పరమాత్మ
దృష్టి జ్ఞానదృష్టి. ప్రేమదృష్టి అందుకే, ''భగవాన్! నీ దృష్టిని నాపై
సారించు. నీ కరుణా కటాక్షము నాకు లభించనీ"-అని ప్రార్థిస్తాం. బిడ్డకు
తల్లిపై మనస్సు మరలిందంటే, ఎన్ని అందమైన వస్తువుల్ని ఇచ్చినా, ఆటబొమ్మల్ని
అందించినా ఏడుపును మాత్రం బిడ్డ మానదు. తల్లే కావాలని తల్లడిల్లుతుంది.
ఎందుకో తెలుసా? తల్లి చూపుల్లో ఉండే ప్రేమ వస్తువుల్లో కనిపించదు. అమ్మ
కళ్లల్లో మెరిసే దయ ప్రపంచంలో మరోచోట బిడ్డకు దొరకదు.
భక్తుడు కూడా భగవంతుని దర్శించేందుకు, ఆయన దయామయ దృష్టిలో పడేందుకు సదా
పరితపిస్తూ ఉంటాడు. ఆ కృపాదృష్టిలో ఎడారులు పచ్చిక బయళ్లవుతాయి. విషాలు
విరిగి అమృతాలవుతాయి. దైన్యం దూరమవుతుంది. దారిద్య్రం నశిస్తుంది. వెలితి
అర్థం కాదు. వెలుగు దూరం కాదు. శత్రువు ఎదురైనా మనస్సులో పరమాత్మ
ముఖారవిందం గోచరిస్తే చాలు. శత్రువు ప్రసన్నంగా కనిపిస్తాడు. ఇదంతా
కమలాక్షుడు ప్రసాదించిన పవిత్ర దృష్టి. ఈ సత్యాన్ని భక్తులే గుర్తించగలరు.
పరమాత్మ తండ్రి లాగా మనకు సమస్తాన్ని ప్రసాదించాడు. అన్నీ అనుభవిస్తూ
ఇచ్చిన వాణ్ణి మనం మరచిపోతూ ఉంటాం. మనస్సు ఉండేది జ్ఞాపకం
పెట్టుకొనేందుకు-అని భావిస్తే, అలా జ్ఞాపకం పెట్టుకోదగినవాడు పరమాత్మ
ఒక్కడే. కళ్లు చూచేందుకు ఇవ్వబడ్డాయి. కాని చూడదగిందేదైనా ఉంటే అది పరమాత్మ
ఒక్కడే. మరి లోకం? లోకం లోకేశ్వరుని కన్నా అన్యంగా లేదు. లోకం గోచరిస్తే,
అది లోకేశ్వరుడుగానే తెలియాలి. ఇదే జ్ఞానదృష్టి, ప్రేమదృష్టి. పరమాత్మ
విశ్వాన్ని భరించేవాడు. ధరించేవాడు. ఇచ్చేవాడు. ఇచ్చి రక్షించేవాడు.
పరమాత్మ మనకు ఇచ్చేది మన కర్మఫలమే. ఇవ్వట మనేది ఆషామాషీ విషయం కాదు. మనకు
ఎక్కువైతే ఇతరులకు ఏదైనా ఇస్తాం. అదీ ఇష్టముంటే. కొన్ని విషయాల్లో ఇతరులకు
అవసరం లేకపోయినా ఇస్తాం. అర్హత లేకపోయినా ఇస్తాం. ఇవ్వవలసి వచ్చినా ఇవ్వం
కొందరికి. ఇదంతా మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. పరమాత్మ అలా ఇచ్చేవాడు
కాడు. అలా ఇస్తే, ఆయన పరమాత్మ కాడు. ఏకర్మకు ఏ ఫలమో అతనికి స్పష్టంగా
తెలిసి ఉండాలి. ఇవన్నీ ధర్మాలు. ఈ ధర్మాలు విశ్వమంతా వ్యాపించి ఉండాలి.
లేకపోతే విశ్వానికంతా ఫలాలెలా అందుతాయి? ధర్మాలు విశ్వమంతా వ్యాపించి
ఉన్నాయి అంటే, ధర్మాల రూపంలో పరమాత్మే వ్యాపించి ఉన్నాడని భావం. ఆయన
దృష్టిని ఏ కర్మ దాటిపోలేదు. ఎవరూ కర్మఫలాల నుండి జారిపోలేరు. ఒక ఫలితం
ఇవ్వ బడిందంటే-తత్సంబంధమైన కర్మ ముందుగా ఉందనే అర్థం. కర్మాచరణ వెనుక
ధర్మాలున్నాయి. కర్మఫలాలలోను ధర్మాలున్నాయి. ఈ ధర్మాల రూపంలో పరమాత్మే
ఉన్నాడు.
ధర్మం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దారి తప్పేది ధర్మం కాదు. ధర్మం
దారిలో మనం నడక సాగించాలి. దారి తప్పితే, దగా పడేది మనమే. ధర్మం భగవంతుని
చట్టం. భగవంతుని ఆకారం. ధర్మంలో అవగాహనకే స్థానం. ఆవేదనకే కాదు. మనం ఈ
క్షణాన ఈ ప్రపంచంలో ఉన్నాం. ఒకనాడు ఉండం. నేడు ఉండటానికి ఏధర్మం కారణమో,
ఒకనాడు ఉండకపోవటానికి ఆ ధర్మమే కారణం. లేనివి వస్తాయి. దాని వెనుక
కారణాలున్నాయి. ఈ రాకపోకల్ని మనం ఆపలేం. వీటిని అర్థం చేసుకుంటూ వీటి మధ్య
సుఖంగా ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి. ఈ ప్రపంచం రాకపోకల నిలయం. అందుకే
ఇది జగత్తు. 'జాయతే గచ్ఛతి ఇతి జగత్'. వస్తూ పోతూ ఉండేదే
ప్రపంచం. ద్రష్ట నష్టస్వభావం కలది. కనుక ప్రపంచంలో స్థిరత లేదు. అంతా
అస్థిరతే. ఇలా తెలుసుకుంటే బాధలు, భయాలు ఉండవు. ఒకవేళ నాకు స్థిరత్వం
కావాలి అని భావిస్తే, అలా భావించటం తప్పు కాదు. స్థిరత్వం ఎక్కడుందో, దాని
స్వరూపమేమిటో తెలుసుకోవాలి. అప్పుడే దానిని పొందగలం. జగత్తులో స్థిరత్వం
లేదు. జగదీశ్వరుడే స్థిరం. పరమాత్మ చల్లని నీడలో మన జీవితం తరించిపోవాలి.
వేదాంత వెన్నెలవాడలో మనకు స్థిరనివాసం ప్రాప్తించాలి. అస్తు!
svaami sundarachaitanyananmda
|
|
|
1 వ్యాఖ్యలు:
ఆయనలో ఉన్న మీరూ..మీలో ఉన్న అయన దూరాలకు అతీతులే కదా..?
Post a Comment