శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పరమ గురువులకరుణ...పవనసుతుని అనుగ్రహం చవిచూపిన హనుమత్ రక్షాయాగం [2015]

>> Tuesday, May 19, 2015

ఇది ఏడవ ఆవృతిగా సాగుతున్న  హనుమత్ రక్షాయాగం. అందులోనూ ఈ సంవత్సరాధిపతి శనైశ్చరులవారు.. జరుగుతున్నది శనిత్రయోదశి రోజు. పాపపుణ్యకర్మలకు ఫలితాలను వెంతనే ప్రసాదింపజేసే వారు ఆయన.
యాగం ససంకల్పించినప్పటినుండి కనపడకుండా  ఎన్నో ఆటంకములు ఎదురొచ్చాయి. యాగప్రతులతయారీ వద్దనుండి పంపిణీవరకు ఒంటరి ప్రయాణమైంది . ఇక యాగసమయం దగ్గరకొచ్చేసరికి ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలకుదగ్గరగా ఉండే కొద్దిమంది  కూడా వారి వారి పనులలో బిజీ .  సామాగ్రిని చేరవేసుకోవటం  అన్నీ సమకూర్చుకోవటం ఒక్కనివల్ల అయ్యేపనేనా అనే విసుగుకూడా కలిగింది ఒకదశలో.అదీకాక ఈమధ్య ఈయాగం శాస్త్రీయమాకాదా అని మనసులో ఓ అనుమానం తొలుస్తున్నది కొదరుపెద్దల మధ్య నాకు పరోక్షంగాలో జరుగుతున్న చర్చలగూర్చి తెలసి .స్వామి మీద చిన్న తాటాకుపందిరి వేపించటానికి కూడా  సాధ్యం కాలేదు. తాటాకు కొట్టటానికి వస్తానన్న కుర్రవాడుకూడా రావటం కుదరలేదు.  . ఈ కార్యక్రమంలో ప్రధానంగా చేదోడుగాఉండే మనోహర్ జర్మనీవెళ్ళాడు. సునీల్ వ్యక్తిగత ఇబ్బందులలో ఉన్నాడు.మిగతావాళ్లు దూరప్రాంతం లో ఉన్నాడు. స్థానికంగా అందుబాటులో  ఉండే అంజిరెడ్డి,రామాంజిరెడ్డి ఇద్దరికీ వృత్తిపరమైన ట్రైనింగ్ లు, నాగిరెడ్డి ఢిల్లీ లో పనుందని తిరుగుతున్నాడు. ఎవరిని పిలచి రెండురోజులు నిలబడండిరా ! అన్నా మొహం తప్పుకు తిరుగుతున్నారు.దీనికి తోడు పెరుగుతున్న ఎండవేడిమి కి అగ్నికార్యం ఎలా అన్న వత్తిడి. ఇంత వత్తిడిలో కూడా స్వామి అనుగ్రహం మీద నమ్మకం కోల్పోలేదు నేను .

రెండురోజులముందు సెలవుపెట్టి మాపిల్లలిద్దరూ వచ్చారు, ముక్కెళ్ళపాడునుండి ఆదిశేషు,సుబ్బారావు, దరిశినుండి వెంకటేశ్వరరెడ్డి  మాపెద్దతమ్ముడు కృష్ణ నిర్విరామంగా పనిచేశారు . కురిచేడునుండి మా శ్రీను మనిషిని గుంటూరుపంపి పూలు తెప్పించాడు. మాస్టారూ! మీవెంట నేనున్నానని హైదరాబాద్ నుండి త్రినాథ్ శర్మ,సంతోష్ ను వెంటబెట్టుకుని తెల్లవారుఝామునే దిగాడు.     యాగం విషయంలో  మేము చూసుకుంటామని గోపాకృష్ణమూర్తిభట్టు ఆయన శిష్యులతో శనివారం ఉదయాన్నే చేరారు .స్వామి ఆదేశించినట్లు గా మాభట్టుగారు శనివారం రోజు మనయాగం అయ్యేవరకు చల్లగా ఉంటుంది లెండి వాతావరణం అని అన్నారు. స్వామి కృప ఆరోజు  తన ప్రియశిష్యుని పేరిట జరుగుతున్న యాగాన్ని చల్లనిచూపులతో చూస్తున్నట్లు వాతావరణం చల్లబడింది.
కానీ సూర్యుపుతృడు మాత్రం పరీక్షలు పెట్తటం ఆపలేదు. వినుకొండనుండి టెంట్ లు సామానులు తెస్తున్న ఆటో డ్రైవర్ తెలివితక్కువతనం వలన రూటుమార్చుకుని తిమ్మాపురంవెళ్ళి అందులో ఆయిల్ అయిపోయి ఆగిపోయింది. మాతమ్ముడూవాళ్ళు వెళ్ళి దాన్ని స్టార్ట్ చేయలేక ట్రాక్టర్కు కట్టి ఈడ్చుకొచ్చేసరికి రాత్రి పదకొండు అయింది శుక్రవారం రోజు.

ఇక స్వామి ఎన్ని యాగకుండాలు తో యాగం జరపాలన్నది తేలలేదు. శనివారం ఉదయాన్నే స్వామిని మనసులో తలచుకుని ప్రార్ధిస్తే ఐదు..ఐదు.. అని తోచినది మనసుకు. యాగశాలలో ఉన్న ప్రధాన యాగకుండానికి అనుబంధంగా మరో నాలుగు కుండములు తాత్కాలికంగా నిర్మించటం జరిగినది. ఇక్కడొక విచిత్రం. యాగకుండం కట్టడానికి మాదగ్గర ఇటుకలు లేవు చుట్టుపక్కల నాలుగూర్లలో అందరిదగ్గరా సిమెంట్ ఇటుకలున్నాయేగాని దగ్గరలో ఎక్కడా మట్టి ఇటుకలులేవు. కొద్ది ఇటుకలకోసం  అద్దంకిదాకా వెళ్లలేంకదా అని బాధ.  శుక్రవారం రాత్రి తొమ్మిదింటికి నేను ఊర్లోకి వెళ్ళి దండలుకట్టిన పూలుతీసుకుని వస్తుంటే అప్పుడే పడిగపాటి వాళ్ళ ఇంటీవద్ద ఒకట్రాక్టర్ ఇటుకలు దించుతున్నారు. సమయానికొచ్చాయి వెంటనే ఇస్తాను,ఓవంద ఇటుకలు ఇవ్వమని అదే ట్రాక్టర్లో తెప్పించుకున్నాము. రాత్రల్లా కష్టపడి పిల్లలు అలంకరణ చేశారు.

 ఇక  రాగలనా రాలేనా ? అని గొప్పసందిగ్దంలో  వృత్తిపరమైన ఇబ్బందిలో ఉండికూడా స్వామి కార్యమే ముఖ్యం అని త్రినాథ్ రాత్రికి రాత్రి బయలుదేరి తెల్లవారుఝాము నాలుగున్నరకల్లా చేరుకున్నాడు.
ఈయాగం గూర్చి తెలిసినది నేను వస్తానని అడిగిమరీ వచ్చిన సంతోష్ కూడా మాపిల్లలలో ఒకడైపోయి పనందుకున్నాడు.
పొద్దుటే చేరుకున్న భక్తులతో  త్రినాథ్ గణపతి పూజ, నవగ్రహారాధన,శనైశ్చరునికి తైలాభిషేకములు మొదలుపెట్టాడు   తైలాభిషేకం శనైశ్చరులవారు చల్లబడిపోయి మాపై అనుగ్రహంచూపారు. నేను  హనుమంతులవారికి  అభిషేకములు జరుపుసమయానికి గోపాలకృష్ణభట్టు శిష్యులతో దిగారు.
భక్తులంతా తరలివస్తున్నారు. దరిశినుండి బాలబృందంతో ప్రశాంతిస్కూల్ వాళ్లు వచ్చారు. లక్ష్మీనారాయణరెడ్డి.నారాయణరెడ్డి. వారిచే రామనామ జపం చేయించటం మొదలుపెట్టారు. ఈలోపల గతసంవత్సరం అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణం లో పాల్గొన్నవారితరపున ఈప్పుడు కోరినవారి తరపున నూటాఎనిమిది అభిషేకకలశములను ఏర్పాటు చేయటం జరిగినది. చిత్రంగా నెల్లూరునుండి మాతమ్ముడి వెంట అక్కడి కామకోటిపీఠం మేనేజర్ గారు సతీసమేతంగా వచ్చారు. వారి వెంట పరమాచార్యులవారి లాకెట్లు తెచ్చారు. వారిని నేనుగానీ మాతమ్ముడుగానీ ముందుగా ఆహ్వానించలేదు.  ఊరికెవెళుతున్నానని చెబితే వినుకొండలో నేను గతకాలంలో పనిచేశాను ఒకసారి ఆఊరుచూడాలి దారిలో మీపీఠాన్ని దర్శించవచ్చని వారు బయలుదేరారట. ఇదీ పరమగురువుల వాత్సల్యానికి గుర్తు. నడిచేదేవుడు అని ప్రఖ్యాతి నొందిన పరమగురువులు  పరమాచార్యులవారి  ఆశీశ్శులు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ వారిదివ్యపాదపద్మములకు నమస్కరించుకుంటున్నాను.

లోకంలో ధర్మంప్రవర్ధిల్లాలని ,అందరికీ క్షేమం కలగాలని సంకల్పించి అగ్నిప్రజ్వలనం చేశారు .

యాగం ప్రారంభం కాగానే ఈలోకం మరచిపోయాం.   వేదఘోషలతో మార్మోగుతున్న యాగ శాల. మధ్యలో జైశ్రీరాం అంటూ పిల్లల రామనామ జపం. మధ్యలో లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం....... అంటూ తినాథ్ శర్మ తన్మయత్వంతో గానం చేయటం. మరొకసారి స్వల్ప విరామంలో చాలీసా పారాయణం .. అంతయు నీవే  హరి పుండరీకాక్ష  నేను పాడుకొంటున్న కీర్తనలు ,మరలా  భట్తుగారి వేదగానం . హోమంలో వరుసగా నాచేతికందుతున్న  మల్లెలు, తులసీదళాలు, మారేడు దళములు,పుష్పముల త్రినాథ్ గారు సమర్పిస్తున్న నాగవల్లీదళములు,కదళిఫలములు, భట్టుగారిస్తున్న ఆజ్యాహుతులు స్వీకరిస్తూ  అగ్నిభట్తారకులవారు  ఆహా  ,,,,  ఎంత అదృష్టమయ్యా! మాది .హనుమయ్యా  ,తల్లివితండ్రివి ఆపైగురువువు నీవై నడిపిస్తున్నావు  రక్షిస్తున్నావు అంటూ మనసులో ఆనందంతో చెప్పుకుంటూన్నాం అందరం .
 ఇంతమంది భక్తులగొంతులతో కలిపిచేస్తున్న ఈ యాగం తో ఆనందం తాండవిస్తుంది మనసులో అని స్వయంగా భట్టుగారు చెప్పారు.

పరిపూర్ణమనస్సుతో పూర్ణాహుతి సమర్పించాము. ఆపై  శ్రీదేవీ భూదేవీ సమేతంగా  శ్రీవారి కళ్యాణం,,, శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగాయి పెళ్ళి మురిపెంతో శ్రీవారిమోముచూడాలి... మా అమ్మల వదనం లో సిగ్గులుచూడాలి,,, చూడాలేగాని చెప్పలేను.

యాగసమయాన భక్తులుసమర్పించిన దక్షిణలన్నీ నేపాల్ భూకంప బాధితుల సహాయార్దం ఆర్ ఎస్ ఎస్ సేవా విభాగం ద్వారా పంపుతున్నామని ప్రకటించి. దక్షిణమొత్తాన్ని పంపాము. మాభట్టుగారైతే తనకిచ్చిన సంభావనతోపాటు తనదగ్గరున్న మరికొంతకూడా దక్షిణగా సమర్పించారు  ఈ సంకల్పానికి.




ఇక సాయంత్రం   ప్రదోషకాలంలో  శివాభిషేకాలు మొదలుపెట్టాము , ఆసమయంలో స్వామిని స్తుతిస్తూ,కీర్తిస్తూ సాగిన అభిషేకం లో అంతటాతానైన స్వామి ఇక్కడ ఇంతగా భక్తికి వశుడై స్నానమాచరిస్తున్నాడని పులకరించిపోయాము ..... 
మరుసటిరోజు         నెల్లూరునుంచి వచ్చిన ఆదంపతులు లిరువురూ ... స్వామీ ! యాగం ఎలాజరిగినదో  పొగిడితే చిన్నవాళ్ళు కనుక మీకు మంచిదికాదు. అద్భుతమైన సంతోషాన్ని  పొందాము. అన్నారు. నాకైతే పుట్టింటికి వచ్చినట్లుంది అని ఆనందంతో దీవించారా  పెద్దముత్తైదువ.  
అమ్మ అనుగ్రహం ఇలా జరిపించినది. శాస్త్రంతెలియనివారం. మూఢభక్తులం పామరులం, పల్లెజనం మేము , కానీ మాఅయ్య. హనుమయ్య తోడై నీడై ఈ అల్పులజీవితాలకొక సార్ధకత  చేకూర్చాలని  ఇలా జరిపిస్తూ. ఈ యాగంలో   ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నవారందరికీ తన రక్షణప్రసాదిస్తున్నారు.












































0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP