శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివతత్వరాశి... వారణాశి

>> Friday, September 28, 2012

శివతత్వరాశి... వారణాశి


భారతదేశం వేదభూమి...ఆధ్యాత్మికంగా ఎంతో పేరుగాంచిన దేశమిది..ఎందరో పుణ్యపురుషులు నడయాడిన పవిత్ర ధరణి మనది. 'సేక్రెడ్ వాక్' పేరిట దేశంలోని పుణ్యక్షేత్రాలను తన శిష్యులతో కలసి సందర్శిస్తున్న ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇటీవల కాశీ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ తన శిష్యులతోపాటు 'నవ్య'తో జరిపిన సంభాషణల సారాంశం..మీకోసం...


కాశీ, వారణాశి, బెనారస్... ఒక నగరానికి ఇన్ని పేర్లా?
ఒకప్పుడు కాశీ క్షేత్రం అద్భుతమైన, ఆహ్లాదకరమైన నగరం. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు. ఆహ్లాదకరంగా కూడా ఇది ఎంతో సుందరమైన నగరం. కేవలం ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగానే గాక ఉల్లాస జీవితానికి కూడా ఇది పేరుగాంచింది. శివుడు ఈ నగరానికి వచ్చింది సన్యాసిగా కాదు...సంసారిగానే. ఈ పుణ్యక్షేత్రానికి ముందునుంచి ఉన్న పేరు కాశీ. ఆ తర్వాత ప్రజలు దీన్ని అందమైన నగరంగా కాబట్టి బనారస్ అని పిలుచుకునేవారు. బ్రిటిష్ వారి హయాంలో వరుణ, అశి అనే రెండు నదుల మధ్య ఉన్న నగరం కాబట్టి వారణాశిగా వ్యవహరించారు. ఈ ప్రాచీన నగరానికి కాశీయే సరైన పేరు.

విదేశీ యాత్రికులు ఈ నగర చరిత్ర 2వేల సంవత్సరాలు అని చెబుతుంటే మరికొందరు కేవలం 600 సంవత్సరాల క్రితమే కాశీ పుట్టిందని చెబుతుంటారు. బనారస్ హిందూ యూనివర్సిటీ గ్రంథాలయంలో లభ్యమయ్యే ఆధారాల ప్రకారం చూస్తే దీని చరిత్ర 6 వేల నుంచి 7 వేల సంవత్సరాల వరకు ఉంది. కాశీకి 12,400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నట్లు ఒక ప్రబలమైన సాక్ష్యం ఉంది. శూలాన్ని చేత పట్టి శివుడు సిద్ధాసనంలో కూర్చుని ఉండగా వెనుక మహిషం ఉన్న ఒక నాణెం ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఆ నాణెం 12,400 సంవత్సరాల నాటిదని విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. ఈ నాణెం మన దేశంలో ఉండి ఉంటే ఎవరూ నమ్మకపోయి ఉండేవారేమో! అదృష్టవశాత్తు లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉండడం వల్ల ఎవరైనా నమ్మక తప్పదు.

కాశీ నగరం నిర్మాణం ఎంతో విలక్షణమైనదంటారు...?
పంచభూతాలను, నాడీ కేంద్రాలను ఆధారంగా చేసుకుని కాశీ నగరాన్ని నిర్మించారు. అయితే గడచిన 7, 8 శతాబ్దాలుగా కాశీ పూర్తిగా నేలమట్టమైంది. ఒకప్పుడు కాశీ నగరంలో 25 వేలకు పైగా ఆలయాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 2వేలకు మించి లేదు. అంతేగాక వీటిలో చాలావరకు పునర్నిర్మాణం జరుపుకున్నవే. కాశీ విశ్వనాథుని ఆలయం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఔరంగాజేబు ఇక్కడకు వచ్చినపుడు కాశీ నగరాన్ని ప్రజలకు అనుసంధానం చేస్తున్నది మతం కాదని, ఏదో అదృశ్య శక్తి అని భావించాడు.

ఆ కారణంగానే విశ్వనాథ ఆలయాన్ని సమూలంగా ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదును నిర్మించాడు. శివ లింగాన్ని ఆలయ ప్రాంగణం నుంచి బయటకు తరలించివేశాడు. ఆ రకంగా ప్రజలను అతను హెచ్చరించదలచాడు. ప్రస్తుతం కాశీ విశ్వనాథుని ఆలయం ఉన్న ప్రదేశం వాస్తవంగా ఆలయం ఉన్న ప్రదేశం కాదు. వెలుపల ప్రదేశం. ఇప్పుడు కాశీ క్షేత్రం ఉత్తరప్రదేశ్ పర్యాటక చిత్రపటం నుంచి తొలగించబడింది. ఈ నగరం తన గత వైభవాన్ని క్రమంగా కోల్పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాశీ కాలగర్భంలో కలసి పోయే ప్రమాదం పొంచి ఉంది.

కాశీకి పూర్వవైభవం ఎలా తేవాలి?
కాశీని సంపూర్ణంగా నేలమట్టం ఎవరూ చేయలేకపోయారు. పాక్షికంగా మాత్రమే విధ్వంసం జరిగింది. కాశీ నగరంలో అమర్చిన యంత్ర శక్తి ఇప్పటికీ సజీవంగానే ఉంది. అయితే ఉండాల్సిన పద్ధతిలో మాత్రం అది లేదు. ఆ యంత్ర శక్తికి పూజాదికాల సహకారం తోడైతే మళ్లీ సంపూర్ణ శక్తి సమకూరుతుంది. నిజానికి ఆనాటి పూజాదికాలు ఏవీ ఇప్పుడు జరగడం లేదు.

చాలా సంప్రదాయాలకు నీళ్లొదిలేశారు. శక్తి ఇప్పటికీ ఉంది..కాని వైభవమే పోయింది. ఆనాటి వైభవం మళ్లీ రాగలిగితే కాశీ నగరం గొప్ప విజ్ఞానగనిగా మళ్లీ విరాజిల్లుతుంది. గణితం, విజ్ఞాన శాస్త్రం వంటివన్నీ ఇక్కడే ఉద్భవించాయి. ఆర్యభట్ట లాంటి ఎందరో పండితులు ఇక్కడ విద్యను అభ్యసించినవారే. ఒకప్పుడు ఇక్కడి నుంచి ప్రపంచ నలుమూలలకు విజ్ఞానం వ్యాపించింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక్కడి విజ్ఞానం ఎక్కడికో వెళ్లిపోయింది...కాని కాశీ ఖ్యాతి చీకట్లోనే ఉండిపోయింది.

కాశీ ఆధునీకరణకు మీ వంతు ప్రయత్నాలు?
ఆధునీకరణ అంటే రాతి కట్టడాలు కాదు. ఈ నగరాన్ని ఆధునీకరించడం కాదు జరగాల్సింది...పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరగాలి. ప్రస్తుతం విశ్వనాథుని ఆలయంలో నేలపై వేసిన పాలరాతి బండలు ఆధునికరణ ముసుగులో ఏర్పాటు చేసినవే. వీటి వల్ల లాభం కన్నా భక్తులకు నష్టమే ఎక్కువ జరుగుతోంది. తడి నేలపై భక్తులు జారిపడుతూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ రాళ్ల స్థానంలో తమిళనాడు నుంచి గ్రానైట్ రాళ్లను తెప్పించి పరిపించే బాధ్యతను చేపడతానని ఆలయ అధికారులను కోరాను. వారు అంగీకరిస్తే ఆ బాధ్యత స్వీకరించడానికి నేను సిద్ధం. అదే విధంగా ఆలయం చుట్టు ప్రక్కల పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం.

మీ దృష్టిలో కాశీ విశిష్టత?
ఇదో మహత్తరమైన పుణ్యక్షేత్రం. కాని చెత్త కుప్పగా మార్చుకున్నాము. ముందు జరగాల్సింది తలా ఒక చెయ్యేసి ఆ చెత్తను తొలగించుకోవాలి. అదే కాశీ విశ్వనాథునికి ప్రజలు చేయాల్సిన సేవ. నిత్యం దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని రప్పించుకుంటున్న కాశీ నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజలు, ఇక్కడి ప్రభుత్వం, పాలకులు పూనుకోవాలి. అదే జరిగిన నాడు మళ్లీ మనం అద్భుతమైన కాశీని చూడగలం. కాశీలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే తలమానికమైనది. ఇందులోని గ్రంథాలయం ఆసియా ఖండంలోనే అతి పెద్దది.

దాదాపు 15 లక్షల గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. 9928 రాత ప్రతులు, 15 వేల పరిశోధనా పత్రాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయం వార్షిక బడ్జెట్ మాత్రమే 15 కోట్ల రూపాయలంటే దీని నిర్వహణ పట్ల కేంద్ర విశ్వవిద్యాలయం చూపుతున్న చిత్తశుద్ధిని ప్రశంసించాలి. ఇలాగే కాశీకి చెందిన మిగిలిన విషయాల పట్ల కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. తమిళనాడులోని చిదంబరం, రామేశ్వరం ఆలయాలలో ప్రతి ఆదివారం మా ఆశ్రమవాసులు ఆలయాలను పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికి 40 శాతం ప్రక్షాళన జరిగింది. ప్రజలు కూడా ఆ బాధ్యత తీసుకుంటే పాలకులకు కూడా ఏదో ఒకనాడు కనువిప్పు కలుగుతుంది.

కాశీకి వస్తే ఏదైనా ఇష్టమైనది వదిలేయాలని అంటారు కదా?
సాధారణంగా అందరూ అనుకునేది తమకు ప్రీతికరమయైనదేదైనా కాశీలో వదిలేయాలని...చాలామంది తాము ఇష్టంగా తినే వంటకాలనో, తీపి పదార్థాలనో వదిలేస్తుంటారు. అయితే వదలాల్సింది అవి కావు. తమకు ఇబ్బందికరంగా తయారైనవి, తమను కట్టడి చేస్తున్నవి...వాటిని వదిలేయాలి. శివతత్వమే అది. నిన్ను కట్టడి చేస్తున్నవి, ఒత్తిడికి నెడుతున్నవి వాటిని వదిలేసి జీవిత పయనం సాగించాలి. ముక్తిని పొందడమంటే నీ లోపల ఉన్న బలహీనతలను జయించాలి. కాని, ముక్తి పేరిట ఎన్ని పాపాలు చేయాలో అన్నీ చేయడం విషాదం.

" నిత్యం దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని రప్పించుకుంటున్న కాశీ నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజలు, ఇక్కడి ప్రభుత్వం, పాలకులు పూనుకోవాలి. అదే జరిగిన నాడు మళ్లీ మనం అద్భుతమైన కాశీని చూడగలం. ''

- టి.సుధాకర్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP