శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భయం మంచిదా? ధైర్యం మంచిదా?

>> Sunday, March 2, 2014

భయానికి వ్యతిరేక పదం ధైర్యం అనవచ్చ్హా? పిరికితనం అంటే ధైర్యం లేకపోవడమా? అయితే, భయంగా ఉండాలా? ధైర్యంగా ఉండాలా? ధైర్యవంతుణ్ణి పొగరుబోతు అంటారు.  వీడికి ఎవరంటేనూ లక్ష్యం లేదమ్మా అని తిడతారు.  పోనీ, దానికి బదులు భయం ఉంటే, పిరికి వాడని బిరుదిచ్చేసి, దద్దమ్మ అని అవహేళన చేస్తారు.

ఇవన్నీ చూశాక, మనని వెనక్కి లాగేసే భయం కన్నా, ముందుకు నడిపిస్తున్న ధైర్యమే గోప్పదనిపిస్తోంది కదా! ధైర్యం గొప్పదే కావచ్చు.  కానీ కొన్నింటిలో భయాలు ఉండాలి.  మన నడవడిక గుర్రం లాంటిది అయితే, దాన్ని లెఫ్ట్ రైట్ తిప్పి నడిపించే కళ్ళేలు ఈ భయాలూ, ప్రేరేపణలు.  సరిగ్గా చక్కగా, గొప్పగా మనని మనం నియంత్రించుకుంటూ వెళ్ళే కళ్ళేలు మనకి ఉండాలి.

భయం అంటే ఒక విధంగా నియంత్రణ కలిగి ఉండడం.  కంట్రోలింగ్ పవర్ అనచ్చేమో.  ధైర్యం మితిమీరితే నియంత. ఫోర్సు కూడా అనచ్చేమో.

పాప భీతి ఉండాలి!!

మనం సమాజానికి భయపడాలి.  దేవుడికీ పెద్దలకీ, సంఘానికీ సంజాయిషీ ఇచ్చుకోడానికి సంసిద్ధంగా ఉండాలి.  ఆ భయం ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా మనం మంచి పనుల వైపే మనసు పెడతాం.  తప్పులు చేస్తే దేవుడు మనని పాపిష్టివాడుగా జమకట్టేస్తాడు.  అమ్మా నాన్నలు కోప్పడతారు, గురువు కొడతారు,  సమాజం వెలివేసి గోల చేస్తుంది - ఇవన్నీ మనం చేసుకున్న కట్టుబాట్లను వ్యతిరేకించకుండా కాపాడేవి.  ఆ కట్టుబాట్లను అతిక్రమించడానికి భయపడాలి.  భయ భక్తులు అనే జంట పదాలు పిరికితనాన్ని సూచించవు.  మనని వినయవంతులుగా, సంస్కార వంతులుగా తీర్చి దిద్దే భయ భక్తులు ఉండాలి.

ధైర్యం ప్రమాదకారా?

మనకీ, సమాజానికీ మేలు చేసే ధైర్యం చాలా గొప్పది.  సంఘాన్ని సంస్కరించడానికి కావలసిన చొరవ సాహసికి ఉంటుంది.  ధైర్యాన్ని కేవలం స్వార్థ ప్రయోజనకారిగా ఉపయోగించడం ఖచ్చితంగా హర్షణీయం కాదు.  అలాంటి సెల్ఫిష్ పనుల వల్ల పక్క వాడికి నష్టం కలిగించడం జరుగుతూనే ఉంటుంది.  ఒక నేరం చేయడానికి చాలా తెగింపు కావాలి.  ఆ తెగింపుకి పర్యవసానాల స్పృహ ఉండదు.  తన కుటుంబానికి కలిగే క్షోభ తెలియదు.  దానివల్ల సంఘానికి కలిగే నష్టం గుర్తుకు రాదు.  దుష్కృత్యాల వల్ల ఎంతో మంది అమాయకులు, నిరపరాధులు చాలా నష్ట పోతూనే ఉంటారు.

అంచేత ధైర్యం మనని ఉత్తమ పౌరులుగా నిలబెట్టడానికి ప్రేరకం కావాలి.  మంచి పనులు చెయ్యడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి భయపడకూడదు.   7, 8 ఏళ్ల బాలకృష్ణుడు క్రూరాత్ముడైన కాళీయుణ్ణి ఎదిరించడానికి ఎంత సాహసం చేశాడో చూశారుగా.... నీటిని కలుషితం చేసే క్రూరుడు ఎంత బలవంతుడైనా ధైర్యంగా ఎదుర్కోవలసిందే కదా!

చివరగా ఒక మాట.


చీకట్లోంచి వెళ్తున్నామంటే భయం. 
వెలుగు వైపు వెళ్తున్నామనుకుంటే నయం.

ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

1 వ్యాఖ్యలు:

astrojoyd March 3, 2014 at 8:49 AM  

దేవుడంటే భయం ఉండాలి ..తప్పు చేస్తే అయ్నవద్దకు ఎలా వెళ్లి ముఖం చూపించగలను అనే భయం ఉండాలి..అది ఉన్నవాడికి ఆయనే ధైర్యం ఇస్తాడు..భయాలకు --ధైర్యాలకూ ..పరి పరి విధముల భావ-భవ రోగాలకూ సైతం వాడే మూలం అని ఎరిగినవారే విజ్ఞులు మరి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP