ఆశ- దురాశ
>> Saturday, May 11, 2013
ఈనాడు మానవుల్లో ధనాశ బాగా పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ఆశలేని మానవులెవరూ ఉండరు. కాని దానికొక పరిమితి లేకుండా పోయింది. ఎంత సంపాదించినా ఇంకా..ఇంకా అన్న దాహం విపరీతంగా ప్రబలుతోంది. రెండు చేతులా సంపాదించాలి. వెండి, బంగారం కూడబెట్టాలి. పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవాలి. కోట్లకు పడగలెత్తాలి అన్న దురాశ అధికమై పోయింది. ఈ క్రమంలో మంచీచెడు, న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలను పట్టించుకోవడం లేదు మనిషి.
ఏ విధంగానైనా సంపాదించాలనే ఏకైక సూత్రాన్నే ఒంటబట్టించుకొని, మరొక దాన్ని గురించి ఆలోచించే అవసరమే లేదని భావిస్తున్నాడు. సంపాదించడంలో తప్పులేదు. ధర్మ సమ్మతంగా, న్యాయబద్దంగా, ఎదుటివాడి నెత్తిపై చేతులు పెట్టకుండా ఎంతైనా సంపాదించవచ్చు. నీతి, నియమాలను తుంగలో తొక్కి, ప్రజల్ని వంచించి, మోసం చేసి, ఏదో ఒక గడ్డి కరిచి సంపాదించాలనుకోవడం దుర్మార్గం. ఈ దుర్మార్గానికి ప్రధాన కారణం ప్రాపంచిక వ్యామోహం. దైవంపై, పరలోకంపై కావాల్సిన స్థాయిలో విశ్వాసం, నమ్మకం లేకపోవడం. ప్రపంచమే సర్వస్వమని భావించడం. అడిగేవాడు, ప్రశ్నించేవాడు ఎవడూ లేడనే అహంకారం.
ఈ కారణంగానే సాధ్యమైనంత అధికంగా ఐహిక సుఖాలను జుర్రుకోవాలన్న వాంఛలో మనిషి హిత, అవిహితాలను పట్టించుకోవడం లేదు. అందుకే ధనదాహం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ధన దాహానిఇక సంబంధించి పవిత్ర ఖుర్ఆన్ ఇలా అంటోంది. "ప్రాపంచిక వ్యామోహంలో పరస్పరం పోటీపడి వీలైనంత ఎక్కువ సంపాదించాలన్న తపనే మమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. చివరికి ఇదే రందితో మీరు సమాధికి చేరుకుంటారు.(ప్రాపంచిక సంపదనే మీరు ప్రగతికి చిహ్నమని అనుకుంటున్నారు కదూ!) ఎంతమాత్రం కాదు. వాస్తవం ఏమిటో మీకు త్వరలోనే తెలుస్తుంది. ఎంతమాత్రం కాదు, త్వరలోనే మీకు తెలుస్తుంది.'' (102-1-4)
"ఎంతమాత్రం కాదు విశ్వసనీయ జ్ఞానంతో మీరు విషయాన్ని గ్రహించ గలిగితే, (మీ వైఖరి ఇలా ఉండదు) మీరు తప్పకుండా నరకాన్ని చూస్తారు. అవును, మీరు నమ్మకంగా దాన్ని కళ్లారా చూస్తారు. ఆ రోజు ఈ సుఖభోగాలు, సిరిసంపదల గురించి తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది.'' (102.5-8) ప్రాపంచిక వ్యామోహంలో పడి, దైవాన్ని, పరలోకాన్ని విస్మరించిన మనిషి తన సుఖసంతోషాల కోసం, విలాసాల కోసం ఎలాంటి గడ్డి కరవడానికైనా సిద్ధపడతాడు. అవినీతి, అక్రమాలకు పాల్పడి కోట్లకు కోట్లు సంపాదిస్తాడు.
ఈ క్రమంలో అతను న్యాయవ్యవస్థ కళ్లకు గంతలు కట్టగలడు. ప్రభుత్వాల కళ్లు కప్పగలరు. చట్టాలను చట్టుబండలుగా మార్చగలడు. కాని దేవుని కళ్లు కప్పలేడు. ఈ ప్రపంచంలో అతను సంపాదించిన ప్రతి పైసాకు, ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు పరలోక న్యాయస్థానంలో లెక్కలు చెప్పాల్సి ఉంది. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువగా విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. అతడి అక్రమ సంపాదన, ధన దుర్వినియోగం రుజువైన తర్వాత అతని నివాసస్థలంగా నరకాన్ని కేటాయించడం జరుగుతుంది.
అందుకని ప్రతి ఒక్కరూ ఆశ దురాశగా, పేరాశగా మారకుండా జాగ్రత్త పడాలి. ఎంత సంపాదించినా కొద్ది మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా - ధర్మాధర్మాల విచక్షణ పాటించాలి. ప్రజల్ని వంచించి, వారి పొట్ట గొట్టి, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని లాభాలు దండుకుంటే, ఏదో ఒకరోజు ఈ లోకంలోనే దాని పర్యవసనాన్ని అనుభవించక తప్పదు. పరలోకంలోనైతే ఎలాగూ వైఫల్యమే ఎదురుకానుంది.
యం.డి. ఉస్మాన్‌ఖాన్
1 వ్యాఖ్యలు:
ఉస్మాన్‌ఖాన్ గారు ఆశ- దురాశ లో ఈ నాటి జీవితానికి అద్దం పట్టారు. దాన ధర్మాలు మాత్రం నీతి నియమాల తో సంపాదించిన దానిలో చెయ్యడం మంచిది. ఒక పెద్ద మనిషి బాగా అప్పనంగా సంపాదించి దేవుడికి వజ్రాల కిరీటం తొడిగాడు 'పలితం మాత్రం ఇంకో విధంగా వుంది'.
Post a Comment