"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-7
>> Tuesday, March 19, 2013
27. లౌకిక విద్యలోనూ ఉత్తమ ఆచార్యులు
పైన చెప్పబడిన లక్షణాలు ఒక వైదిక ఆచార్యునికే కాక, లౌకిక విద్యలను నేర్పే ఆచార్యుల జీవితంలోనూ ఉండేది. విశేష శాస్త్రజ్ఞత, అత్యుత్తమ శీలసంపదా ఆ లౌకిక ఆచార్యులకు ఉండేవి. వారికి ఆత్మానుభవం లేకపోవచ్చును. ఉత్తమ మానవులకు ఉండవలసిన గుణసంపత్తి విస్తారంగా వారిలో ఉండేవి. కొందరికి కొంచెం కోపస్వభావమూ, కొంచెం పక్షపాతమూ ఉన్నా శిష్యులు వారిని విద్యాప్రాప్తి కొరకు వెన్నంటేవారు.
నాట్యాన్ని నేర్పేవారిని నాట్యాచార్యులనేవారు. వారికి విద్వత్తు మాత్రమేకాక సౌశీల్యము ఉండేది. సంగీతంలో సింహంవంటీ వాడు ఉస్తాద్ తాన్ సేన్. అక్బరు ఆస్థానంలో గాయకుడు. అతని గురువు హరిదాసస్వామి - ఋషితుల్యుడు.
దక్షిణదేశంలో తిరువైయార్ లో ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన పేరు మహావైద్యనాథశివన్. ఆయన గొప్ప నైష్టికుడు. సంధ్య, శివపూజ ఒక్కరోజు వదలలేదు. ప్రయాణం చేసేటప్పుడు అతని దేవతార్చన పెట్టె సకాలంలో రాకపోతే, ఉపవాసముండేవాడు. కచేరీలు సాయంత్రం మూడు నుంచి ఆరు వరకు చేసేవాడు. సాయం సంధ్య కొఱకు కచేరీల సమయం నియమించుకున్నాడు, సాయంత్రం సంధ్య చేసి తిరిగి 6.30 కి కచేరీ ప్రారంభించేవాడు.
అతని సోదరుడు రామస్వామి, వైద్యనాథన్ యొక్క ఆర్ధిక విషయాలు, కోర్టువిషయాలూ చూసుకునేవాడు. ఆయన విద్వాంసుడు. 63 శైవనాయన్మార్లపై పెరియపురాణీయ కీర్తనలను వ్రాశాడు. తన కుటుంబ విషయాలన్నీ రామస్వామికి అప్పగించి వైద్యనాథశివన్ కచేరీలు, శివపూజ, గాయత్రీ పురశ్చరణలతో గడిపేవాడు. ఆయన ఒక శిష్య పరంపర కావాలని కోరుకోక పోయినా, ఒక ఇరవై మంది శిష్యులు ఎప్పుడూ ఆయనను పరివేష్టించి ఉండేవారు. వారికి ప్రత్యేకంగా ఈయన పాఠాలు చెప్పలేదు. ఆత్మార్ధం ఆయన పాడుకునే పాటలు విని శిష్యులు ఘనవిద్వాంసులయ్యారు. వీరంతా ఆయన ఇంట్లోనే ఉండేవారు. ఆయన వీరివద్ద గురుదక్షిణ తీసుకున్నదీ లేదు.
నాట్యశాస్త్రం, గానకళ, ధనుర్వేదం ఇలాంటి శాస్త్రాలను చెప్పేవారిని ఆచార్యులని పిలిచేవారు. ఇక వేదవేదాంతాలను బోధించేవారిని ఏమనాలి? వారిని ఈశ్వరునికి ప్రతినిధిగా శిష్యులు భావించారంటే ఆశ్చర్యమేమిటి??
28. సంఘగతంకాదు వ్యక్తిగతమే
మనదేశంలో విద్య మహోన్నత స్థితిలో ఉండేది అంటే విద్య ఒక వ్యాపారం కాకపోవడం వలనే. విద్య వ్యక్తిగతంగా ఉండేది, దానికి సంఘాలు, స్థాపనలూ లేవు. ఈ విధానం రెండు మూడు శతాబ్దాల క్రితం కూడా ఉండేది. ఈకాలంలో కూడా గురుకులవాసంలాంటి విధానాన్ని ఒకరిద్దరు అవలంబిస్తున్నారు.
బుద్ధుని కాలం నుంచీ నలంద, తక్షశిల విద్యాస్థానాలూ, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ఒక్కచోటులో అనేక శాస్త్రములు నేర్పడం అనేది ఎరుగని విషయం. గురుకులవాసాలు వ్యక్తిగతంగా ఉండేవి. వారికి సాహాయ్యకంగా ఒకరిద్దరు ఉపాధ్యాపకులు బహుశా ఉండేవారు.
(సశేషం .....)
సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
0 వ్యాఖ్యలు:
Post a Comment