శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమంతుడు కాదులేవయ్యా !! ఆయనైతే ఇన్నిమాటలు మార్చడు కదా !

>> Sunday, November 30, 2014

మొన్నఒకరోజు పూజ అయిపోయాక టిఫిన్ చేయబోయేసమయంలో ఒకతను పీఠానికొచ్చాడు. ఎవరుస్వామీ మీరు?అనడిగాను. మాది శాశంవారిపాలెం  ఒకసారి ఇక్కడకొచ్చాను అన్నాడాయన . సరే  ప్రసాదం తీసుకోండి అని ఇంట్లో నుండి ఆయనకు ప్రసాదం ,మంచినీళ్ళు ఇచ్చి  ,ఇప్పుడు చెప్పండి  ఎందుకొచ్చారు ? ఏంకావాలి అనడిగాను . మీ గుడి గవర్ణమెంట్ లో చేరిందా ? అన్నాడు [ఆయన మాట మోటుగాఉంది. ]
ఇది గుడికాదు  .పీఠం అన్నాను
ప్రతిష్ఠ జరగలేదా ?
జరిగింది. కానీ ఆలయ మర్యాదలు,ఆచారాలు వేరు ,పీఠం విషయం వేరు అని చెప్పాను.
సరే ! ఇవి పక్కనుంచండి .ఇంతకీ మీరెందుకొచ్చారు  అది చెప్పండి ముందు అనడిగాను.


నేను దేవారంగ్రామం దగ్గరున్న ఆలయంలో ఆంజనేయస్వామి దగ్గర పూజ చేసేవాడిని .ఇప్పుడు ఇంటిదగ్గరే పూజచేసి ప్రశ్న చెబుతుంటాను .రోజూ ఓ ఇరవైముప్పైమంది వస్తుంటారు .
మీరేం చేస్తారిక్కడ ?మీశిష్యుల చేత ఏంచేపిస్తారు?  అనడిగాడు.

స్వామి ! ఇక్కడ గురువులెవరూ లేరు ? ఇక శిష్యులెక్కడుంటారు? ఏదో కృష్ణా రామా అనుకొని భజన సాంప్రదాయంలో ,సంకీర్తనలు,పూజలు జరుపుకుంటుంటాము. అందరితో కలసి . అని వివరించాను.

నేనొక ఆలయం కట్టాలనుకుంటున్నాను .ముహూర్తం కోసం చూస్తున్నాను అన్నాడాయన.

అదేమిటీ ? మీరు దేవారం దగ్గర ఆలయంలో పూజలుచేస్తున్నారంటిరే ??

పూర్తి విషయం చెబుతాను  .  అని  మొదలుపెట్టాడాయన  నాకసలు మొదట్లో  దేవుడంటే పెద్దగా అసక్తి లేదు. మావూర్లో వాళ్ళు మార్కాపురం  దగ్గరున్న   ఊర్లో  ప్రశ్న లడగటానికి వెళుతుంటే వాళ్లవెంట వెళ్లాను . అక్కడ గణాచారి గారికి ఒంటిపై దేవత ఆవహించి  వచ్చినవారెందుకు వచ్చారో  వారి కోరికేమిటో తెలియజేస్తుంది.
నేను వెళ్లగానే మొదట ఉన్నవారిని కూడా ఆపి నన్ను పిలచాడు . ఏమయ్యా  మీ ఊరికి తూరుపుగా ఒక ఆంజనేయస్వామి ఆలయం వెలుగులేకుండా ఉంది . నీద్వారా  అక్కడ అభివృధ్ధి  జరుగుతుంది. ఇక్కడలాగే అక్కడకూడా నువ్వు ప్రశ్నచేప్తావు  అన్నాడు. మా మూడు ఊర్ల మధ్యలో దేవారం దగ్గరున్నదే పాత కాలంనాటి ఆంజనేయస్వామి గుడి.ఎవరూ పట్టించుకోవటం లేదు.  నేను రోజూ వెళ్ళటం  పూజచేసుకోవటం . పూజచేసుకుంటుంటే ప్రశ్నచెప్పమని అనిపించింది. అక్కడ నుండి జనం రావటం ప్రశ్నలు చెప్పటం ,నాకు ఒంటిపై ఆంజనేయస్వామి రావటం. ఇలా బాగా జరిగింది రెండేండ్లు. ఆతరువాత ఒకరోజు కలలో నాకు స్వామి కనపడి పలనా సర్వేనంబర్ లో నాకు  పొలం వుంది నువ్వు దాన్ని తీపించు అని చెప్పాడు. మరుసటిరోజు  నేను  వీఆర్వో దగ్గరకెళ్ళు అడిగిచూస్తే స్వామి చెప్పిన సర్వేనంబర్లో ఆపొలం ఉంది. కాకుంటే ఆపొలం  పెద్దవాళ్లచేతుల్లో ఉంది. దానికోసం వాల్లందరినీ అడిగి అది గుడికి ఇప్పించమన్నాను. నాపై వాల్లకు కోపం వచ్చింది. ఇక్కడ నుండి నాపై  పగబెట్టుకున్నారు. నేను భయపడకుండా అద్దంకి వెళ్ళి  దేవాదాయశాఖ ఈ వో ను కలసి దీనిపై పోరాడాను. చివరకు దేవాదాయ శాఖవాళ్లు ఆపొలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ నుండి ఇప్పటిదాకా  పొలం అనుభవించుకున్నవారు గుడినుండి నన్ను వెళ్లగొట్టే పని పెట్టుకున్నారు. ఏదో ఒక వంకతో తగాదాలు పెట్టుకునేవారు .చివరకు ఈ గొడవలు నాకెందుకని  నేను  మావూర్లోనే ఇంటివద్దే పూజచేసుకోవటం ప్రశ్న చెప్పటం చేస్తున్నాను.స్వామి నాకు కలలో కనపడి గుడితాళాలు నీదగ్గరకు రప్పిస్తాను అని చెప్పాడు .  మా అవిడకు కూడా నాగమయ్య స్వామి వంటి మీదకొస్తున్నాడు .జనం బాగా వస్తున్నారు.
ఈ మధ్య స్వామి కలలో కనపడి     ఒకస్థలం చూపి  కొలతలు చెప్పి ఇక్కడ గుడికట్టుకోమని చెప్పాడు .  అందుకని ముహూర్తం చూసుకుని మొదలు పెడదామని అనుకుంటూన్నాను. వేసవిలో  మావూరివాళ్ళు ఇక్కడ అన్నపూర్ణ శాలకు  స్లాబ్ కోసం చెక్క సెంట్రింగ్  బిగించేందుకు వచ్చారు  కదా , అప్పుడు వాళ్లు నీగురించి చెప్పారు. నేనొకసారి దార్లో వెళుతూ వచ్చి వెళ్లానుగాని మాట్లాడటం కుదరలేదు అందుకని ఈరోజు నరసరావు పేట వెళుతూ మాట్లాడిపోదామని వచ్చాను అన్నాడు.

ఆయన మాట మొరటుగాఉన్నాగానీ  భక్తిభావం,అమాయకత్వం కలగలసి ఉన్నాయి. ఈయనకోసం నాకుతెలిసిన విషయం చెప్పటంలో తప్పులేదనిపించింది.

చూడు స్వామీ ! ఇప్పుడు మీచేత ఎవరు ఇదంతా చేపిస్తున్నారనుకుంటున్నారు ? అడిగాను
ఇంకెవరు ?ఆంజనేయస్వామే కదా అన్నాడాయన.
నాకైతే ఇది స్వామి అనుగ్రహంలా కనిపించటంలా !
మీరేమనుకోకండి  నాఅభిప్రాయం చెపితే తప్పనుకోరుగా అనడిగాను.

అయ్యో ! నాకు ఇలా విషయాలు  తెలుసుకోవటం బాగా ఇష్టం చెప్పుస్వామీ అన్నాడాయన.


లోకంలో సిధ్ధపురుషులు,మహాయోగులుంటారు. వాళ్ల బోధన,నడిచేమార్గం భగవన్మయంగా సాగుతుంటాయి.భగవంతునిసేవ,సనాతనమైన ధర్మం,తప్ప మరో విషయానికి ప్రాధాన్యత ఇవ్వరు వాళ్లు.ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో వాళ్లవిషయం పక్కనపెడదాం.

 మీరు చెప్పినట్లుగా   భగవంతుడు వంటిమీదకు రావటం, ప్రశ్నలు చెప్పే చిల్లరపనులు  చేస్తాడం టే నేను  నమ్మలేను.


ఇప్పుడు కొన్నిచోట్ల ప్రశ్నలు చెపుతున్నారని,తాయెత్తులిస్తున్నారని ,వంటిమీదకు స్వామి వస్తున్నారని ఊగేవాళ్లందరి దగ్గరకు జనం వెర్రిగుంపులా పరిగెత్తటం, కొంతకాలానికి అక్కడ మహిమ తగ్గిందని ఇంకొకరిదగ్గరకు ఉరకటం చూస్తున్నారుకదా !
నాఅభిప్రాయమేమిటం టే ! ఇలా మహిమలు చూపుతున్నారనుకునేవాళ్ళు  మూడు రకాలు .
ఒకటి ఏదోపూర్వజన్మ పుణ్యం వలన కాస్త ఆథ్యాత్మిక సాధన అబ్బి ఏవో ఆథ్యాత్మిక శక్తులు మేల్కొనడం వలన వాళ్లకు ఎదుటివారి విషయాలు కొద్దిగా తెలుస్తుండటం జరుగుతుంది.  తనకు ఉన్న ప్రత్యేకతను ఆయన మార్కెట్లో పెట్టినట్లు పెట్టి జనాన్ని పోగేసుకుని గౌరవం పొందటం కోసం చూస్తాడు. అయితే ఈయన బాటరీ రీచార్జ్ అవగానే ఈయన ఇంకేమీ చెప్పలేడు. జనాన్ని వదలుకోలేక అబద్దాలన్నా చెప్పటానికి ప్రయత్నిస్తాడు. ఈయన దగ్గర ఉప్పులేదని తెలసి జనం ఇంకొక చోటుకు వెళుతుంటారు.

 ఇక రెండవ రకం  వీరు అమాయకులు. గతజన్మలో సాధనలో పొరపాట్ల వలన ఉన్నతగతిని పొందలేక ప్రేతాత్మలై తిరిగే కొందరికి వీళ్లు వశులవుతారు . ఇలాంటి అత్మలలో కొందరు భగవద్భక్తిని కలగినవారు ఉన్నాగానీ , ఈ పిశాచజన్మ లో తాము తమ జీవితకాలంలో చేద్దామనుకున్న పనులు   మీలాంటి అమాయకులద్వారా సాధించాలనుకుంటారు .నేను దేవుడ్ని ,అని   నమ్మబలికి ,మీదగ్గరకొచ్చేవారి విషయాలు మీకుచెబుతూ మీకు దేవుడే ఇదంతా చెబుతున్నాడు అనే నమ్మకాన్ని కలిగిస్తారు. ఉన్మాదంలో ఊగిపోయేట్లు.దొర్లేట్లు,కొన్నిసార్లు మీకు పరిచయం లేని భాషలో కూడా మాట్లాడుతూ,  తక్కువస్థాయి మహిమలు చూపుతూ మిమ్మల్నొక దేవతాంశలుగా నమ్మింప జేస్తారు .
అయితే   ఈ రకం సాధకుల ఆత్మలతో చిక్కెమిటంటే తాము ఏదో మంచిచేస్తున్నామని భావిస్తూ ,ఎవరిని ఆవహిస్తుంటారో వాళ్లచేత వెర్రిచేశ్టలు కూడా చేపిస్తుంటారు. ఎంతైనా పిశాచజన్మకదా! ఏదో ఒకరోజు .ఉన్నట్లుండి హఠాత్తుగా  మీలాంటి వాళ్లను వదలి వెళ్లిపోతుంటారు. దాంతో  జనం దృష్టిలో పిచ్చివాళ్లయి పోయినవాళ్లను, ఆత్మహత్యలుచేసుకున్నవాళ్లగూర్చికూడా నాకు తెలుసు. ఏదో విధంగా స్వామి అనుగ్రహం ఉంటేమాత్రం , ఈవిషయం మీకు తెలిసి వాటినుండి తప్పుకుని భగవంతుని చెంతకు  చేరే శుధ్ధ మార్గానికి మళ్లుతారు.

ఇక మూడోరకం పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్స్ కొందరుంటారు. వీళ్లకు మానవసైకాలజీ పై బాగాపట్టుఉంటుంది. పేరాశభక్తుల లో ఎలా దురాశపెంచి వసూళ్లుపిండుకోవాలో ,ఆ గారడీ విద్యలన్నీ వీళ్ళకు కొట్టిన పిండి.
ఇది కలియుగం కనుక యుగధర్మాన్ననుసరించి పేరాశతో చేరేవారంతా పోలో మని వెళ్లి  బలవుతుంటారు.

నేను చెప్పినదాంట్లో ఒక్కసారి ఆలోచించు.  నీకు స్వయంగా ఆంజనేయస్వామి అనుగ్రహం దర్శనం,ఆయన భాషణం వినగలిగే అదృష్టం ఉంటే . ముందు  దేవారం ఆలయం అభివృధ్ధి చేయాలని  చెప్పాడన్నావు ఆయనే,మరలా మాటమార్చి ఇంకొక చోట చోటు చూపించి అక్కడ ఆలయం కట్టమని చెబుతాడా ? ఇన్నిరకాలుగా మాట మార్చటం మనస్వామి అవతారంలో ఎక్కడైనా ఉందా? ఆలోచించి చూడు. ఇదెవరో ? నిన్ను అడ్డం పెట్టుకుని పిచ్చివాణ్ణి చేస్తూ ఆడుతున్న పిశాచ చేష్ఠ లాంటిదే. పూర్వపుణ్యం వలన స్వామి మీద భక్తి కుదిరింది మీకు . పెద్దలనాశ్రయించి శుధ్ధమార్గం లో స్వామిని పరిపూర్ణంగా  భక్తితో సేవించుకోవటమే మనలాంటివాళ్ళకు మంచిది అని వివరించాను,నాకు తెలిసిన విధంగా .


నేను నరసరావుపేట అర్జంటూగా వెళ్ళిరావాలిస్వామీ. మీదగ్గరకు మళ్ళీ వస్తాను మాట్లాడుకుందాం అని వెళ్ళాడాయన ,పదిహేనురోజులయింది   ...... ఇంకా రాలేదు. రాడేమో....!!!!!!



2 వ్యాఖ్యలు:

hari.S.babu December 1, 2014 at 2:17 AM  

ఇంకేం తిరిగి వస్తాడు?
రోకలి కోసం వెళ్ళాడు!

srini December 14, 2014 at 6:42 AM  

Really Interesting and informative article

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP