భార్య చేసే పూజలకన్నా భర్తచేసే పూజలవల్లనే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది ఎంతవరకు నిజం?
>> Wednesday, April 29, 2015
* ప్రతి దినం భర్తను అనుమానించే స్ర్తికి ఎటువంటి ఫలితం చేకూరుతుంది? - యన్.సురేంద్ర, కొత్తగాజువాక
ప్రతిదినం భార్యను అనుమానించే భర్తకు ఏ పాపం వస్తుందో అదే వస్తుంది. ఇహలోకంలో శాంతి లేకపోవటం ఇద్దరికీ సమానమే.
* భార్య చేసే పూజలకన్నా భర్తచేసే పూజలవల్లనే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది ఎంతవరకు నిజం?
- రాజు, సూర్యాపేట
మన వేదోక్త కుటుంబ వ్యవస్థ గురించి మన యువతీయువకులకు సరియైన అవగాహన లేకపోవటంవల్లే ఇలాంటి ప్రశ్నలు పుడుతూ వుంటాయి. మన వ్యవస్థలో భర్తముందు జన్మిస్తాడు. తరువాత భార్య జన్మిస్తుంది. భర్త కుటుంబానికి నాయకుడు, భార్య ఆ కుటుంబానికి దీపం. భర్త ఏ దైవకార్యం చేసేనా ‘ధర్మ పత్నీ సమేతస్య మమ’’ అని సంకల్పం చెప్పుకోవాలి. భార్య ‘‘సభర్తృకాయాః మమ’’ అని చెప్పుకోవాలి. ఇది అవశ్య విధి. ఇలాంటి వ్యవస్థలో ఒకరి పుణ్యం ఎక్కువ అనీ, ఒకరిది తక్కువనీ చెప్పే వీలు ఎక్కడుంది?
* పరువుకోసం సొంత కూతురునే హత్యచేసే తల్లిదండ్రులకు ఎలాంటి పాపం వస్తుంది?
- బి. పవన్, హైదరాబాద్
మన ధర్మశాస్త్రంలో అక్రమ సంబంధాలు, వర్ణాంతర వివాహాలు ఇత్యాదులకు చాలారకాల శిక్షలు ఉన్నాయి. గానీ వాటిలో మరణ దండన లేదు. శాస్త్ర నిబంధనలకు అతీతంగా చేసే పరువు హత్యలు కేవలం పగ, ద్వేషం, అహంకారం ఇత్యాది పునాదుల మీద జరిగే క్రూర కర్మలు. మనిషి పగబూని, చేసేది నేరం- అనే సూక్తి వీరికి వర్తిస్తుంది. వీరికి స్ర్తిహత్యా పాపమేగాక, ద్వేషపూర్వక హత్యాపాపము, ధర్మశాస్తధ్రిక్కార పాపమూ గూడా వస్తాయి.
* ధనం ఎవరికి దానం ఇవ్వాలి?
- రాజు, నల్లగొండ జిల్లా
పాత్రత ఎరిగి దానం చేయమన్నారు. అనగా, పుచ్చుకునేవాడి గుణ గణాలు, వాడి అవసరాలు, ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకోవటంలో గల సామర్థ్యాలు, ఇలాంటివి పరిశీలించి కేవలం నిష్కామబుద్ధితో చేసే దానం ఉత్తమ దానమవుతుంది. అన్న దానానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలిగొన్న వాడెవడైనా సరే అన్నదానానికి పాత్రుడే.
* ఎవరి దగ్గర దానం పుచ్చుకోవాలి?
- వల్లీ నాథ్ సూర్యాపేట
దానం తీసుకుంటే ఆ దాత పాపాలు పుచ్చుకునేవాడికి సంక్రమించి తీరుతాయి. వీలయినంతవరకూ ఎవరి దగ్గరా దానం పుచ్చుకోకుండా ఉంటే మంచిది. వృద్ధులైన తల్లిదండ్రులను, భార్యను, రెక్కలు రాని సొంత పిల్లలను, పోషించేందుకు వేరే దారిలేనప్పుడు మాత్రమే తగుమాత్రంగా దానాలు పుచ్చుకోవాలి. అలా పుచ్చుకునేటప్పుడు తమకు దానం పుచ్చుకోవటం మీద ‘‘అభిరుచి’’ ఏర్పడిపోతోందేమోనని ఆత్మపరిశీలన చేసుకుంటూ వుండాలి. అవసరాలకు మించి దానాలు పుచ్చుకుని నిలవ వేసుకునే భావన మనసులోకి రానీయకూడదు. అది ఎవరికీ తగదు.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org
0 వ్యాఖ్యలు:
Post a Comment