ళి బిడ్డ కొసం వెతుకుతున్నారా? వెతికే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకీ వ్యర్థమైన కాలయాపన,వ్యర్థమైన కబుర్లు, ఓదార్పులు ముందు నా బిడ్డను వెతికించే ప్రయత్నం చేయండని ఆ తల్లి పడే బాధను ఊహించండి. అలాగే పరదేవత కూడా మన గురించి ఎంత తపన ఎంత బాధపడుతోందో ఆలోచించండి. మనకు దారిచూపడానికి మన యొక్క విలాసము, వివరములు తెలియజేయడాని ఎందరో మహానుభావులను పంపింది. ఒక ఆదిశంకరాచార్య, ఒక రామానుజాచార్య, ఒక మద్ద్వాచార్య, ఒక రమణమహర్షి, ఒక అరబిందో, ఒక చంద్రశేఖరేంద్ర భారతీ సరస్వతి స్వామి ఎందరో అవధూతలు ఎందరో మహానుభావులు వచ్చారు. మనలను ఈ భవబంధముల నుండి బయటకు లాగి మన అసలైన చిరునామా, మన వివరములు తెలియజేయడానికి, మనలను మరలా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళే మార్గము చూపడానికి. కానీ మనకు వారిని కలిసే సమయమేది? వారి పాదపద్మముల మీద పడి ప్రణిపాతము చేసే సంస్కారమేది?వారి ప్రవచనాలను వారి జీవిత గాథలను చదివే సమయమేది? ఎంతసేపూ నా సంసారం, నా పిల్లలు, నా సంపాదన, ఇదే ధ్యాస. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారన్నట్లు “ఎంత సేపూ చేసిన సంసారమే చేయిస్తావు, తిన్న తిండే తింటావు ఎంత కాలమిలా బ్రతుకుతావు? నీలో మార్పురాదా?” అన్నారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనకు పశుపక్ష్యాదులకి తేడా ఏముంది?

పూజాలో పొందవలసిన అనుభూతి:

మనము ఒక సినిమా చూచేటప్పుడు, ఒక TV సీరియల్ చూచేటప్పుడు అందులోని సన్నివే శాలలో లీనమైపోయి, ఆ సందర్భానుభూతిని, మనము అనుభవించుచున్నప్పుడు, మన హృదయము తెలియని అనుభూతికి లోనై, కళ్లు చెమర్చడం, ఏడ్వడం, బాధపడడం జరుగుతుంది. మరీ కొన్ని కొన్ని హాస్య సన్నివే శములలో నైతే పొట్ట చక్కలయ్యేటట్లు నవ్వడం, నవ్వి నవ్వి కడుపు పట్టుకోవడం, మరీ విపరీతముగా నవ్వడం వలన, కళ్ళలో ఆనంద భాష్పములు రావడం, జరుగుతోంది కదా! ఇక్కడ మనము బాగా సుదీర్ఘముగా ఆలోచించగలిగితే, ఒక విషయం బోధపడుతుంది. నిజానికి సినిమాను నిర్మించే, నటించే వారికి అందరికీ, ఆ సినిమాను చూచి ఆనందించి, ఆదరించే ప్రేక్షకులే దేవుళ్లు. నటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, ఆ పరిశ్రమలో పనిచేయు వారెవ్వరైనాసరే, ప్రేక్షకులు చూచి మెచ్చి చాలాబాగుందని అదరిస్తేనే (సినిమా, TV సీరియల్ పరిశ్రమల) వారికి జీవనం, మరియు సినిమా టివి పరిశ్రమలు వృద్ధి చెందుతాయి.

మరి మనము, విభిన్న మనస్తత్వాలు, విభిన్న ఆలోచనలు, అభిప్రాయాలు, విభిన్న పద్దతులు,ఆచారవ్యవహారాలు, కలిగిన ప్రేక్షకులు సినిమా పరిశ్రమ పట్ల, దేవుళ్లైతే, ఆ దేవుళ్లను మెప్పించడానికి (సినిమా,TVసీరియల్ పరిశ్రమల) వారు ఎంత కఠోర పరిశ్రమ చేయాలి. వివిధ దర్శకాగ్రేసరులు (సంగీతం, అలంకరణ, ఛాయా,నృత్యం,సంభాషణలు) ఎంతగా శ్రమించాలి. మరి నటులు, దర్శకులు వివరించిన విషయమును, ఆసందర్భమును, ఆ పాత్రయొక్క, గుణగణములను జీర్ణించుకొని, ఆ పాత్రలోనే జీవించుచూ, ఆ పాత్ర యొక్క భావములను, తను అనుభూ తి చెందుచూ, తన నటనతో ఆ భావమును వ్యక్తీకరించి, ప్రేక్షకులకు అందించాలి. అలా జీవించి నటించకపోతే, చూచే మనకు,ఆ మధురానుభూతి కలుగుతుందా? ఆ సినిమాను చూచిన మనము, ఆనందించగలమా? వారు, వారి వారి పాత్రలపట్ల,వృత్తిపట్ల ఎంత న్యాయము చేస్తున్నారనే విషయం, ప్రేక్షక దేవుళ్లమైన మనము నిర్ణఇంచి ఆదరించుచు న్నాము. అవునా?

ఒక సినిమానే కాదు ఒక సంగీత విద్వాంసుని సంగీతం, ఒక చిత్రకళా తపస్వి చిత్రం, ఒక నవలా రచయిత రచన, ఒక ఉపాధ్యాయుని పాఠం, ఒక నాట్యకళాకారుని నాట్యం, ఒక పురోహితుని మంత్రపఠనం, ఒక దేశరక్షకు (సైనికుడు) ని త్యాగం, ఒక అధికారి అధికారం, ఒక వైద్యుని వైద్యం ఇలా ఎందరెందరో వారివారి పాత్రలలో వారు లీనమై జీవించి పనిచేయక (ఫొటోల కొసమో, పబ్లిసిటీ కోసమో లేదా పత్రికల కోసమో) వారు పనిచేస్తే, ప్రేక్షకులమైన మనము,వారినాదరింతుమా, వారిని అభిలషింతుమా, మనము ఆదరించక పోతే వారికి మనుగడెక్కడిది?

మరి భగవంతుడు మనకొక పాత్రనిచ్చి ఈ జానారణ్యమనే నాటకరంగము పై మనలను, మనయొక్క సనాతన ధర్మములను, వేదములను, గౌరవించి వేదయుక్తముగా, ధర్మబద్ధముగా, నడుచుకోమని, జీవించమని,మనకు గొప్ప అవకాశము ఇస్తే, మనము చేయుచున్నదేమిటి, వేదములు, ధర్మవర్తన మాట అటుంచి, కనీసములో కనీసము నిత్య పూజను, ఆలయదర్శనమును కూడా మరచిపోయాము.

ఈ ఉపాధిని మనకు భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనము పరమాత్మ చెప్పినవిధముగా వేదముల సారము గ్రహించుచూ వేదప్రోక్తముగా, ధర్మబద్ధముగా, జీవనము సాగించుచూ భగవంతునకు చేయు పూజలో మనము అందులో మమేకమై నిత్యమూ పూజా విధిలో జీవించుచూ పూజలో లీనమై ఆత్మానుభూతి చెందువిధముగా పూజచేస్తే, అటు పరమాత్మ కన్నులలో, మనకన్నులలో ఆనంద భాష్పములుకాక మరేమొస్తాయి. ఆలోచించండి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP