దళారీల ‘మత’ పాఠం!
>> Monday, November 2, 2015
దళారీల ‘మత’ పాఠం!
[ఆంధ్రభూమి సంపాదకీయం ]
- 02/11/2015
TAGS:
ఆవులను
హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేయడం మతపరమైన అసహిష్ణుతకు నిదర్శనమని
‘మూడీస్’ అన్న విదేశీయ సంస్థ నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. కానీ మన
ప్రభుత్వం వారు ‘మూడీస్’ వారిని గట్టిగా మందలించకపోవడమే ఆశ్చర్యకరం. తమ
దేశంలో మానవ అధికారాలకు భంగం కలిగిందన్న నిర్ధారణలను పాశ్చాత్య దేశాల
ప్రభుత్వాలు, సంస్థలు చేసినప్పుడల్లా చైనా ప్రభుత్వం తీవ్రంగా ప్రతిక్రియకు
పాల్పడుతోంది! గతంలో అమెరికా అధ్యక్షుడు-ఇప్పుడు మాజీ అధ్యక్షుడు-జారజ్
బుష్ ప్రజాస్వామ్య పద్ధతుల గురించి సలహాలివ్వడానికి యత్నించినప్పుడు ‘ఇరాక్
తరహా ప్రజాస్వామ్యాన్ని మాకు నేర్పకండి’ అని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్
పుతిన్ పత్రికా ప్రతిధుల సమక్షంలోనే బుష్ ముఖం మీద కొట్టాడు. ఇరాక్
‘ప్రజాస్వామ్య రాజ్యాంగం’లో ‘ఇస్లాం’ను అధికార మతంగా గుర్తించడానికి
అమెరికా వీలు కల్పించింది. ఇలాంటి వారు మనకు పాఠాలు చెబుతున్నారు! అంతర్గత
వ్యవహారాలలో విదేశీయుల అక్రమ ప్రమేయానికి ఇది మరో సాక్ష్యం, ఈ అనుచితమైన
జోక్యాన్ని తీవ్రంగా నిరసించకపోవడం మన ప్రభుత్వం వారి మెతక విధానానికి మరో
నిదర్శనం! ‘‘స్వచ్ఛందం’’ ముసుగు వేసుకుని ఉన్న ఈ ‘మూడీస్’ అన్న ‘దళారీ’
సంస్థ వారు అనేక ఏళ్లుగా మన దేశాన్ని బెదిరిస్తున్నారు. ఇంత వరకూ ఈ
బెదిరింపు ఆర్థిక వాణిజ్య వ్యవహారాలకు మాత్రమే పరిమితమై ఉంది! ఇప్పుడు
‘మూడీస్’ వారు ‘సర్వమత సమభావం’-సెక్యులరిజమ్ గురించి కూడ మన దేశానికి
బోధించడానికి నడుం బిగించి తమ బోధనలను విని ‘బుద్ధిగా
ప్రవర్తించకపోయినట్టయితే’ మన దేశం అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోగలదని
‘మూడీస్ అనలటిక్స్’ వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హెచ్చరించడం మనదేశం
పట్ల ఈ ‘సంస్థ’కున్న తేలికభావానికి నిదర్శనం! దశాబ్దుల తరబడి ఇలాంటి
ప్రచ్ఛన్న బీభత్స సంస్థల వ్యూహాత్మక దురాక్రమణను మన ప్రభుత్వం
సహించడంవల్లనే ఈ ‘మూడీస్’ ఇప్పుడింతగా బరి తెగించింది. మనదేశంలో
‘అసహిష్ణుత’ పెరిగిపోతోందట, నరేంద్ర మోదీ ఈ అసహిష్ణు ప్రవృత్తిని అదుపు
చేయాలట! ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అల్పసంఖ్యాక వర్గాలవారిని
రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారన్నది ‘మూడీస్’ వారు నిర్భయంగా
నిర్లజ్జగా చేయగలిగిన ఆరోపణ! ఈ నాయకులను నరేంద్ర మోదీ కట్టడి
చేయకపోయినట్టయితే ప్రపంచ వ్యాప్తంగా మన దేశం విశ్వసనీయత దెబ్బ తింటుందట!
‘తింటే’ ఏమవుతుంది? ఐరోపా, అమెరికాలకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు
మన దేశంలో పెట్టుబడులను పెట్టవన్నది ‘మూడీస్’ నిర్ధారణ! ‘బహుళ జాతీయ
వాణిజ్య సంస్థలు’ పెట్టుబడులను పెట్టి ఉద్ధరించకపోతే మన దేశం ఆర్థికంగా
దివాలా తీస్తుందన్నది ‘మూడీస్’ వారి దురహంకారపూరితమైన హెచ్చరిక...బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు భారత్ వంటి ప్రవర్ధమాన దేశాలలోని ‘పంట పొలాలలోకి వన వరాహాల’ వలె చొరబడిపోవడానికి వీలైన రంగాన్ని సిద్ధం చేయడానికి ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటి దళారీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇవి స్వచ్ఛంద నిష్పాక్షిక అంతర్జాతీయ సంస్థలుగా చెలామణి అవుతుండడం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ సృష్టించిన మాయాజాలంలో భాగం! వీటిని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దళారీ ముఠాలుగా ఋజువు చేయడం బ్రహ్మదేవునికి కూడ సాధ్యం కాదు. అంత పకడ్బందీగా బహుళ జాతీయ వాణిజ్య వంచన క్రీడ జరిగిపోతోంది! అందువల్ల ఇలాంటి సంస్థలు వివిధ దేశాల ‘పరపతి’ స్థాయి-సావరిన్ రేటింగ్స్-గురించి అప్పుడప్పుడు నిర్ధారణలను చేసి నివేదికలిస్తున్నాయి. వర్ధమాన దేశాల ‘పరపతి’ స్థాయి తగ్గిపోతోందని బెదిరించడం ద్వారా ఆయా దేశాల ఫ్రభుత్వాలు తాము కోరిన సంస్కరణలను జరిపే విధంగా ఒత్తడి చేయడం ఈ దళారీ సంస్థల ప్రధాన కార్యక్రమం! వ్యవసాయదారులకు, వినియోగదారులకు ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేయడం, చిల్లర వ్యాపార రంగంలోని ‘బహుళ జాతీయ సంస్థల’ ప్రవేశాన్ని ఆమోదించడం, మంచినీటిని సేద్యపు నీటిని ఉచితంగా సరఫరా చేసే పద్ధతికి స్వస్తి చెప్పించి, నీటి వనరులను వ్యాపారానికి అప్పగించడం వంటివి ఈ సంస్కరణలలో కొన్ని మాత్రమే! మనదేశంలో మత సామరస్యం దెబ్బ తినిపోతోందన్న నిర్ధారణ ‘మూడీస్’ వారి కొత్త ఎత్తుగడ! ఈ ఎత్తుగడ వెనుక అమెరికా ఐరోపా దేశాలకు చెందిన మతం మార్పిడి ముఠాల కుట్ర పొంచి ఉంది! నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విదేశీయ బృందాలను నియంత్రించడానికి యత్నిస్తుండడంతో ఆ తండాల వారు మూడీస్‌ను రంగంలోకి దింపారు!
ఆర్థికపరమైన అక్రమ ప్రమేయాన్ని సాగిస్తున్న ‘మూడీస్’ వంటి సంస్థలు ‘మత సామరస్యం’ గురించి నివేదికలను ప్రచురించడానికి నేపథ్యం ఇదీ! ‘ఇనె్వస్టర్స్ సర్వీస్’-పెట్టుబడి దారుల సేవల విభాగం-పేరుతో ‘పరపతి స్థాయి’ని నిర్ధారిస్తున్న ‘మూడీస్’వారు, ‘అనలటిక్స్’-విశే్లషకుల విభాగం-కూడ ప్రారంభించినట్టు ఇప్పుడు ప్రచారం అవుతోంది. ఈ అనలిటిక్స్ వారు చేసిన మొదటి నిర్ధారణ బహుశా ఇదే కావచ్చు- మన దేశంలో ‘అసహిష్ణుత’ పెరుగుతోందన్నది! ‘సజ్జనుని దుర్జనుడు దుర్జడని పిలువడానికి’ యత్నించడమంటే ఇదే మరి...అనాదిగా మన దేశం సర్వమత సమభావ స్వభావాన్ని కలిగి ఉండడం చరిత్ర నిరూపించిన అంతర్జాతీయ వాస్తవం! అందువల్లనే హైందవ జాతీయ జీవనంలో అనేక మతాలు సమాంతరంగా సమానంగా పరిఢవిల్లాయి. హైందవ సంస్కృతి సర్వమత సమభావానికి మరో పేరుగా వికసించింది! ఈ సర్వమత సమాన వ్యవస్థ వర్తమానంలో కూడ ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా విజయవంతం అవుతుండడానికి కారణం ఈ హైందవ జాతీయ స్వభావం మాత్రమే! ప్రపంచంలోని అనేక దేశాలలో అల్పసంఖ్యాక మత వర్గాల వారు స్వదేశాలను వదిలి పారిపోతుండడం దశాబ్దులుగా ప్రస్ఫుటిస్తున్న వైపరీత్యం. ఎందుకంటే ఆయా దేశాలలోని అధిక సంఖ్యాక మత వర్గాలవారు అల్పసంఖ్యాకులను హత్య చేశారు, చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంనుండి అల్పసంఖ్యాక మతస్థులు ఇతర దేశాలకు పారిపోయిన చరిత్ర లేదు,పారిపోవడం లేదు! కానీ నిన్న నేడు కూడ పాకిస్తాన్‌నుంచి, బంగ్లాదేశ్‌నుంచి అల్పసంఖ్యాకులు తరిమివేతకు గురి అవుతున్నారు! ‘మూడీస్’ కామెర్ల దృష్టికి పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను ఆవిష్కృతమైన, ఆవిష్కృతం అవుతున్న మతోన్మాద పైశాచిక దృశ్యాలు కనబడవు...
ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలో సర్వమత సమభావానికి చోటులేదు. ఐరోపా దేశాలు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలుగా ఏర్పడి ఉన్నప్పటికీ క్రైస్తవేతర మతాలవారి సంఖ్య పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఐరోపా సమాఖ్య దేశాల క్రైస్తవ మత స్వభావం మారకుండా చెడిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆ దేశాల ప్రభుత్వాలకు వాటికన్ అధినేతలు తరచు పిలుపులనిస్తున్నారు. ఇవన్నీ ‘అసహిష్ణుత’కు అంతర్జాతీయ ఉదాహరణలు. భారతదేశంలో గతంలో కాని ప్రస్తుతం కాని మత రాజ్యాంగ వ్యవస్థ లేదు! భవిష్యత్తులో ఉండదు ఎందుకంటే ఈ దేశపు వౌలిక జాతీయతత్వమైన హిందుత్వం సర్వమత సమాహారం. సర్వమత సమాన భావం... ఈ దేశానికి మూడీస్ వంటి దళారీలు ‘సహిష్ణుత’ గురించి పాఠాలు చెప్పనక్కరలేదు..
0 వ్యాఖ్యలు:
Post a Comment