14. తులసిని -పూజిస్తాము ఎందుకు?
>> Friday, June 28, 2013
14. తులసిని -పూజిస్తాము ఎందుకు?
హిందువుల
గృహాలలో ముందర, వెనుక లేక పెరట్లో మధ్య స్థలంలో 'తులసి కోట నిర్మించబడి
ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటాల (అపార్టుమెంట్లు) లోని వారు కూడా
పూల తొట్టెలలో తులసి మొక్కను పోషించుకొంటున్నారు. ఇంటి ఇల్లాలు తులసి
మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తుంది. తులసి మొక్క
ఆకులు, విత్తనాలు మొక్కకు ఆధారమైన మట్టితో సహా అన్ని భాగాలు పవిత్రమైనవిగా
పరిగణించ బడతాయి. భగవంతునికి నివేదింపబడే నైవేద్యములో ఎప్పుడూ తులసి ఆకులు
ఉంచబడతాయి. భగవంతుడికి చేసే పూజలలో, ప్రత్యేకించి శ్రీ మహావిష్ణు అవతార
మూర్తుల పూజలలో తులసి సమర్పించ బడుతుంది.
మనము తులసిని ఎందుకు పూజిస్తాము?సంస్కృతములో 'తులనా నాస్తి అథైవ తులసి' అంటే దేనితోను పోల్చలేనిది తులసి (దాని లక్షణాలలో) అని అర్ధము. భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి.
వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే
వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్ళీ పూజకు వాడదగినదిగా
పరిగణించవచ్చు.
ఒక కధనం ప్రకారము తులసి ఒక దేవత. ఆమె శంఖచూడునికి
భక్తి శ్రద్ధలు గల భార్య. ఆమెలోని భక్తి, ధర్మశీలత యందు గల విశ్వాసములను
చూచి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తలమీద
అలంకరింప బడే యోగ్యత గలది గాను దీవించాడు. తులసి ఆకుని సమర్పించకుండా
చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే. అందువలననే తులసి పూజింప బడుతుంది (కొన్ని
పూజలలో తులసి వాడకూడదు అంటారు. విష్ణు పూజ కి సంబంధించి మాత్రం తప్పక వాడ వలసినది).
ఇంకో కధనం ప్రకారము - భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలాగ
వరమిచ్చాడు. అందువలన ఆమెకు భగవంతునితో చాల ఆడంబర పూరితముగా వివాహ మహోత్సవం
జరుపుతాము. ఈ విధముగా విష్ణు మూర్తి భార్య యగు లక్ష్మీ దేవికి కూడా తులసి
ప్రతీక. ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని
కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు.
ఒకసారి సత్యభామ కృష్ణ భగవానుడిని తన దగ్గరున్న విలువైన సంపదతో
తులాభారము చేస్తుంది. కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీ దేవి భక్తితో ఒక్క
తులసీదళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు. ఆ విధంగా తులసి ప్రపంచంలోని
మొత్తము సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా
భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడములో ప్రధాన పాత్ర
పోషించినది.
తులసి ఆకు చాల విశేషమైన ఔషధ విలువలని కలిగి ఉన్నది. జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది.
తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకము:
యన్మూలే సర్వ తీర్ధాణి యదగ్రే సర్వ దేవతాః
యన్మధ్యే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహమ్ ఎవరి మూలములో సర్వ పుణ్య తీర్ధాలు ఉన్నాయో, ఎవరి అగ్రములో సర్వ దేవతలున్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలున్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను.
(తరువాత శీర్షిక - తామర పూవుని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాము ఎందుకని)
0 వ్యాఖ్యలు:
Post a Comment