శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ప్రదోష పూజ – విష్ణు సహస్రం

>> Thursday, March 31, 2016

ప్రదోష పూజ – విష్ణు సహస్రం
ఒకసారి పరమాచార్య స్వామివారు మైలాపూర్ లో పర్యటిస్తున్నారు. వారి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. దాదాపుగా మద్యాహ్నం రెండు గంటల సమయమైనా మహాస్వామి వారు కోలుకోలేదు. గంట గంటకు జ్వరం ఎక్కువ అవుతోంది.
ఆరోజు చంద్రమౌళీశ్వరునికి జరిగే అభిషేకము, ప్రదోష పూజ చూడటానికి చాలా మంది భక్తులు వచ్చారు. వారు స్వామివారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. బహుశా స్వామివారు ఆరోజుకి కోలుకోలేరేమోనని అనుకుంటున్నారు. కాని మహాత్ముల లీలలు మనలాంటి సామాన్యులకు తెలుస్తాయా?
వెంటనే స్వామివారు శిష్యులని పిలిచి దగ్గర్లో ఉన్న వేద పండితులను సమావేశపరచి ఆపకుండా విష్ణు సహస్రం పారాయణ చెయ్యించమని ఆదేశించారు. దాదాపు మూడు గంటలప్పుడు స్వామివారి చుట్టూ ఉన్న వేద పండితులు విష్ణు సహస్రం పారాయణ చేస్తుండగా స్వామివారికి తీవ్రమైన చమట పట్టడం మొదలైంది. కొద్దిసేపటికి జ్వరం మాయమైపోయింది.
స్వామివారు స్నాదికాలు ముగించుకుని, చంద్రమౌళీశ్వరునికి అభిషేకము, ప్రదోష పూజ మొదలుపెట్టారు. విష్ణు సహస్రనామ పారాయణ యొక్క విశిష్టతను మహాస్వామి వారు ప్రత్యక్షంగా చూపించారు. పరమశివునికి ప్రీతికరమైన రోజున విష్ణు సహస్రం పారాయణ చెయ్యమని చెప్పి శివ కేశవులకు అభేదం లేదని, ఇద్దరు ఒక్కటే అని స్వామి వారు నిరూపించారు.
వారు తలచుకుంటే ఎటువంటి బాధనుండి అయినా బయటపడగలరు. కాని దాన్ని వారు స్వయంగా అనుభవించి ప్రారబ్ధకర్మను ఎంతటివారైనా అనుభవించవలసిందే అని చాటి చెప్పారు.
కేవలం పరిశుద్ధమైన భక్తి చేత మాత్రమే ప్రారబ్ధము, సంచితము మరియు ఆగామి అనే మూడు రకాలైన కర్మల నుండి విముక్తి పొందగలము.
[ఉన్న ఒక్క పరబ్రహ్మ స్వరూపం సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ గాను, స్థితి చేసేటప్పుడు విష్ణువు గాను, లయం చేసేటప్పుడు శివుడిగాను కనపడుతుంది. వారిలోని చైతన్య స్వరూపము, శక్తి స్వరూపమే వారి భార్యలు సరస్వతి, లక్ష్మీ, పార్వతులుగా ప్రకటనమవుతారు. ‘రెండు లేదు’ అనునది సత్యం. రుద్రాక్షలు ధరించి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసే అద్వైత పీఠాధిపతులు సర్వకాలములయందు నారాయణ నామం జపిస్తూ ఉంటారు. భజగోవిందం భజగోవిందం భజగోవిందం అని గోవింద నామాన్ని వ్యాప్తి చేసినది శంకర భగవత్పాదులే]
”శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
శివస్య హృదం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివః
యథా శివమయో విష్ణు ఏవం విష్ణు మయ శివః”
‪#‎KanchiParamacharyaVaibhavam‬ ‪#‎కంచిపరమాచార్యవైభవం‬

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP