శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

13. కలశాన్ని ఎందుకు పూజిస్తాము?

>> Thursday, June 27, 2013

13. కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
ముందుగా అసలు కలశము అంటే ఏమిటి?
నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది.  తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది.  ఆ పాత్ర చిత్రములతో కూడా అలంకరించబడి ఉండవచ్చు.   అటువంటి పాత్ర 'కలశం' అనబడుతుంది.  ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు "పూర్ణకుంభము" అనబడుతుంది.  అది దివ్యమైన ప్రాణశక్తి తో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది.  ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.

సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో 'కలశము' ఏర్పాటు చేయబడుతుంది.  స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది.  ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.

మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము?సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహా విష్ణువు పాల సముద్రములో తన నాగశయ్య పై పవ్వళించి ఉన్నాడు.  అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని   సృష్టించాడు . కలశములొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రధమ జాతమైన నీటికి ప్రతీక గా నిలుస్తుంది.  ఇది అన్నింటికీ జీవన దాత.  లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్దముల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.  ఈ ప్రపంచములో ఉన్నదంతా సృష్టికి ముందుగా నున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది. 
ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక.  చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ' ను సూచిస్తుంది.  అందువల్లనే 'కలశం' శుభసూచకముగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.

అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించ బడిన తరువాత అందులోని నీరు "అభిషేకము" తో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింప బడుతుంది.  దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు.

పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశముతో  భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.  కనుక 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీక గా ఉంటారు.  వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభము తో హృదయ పూర్వకముగా స్వాగతమిస్తాము.
(తరువాతి శీర్షిక - తులసిని పూజిస్తాము - ఎందుకు?)

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP