శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మన గురువెవరు ? ఆయననెలా గుర్తించాలి ? [గురుపౌర్ణమి శుభాకాంక్షలతో]

>> Monday, July 18, 2016






గురువంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.
1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.
2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి

3 సర్వ సమర్ధత :- తాను శిష్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాడ నియమాలను సహితం మార్చగలిగేంతగా.

ఇటువంటి వారిని మనము పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.
అటువంటివారిని పరిశీలించి,పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు...గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికం గా పతన హేతువవుతుంది.

శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్డకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టేరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.
కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.
మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?
గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.
గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చేస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధిపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరిత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.


శ్రీగురు దత్తాత్రేయాయనమ:




శ్లో// శ్రీ సమంచిత మద్వయం పరమప్రకాశ మగోచరం
భేద వర్జిత మప్రమేయ మనంత మాద్య మకల్మషం
నిర్మలం నిగమాంత మద్వయ మప్రతర్క్య మబోధకం
ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం
శ్లో// నాదబిందు కళాత్మకం దశనాద భేదవినోదకం
మంత్ర రాజ విరాజితం నిజమండలాంతర్భాసితం
పంచవర్ణ మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// వ్యోమవత్ బహిరంతరస్థిత మక్షరం అఖిలాత్మకం
కేవలం నిజశుద్ధమేకమ జన్మహిప్రతిరూపకం
బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుబోధ సుబోధకం

ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో // బుద్ధి రూపమ బుద్ధికం త్రితయైక కూటనివాసినం
నిశ్చలం నిరతప్రకాశక నిర్మలం నిజమూలకం
పశ్చిమాంతర ఖేలనం నిజశుద్ధ సమ్యమి గోచరం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో // హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం
నీల మధ్య సునీలసన్నిభ నాద బిందు నిజాం శుకం
సూక్ష్మకర్ణిక మధ్యమ స్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరంపరం
పంచ భూత సకామ షట్క సమీర శబ్దమఖేతరం
పంచకోశగుణత్రాయాది సమస్త ధర్మ విలక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం

శ్లో // పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్మ నిరూపణం
విద్యుదాది ధగద్ధగిత సుచిర్విచిత్ర వివర్ధనం
చిన్ముఖాంతరవర్తనం విలసద్విలాస మమాయకం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// పంచ వర్ణ సుచిర్విచిత్ర విశుధ్దతత్వ విచారిణం
చంద్ర సూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం
చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం
శ్లో// హంస చార మఖండనాద మనేకవర్ణమ రూపకం
శబ్దజాలమయం మయం చరాచర జంతుదేహ నివాసినం
చక్రరాజ మనాహతోద్భవ మేకవర్ణమరూపకం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// జన్మకర్మ విలీన కారణ హేతుభూత మబోధకం
జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం
నామ రూపవివర్జితం నిజ నాయకం సుఖదాయక
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం

శ్లో// తప్తకాంచన దీప్తమాన మహాణుమాతృక రూపకం
చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం
నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం

శ్లో// స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం పరిపాలనం
విశ్వ తైజస ప్రాజ్ఞ చేతస మంతరాత్మ నిజాంసుఖం
సర్వ కారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

1 వ్యాఖ్యలు:

Sharma July 18, 2016 at 5:22 AM  

హరి గారు ,

గుడ్ ఈవెనింగ్ .

ఆధ్యాత్మిక సద్గురువును ఎవరికి వారు ఎన్నుకోవటం కంటే ( ఎందుకంటే మనకు అంతటి శక్తి లేనివాళ్ళం కావటం వలన ) , ఆ సద్గురువే ( ఆ అనంత శక్తి { భగవంతుని } ఆశీర్వాదంతో సత్ శిష్యులను ఎన్నుకొనగల సమర్ధత వారికుండటం వలన వారే ) సత్ శిష్యులను ఎన్నుకొనటానికి వస్తారు . అంతవరకు ఆ మహా పురుషుల యొక్క జీవిత చరిత్రలను పఠిస్తూ , వీలైనంతవరకు ఆ సన్మార్గాలను ఆచరిస్తూ ఉండటమే సత్ శిష్యుని అసలు ధర్మం అని చక్కగా సెలవిచ్చారు .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP