శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

" అల్లూరి "గూర్చి అవాకులు చవాకులుపేలే కబోదులారా ! ఈవాస్తవాలు చూడండి

>> Saturday, June 16, 2012

... It is clear that the rebels are too dangerous to be dealt with by police, and that soldiers experienced in jungle warfare are required. I much regret that I did not realise this sooner.. It is essential that Martial Law should be proclaimed throughout the necessary area.
[Demi-official from F.W.Stewart, Esq.,ICS, Agency Commissioner, to R.A.Graham, Esq.C.S.I., I.C.S. Chief Secretary to Government dated camp Narasapatnam, the 26th August 1922]
... తిరుగుభాటుథారులు చాలా ప్రమాదకరమైనవారని స్పష్టం. కేవలం పోలీసులతో వారిని ఎదుర్కోవటం కష్టం. జంగిల్ యుద్ధాల్లో అనుభవమున్న సైనికులు అవసరం. ఈ వాస్తవాన్ని ఇంతకుముందే గ్రహించలేక పోయినందుకు నేను చాలా చింతిస్తున్నాను. అవసరమైన ప్రాంతమంతటా మార్షల్ లాని ప్రకటించటం అత్యవసరం.
దమనపల్లి ఘటనలో స్కాట్‌కవర్డ్, హైటర్‌ల దుర్మరణాన్ని రిపోర్టు చేస్తూ ఏజన్సీ కమిషనర్ స్టీవర్ట్ దొరవారు మద్రాసులోని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గ్రహాం దొరవారికి 1922 ఆగస్టు 26న నర్సీపట్నం మకాం నుంచి రాసిన డి.ఒ. లేఖలో చేసిన ఆర్తనాదమిది.
సీనియర్ ఐ.సి.ఎస్. ఆఫీసరు స్టీవర్ట్ అంతటివాడు నేరుగా రంగంలో ఉండి పరిస్థితిని స్వయంగా మదింపు చేసి, సీతారామరాజు తిరుగుబాటును అణచటం పోలీసుల వల్ల కాదని చేతులెత్తేయడాన్నిబట్టే మన్య విప్లవం బ్రిటిష్ అధికార యంత్రాంగాన్ని ఎంత గడగడలాడించిందీ బోధపడుతుంది. అయినా తెల్లదొరతనానికి తమ చల్లని పాలనలో పరిస్థితి అంతగా విషమించిందంటే నమ్మబుద్ధి కాలేదు. కొద్దిమంది పోలీసుల సాయంతో విశాల భారతదేశం మొత్తాన్ని తుపాకి మడమ కింద అణచి ఉంచి, లెక్కలేనన్ని స్థానిక తిరుగుబాట్లను, బీభత్సపు దాడులను విజయవంతంగా ఎదుర్కొని, సహాయ నిరాకరణ లాంటి మహామహా జాతీయ ఉద్యమాలనే గాంధీ మహాత్ముడి పుణ్యమా అని అవలీలగా కాలరాచి వేయగలిగిన మహాశక్తిమంతులాయె వారు! అంత చండ ప్రచండంగా యావద్దేశాన్ని ఏలుతున్న తమకు ఆఫ్టరాల్ ఒక ఏజన్సీలో పాతిక ముప్ఫై కుగ్రామాల్లో ఎవడో ఒక పాతికేళ్ల కుర్రవాడు రెండు మూడొందల అలగాజనాన్ని పోగేసి... ఎత్తుకొచ్చిన నాటు తుపాకులతో, తాతలనాటి విల్లంబులతో చిన్నపాటి దాడులు చేసి, ఇద్దరు ఆఫీసర్లను మాటువేసి చంపినంత మాత్రానే గంగవెర్రులెత్తి మార్షల్‌లాను ప్రకటించి, భారీ ఎత్తున సైన్యాన్ని మొహరించవలసి వస్తే ప్రపంచంలో ఎంత అప్రతిష్ఠ?! ఇనుప పాదాల కింద తాము తొక్కిపెట్టిన కోట్లాది భారతీయులకు తామంటే ఇక ఎంత అలుసు?
అలా ఆలోచించే బ్రిటిష్ సర్కారు వారు అల్లూరి అలజడిని అణచటానికి మార్షల్‌లా వైపు మొగ్గు చూపలేదు. పోలీసులకు సాయంగా వీలైనమేరకు సైనిక దళాలను పంపించడమే తప్ప మొత్తం కల్లోల ప్రాంతాన్ని మిలిటరీకి అప్పగించటానికి ఇష్టపడలేదు.
అంతదూరమైతే వెళ్లకూడదనుకున్నారు కాని పరిస్థితి తీవ్రతను బట్టి తిరుగుబాటును ఎదుర్కోవడానికి నానాతంటాలు పడ్డారు. చేయగలిగిందంతా చేశారు. ఇటీవలే మోప్లా తిరుగుబాటును కర్కశంగా అణచిన మలబార్ స్పెషల్ పోలీసులను మన్యానికి అర్జంటుగా తరలించారు. ఏజన్సీ ప్రాంత పరిస్థితుల్ని బాగా ఎరిగిన ఎ.జె.హాపెల్‌ని ఏజన్సీ పోలీసు బలగానికి ఆపరేషన్స్ కమాండర్‌గా నియమించారు. అపరాధ పరిశోధనలో పేరు పొందిన గంజాం జిల్లా పోలీసు సూపరింటెండెంటు స్వీనీని రంగంలోకి దించారు. మలబారు నుంచి రెండు సిక్కు పటాలాల్ని టెలిగ్రాం ఇచ్చి పిలిపించారు. స్వైన్‌ను ప్రత్యేక పోలీసు ఇన్‌స్పెక్టరు జనరల్‌గా నియమించారు. విప్లవకారులు తెల్లదొరల మీదే పగబట్టటం వల్ల కనీసం 50 మంది రక్షకులు లేకుండా ఏ తెల్ల అధికారీ కాలు బయటపెట్టకూడదని చెప్పారు. పితూరీదార్లను, పితూరీకి తోడ్పడిన వారిని, పితూరి అణచటానికి సాయపడని వారిని వెనువెంటనే శిక్షించటానికి వాల్తేరులో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. పితూరీదారులకు సహకరించారనే నెపం మీద రోజూ డజన్ల సంఖ్యలో సామాన్య ఆదివాసులను వాల్తేరుకు లాక్కెళ్లి ఈ ట్రిబ్యునల్‌తో క్రూరమైన శిక్షలు విధింపజేసేవారు.
80 పేర్లతో విప్లవకారుల జాబితా తయారుచేశారు. అందులోని వారికి ధనరూపంలో, వస్తు రూపంలో ఎవరూ సహాయం చేయకూడదని, పలకరించరాదని, భోజనం పెట్టరాదని, వసతి ఇవ్వరాదని ఊరూరా చాటింపు వేశారు. ఈ కట్టుబాటును అతిక్రమించిన గ్రామంలో అదనపు పోలీసు సిబ్బందిని నియమిస్తామని, అందుకయ్యే ఖర్చును ఆ గ్రామంవారే భరించాలని బెదిరించారు. విప్లవకారుల ఆచూకీ తీసి సమాచారం ఇవ్వని ముఠాదార్ల ఆస్తి, భూములు ప్రభుత్వ వశమవుతాయని, కేసులు పెట్టి జైల్లోనూ వేస్తామని హెచ్చరించారు. ఏజన్సీలోని ప్రతి పోలీసుస్టేషనులోనూ అదనపు సిబ్బందిని నియమించి గట్టి బందోబస్తు చేశారు.
ఇంతా చేస్తే ఏమైంది?
సీతారామరాజు అనుచరులతో కలిసి ధారకొండ బంగళాలో విడిది చేసి వున్నాడని స్థానిక ముఠాదారు పై అధికారులకు రిపోర్టు చేశాడు. అక్కడ నుంచి అడ్డతీగల, రంపచోడవరం స్టేషన్లు ముట్టడించి పాపికొండల మీదుగా బస్తర్ పోయే సన్నాహాల్లో రాజు ఉన్నాడని, బస్తర్ నుంచి పెద్ద సైన్యంతో తిరిగి వచ్చి స్వరాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడని వార్తలు వ్యాపించాయి. అవి వట్టి పుకార్లేనని అధికారులు మొదట కొట్టిపారేశారు.
అంతలో ఒక పోలీసు గూఢచారి నుంచి వేగు వచ్చింది. ఆనుపానులు ఆరా తియ్యటానికి రామరాజు బస దగ్గర తారట్లాడుతుంటే రాజు మనుషులు అతడిని పట్టుకుని నాయకుడి దగ్గరికి తీసుకుపోయారట. భారతీయ ఉద్యోగులను ఏమీ చేయరాదన్న నియమం ప్రకారం రాజు అతడికి హితబోధ మాత్రం చేసి వదిలిపెట్టాడట. బతుకుజీవుడా అని అతడు కాలికి బుద్ధి చెప్పబోతూంటే ‘‘ఎలాగూ వచ్చావు కదా. ఓ పని చెయ్యి. నేను పైడిపుట్ట వెళతాను. అక్కడ పంచాంగం చూసి ముహూర్తం పెట్టి అడ్డతీగలకు గాని, రంపచోడవరంగాని వెళతాను. ఈ సంగతి మీ అధికారులకు రిపోర్టు చెయ్యి’’ అన్నాడట రామరాజు.
అదీ సమాచారం. విన్న తాసిల్దారు విస్తుపోయాడు. అంత ధైర్యంగా... చెప్పి మరీ దాడి చేస్తారంటే నమ్మలేకపోయాడు. ‘‘మనల్ని తప్పుదారి పట్టించటానికే రామరాజు అలా చెప్పాడేమో. నువ్వు పైడిపుట్ట వెళ్లి అతడు అన్న ప్రకారం అక్కడికి పోయిందీ లేనిదీ చూసిరా’’ అని గూఢచారికి చెప్పాడు. అతడు వెళ్లాడు. పైడిపుట్టలో రామరాజును చూశాడు. ‘‘పంచాంగం చూశానయ్యా. 16వ తేదీన అడ్డతీగల స్టేషనుకు వస్తున్నాను. మీ పై వాళ్లకు చెప్పు’’ అన్నాడు రాజు. ఆ రోజు అక్టోబర్ 13.
కబురు తెలిసిన అధికారులు వెంటనే ఎలర్ట్ అయ్యారు. గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు డాసన్ హుటాహుటిన అడ్డతీగల బయలుదేరాడు. ఏ క్షణమైనా దాడి జరగొచ్చు. సిద్ధంగా ఉండమని అడ్డతీగల ఠాణాకు టెలిగ్రాం ద్వారా ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజునే (అక్టోబర్ 13న) ఇన్‌స్పెక్టర్ షెర్లాక్ అడ్డతీగల స్టేషను రక్షణ బాధ్యత తీసుకున్నాడు. అతడి కింద 24 మంది రిజర్వు కానిస్టేబుళ్లు ఉన్నారు. మామూలుగా ఉండే స్టేషను సిబ్బందికి అదనంగా ఇంతమంది తుపాకులతో కాపలా ఉండగా రాజు అడ్డతీగలను దోచుకొనగలనని భావిస్తే అది దుస్సాహసమని ఏజన్సీ కమిషనరు స్టీవర్ట్ నర్సీపట్నం మకాం నుంచి 16వ తేదీన ప్రభుత్వానికి పంపిన రిపోర్టులో చెప్పుకున్నాడు.
ఏం లాభం? సరిగ్గా ఆ రోజునే రామరాజు ముందు హెచ్చరించిన ప్రకారం అడ్డతీగల ఠాణా మీద మహారాజులా దాడి చేశాడు! పోలీసులు, అధికారులు నిశే్చష్టులై చూస్తూండిపోయారు.
విప్లవకారులు గుంపుగా వచ్చేస్తున్నారని, ప్రస్తుతం అడ్డతీగలకు రెండు మైళ్ల దూరంలో ఉన్నారని గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు డాసన్‌కు ఉదయం 7 గంటలకు సమాచారం అందింది. అప్పుడు ఆ దొర కారులో అడ్డతీగలకే వెళుతున్నాడు. ఆయన వెంట గోదావరి జిల్లా మేజిస్ట్రేటు బ్రావెన్ దొరవారూ ఉన్నారు. కబురు అందగానే వారు ఇంకా వేగంగా అడ్డతీగలకు పరుగు పెట్టారా? లేదు. రామరాజు వస్తున్నాడని తెలిసిన వెంటనే ఇద్దరికీ గుండెలు జారాయి. అదనపు సిబ్బందిని అర్జంటుగా తరలించడానికని చెప్పి ఎస్.పి.గారు వెనక్కి తిరిగి కాకినాడకు వెళ్లాడు. జిల్లా మేజిస్ట్రేటేమో 40 మంది రిజర్వును, రాజమండ్రి నుంచి పంపించమని ఆజ్ఞాపించి ఏలేశ్వరానికి ఉడాయించాడు. విప్లవకారులను పట్టుకోవటానికి హడావుడి అంతా చేశారు. జరగవలసింది జరిగే పోయింది. అదేమిటో ఆ సమయాన అడ్డతీగల స్టేషనులో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ అడ్డాల సుబ్బారావు మాటల్లో వినండి:
‘‘జిల్లా మేజిస్ట్రేటు అడ్డతీగలకు 5 మైళ్ల దూరమున తిమ్మాపురములో మకాము చేసియుండెను.. మమ్ములను ఆయుధములు, మందుగుండు తీసుకొని మా ఇష్టము వచ్చినచోట దాగుకొనవచ్చునని కబురు చేసినారు. ఇందుకు కారణము ఆయుధములు విప్లవకారుల వశము గాకుండా చేయుటయే. పోలీసుస్టేషను సిబ్బంది వారి కుటుంబములను ఏలేశ్వరము మొదలగు ప్రాంతములకు భయకంపితులై పంపివేసిరి.. మా యిండ్ల తలుపులు బాహాటముగా తీసి యుంచితిమి.
‘‘రాజుగారు కబురు పంపిన టైముకు తన అనుచరులతో వచ్చి ముందుగా స్టేషనుపై కాల్పులు సాగించిరి. స్టేషను పైకప్పు జింకు రేకులదగుట వలన ఆ ధ్వనితో గ్రామమంతయు దద్దరిల్లినది. నేను స్టేషనుకు దగ్గరలోనున్న పూటకూళ్ల ముసలమ్మ ఇంటిలో తూటాలు జాగ్రత్తగా పట్టుకొని దాగుకొని యుంటిని. భయాందోళనవలన నిద్రపట్టలేదు. అనుచరులను నాలుగు రోడ్ల మీద కావలియుంచి, శ్రీ సీతారామరాజు మరికొంతమంది అనుచరులతో స్టేషనులోనికి వెళ్లెను. వారు ఊరిలోని ప్రజల మీదకు రానేలేదు. తెల్లవారుఝాము మూడు గంటల వరకు స్టేషనులోనే యుండిరి.
‘‘ఈలోపున జిల్లా మేజిస్ట్రేట్ అడ్డతీగలలో నేమి జరుగుచున్నదో చూచి రావలసినదిగా నాకిరెడ్డి రుద్రయ్య అను నతనిని సైకిలుపై పంపెను. విప్లవకారులు అతనిని రాజు యెదుట హాజరుపరచిరి. రాజుగారు చెప్పిన టైముకు వచ్చినారనియు, రిజర్వు పార్టీ, ఇనస్పెక్టరు మొదలగువారు పారిపోయినారనియు, మీరు తిమ్మాపురములో నున్నట్లు తెలిసినదనియు, మీ రాకకు ఎదురు చూస్తున్నాననియు మేజిస్ట్రేట్‌కు చెప్పవలసినదిగా రుద్రయ్యకు రాజు ఆజ్ఞాపించెను. ఈ సంభాషణ నాకు అక్షరాల వినిపించినది. తెల్లవారగట్ల 3 గంటలకు రాజు జడయేరు ఒడ్డున తన కుటీరమునకు వెళ్లిపోయెను. మేము అది కనిపెట్టి వెంటనే స్టేషనులో ప్రవేశించితిమి. మరునాడు ఉదయము అధికారులందరూ వచ్చి రాత్రి జరిగిన విషయములు తెలిసికొనిరి. సీతారామరాజు జడయేరులో స్నానము చేయుచున్నారని వార్త అందినది. కాని రాజు దగ్గరకు వెళ్లుటకు ఎవరును సాహసింపలేదు.’’
శ్రీ అల్లూరి సీతారామరాజు చరిత్ర,
యర్రమిల్లి నరసింహారావు, పే.78
మరి తన రక్షణలో ఉన్న స్టేషనులో విప్లవకారులు ఇంత థర్జాగా దర్బారు నడుపుతూంటే మందీమార్బలం, తుపాకులు, తూటాలు దండిగా ఉన్న ఇన్స్‌పెక్టర్ షెర్లాక్ ఏమి చేస్తున్నాడు? ఆ సంగతి జిల్లా పోలీసు సూపరింటెండెంటు డాసన్ మాటల్లో విందాం:
‘‘16వ తేది రాత్రి 10 గంటలకు విప్లవకారులు తమపై పడనున్నారని షెర్లాకు తెలిసికొనెను. తన వద్ద ఆరుగురు జవాన్లు, ఒక హెడ్ కానిస్టేబుల్, పది మంది రిజర్వు పోలీసులు మాత్రము ఉండిరి. జవానులు, ఇద్దరు రిజర్వు పోలీసులు వెంటనే పారిపోయారు. తెలివైనవాడు గావున అతడు స్టేషను ఆవరణను దాటి కొంత దూరములోనున్న పొడుగాటి గడ్డిలో పరుండి అవకాశము కొరకు ఎదురుచూచుచుండెను. విప్లవకారులు 20 మంది ఉండిరి. తుపాకి కాల్చుట వలన లాభము లేదని తలచి అతడు గ్రామము లోనికి బోయెను. విప్లవకారులు స్టేషను లోనికి 5సార్లు తుపాకులు పేల్చి, స్టేషనులో ఎవ్వరును లేకపోవుట చూచి గ్రామము లోపలికి బోయిరి. షెర్లాకును, అతని సిబ్బందిని గ్రామస్థులు కనపడకుండా దాచిరి.’’
అల్లూరి సీతారామరాజు చరిత్ర,
దంతులూరి వెంకట రామరాజు, పే.101
ఫలానా రోజు ఫలానా సమయానికి ఫలానా పోలీసుస్టేషను మీథ దాడి చేయబోతున్నానని మూడు రోజుల ముందు విప్లవ నాయకుడు నోటీసు ఇచ్చినా ఏమీ చేయలేక, దాడిని ఎదుర్కొనలేక, బ్రిటిష్ మహాసామ్రాజ్యపు అధికార, పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చేతులెత్తేసిందంటే నమ్మశక్యం కాదు. కాని నిజం. 1923 అక్టోబరు 17న ఏజన్సీ కమిషనరు స్టీవర్టు దొరవారికి ఏలేశ్వరం తాలూకా మేజిస్ట్రేటు పంపిన తంతి వార్త జరిగిన పరాభవాన్ని మూడు ముక్కల్లో చెప్పింది:
‘‘గత రాత్రి అడ్డతీగల లూటీ చేయబడినది. పోలీసులు పారిపోయిరి. ఆయుధ సామగ్రి ఏమియుపోలేదు. నల్లమందు పెట్టె భోషాణము బ్రద్దలు గొట్టబడినవి. ఏమియు పోలేదు. విప్లవకారులు చోడవరము వైపు వెళ్లుచున్నారు.’’
దంతులూరి వెంకట రామరాజు గ్రంథం, పే.101
జిల్లా మేజిస్ట్రేటు బ్రాకెన్ పెథ్ద బలగంతో వస్తున్నాడని తెలిసి రామరాజు అడ్డతీగల నుంచి పారిపోయాడని పోలీసు సూపర్నెంటు డాసన్ తన రిపోర్టులో చెప్పుకున్నాడు. అది అబద్ధం. రాజు తెల్లవారుఝాము దాకా అడ్డతీగల స్టేషనులోనే ఉన్నాడు. రమ్మని తాను కబురంపినా అధికారులెవరూ వచ్చే జాడ లేదని నిశ్చయించుకున్నాక తీరుబడిగా రాజఠీవితో మరలిపోయాడు. తాను మరుసటి దినం మధ్యాహ్నం 3 గంటల వరకూ పైడిపుట్టలో ఉంటానని, పోరాటానికైనా సరే, మాట్లాడటానికైనా సరే రావచ్చునని మేజిస్ట్రేటుకు రిజిస్టరులో సందేశం రాసి, సంతకం పెట్టి మరీ వెళ్లాడు.
అన్నట్టే పైడిపుట్టలో వేచి వున్నాడు. ఎటొచ్చీ ఆయనకు ఎదుటపడేందుకే కొమ్ములు తిరిగిన ఏ తెల్లదొరకూ దమ్ములు లేకపోయాయి.
అదీ అల్లూరి తడాఖా!
*

2 వ్యాఖ్యలు:

Murthy K v v s June 16, 2012 at 11:28 PM  

Sir,
I have a conviction for a long time that Late sri balananda swami of perantapalli (paapi kondalu)was none other than sri Alluri.I have read his "spiritual enquiry" & other writings.Swamiji got samadhi in sixties.His photograph has close similarities with alluri that I had seen.swamiji never disclosed his whereabouts even to his close aids.And I have many other strong doubts in this regard.Anyway salute to that great man...KVVS MURTHY

రేణూకుమార్ June 17, 2012 at 10:48 PM  

<<>>

ఇది కూడా సత్యం అందరు గుర్తించవలసిన వాస్థవం
- రేణూ కుమార్

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP