ఆత్మబలమే అండగా..
>> Tuesday, May 21, 2013
ఆత్మబలమే అండగా..
"నువ్వు చేసిన వాటి లో ఏది ముందరపడిందని, మళ్లీ
ఇది మొదలెడుతున్నావ్?'' వంటి మాటలు కొందరి గుండెల్లోకి ఈటెల్లా
దిగిపోతుంటాయి. చాలా సార్లు అలా అంటున్న వారిని కూడా తప్పు పట్టలేం. తమ
వాళ్లు వరుసగా ఓటమి పాలవుతుంటే ఎవరైనా ఎంత కాలం నిగ్రహించుకుంటారు?
కాకపోతే, ఆ వరుస పరాభవాల వెనుక ఏం కారణాలు ఉన్నాయో పరిశీలించే అవసరమైతే
ఉంటుంది. కొందరికి సమాజం గురించి, ప్రపంచ పరిణామాల గురించి ఎంత పరిజ్ఞానమో
ఉంటుంది.
కానీ, ఎక్కడా ఒక విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలా ఉండదు. గతంలో వైఫల్యాలు
ఉంటే భవిష్యత్తులోనూ వైఫల్యాలే ఎదురు కావాలనేమీ లేదు కానీ, చూసే వారికి
భవిష్యత్తులో వారేదో చేస్తారన్న నమ్మకమే కలగదు. అయితే పదే పదే ఓటమి పాలు
కావడం వెనుక వారిలో ఆత్మబలం లోపించడమే కారణంగా కనిపిస్తుంది. పరిశీలిస్తే,
మనిషి విజయాలు అతని ఆత్మబలం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాకపోతే,
ఆత్మబలాన్ని పెంచుకోవడం ఎలా అన్నదే చాలా మందికి ఒక పెద్ద ప్రశ్న. మౌలికంగా
కార్యదక్షతే ఆత్మస్థైర్యానికి పునాదిగా ఉంటుంది. శ్రమను ప్రేమించే
కార్యశీలతలో నుంచే ఈ కార్య దక్షత రూపు దిద్దు కుంటుంది. ఆత్మ విశ్వాసమైనా,
ఆత్మస్థైర్యమైనా వాటికవే పుట్టుకు రావు. మనలోని శ్రమ సామర్ధ్యమే మనలో ఆ
విశ్వాసాన్నీ, బలాన్నీ పెంచుతాయి. ఆత్మస్థైర్యమే ఉంటే ప్రతికూల
పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఆత్మబలమైనా, ఆత్మ విశ్వాసమైనా పెరగడానికి కార్యశీలతను పెంచే క్రమ శిక్షణ
కావాలి. ఈ క్ర మశిక్షణ కార్యదక్షతను పెంచితే, ఆ దక్షత మన ఆత్మబలాన్ని
పెంచుతుంది. విజయాల్ని సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా ఆత్మ
విశ్వాసాన్నీ ఆత్మబలాన్నీ పెంచుకోవాల్సిందే!
0 వ్యాఖ్యలు:
Post a Comment