శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

‘అవశేష’ విషాదం.

>> Saturday, December 3, 2016

​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
​​
Andhrabhoomi
సంపాదకీయం
‘అవశేష’ విషాదం..
Published Thursday, 2 December 2016
హిందూ వివాహ, కుటుంబ వ్యవహారాల బిల్లును పాకిస్తాన్ జాతీయ శాసనసభ ఆమోదించాలా? లేదా? అన్నది మన దేశంలో ప్రచారం కాని విషయం. పాకిస్తాన్‌లోని దాదాపునలబయి ఐదు లక్షల మంది హిందువుల కడగండ్లు 1947 నాటి దేశ విభజనకు సంబంధించిన వ్యవహారం. పాకిస్తాన్‌లో అత్యల్ప సంఖ్యాకులుగా మారి ద్వితీయ, తృతీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్న అవశేష హిందువుల హక్కుల పరిరక్షణ గురించి పట్టించుకోవడం అవశేష భారత ప్రభుత్వం బాధ్యత! ఇది నైతిక బాధ్యత మాత్రమే కాదు, ఇందుకు వీలైన నియమావళి గతంలో మన ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి కుదిరిన ద్వైపాక్షిక అంగీకారాలలో ఉంది. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత డెబ్బయి ఏళ్లు అవుతున్నప్పటికీ అవశేష హిందువులకు తమ సనాతన సంప్రదాయాలను పాటించే హక్కులను అక్కడి రాజ్యాంగంలో పొందుపరచలేదు. పాకిస్తాన్ ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడడమే ఇందుకు కారణం. ఇస్లాంకు తప్ప మిగిలిన ఏ మతానికీ గుర్తింపు లేకపోవడం ఆ రాజ్యాంగ వ్యవస్థ స్వభావం. సర్వమత సమభావ స్పూర్తికి -సెక్యులర్ స్పిరిట్-,ప్రజాస్వామ్య వౌలిక స్వభావానికి మత రాజ్యాంగం విరుద్ధం. ఈ వైరుధ్యం ప్రాతిపదికగా పరిఢవిల్లుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి హిందువుల వివాహం గుర్తుకు వచ్చింది! బిల్లు తయారైంది. పాకిస్తాన్‌లోని హిందువులలో అధిక శా తం సింధు ప్రాంతంలో ఉన్నారట! సింధు రాష్ట్రంలో ఒక హిందువు శాసనసభకు కూడ ఎన్నికైనాడు. ఆయన ఇటీవల బలవంతపు మతం మార్పిడుల నిరోధక బి ల్లును రూపొందించి ప్రాం తీయ శాసనసభలో ప్రవేశపెట్టాడు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించిందా? అన్నది తెలియరాలేదు. సింధు, బలూచిస్థాన్ ప్రాంతాలలో హిందువులను అపహరించికొనిపోతున్న జిహాదీ భారీగా ‘దండుగ’-రాన్‌సమ్-ఇచ్చి బంధితులను విడిపించుకోవాలని కుటుంబ సభ్యులను, బంధువులను కోరడం తరచూ పునరావృత్తమవుతున్న ఘటన! ఇలా ‘దండుగ’ చెల్లించలేని బాధితులను హత్య చేస్తున్నారు! సింధు ప్రాంతంలోని కరాచీ నగరంలోని అతి ప్రాచీన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని 2012లో ఒక స్థిరాస్థి దళారీ-రియల్ ఎస్టేట్ ఏజెంట్-కూల్చి పారేశాడు. విలువైన పంచలోహ విగ్రహాలను, విగ్రహాలకు ఉన్న బంగారు ఆభరణాలను మాయం చేసారు. సింధు ప్రాంతం హైకోర్టు ఇంతవరకు దోషులను దండించకపోవడం అనేక మతోన్మాద దుశ్చర్యలలో ఒకదానికి మాత్రమే ఉదాహరణ.. అధికార పక్షం ఏదయినప్పటికీ అన్ని పార్టీల స్థానిక జిహాదీ రాజకీయ వేత్తలు ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తునే ఉన్నారు..
తాలిబన్లు, లష్కర్లు తదితర జిహాదీ ముఠాలవారు అదను దొరికినప్పుడల్లా సిక్కుల నుండి మిగిలిన హిందువుల నుండి ‘జుట్టుపన్నులు’ వసూలు చేస్తున్నారు. వాయువ్య సరిహద్దు ప్రాంతంలో సిక్కుల నుంచి రెండుకోట్ల రూపాయలను జిహాదీలు బలవంతంగా వసూలు చేయడం 2009లో ప్రముఖంగా ప్రచారమైంది! ఈ ఘటనతో బికారులుగా మారిన ఆ ప్రాంత సిక్కులు వంద కుటుంబాల వారు-పంజాబ్ ప్రాంతానికి వలస వచ్చారు. మరో అరవై లక్షల రూపాయలు చెల్లించాలని భట్టగ్రామ్ జిల్లాలోని హిందువులను బెదిరించడంతో కూలి చేసుకునే రెండు వందల కుటుంబాల హిందువులు ఇళ్లను వదిలి పారిపోయారు. ఇలా ‘దండుగ’లను చెల్లించని సిక్కులను, హిందువులను వారాల తరబడి, నెలల తరబడి నిర్బంధించిన జిహాదీలు వారిని చిత్రహింసలకు గురి చేసారు! కొందరిని చంపేసారు. పాకిస్తాన్ నుంచి ప్రతిరోజు ఐదు వేల మంది హిందువులు మన దేశానికి పారిపోయి వస్తున్నట్టు 2014 మేలో వార్తలు వెలువడినాయి! మన దేశాన్ని సందర్శించడానికై వీసాలను తీసుకుని వస్తున్న పాకిస్తానీ హిందువులు వీసాల గడువుముగిసిన తరువాత ఇక్కడనే ఉండిపోతున్నారు. ఇలాంటి వేలాది పాకిస్తానీ హిందువులకు మనదేశం పౌరసత్వం ఇవ్వనున్నట్టు మన ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రకటించింది! కానీ, మన దేశంలోకి ప్రవేశించలేని లక్షలాది హిందువులు పాకిస్తాన్‌లో ఇప్పటికీ అలమటిస్తునే ఉన్నారు! వీరిలో అధిక శాతం తాము హిందువులమని బయటపడకుండా దాదాపు రహస్య జీవితం గడుపుతున్నారు. ఈ రహస్య జీవనం పల్లెలలో సాధ్యం కాదు. జిహాదీలు పల్లెపట్టులలోని హిందువులను అపహరిస్తున్నారు, హత్య చేయిస్తున్నారు, హతమార్చుతున్నారు, మానభంగం చేస్తున్నారు.
పల్లెలను, పొలాలను, ఇళ్లను వదిలిపెట్టి హిందువులు పట్టణాలకు, నగరాలకు చేరి ఉపాధి దొరకక అలమటిస్తున్నారు. పాకిస్తాన్ హిందువులలో ముప్పయి శాతం పైగా జనాభా లెక్కలలోను, వోటర్ల జాబితాలోను తమ పేర్లను నమోదు చేయించలేకపోవడానికి ఈ జిహాదీల బీభత్సకాండ కారణం! అందువల్లనే పాకిస్తాన్‌లో నలబయి ఎనిమిది లక్షల మంది హిందువులుండగా లెక్కలకెక్కినవారు ముప్పయి ఐదు లక్షలు మాత్రమేనట. నిజానికి హిందువుల సంఖ్య అరవై లక్షల దాకా ఉండవచ్చునని కూడ 2012లో ప్రచారమైంది! కానీ, అధికారికంగా హిందువులమని చెప్పుకోకపోవడానికి కారణం- జిహాదీలు చంపేస్తారనే భయం! 1947లో పశ్చిమ పాకిస్తాన్‌లో హిందువులు మొత్తం జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉండేవారు. ప్రస్తుతం రెండు శాతం కూడ లేరు. ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ ఇందుకు కారణం. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, ప్రపంచ సర్వమత సమభావ వ్యవస్థ గురించి ప్రచారం చేస్తున్న వారు ‘ఏక మత రాజ్యాంగ వ్యవస్థల’ను అంతర్జాతీయ సమాజం నుండి ఎందుకని వెలివేయడం లేదు? ఇన్నాళ్ల తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం హిందూ వివాహపు బిల్లును రూపొందించడం కూడ హిందువుల నిర్మూలనకు మరింతగా దోహదం చేయగలదన్న భయాందోళనలు చెలరేగుతున్నాయట! వివాహితులు నమోదు కావడం వల్ల వివాహిత మహిళలను అపహరించడం తగ్గిపోతుందని ప్రభుత్వం చెబుతోంది! కానీ ఈ నమోదు వల్ల ఎవరెవరు హిందువులన్నది మరింత బహిరంగం అవుతుంది కాబట్టి జిహాదీలు మరింత ఎక్కువ మందిని అపహరించుకొనిపోయే ప్రమాదం ఉందన్నది పాకిస్తాన్‌లోని హిందువుల భయం! వివాహితులు తమ పెళ్లిళ్లను ఆధికారికంగా నమోదు చేసుకోనట్టయితే వారికి పాకిస్తాన్ పౌరులుగా గుర్తింపు పత్రాలు ఇవ్వరట! నమోదు చేసుకున్నట్టయితే అంతర్జాలం మాధ్యమంగా జిహాదీలు హిందువులను సులభంగా గుర్తిస్తారు!
బలూచిస్థాన్‌లోని కలాత్ జిల్లాలో సురభ్ గ్రామంలోని ప్రాచీన దేవాలయం ప్రధాన అర్చకుడు లక్ష్మీచంద్ర గార్జిని, ఆయన కుమారుడిని, మరో ముగ్గురు హిందువులను 2010లో జిహాదీలు అపహరించారు. లక్ష్మీచంద్రకు అప్పటికి ఎనబయి రెండేళ్ల వయసు. ముగ్గురిని మూడు వారాల తరువాత దుండగులు వదిలిపెట్టారు. ‘దండుగ’ చెల్లించనిదే లక్ష్మీచంద్రను, ఆయన కుమారుడిని వదలిపెట్టబోమని స్పష్టం చేసారు. ఈ ఘటన తరువాత బలూచిస్థాన్ గ్రామీణ ప్రాంతాలలో మిగిలి ఉన్న ఐదారు వందల హిందూ కుటుంబాలు పట్టణాలకు వలసపోయాయి. లక్ష్మీచంద్ర, ఆయన కుమారుడు ఏమయ్యారన్నది ఆరు ఏళ్ల తరువాత కూడ తెలియదు! సింధులోని ఉమర్‌కోట్‌లో ఆరేళ్ల శిశువును 2012 డిసెంబర్‌లో జిహాదీ దుండగుడు లైంగిక అత్యాచారానికి గురి చేయడం పైశాచిక కాండకు పరాకాష్ఠ!

Cc:

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP