శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వేదం -- స్త్రీలు అధ్యయన అధికారం

>> Tuesday, March 8, 2016

వేదం -- స్త్రీలు అధ్యయన అధికారం
మన హిందూమతం పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకువచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు.స్త్రీలు,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలాఅని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం.
భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు
"చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః"అన్నాడు.
దీని అర్థం"మొదట వారి గుణాలబట్టి,తర్వాత వారు చేసే పనులబట్టి నాలుగు వర్ణాలు(కులాలు) నాచే(భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి."అని అర్థం.
వేదాలలో నాలుగు వర్ణాల (కులాల)గురించి చెప్పారు కానీ వాటిమధ్య ఎక్కువ,తక్కువల గురించి చెప్పలేదు.మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు.సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.

1.యజుర్వేదం(26.2) శ్లోకం
"యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ"
అంటే "నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రులవరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి."అని అర్థము.
2.అధర్వణ వేదం (8వ మండలం,2వ అనువాకం) బ్రాహ్మణులకు,శూద్రులలో కూడా చివరివారికి
"సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద,నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే"
అంటే "ఓ మానవుడా!గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను.నేను దాస(శూద్ర),ఆర్య పక్షపాతము గలవాడను కాదు.నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను"అని అర్థము.
3.ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయబ్రాహ్మణమును,స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
4.అలానే ఋగ్వేద ఒకటవ మండలం,17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిసకొడుకని ఋగ్వేదంలోనూ, శాయనభాష్యములోనూ,మహాభారతంలోనూ చూడవచ్చు.
5.అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు.సత్యకామజాబాలి వేశ్య కొడుకు.వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం(వేదాల చివరివి)ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
6.ఋగ్వేద ఒకటవమండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర,8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక,శాయనభాష్యములోనూ చెప్పబడింది.
"న స్త్రీ శూద్ర వేదం అధీయతాం"(స్త్రీలు,శూద్రులు వేదమును అభ్యసింపరాదు)అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
7.ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు.యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది.ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు.ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరుప్రఖ్యాతులు పొందింది.(బృహదారణ్యకోపనిషత్తు నుండి).
8.వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో,సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుషశూద్ర భేధము లేక అందరూ అర్హులే.
నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు,శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల(ఆత్మానుభవం పొందినవారు)మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.
దుష్టము,సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని,ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP