అమెరికాలో వీరాంజనేయుడు
>> Saturday, September 1, 2012
అమెరికాలో వీరాంజనేయుడు

రాజస్థాన్‌లో తయారీ
ఉత్తర భారతానికి చెందిన నీమ్ కరోలీబాబా స్వామి జ్ఞాపకార్థం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని, అందులోనే ఒక మారుతి ఆలయాన్ని నిర్మించి దాన్ని ఆశ్రమాలయంగా మార్చారు. సర్వమానవ సౌభ్రాతృత్వం, శాంతి, దయ, ప్రేమల ప్రాతిపదికగా నీమ్ కరోలీబాబా చేసిన ఉద్బోధలు ఆయన శిష్యగణాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. ఆయన శిష్యులు గురువాగారి బోధనలను ప్రచారం చేస్తూనే హనుమంతుని ఆలయాన్ని కూడా నిర్వహిస్తున్నారు. పాలరాతి విగ్రహాలకు పుట్టినిల్లయిన రాజస్థాన్‌లోనే ఈ ఆంజనేయుని విగ్రహం తయారై, పసిఫిక్ సముద్రం మీదుగా న్యూమెక్సికో రాష్ట్రానికి చేరింది. భారతీయులతోపాటు ఈ ఆశ్రమాలయానికి అమెరికన్ భక్తులు కూడా చాలామంది వస్తుంటారు.
వేడుకగా పండుగలు
హనుమజ్జయంతి, గురుపౌర్ణమి, నీమ్ కరోలీబాబా జయంతి, అమెరికా స్వాతంత్య్ర దినం(జూలై 4వ తేదీ) మొదలైన పండుగలు ఇక్కడ వేడుకగా జరుపుతారు. వేడుక రోజుల్లో రోజుకు విదేశీయులు, దేశీయులు కలిపి సుమారు 500 మంది వరకు వీరాంజనేయుని దర్శించడానికి వస్తుంటారు. స్వామివారి విగ్రహాన్ని చూస్తూ దేశీయ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. హార్మోనియం వాయిస్తూ భక్తిగా హనుమాన్ చాలీసాను శ్రావ్యంగా ఆలపించే అమెరికన్ భక్తులను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
మరొక అమెరికన్ భక్తుడు రెండు భుజాలపై శివుడు, మారుతి, నవగ్రహాలు, బుద్ధుడు మొదలైన బొమ్మల్ని రంగుల టాటూలుగా వేయించుకుని అందరికీ చూపించి సంబరపడటం చూసి ఆశ్చర్యపడటం మన వంతవుతుంది. వేడుక దినాల్లో భారతీయ భక్తులు పాల్గొన్నా తక్కిన రోజుల్లో అమెరికన్ భక్తులు ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచడం, వంటశాలలో మన దేశీయ ప్రసాదాలను(కేవలం శాకాహారమే, వెల్లుల్లి కూడా వాడరు) తయారు చేస్తారు. మొత్తానికి న్యూమెక్సికో, టెక్సాస్ ప్రాంతాల్లో పేరొందిన హిందూ దేవాలయంగా టావోస్ వీరాంజనేయ దేవాలయం గుర్తింపు పొందింది.
- గాంధీ బందా
డల్లాస్, టెక్సాస్
0 వ్యాఖ్యలు:
Post a Comment