శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గంగమ్మకు ఇంతకోపం దేనికొస్తోంది ?

>> Thursday, June 20, 2013

చల్లని తల్లి గంగమ్మ . మనుషుల పాపాలను ధ్వంసం చేసే కర్తవ్యంపై భువికి దిగింది. సగరపుతృలపాపాలను పోగొట్టటమేగాక  భూమిపుతృలకు అండయై జీవరాశిని పోషిస్తూ వస్తుంది . అటువంటి చల్లని తల్లి కి ఇప్పుడు కోపమొచ్చింది.అదీ  మనలను గంగవెర్రులెత్తిస్తూ భీకరరూపంగా . నలభై ఏళ్లలో గంగమ్మకు ఇంత కోపం రావటం చూడలేదని పరీవాహక ప్రాంతవాసులంటున్నారు. ఎందుకిలా జరిగింది. భగవంతుని నమ్ముకుని కొండాకోనలు దాటి పుఞక్షేత్రాలదర్శనానికి వెళ్ళిన జనాలకు ఇంతకష్టం కలిగించినదెవరు. ? నేను గత నెల ఇరవై ఏడున బయలుదేరి వెళ్ళి  ఈనెల ఏడవతేదీ తిరిగి వచ్చాను .  అక్కడ పుణ్యక్షేత్రాలలో  నేను గమనించిన కొన్ని అంశాలు బాధకలిగించాయి. ఇవన్నీ ఎప్పుడొ ముప్పుకలిగిస్తాయి అని మనసుకు తోచింది . వచ్చిన రోజునుంచి నాయాత్రావిశేషాలను వ్రాయలనుకుంటూన్నా కీబోర్డు పై వేలు కదలటం లేదు . అందువలన వ్రాయలేకపోయాను.
ఇక ఇప్పుడు  నేను వ్రాస్తున్న ఈ పోస్ట్ చదివేవారికి నేను మానవత్వం లేనివానిగా కూడా కనిపించవచ్చు. ఆపదలో మనుషులుంటే ఇలావ్రాయటానికి సాహసించటం పద్దతి కాదు. కానీ ప్రకృతి ధర్మాలు మన భావాలను బట్టి మారవు. కనుక నిజాన్ని నిజంలా ఒప్పుకోవలసినదే . అలా మనతప్పులను మనం ఒప్పుకోవటం కూడా ప్రాయశ్చిత్తం లో ఒక భాగమే.

   నాకు చిన్నతనం నుండి హిమాలయభూములంటే ఓ గొప్పభావన. అక్కడ క్షేత్రాలగూర్చి గొప్పవారంతా వ్రాసిన రచనలు , దాశరధి రంగాచార్యుల వంటి పెద్దలు వ్రాసిన యాత్రా గ్రంథాలు నా ఉత్కంఠతను ఇంకా పెంచాయి.  అయితే నలభైనాలుగు సంవత్సరాలపాటు నాకు  ఆఋషిభూములను ,దేవభూములను దర్శించే అవకాశం కలగలేదు.  అడగగా అడగగానేమో అమ్మవారు అనుకోకుండా యాత్రకు వెళ్ళే అవకాశం కల్పించినది ఆతల్లి.
ఇక యాత్రగూర్చి  వ్రాయటం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు కనుక అసలు విషయం లోకొస్తున్నాను.
  గుంపులుగా వేలకొద్దీ తరలుతున్న భక్తులలో చాలామంది లో ప్రయాణంలో గమనించిన వికృత భావాలు వెగటు పుట్టించాయి . అడుగడుగునా వెల్లువెత్తినట్లు కనిపిస్తున్న వ్యాపారధోరణులు మనసులో ఉన్న ప్రశాంతతకు భంగమయ్యాయి. ఇక ఒంటరిగా బయలుదేరటం వలన అనేక ప్రాంతాలు,భాషలవాల్లతో కలసి  కొన్నిసార్లు ప్రయాణించే అవకాశం దొరికింది . ప్రస్తుతం సాగుతున్న ఆథ్యాత్మిక వాతావరణంలో ఆథ్యాత్మికతపాలు ఎంతో కొంతమేరకు తెలుసుకోగలిగాను.
 మధుర నుండి హరిద్వార ప్రయాణ సమయంలో విజయనగరం జిల్లానుంచి వచ్చిన యాత్రికులు రైల్లో తోడయ్యారు. బాగాడబ్బున్నవాల్లుకూడా ఉన్నారు. ఓలారీడ్రైవర్ ఆయన మితృడు  బాగా మాటలు కలిపారు. మధ్యలో వారి జిల్లావారు వీల్లిద్దరినీ రమ్మని సైగ చేస్తున్నారు. ఏమిటీ సంగతి అని అడిగితే ! ఏం లేదండి వాల్లు మాజిల్లావాల్లే ! రాత్రి నుంచి రౌండు కు కూర్చున్నప్పుడల్లా పిలుస్తున్నారు . మేము  మేము మోటారు ఫీల్డ్ వాల్లం అవటం వల్ల మందు అలవాటు ఉంది . కానీ ఈ యాత్రలో మాత్రం ముట్టగూడదని ఒట్టుపెట్టుకున్నాం అన్నారు ఆమితృలిద్దరు. నాకైతే బాగా కోపం వచ్చింది. ఆపిలిచే ఆయనతో ఏమయ్యా ! తాగటం కోసం ఇంతదూరం ఖర్చు పెట్టుకుని రావాలా ? ఇదేందరిద్రం ?  ఎక్కడన్నా  చేసిన పాపాలు పుణ్యక్షేత్రాలలో తొలగుతాయంటారు. కానీ ఇక్కడచేసిన పాపాలుమాత్రం మనలను వదలకుండా పీడిస్తాయి అన్నాను. ఇంకా క్షేత్రాలకు వెల్లలేదు కదండి ? అని ఆయన ఎదురు ప్రశ్నించాడు. ఆయనవెంట పెద్దబంధువర్గం ,ఆడవాల్లుకూడా ఉన్నారు. మన తెలివితేటలు భగవంతుని దగ్గర చూపించక్కరలేదు. మనకు ప్రస్తుతం అవసరమైన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. అందుకనే ఇలాంటి తెలివితేటలు పుడతాయి . ఇప్పుడు కాదు ! రేపు మంచానపడి ఈగలుతోలుకునేప్పుడు తెలుస్తుంది అని దులిపి పారేశాను. ఆయన మొహం నల్లగా పెట్టుకుని వెళ్లాడు. అయ్ బాబో! ఏటండీ ! అంతలా తిట్టేశారు అన్నారామిత్రులు వీల్లు నాతో ఋషీకేశ్ వరకు వచ్చారు .
ఇక రుషీకేశంలో టిటీడి వాల్ల ఆలయంలో  కిశోర్ అనే అర్చక మిత్రుడు పరిచయమయ్యాడు. ఆయనతో మాట్లాడుతుండగా ఢిల్లీ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులలో కొందరు స్త్రీల వస్త్రధారణ చూస్తే   చిన్నప్పుడు "ఎర్రమల్లెలు" సినిమాలో  " కారుల్లోనా తిరిగేతల్లికి కట్టేబట్టే బరువై పోయె" అనేపాట గుర్తొచ్చింది . వీల్లు వచ్చింది దైవదర్శనానికేనా అనుమానం కలుగుతుంది.  డబ్బెక్కువైతే వచ్చే జబ్బులక్షణాల్లో బట్టలు కూడా కట్టుకోలేని స్థితి ఒకటి.
 ఇక దారి పొడవునా గంగమ్మ లో సుడులు తిరుగుతున్న ప్లాస్టిక్ బాటిళ్ళు వ్యర్థాలు . అడుగడుగునా వ్యాపారపు దుకాణాలు . చల్లని గంగనీరు తాగే అవకాశమున్నా, కొండలలో గుచ్చి పైపులద్వారా ఊటజలధారలు అమ్దేలా అమర్చినా , మినరల్ వాటర్ బాటిల్లు కొని తాగిపారేస్తున్న భక్తజనం .  బాగాడబ్బుంటే చాలు హెలీకాప్టర్లో  కేదారనాథ్ దాకా ప్రయాణసౌకర్యం. అక్కడ గడ్వాల్ ప్రాంతప్రజలు చాలా నిజాయితీ పరులు కష్టజీవులు. కానీ ప్రాంతాలన్నీ ఆక్రమించుకుని పాతుకుపోతున్న ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంత వ్యాపారులు, వారివ్యాపారాలు, కొండలల్లో సైతం పారిశ్రామికీకరణ , అక్కడ  గంగను రక్షించుకోవాలని నిరాహార దీక్ష  చేస్తున్న  సాధువులనుకూదా చంపేయగల వ్యాపార మాఫియా పాతుకు పోతున్నది.

 అక్కడ గడగడ వణికించే చలి అని చెప్పారు. కొనుక్కున్న స్వెట్టర్ వెసుకుని నడుస్తుంటే ఉక్కపోత .  డబ్బు ఉన్నది కనుక విహారయాత్రగా ఈప్రాంతాన్ని మార్చిన జనమే ఎక్కువ. ఎక్కువమందికి గంగానది పవిత్రత మీద నమ్మకం లేదు. అందుకే ఆనీళ్ళు తాగలేకపోతున్నారు. అక్కడ పుణ్యక్షేత్రాలపట్ల భయభక్తులు లేవు. అందుకే ఇష్టం వచ్చినట్లు కలుషితం చెస్తున్నారు. పరమపవిత్రంగా భావించే గంగమ్మలో అక్కడ హోటల్లు కాటేజీలనుంచి వచ్చే మురికి కలుస్తుండటం చూసి మనస్సు విలవిల లాడుతుంది.  పూజకూడా వ్యాపారమే పిచ్చిపిచ్చి వస్తువులన్నీ పూజాద్రవ్యాలుగా అమ్మటమే. అక్కడకెళ్ళికూడా  ఎటువైవు లొసుగుమార్గాలున్నాయో వెతకటం ,డొంకదారులలో దర్శనమెలా అని ఆలోచించటం . ఎప్పటికి మారతాం మనం ?
 డబ్బు జబ్బు పట్టిన చోటల్లా ఉండే వికృతాలు దేవభూమిని కలుషితం  చేస్తున్నాయి . చిన్నతనం నుంచి ఉన్న ఊహలు తల్లక్రిందులయ్యాయి . నేననుకున్న హిమాలయాలు ఇంకా ఎత్తుకు పోతేగాని కనపడవేమో అనిపించింది దూరంగా కనిపించే మంచుశిఖరాలను చూస్తుంటే .
        
      ఇక బదరీ వెళుతుంటే అనంతపురం వాసులు బస్సులో పక్కనే కూర్చున్నారు. ఆబృందంలో ఒక త్రాష్టుడున్నాడు . వాడు ఆగ్రూపు లీడర్ను తిడుతున్నాడు. నువ్వు పనికిరానివాడివయ్యా . మేమడిగినవేవి? అక్కడ బస్సు ఆపించు అని. ఏంటి సార్ సంగతి అనడిగితే. లేనిపోనిది తగిలించుకున్నానండి. నేనొక్కడ్ని ప్రశాంతంగా వచ్చినా బాగుండేది. బయలుదేరినకాడ్నుంచి ఏడిపిస్తున్నాడు. వీడికి మమ్దు,విందులు కావాలత అని చెప్పుకొచ్చాడా పెద్దాయన? ఇదేంపనయ్యా ? అంటే . ప్రయాణమంటే సరదా ఉండాలండి అని ఎదురు వాదన వేసుకున్నాడు నాతో. ఇదిగో ఇలా తగలడింది ఇప్పుడు యాత్రంటే. ఇన్నికలుషితాలు భరిస్తున్న గంగమ్మకు కోపం వస్తే ? అని మనసులో ఆరోజు అనిపించింది. ఈరోజు కనిపిస్తున్నది.

భక్తిపేరుతో డబ్బులున్నాయని ప్రతిపుణ్యక్షేత్రాన్ని విహారయాత్రాక్షేత్రంగా మారుస్తున్న మనం ఋషుల ఆగ్రహానికి దేవతల ఆగ్రహాలకు గురికాక తప్పదు. ఈ అకలుషితాలను కడగటానికే  కలుషహారిణి అగు గంగమ్మ ఉగ్రరూపం ధరించినదేమో?
ఎవరో సంగతి ఎందుకు నేనుకూడా అక్కడ వర్షం నుండి రక్షణకు తీసుకెళ్ళిన ప్లాస్టిక్ కవర్ ఒకటి మరచిపోయివచ్చాను.  పుణ్యక్షేత్ర దర్శనానికని వెళ్ళి అక్కడి ప్రశాంత వాతావరణాన్ని, చెడగొట్టటానికి తలో చేయీ వేస్తున్నాం . అసలు యాత్రలు ఎలాచేయాలో ఎంచేయకూడదో పట్టించుకునే స్థితిలో లేము .  మరేంజరుగుతుంది?
ఇదిగో ఇలానే కోపగిస్తుంది ప్రకృతి చూసి చూసి.    ఇక అప్పుడు మంచిలేదు చెడు లేదు రైతు భూమిని భాగుచేసేప్పుడు  పిచ్చిమొక్కలతోపాటు ఔషధ మొక్కలడ్డువచ్చినా పీకి తగలెడతాడు . ఇప్పుడు ప్రకృతి చేస్తున్న ఊడ్చివేత కూడా అంతే. అది హిమాలయాలలో నేకాదు . మన ఇంటిముందుకూడా జరగొచ్చు. మనం మారటం తప్ప గత్యంతరం లేదు.

9 వ్యాఖ్యలు:

Lakshmi Raghava June 20, 2013 at 5:50 PM  

maarpu eppudu vastundi?

వనజ తాతినేని/VanajaTatineni June 20, 2013 at 10:38 PM  

aakhari kshaNaallO..paapabheeti kalginappuDu anukuMTaanu.

KRRAO June 21, 2013 at 3:20 AM  

chalaa baaga chepparu

కమనీయం June 21, 2013 at 7:53 AM  



మీరు రాసిందంతా నిజమే.మన భారతీయుల తీరే అంత.క్రమశిక్షణ,పారిశుద్ధ్యం బాగా తక్కువ.అందులో ఉత్తరాది రాష్ట్రాల సంగతి చెప్పనక్కరలేదు. అక్కడి ప్రభుత్వాలు చాలా అసమర్థంగా ఉంటాయి.ఎంతయినా మన దక్షిణాదిరాష్ట్రాలు నయం.దేవాలయాల్ని,పుణ్యక్షేత్రాల్ని కొంత బాగా నిర్వహిస్తారు.

karthik June 21, 2013 at 9:37 AM  

వినాశకాలే విపరీతబుద్ది అంటే ఇదేనేమో! :((

Anonymous June 22, 2013 at 10:22 AM  

@kartik ...మీ అభిప్రాయమే కరెక్ట్..ఈ విపరీత బుద్దుల వల్ల ... జరిగే చివరి పరిణామాలే...ప్రక్రుతి విలయతాండవం....పర్యావరణం నాశనం అయితే జరిగే పరిణామాలు కూడా...

తెలివైన వాళ్ళు మాత్రం దేశ జీడీపీ ...లు లెక్కలు వేసి సంబర పడుతుంటారు..

KVS June 22, 2013 at 11:33 AM  

దుర్గేశ్వర గారూ,

మనలాంటివాళ్ళ హృదయవేదనను చాలా బాగా చెప్పారు. నేను చిన్నప్పుడు ఋషీకేశ్ వెళ్ళాను. తరువాత గత ఏడాది వెళ్ళాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన, నేను చూసిన-అనుభవించిన పావిత్ర్యాన్ని గుర్తు తెచ్చుకోగలిగానే కానీ మీరు స్పష్టంగా వ్రాసినట్టు ఎంతో వ్యాపారధోరణి, తిరునాళ్ళకి వచ్చినట్టు జనాలు. వాళ్ళలో - భారతదేశానికి, సనాతన ధర్మానికి గంగమ్మ, వేదములు ఆయువుపట్లని తెలిసిన వాళ్ళు దాదాపు ఎవరూ ఉండరేమో అనిపించింది. ఆ జ్ఞానం ఉండి ఉంటే మీరు ఉటంకించిన దౌర్భాగ్యులలాంటి వారు "అది మనకు తగిన ప్రదేశం కాదులే, అక్కడ మడిగట్టుకుని జపాలు చేసుకునేవాళ్ళూ ధ్యానాల్లో మునిగేవాళ్ళూ మాత్రమే వెళ్తారు" అనుకుని వేరే భోగభూములకు వెళ్ళి ఉండేవాళ్ళేమో.

ఈ "దెబ్బతో" అయినా మూకుమ్మడిగా 'తగుదుము' అనుకుంటూ విహారయాత్రగా హిమాలయాలకు వెళ్ళేవాళ్ళూ వాళ్ళమీద ఆధారపడే వ్యాపారస్తులూ తగ్గుతారనీ, ఆ పావిత్ర్యాన్ని అనుభవించటానికి ఆరాధనాభావంతో వెళ్ళేవారు మాత్రమే వెళ్తారనీ ఆశిస్తున్నాను.

KVS June 22, 2013 at 11:35 AM  

దుర్గేశ్వర గారూ,

మనలాంటివారి హృదయవేదనని చాలా బాగా చెప్పారు. నేను చిన్నప్పుడు ఋషీకేశ్ వెళ్ళాను. తరువాత గత ఏడాది వెళ్ళాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన, నేను చూసిన, అనుభవించిన పావిత్ర్యాన్ని గుర్తు తెచ్చుకోగలిగానే కానీ మీరు స్పష్టంగా వ్రాసినట్టు ఎంతో వ్యాపారధోరణి, తిరునాళ్ళకి వచ్చినట్టు జనాలు. వాళ్ళలో - భారతదేశానికి, సనాతన ధర్మానికి గంగమ్మ, వేదములు ఆయువుపట్లని తెలిసిన వాళ్ళు దాదాపు ఎవరూ ఉండరేమో అనిపించింది. ఆ జ్ఞానం ఉండి ఉంటే మీరు ఉటంకించిన దౌర్భాగ్యులలాంటి వారు "అది మనకు తగిన ప్రదేశం కాదులే, అక్కడ మడిగట్టుకుని జపాలు చేసుకునేవాళ్ళూ ధ్యానాల్లో మునిగేవాళ్ళూ మాత్రమే వెళ్తారు" అనుకుని వేరే భోగభూములకు వెళ్ళి ఉండేవాళ్ళేమో.

ఈ "దెబ్బతో" అయినా మూకుమ్మడిగా 'తగుదుము' అనుకుంటూ విహారయాత్రగా హిమాలయాలకు వెళ్ళేవాళ్ళూ వాళ్ళమీద ఆధారపడే వ్యాపారస్తులూ తగ్గుతారనీ, ఆ పావిత్ర్యాన్ని అనుభవించటానికి ఆరాధనాభావంతో వెళ్ళేవారు మాత్రమే వెళ్తారనీ ఆశిస్తున్నాను.

venkatram rao July 2, 2013 at 7:40 PM  

Durgeswar Garu,

I observed the same feeling in the year 1991/92 when I first time entered in to Devabhumi Haridwar and Rishikesh. Some of high middle class persons openly agreed that they came to escape Summer climate/environment as they are not able to bear the cost of tours like Europe and other places!!!

A person (Widower aged above 60 yrs) came along with his brother's son met me in a train on the way to haridwar. As he wants to know some details and where about of Himalyan special medicines and even we went to an ashram which is 5/6 kilometers far away from Rishikesh. The Saadhu and his nephew scolded the old man. I asked why they are scolding? Then the young person answered, the old man inquiring/searching for ayurved herbs for sexual stamina!!!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP