శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-5

>> Sunday, March 17, 2013

గురువు, ఆచార్యుడు అనేవి ఒక ఉత్తమ స్థితిలో ఉన్నవారిని ఉద్దేశించి చెప్పే పదములు. యజ్ఞ హోమాదులు చేసేవారినీ, మంత్రదీక్షనిచ్చే వారినీ ఆచార్యుడు అంటారు. గానకళ, నృత్యకళలలాంటివి నేర్పే వారిని గురువు అని అనడమూ కలదు. తమిళ దేశంలో వాద్యార్ అనే పదం ఒకటి వాడతారు. సాధారణంగా బళ్లలో చదువు చెప్పేవారినీ, ఇళ్ళలో పూజలు, శ్రాద్ధాదికములు పెట్టే వారిని వాద్యార్ అని అంటారు. ఈ వాద్యార్ అనే పదం సంస్కృతంలోని ఉపాధ్యాయ అనే పదం నుండి పుట్టింది. తమిళంలో 'ఆశిరియర్' అన్న పదం ఒకటి ఉంది. అది ఆచార్య పదోద్భవం, కథాశిరియర్ అని వాడుకలో ఉన్నది.

అధ్యాయం అన్న పదం ఒక పుస్తకంలోని విభాగాన్ని సూచించేది. ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం అని గ్రంధ విభాగాలను సూచిస్తారు. ఇవన్నీ ఈ మధ్య వచ్చినవి. అధ్యయనం, అధ్యాయం అనే పదాలు వేదాధ్యయనాన్ని సూచించే పదాలు. జీవితంలో అన్ని ముఖ్య విషయాలూ వేద సంబంధమైనవే. ఒక పుస్తకాన్ని ఎన్నో విభాగాలుగా విభజించినప్పుడు వాటిని కాండము, ఖండము, సర్గము, పటలము, పర్వము, పరిఛ్చేదము, ఉఛ్చ్వాసము, ఉల్లాసము, అంగము, ప్రకరణము, స్కందము అని ఎన్నో పేర్లతో పిలుస్తారు.

మనం పాఠం అనే పదాన్ని వాడితూ ఉంటాము. పాఠాలు చెప్పేచోటు పాఠశాల. ఈ పాఠమనేదీ వైదికమే. కానీ వేదాలన్నీ అబద్ధాలు అని చెప్పే బడి కూడా నేడు పాఠశాలయే. నాస్తిక్యమునకు ఒక బడి స్థాపిస్తే అదీ పాఠశాలయే. బ్రహ్మయజ్ఞమే పాఠం. వేదములను అధ్యయనం చేయడమే పాఠం.

వేదములను వల్లించేవాడు పాఠి. వేదాలను పఠించే ఒక మార్గాన్ని ఘనం అని అంటారు. ఆ వల్లెవేసేవాడు ఘనాపాఠి. వేదములు కలసి చుదువుకొనేవాడు సహపాఠి. ఈ పదములన్నీ వేద సాంప్రదాయము నుంచి పుట్టినవే.

17. ఉపాధ్యాయుడు, ఆచార్యుడు

అధ్యాయాన్ని చెప్పేవాడు అధ్యాపకుడు. వేదములను బోధించడం అధ్యాపనం, నేర్చుకొనేది అధ్యయనం. ఉపాధ్యాయుడు అధ్యాపకునికి సహకారి. అతనిది తక్కువ స్థానం, స్మృతుల ప్రకారం రెండు రకాలైన వేదబోధకులున్నారు. ఒకడు ఆచార్యుడు, ఒకడు ఉపాధ్యాయుడు. ఈ భేదాన్ని మనుస్మృతి చెబుతుంది.

జీవనోపాధికోసం ఆచార్యుడు వేదాధ్యాపనం చేయటంలేదు. తాను నేర్చుకున్న విద్య నలుగురికి చెప్పి వేద్దధ్యయనం అవిఛ్చిన్నంగా జరగాలని అతడు గురుకులం స్థాపిస్తున్నాడు. శిష్యుడు అధ్యయనం పూర్తి అయిన పిదప దక్షిణ విషయం ఎత్తితే అప్పుడు గురువు ఏదైనా అడగవచ్చు. సాధారణంగా అధ్యయనానికి పెన్నెండు ఏళ్ళు పడుతుంది. సత్పాత్రులకు విద్యాదానం చేయడమే అతని వ్రతం. గురుకులవాసంలో ఉన్నంత వరకు శీలమునకు, నియమ జీవనమునకు గురువు బాధ్యత వహించేవాడు.

ఒకప్పుడు మన దేశంలో ఇలాంటి గురుకుల వాసములు ఉన్నాయన్న విషయమే గర్వకారణంగా ఉన్నది. ఆచార్యులమని పేరు పెట్టుకొన్న మేము (శంకర భగవత్పాదుల నుంచి వస్తున్న గురుపరంపర.) ఈ విషయం గురించి చెప్పడం, ఇలాంటి గురుకుల వాస విధానం పూర్తిగా నశించరాదనియే.

18. జీవనోపాధికోసం వేదాధ్యాపనం

జీవనోపాధికోసం వేదాధ్యాపనం చేసేవారిని ఉపాధ్యాయుడని మనుస్మృతి పేర్కొంటున్నది. డబ్బు తీసుకుని వేదవిద్య చెప్పేవాడు భృతక అధ్యాపకుడు. వేదభాగాన్ని ఒకటి చెప్పి ప్రతిఫలంగా అతడు వేతనం తీసుకుంటున్నాడు.

యో౨ధ్యాయపతి వృత్యర్ధం ఉపాధ్యాయస్స ఉచ్యతే

పూర్వకాలంలో వేతనాన్ని ఉద్దేశించి అధ్యాపన చేసేవారు చాలా తక్కువ. గురుకుల వాసములు డబ్బు ప్రసక్తి లేకుండా ఉత్తమ ఆచార్యులచే నడపబడేవి. ఐతే కూలికి చెప్పే అధ్యాపనం గురించి కూడా ధర్మశాస్త్రములు చెప్పటం చూస్తున్నాము.

గురువు, ఆచార్యుడు, ఉపాధ్యాయుడు - ఈ పదములను ధర్మశాస్త్రములు నిర్వచించినవి.

బ్రహ్మోపదేశం మొదలు వేదాంత పర్యంతము చదువుచెప్పేవాడు గురువు. ఆచార్యుడు బ్రహ్మోపదేశం చేయక, శాస్త్రములను మాత్రం నేర్పేవాడు. ఒక ఉదాహరణ, గర్గాచార్యులు కృష్ణునికి ఉపనయనం చేశారు. ఆయన విద్యాభ్యాసం సాందీపుని వద్ద జరిగింది. ధర్మశాస్త్రములు ఏ భాషలోనైనా ఉపదేశమిచ్చేవాడు గురువనీ, శాస్త్రములు నేర్పేవాడు ఆచార్యుడనీ చెప్పుతున్నవి.

ఒక సాంప్రదాయానికీ, పద్ధతికీ చెందినవాడు ఆచార్యుడు. అతడొక సిద్ధాంతాన్ని సమగ్రంగా బోధిస్తున్నాడు. ఉదాహరణ శంకర భగవత్పాదులు. ఏ సాంప్రదాయానికీ చెందని వాడు గురువు, ఉదాహరణ - దత్తాత్రేయుడు. అందుకే ఆయనని దత్తగురువు అని అంటారు. దత్తాచార్యుడని అనడం లేదు. ఒక సిద్ధాంతాన్ని బోధిస్తూ గురువు వలె అనుగ్రహశక్తి ఉన్న భగవత్పాదులను శంకరాచార్యులు, శంకర గురువు అని వ్యవహరిస్తారు. మనుస్మృతిలో ఆచార్యుని లక్షణములు గురువుకి కూడా చెప్పబడినవి.

ఉపనీయతు యః శిష్యం వేదం అధ్యాపయేత్ ద్విజః
సకల్పం సరహస్యం చ తం ఆచార్యం ప్రచక్షతే

పరబ్రహ్మకు రూపం లేదు. గుణం లేదు. రూపం గుణం ఉంటే కానీ మనస్సు ధ్యానించలేదు. అందుచే పరబ్రహ్మ గురుమూర్తి రూపంలో నయన గోచరమై మనలను అనుగ్రహిస్తున్నాడు. గు అంటే గుణములు, రు అంటే రూపము. గురువంటే గుణ రూపములతో మనలను అనుగ్రహించే పరబ్రహ్మము.

పూర్వం బ్రహ్మోపదేశం మొదలు శాస్త్రపర్యంతం పుత్రునికి పుత్రునికి తండ్రియే ఉపదేశిస్తున్నందువల్ల అతనిని గురువనే వారు. రామాయణంలో, కావ్యములలో తండ్రిని గురువనే వ్యవహరించారు. కొన్ని విద్యలు కొన్ని కుటుంబాలకే పరిమితమై ఉండేవి. తండ్రికి తెలియని విద్యలు నేర్చుకోవడానికి ఇతరులను ఆశ్రయించేవారు. ఈ కారణంగా తండ్రికాక గురువు బ్రహ్మోపదేశం చేయడం, విద్యాభ్యాసం గురుకులాలలో జరగడం ఏర్పడింది.

తండ్రికి అన్ని శాస్త్రములు తెలిసినా, కుమారుడు ఇంట్లో ఉంటే సరిగా చదువుకోడేమో అని, గురుకులవాసాలలో ఒక నియమ జీవనమూ, శాస్త్రాభ్యాసము వీలౌతుందని గురుకులవాసమునకు పంపేవారు. విద్యార్ధి అన్నభిక్షకై వెళ్ళి సాధారణ జీవనం గడిపేవాడు. అలాంటప్పుడు గురువే బ్రహ్మోపదేశమూ చేసేవాడు.

ఈ కాలంలో తల్లి తండ్రులకు పిల్లల చదువుగూర్చికానీ శీలం గురించి కానీ చింత లేదు. వారికే డబ్బే ప్రధానం, ఏ చదువు చదివినా, ఏ దేశం పోయినా అభ్యంతరం లేదు. కుమారుడు పుష్కలంగా ధనార్జన చేయాలి. వారి లక్ష్యమంతా అదే. తండ్రులు పిల్లలను చదువుకోసం విదేశాలకు పంపకపోతే స్వయంగా తామే పోతారు. విదేశాలకు పోయిన్ ధనార్జన చేసేటప్పుడు ఈ తల్లితండ్రులకు ఒక్కపైసా కూడా ఆ కుమారుడు పంపకపోవచ్చును. ఇది ఈనాటి విద్యావిధానము.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP