శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరిత్ర 44,45,46

>> Monday, June 18, 2012

శ్రీ త్రైలింగస్వామి వారు ఉపదేశ సమయాలలో శ్రీ ఉమాచరణ్‌గారికి గంభీరమైన తరువాతి ప్రకరణంలోని పనె్నండు విషయాలను వివరించారు.
గురుశిష్యులు
గురువు అని ఎవరిని అంటారు? ఆయన ఆవశ్యకత ఏమిటి? ‘గురు’శబ్దానికి ‘గ’ అంటే గతిప్రదాత అని, ‘ర’ అంటే సిద్ధి ప్రదాత అని ‘ఉ’ అంటే అన్నీ చేయగలవాడని అర్థము. అందువలన ఈశ్వరుడు ఒక్కడే గురువని చెప్పబడతాడు. ఎందుకంటే ఆయన తప్ప జీవితానికి గతి- ముక్తులను ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. అయితే గతి ముక్తులకు మార్గదర్శకత్వం చేసేవారినికూడా గురువని చెప్పవచ్చును. అందువలన ఈశ్వరునికీ- గురువుకీ అసలు తేడా లేదని చెప్పవచ్చును. ఆ కారణంగానే గురువును సాకారమైన ఈశ్వరుడని చెప్పవచ్చును. కొందరు‘గు’ శబ్దానికి అంధకారమని, ‘రు’ శబ్దానికి దానిని నివారించేవాడని, కనుక- అజ్ఞాన రూపమైన అంధకారాన్ని పోగొట్టేవారిని గురువు అనవచ్చని అంటారు. అందువలన గురువును ఎప్పుడూ సామాన్య మనిషిగా భావించకూడదు. గురువుదగ్గర ఉన్నప్పుడు ఏ దేవతను పూజించకూడదు.
ఒకవేళ ఎవరన్నా చేసినా అది విఫలమవుతుంది. గురువే కర్త. గురువే విధాత. గురువు సంతుష్టుడైతే దేవతలంతా సంతుష్టులవుతారు. ‘గురు’ అనే అక్షరద్వయం ఎవరి నాలుక చివర ఉంటుందో, ఆయనకు శాస్త్ధ్య్రాయనం చెయ్యవలసిన అవసరం కూడా లేదు. ‘గ’వర్ణోచ్ఛారణ చేత మహాపాపములు నశించిపోతాయి. ‘ఉ’ వర్ణోచ్ఛారణ చేత ఈ జన్మలో చేసిన పాపాలు నశించిపోతాయి. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే గతిప్రదాత. ఒకవేళ ఈశ్వరునికి కోపం వచ్చినా గురువు రక్షించగలుగుతాడు. కాని, గురువుకే కోపంవస్తే ఎవరూ ఉద్ధరించలేరు.
జగత్తులో గురువును మించిన శ్రేష్ఠవస్తువు మరొకటి లేదు. జపము, తపము, అర్చన, శాస్తమ్రు, మంత్రము మొదలైనవి ఏమీ గురువుకన్న గొప్పవికావు. గురువు యొక్క మూర్తిని ధ్యానిస్తూ ఆయన తత్త్వాన్ని ఎప్పుడూ జపించేవారికి కాశీవాసఫలం లభిస్తుంది. గురువే తారకబ్రహ్మము.
గురుప్రణామ మంత్రభావార్థాన్ని హృదయంలో నిలుపుకోవాలి. లేకపోతే కేవల ఉచ్ఛారణ వలన ఏమీ ఫలము లభించదు. భక్త్భివంతో చేసిన పనులకే ఫలం లభిస్తుంది.
1.గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
2.అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః
3.అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః
1.గురువే బ్రహ్మ. గురువే విష్ణువు, గురువే దేవాధిదేవుడైన మహేశ్వరుడు, గురువే పరంబ్రహ్మ. అలాంటి గురువుకు నమస్కారము.
2.ఈ సమస్త బ్రహ్మాండము ఎవరి ఆకారమో, ఎవరు ఈ చరాచర జగత్తంతా వ్యాపించి యున్నారో, ఎవరు బ్రహ్మపదమును దర్శింపజేస్తారో, అలాంటి గురువుకు నమస్కారము.
3.అజ్ఞానాంధకారంలో ఉన్న గ్రుడ్డివారికి, జ్ఞానమనే అంజన శలాకచేత ఎవరు దృష్టిని ప్రసాదిస్తారో, అలాంటి గురువుకు నమస్కారము.
గురువులు రెండు రకాలుగా ఉంటారు. శిక్షాగురువు, దీక్షా గురువు అని. గురూపదేశం లేనిదే సామాన్యమైన వృక్షలతాదుల పరిచయం కూడా చక్కగా కలుగదు. మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు మొదలైనవన్నీ ఏదో ఒక ప్రబలమైన శక్తి ద్వారా ప్రేరేపింపబడనిదే, ఏ పనీ చేయలేవు. ఏ శక్తి ద్వారా ఆత్మ ఔన్నత్యాన్ని పొందుతుందో, మనము ముక్తిమార్గంలో ముందుండగలుగుతామో, ఆ శక్తే మనకు గురువు. ఏ పని అయినా రెండు శక్తుల మధ్య పరస్పర ఘర్షణ లేకుండా జరగదు. అంతేకాక, ఆ రెండు శక్తులలో ఏది ప్రబలమై ఉంటుందో అదే రెండవ దానికి గురువు అవుతుంది. చంద్రుడు సూర్యుడు, గ్రహములు, నక్షత్రములు మొదలైనవి ఏ శక్తులయొక్క సైగలవలన తమ తమ పనులను నిరంతరంగా చేసుకొంటున్నాయో ఆ శక్తే జగద్గురువు.

అలాంటి జగద్గురువును తెలుసుకోవటానికి జీవుని మనస్సు - ప్రాణములు తపన చెందినప్పుడు, తత్త్వజ్ఞానోపదేశము చేసి, జీవుని మార్గాన్ని చక్కగా సుగమం చేయగలిగినవారిని దీక్షా గురువు అంటారు. మాయాజాల స్వరూపమైన ఈ బ్రహ్మాండములో పరమాణువు నుండి అనంతమైన విశ్వం వరకూ గల అంతరంగ బహిరంగ విషయాల తత్వాన్ని బోధించేవారిని శిక్షా గురువు అంటారు. వృక్షములు, లతలు, పశువులు, పక్షులు మొదలైనవన్నీ ఎంత సమయంలో ఎంత బోధిస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుసుకోవాలనే తపనతో ఎక్కడికి వెళ్లినా అక్కడ నేర్చుకోవలసినది ఏదోఒకటి కన్పిస్తుంది. శిక్షణవలన జీవికి పరమాత్మ దర్శనం కలగటంలో సహాయం లభిస్తుంది.
సూక్ష్మతత్త్వ ప్రాప్తికి శిక్షణ మొదటి గురువు. దీక్ష రెండవ మెట్టు. శిక్షణ దీక్షకు అనుకూలంగా ఉండాలి. శిక్షణ విధి విధానంగా లేకపోతే ఫలవంతం కాదు. అందువలన శిక్షణనివ్వటానికి సుశిక్షితుడు, దీక్షితుడు అయిన సద్గురువు తప్పక కావాలి. శిక్షణ- దీక్షల తత్త్వములు వేరు వేరని భావించేవారు శిష్యుని చక్కగా సుశిక్షితుని చెయ్యలేరు. శైశవము వనమనకు, వనమ ముసలితనమునకు పూర్వావస్థలైనట్లుగా శిక్షణ దీక్షకు పూర్వాస్థ అవుతుంది. దీక్ష ద్వారా సంశయనాశము, యథార్థ జ్ఞానము, దివ్యదృష్టి కలుగుతాయి. దీక్ష ద్వారా జీవుడు పరమారాధ్యయైన పరదేవతను దర్శించి కృతార్థుడవుతాడు. శిక్షణ దీక్షలు ఇవ్వటానికి యోగ్యుడైన గురువునకు తప్ప మరెవరికీ అధికారం లేదు.
గురువనగానే సామాన్యంగా దీక్షా గురువని లోకులు భావిస్తారు. కాని గురువు అనగానే జగత్తుకన్నా ఉన్నతమైన లోకం అని తెలియాలి. మనలాంటి మనిషే అనటానికి భయం కలగాలి. వారితోపాటు ఏకాసనం మీద కూర్చోటం కానీ, కూర్చునే సాహసం కాని చేయరాదు. వారి మాటలు వేదవాణి. వారి పాదోదకం అమృతము. వారి ఆజ్ఞ శిరోధార్యము. వారి దర్శనంవలన జీవితం సఫలమవుతుంది. అపారమైన ఈ సంసార సాగరాన్ని తరించటానికి గురువు విలక్షణమైన కర్ణ్ధారి. అలాంటి పవిత్రమైన దీక్షా గురుపదంలో ఎవరిని ఎన్నుకోవాలి? మన దేశంలో ఇవాళ రేపు గురువులని ఎవరు చెలామణి అవుతున్నారో, గురుదక్షిణే ఎవరి ధ్యేయమో, అలాంటివారిని సద్గురువులు అనే సాహసం చెయ్యకూడదు. కులగురువును త్యజించటమూ చెయ్యకూడదు. ఇలాంటి సంస్కారము మన దేశంలోని చాలామంది గురువులను దుర్దశకు పాలు చేసింది.
అయితే వారిలో ఒకరిద్దరు మంచి గురువులు ఉండవచ్చును. వారిని అందరూ భక్తిశ్రద్ధలతో ఆదరిస్తారు. కాని అశిక్షితులు, అసచ్ఛరిత్రులు, సాధనారహితులు అయిన గురువులకు దీక్షనిచ్చే అధికారం ఎక్కడిది? తాను అంధుడైనవాడు, ఇతరుల కండ్లు తెరిపించటానికి బదులు భయంకరమైన శలాకతోశిష్యుల కళ్లనే పోగొట్టుతాడు. అలాంటి గురువులకు చరాచరవ్యాపి, అఖండమండలాకారుడైన పరమ పురుషుని దర్శింపజేసే శక్తి ఉండదు కదా! తాను ముందుగా దర్శించనివాడు ఇతరులకు ఏమి దర్శింపజేస్తాడు? అలాంటివారు కేవలం సద్గురుబ్రువులు మాత్రమే!
పిత్రార్జితమైన వనములు- భూములు - గృహములు- సంపదలలాగా ఆ గురువులు కూడా శిష్యుల ఇళ్ళలో కూర్చొని అధికారం చెలాయిస్తూ ఉంటారు. దీక్ష ఇవ్వటం తమాషాకాదని వారు ఒక్కసారి కూడా ఆలోచించరు. శిష్యుని సంసార సాగరాన్ని తరింపజేసే గురుతర బాధ్యత వారిమీద ఉన్నది. అలాంటి తమ శిష్యుల బాధ్యతను గురించి భగవంతునికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏమీ తెలియని అలాంటి గురువులు మండే నిప్పులలో ఎందుకు చెయ్యి పెడుతున్నారో తెలియదు. హిందువులై ఉండి, శాస్తమ్రులను నమ్ముతూ వారు అలాంటి భయంకరమైన పనులు ఎందుకు చేస్తున్నారో చెప్పలేము. గురువులక్షణమేమిటో ముందువారు తెలుసుకొని, దీక్ష ఇవ్వటానికి అర్హతుంటే దీక్ష ఇవ్వవచ్చు.
- ఇంకాఉంది

సకల శాస్తమ్రులను తెలిసినవాడు, కార్యదక్షుడు, శాస్త్ర రహస్యాలు తెలిసినవాడు, చక్కగా మాట్లాడేవాడు, వికలాంగములు లేనివాడు, దర్శన మాత్రం చేతనే శుభాలను కలిగించేవాడు, జితేంద్రియుడు, బ్రాహ్మణుడు, శాంతచిత్తుడు, మాతాపితరుల హితము కోరేవాడు, ఆశ్రమ స్వీకారం చేసినవాడు, దేశీయుడు- ఇలాంటి లక్షణాలు కలిగిన పురుషుని గురువుగా స్వీకరించాలి. ఇలాంటి గుణవంతుడైన గురువు శిష్యునికి దీక్షనిస్తే గురుశిష్యులిద్దరికీ శుభం కలుగుతుంది. ఈ రోజులలో గురుత్వం అనేవి ఉద్యోగము, వ్యవసాయములలాగా ధనార్జనకు మార్గమైంది. కర్మదోషం వలన గురుపదమును కలుషితం చేస్తున్నారు. శిష్యుని ఉద్ధరించకపోతే గురువు మహాపాప పంకిలంలో పడిపోతాడు.
మంత్రదీక్ష ఇవ్వటానికి పూర్వం గురుశిష్యులిద్దరూ కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం దాకా ఒక చోట కలిసి ఉండాలి. ప్రీతికరమైన ప్రయోజనకరమైన బోధ చేసిన గురువును జ్ఞానభిక్ష ప్రసాదించమని కోరాలి. అప్పుడు గురువు దయతలచి శిష్యునికి భవబంధాలనుంచి ముక్తుడు కాగలిగిన ఉపాయమును, తత్త్వజ్ఞామును ఉపదేశించి, దీక్షనివ్వాలి. చాలా సమయాలలో శిష్యుని సమ్మతి లేకుండానే గురువులు బలవంతంగా దీక్షనిస్తున్నారు. అట్లా చెయ్యటం మహాపాపము. అడగకముందే దీక్షనిస్తాననటం ధనలోభమే అవుతుంది. శిష్యుడు చేతులు జోడించి ప్రార్థించనంతవరకూ సద్గురువు దీక్షనివ్వకూడదు. శిష్యుడు మంత్రజపం చేస్తున్నాడా, లేదా? సాధనలో ఎలాంటి విఘ్నాలైనా వస్తున్నాయా లేదా? శిష్యుడు ఎంత ఉన్నతిని సాధించాడు? ఇలాంటివన్నీ తెలుసుకోవలసిన అవసరం గురువుకు ఉన్నది. కాని ఈనాటి గురువులు పొరపాటున కూడా ఇలాంటి విషయాలు అడుగరు. కాని శిష్యునికి ఎంత జీతం వస్తుంది? ఆపైన ఇంకేమైనా సంపాదిస్తున్నాడా, లేదా? ఇలాంటి విషయాలు అడగటం మాత్రం మర్చిపోరు. అందువలన ఈ రోజులలో చదువుకొన్నవారు కుల గురువు నుంచి దీక్షను తీసుకోకూడదు. యోగ్యుడైన గురువు లభించినప్పుడే దీక్షా ప్రయత్నం చెయ్యాలి.
సరియైన మార్గాన్ని చూపించే శక్తి మంచి గురువులకు తప్ప మరెవ్వరికి లేదు. క్షేత్రము- అంటే మానవ శరీరము- అందరికీ ఒకే విధంగా ఉండదు. అందువలన ఒకే రకమైన బీజమనే మంత్రాన్ని అందరికీ ఇవ్వటం కుదరదు. మహాపురుషులు తప్ప అలాంటి పని ఎవ్వరూ చెయ్యలేరు. పరంపరగా వచ్చే కుల గురువుల నుంచి మనకేదో లభిస్తుందన్న నమ్మకం కాని ఆశ కాని ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఏ మార్గంలో నడవాలో వారికే తెలియదు. గ్రుడ్డివాడు గ్రుడ్డివారికి దారి చూపలేడు కదా!
ఒకే ఇంటిలోని వారిలో ఒకడు సన్మార్గుడు, ఒకడు దుర్మార్గడు, ఒకడు ధార్మికుడు, ఒకడు అధార్మికుడు, ఒకడు నాస్తికుడు, ఒకడు పండితుడు కావటం సర్వసామాన్యంగా కన్పించేదే! కాని కుల గురువు మాత్రం ఎప్పుడూ అందరికీ ఒకే ఇష్టదేవతను, ఒకే బీజాక్షరాలతోకూడిన మంత్రాన్ని (కేవలం అక్షరాలను మాత్రం కొంచెం ఇటు అటూ మారుస్తారు) ఇస్తూ ఉంటారు. ఆ మంత్రం వలన శిష్యునికి శుభం జరిగినా, అశుభం జరిగినా, దాని బాధ్యత ఆయనకు పట్టదు. గురువంటే ఏమిటో అతనికే తెలియదు. శిష్యునికి దీక్ష ఇచ్చినందుకు తనకు ప్రతిఫలంలభించటమే అతనికి కావలసింది. దీక్ష తీసుకొన్న శిష్యుడు దానివలన ఏమి ఉపకారాన్ని పొందాడు అని అడిగితే భయభ్రాంతుడవుతాడు. ఒకవేళ శిష్యుడే ఆ విషయాన్ని గురించి అడిగితే ధర్మోపార్జన అనేది ఒక జన్మలో జరిగేది కాదని, దానికి జన్మ- జన్మాంతరాలు పడుతుందని చెబుతారు. ఇలాంటి మాటలు పూర్వజన్మలోను విన్నాము. ఈ జన్మలోనూ వింటున్నాము. ఈ విధంగా జన్మలు గడిచిపోతున్నాయి; కాని ఆ జన్మలో ఎట్లా ఉండిందో, లేదా ఆ జన్మలో లేక ఈ జన్మలోనే ఉన్నది అనే చెప్పే యోగ్యత కూడా ఎవరికీ లేదు. అయినా వారు మాత్రం గురువు అని అనిపించుకోవాలని అభిమానపడుతూ ఉంటారు.
- ఇంకాఉంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP