శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీకృష్ణుని అష్టభార్యాత్వం

>> Sunday, April 24, 2016

శ్రీకృష్ణుని అష్టభార్యాత్వం
కృష్ణ బహు భార్యత్వ అంతరార్థాలు, పరమార్థాలు, జన్మాంతర పుణ్య సంస్కార సంపన్నులు, భక్తి-జ్ఞాన వైరాగ్య-తత్వ ముముక్షువులు అయినవారికి కొంతమేరకు తెలిసే అవకాశముంది. శ్రీకృష్ణుని భార్యా సంఘంలో అష్టమహిషులు అని పేరొందిన వారు: రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ. వీరిని చేపట్టటంలో ప్రత్యేకత ఏమిటంటే, శ్రీకృష్ణుడు భగవంతుడైన పురుషోత్తముడు. ప్రకృతి స్త్రీ. ఎనిమిది విధాలుగా విభాగితమైన ఈ ప్రకృతిని భగవంతుడు స్వీకరించి, లోక కల్యాణం గావించడమే ఈ అష్టకల్యాణలలోని ఆంతర్యం! భగవంతుని ప్రకృతులు లేక ఎనిమిది శక్తులు:
భూమి రాపో2నలో వాయుః ఖం మనోబుద్దిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్న ప్రక్రుతి రష్టధా || (గీత 7.4)
శ్రీకృష్ణుడు స్వయంగా విజ్ఞానయోగంలో వివరించినట్లుగా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ ఎనిమిది భగవంతుని విశ్వ కల్యాణ కారకాలైన అంగాలు.
ఈ పంచభూతాదులైన అష్టశక్తులు పురుషోత్తమునిచే భరింపదగినవి కనుక భార్యాత్వం పొందుతాయి. వీటిల్ని భరించేవాడు కనుక ఈ ప్రకృతులకు అయన భర్త అవుతాడు. కాగా, భగవంతుడు పేర్కొన్న ఈ అష్ట ప్రకృతులే మూర్తిమంతాలై అష్ట-భార్యలుగా స్వామినే చేరాయి. ఎవరెవరియందు ఏయే ప్రకృతి కనిపిస్తుందో క్రింద వివరించబడింది.
(1) రుక్మిణి - అగ్ని తత్వం - శ్రీ కృష్ణుని అష్ట మహిషులలో అనుపాయని (ఎడబాటు లేనిది) అయిన లక్ష్మీదేవి అంశతో జన్మించినది రుక్మిణి ఒక్కతే! లక్ష్మి మూల ప్రకృతి రూపం అగ్ని శిఖలతో పోల్చబడి ఉంది. (హిరణ్యప్రాకారా మార్ద్రం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం - తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం - జాతవేదో మమావహ) మొదలైన శ్రీసూక్త వాక్యాలలో అగ్నితత్వం రాజశ్శక్తి పూర్ణ అయిన లక్ష్మికి అన్వయిస్తుంది. శ్రీంలో 'ర' కారము మంత్రశాస్త్రమున అగ్నిబీజం.
(2) జాంబవతి – భూతత్వం - జాంబవతి తండ్రి అయిన జాంబవంతుడు, బ్రహ్మ వంశంలో పుట్టిన స్వేచ్ఛారూపుడు మరియు రావణ వదకై బల్లుకాకృతి (ఎలుగుబంటి) రూపంలో వచ్చినవాడు. బల్లూకరాజు అయిన ఇతడు తెలివైనవాడు మరియు మరపుదనం, మొండిపట్టుదల, జడత్వం కలవాడు. కృష్ణావతారంలో భగవంతునికి కన్యకామణి అయిన తన కూరుర్ని భార్యగా ఇచ్చి ముక్తి నొందాల్సిన విధి ఉంది, కావున కృష్ణావతారం దాకా జీవించి కృష్ణునితో యుద్ధం కూడా చేసాడు. ఇలా తండ్రి యందుగల భూగుణమైన 'జడత్వం' ఈమెలో ఉన్నందున, ఈమెను భూతత్త్వంగా భావించవచ్చు.
(3) సత్యభామ – అహంకారతత్త్వం - ఈమె చరిత్ర అంతా అహంకారమయమే. పోతనామాత్యుడు విశేషణాలతో ఈమెను వివరించాడు: "నానామనుజేంద్ర వందిత గుణస్థితి లక్షణ సత్యభామ, నుద్దామపతి వ్రతాత్వనయ ధర్మ విచక్షణతాదయాయశఃకామను, ముఖద్యుతి నిర్జితసోమను, సత్యభామను. ఈ విశేషణాధిక్యమే ఆమె అహంకారాన్ని చెప్పకనే చెబుతుంది. కనుక, సత్యభామ అహంకార ప్రకృతిగా నిరూపించవచ్చు.
(4) కాళింది – బుద్ధితత్త్వం - సూర్య పుత్రిక అయిన ఈమె విష్ణువునుగూర్చి గొప్ప తపస్సు చేసి, ఆయనకు కృష్ణావతారంలో భార్య అయింది. సూర్యుని పుత్రిక కావటం వలన మరియు తపోనిష్ఠ వలన, ఈమె బుద్ధితత్త్వాన్ని తెలియపరుస్తుంది. కావున కాళింది బుద్ధితత్వంమని భావించవచ్చు.
(5) మిత్రవింద – ఆకాశతత్త్వం - మిత్ర అనే పదానికి సూర్యుడనే అర్థం ఉన్నందున మరియు పోతనగారు అన్నట్లు 'నిత్యాపూరిత సుజనానందత్వా' అంటే గ్రహతారకాదిసంచారాలు కలిగి, 'ఆకాశశరీరం బ్రహ్మ' మొదలగు భావనలవల్ల ఆకాశంలో అన్వయిస్తుంది. కనుక మిత్రవింద ఆకాశతత్త్వం అని అనటానికి సరిపోతుంది.
(6) నాగ్నజితి - మనస్సుయొక్క తత్త్వం - ఈమె కృష్ణున్ని చూచినంతనే ప్రేమించి పట్టుదలతో పెండ్లాడింది. తన మనస్సును క్రుష్ణార్పితం చేయడంవల్ల, ఈమెను మనస్సుయొక్క తత్త్వంగా తలంపవచ్చు.
(7) భద్ర – జలతత్త్వం - "ఇద్ధనయొన్నిద్రన్, ప్రపూర్ణసద్గుణ సముద్రాన్, అక్షుద్రన్, భద్రన్" అని భద్రకు భద్రవిశేషణాలు అంటే మంగళకరమైన గుణ విశేషణాలు చేర్చినాడు పోతనామాత్యుడు. ప్రపూర్ణ మరియు సముద్ర అనునవి జల శబ్దాలు. కావున ఈమెను జలతత్త్వంగా తలపింపజేస్తాయి.
(8) లక్షణ – వాయుతత్త్వం - మదాంధులైన రాజులనుక్కడించి, కృష్ణుడీమను గైకొని తెచ్చాడు. కనుక ఈమె కేవలం 'మహాబలైమ సాధ్య' అయింది. మహాబలత్వం వాయుగుణం.ఇందువల్ల ఈమెను వాయుతత్త్వంగా భావించవచ్చు.
ఇలా భావించడం వల్ల శ్రీకృష్ణుడు తన అష్టప్రకృతులనే వివాహరూపంలో చేపట్టాడనిపిస్తుంది.
శ్రీకృష్ణుని వివాహాలలో ఒక అద్భుత వృత్తాంతం ఉంది. మొట్టమొదట కృష్ణుడు రుక్మిణిని పెండ్లాడు. పిదప కొంతకాలానికే తక్కిన ఏదుమందినీ పెండ్లాడు. మొత్తం ఈ అష్టభార్యలో ఎవ్వరికిగానీ సపత్ని సంబంధమైన అసూయలేదు. వీరందరూ పతివ్రతలు కనుకనే "సాధ్వి' అనే పేరు చెల్లింది. అందుచే వారి ఆనందానికి కొరతలేదు. తృప్తియే ఆనందానికి ప్రధానం. శ్రీకృష్ణుని భార్యలందరూ శ్రీదేవీ కళాసంబవలే! శ్రీమహావిష్ణువుకు ఒక్క శ్రీదేవియే పత్ని. ఆమె ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పత్నియై భగవంతున్ని సేవించింది. వారిని సేవించి, పూజించి, తరించడం మన కర్తవ్యం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP