శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆలయాలలో, దేవుని సన్నిధిలో, ఇతరులకు నమస్కారం పెట్టరాదంటారు. ఎందువల్ల?

>> Saturday, April 28, 2012

ఆలయాలలో, దేవుని సన్నిధిలో, ఇతరులకు నమస్కారం పెట్టరాదంటారు. ఎందువల్ల? - రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం
దేవుడు, సద్గురువులైన యతీశ్వరులు, ఇలాంటివారు త్రిజగత్ప్రభువులు. వారి సన్నిధిలో ఇతరులంతా దాసులే. చక్రవర్తి సన్నిధిలో వుండగా, దాసుల దృష్టి చక్రవర్తిమీద కేంద్రీకృతం కావాలి గానీ, పక్కనున్న దాసుల మీద కాదు. పక్కనున్న దాసుల మీద దృష్టిపెట్టి వారిని గౌరవించడం చక్రవర్తికి అవమానం చేసినట్లే అవుతుంది. దైవ సన్నిధిలో ఇతరులకు నమస్కారం చేయటం కూడా అలాంటిదే. అందువలన దానిని ధర్మశాస్త్రాలు నిషేధించాయి.
ఏటిసూతకంలో వున్నవారు వరణ ఇచ్చి గ్రహజపాదుల చేయించుకోవచ్చునా? - దువ్వూరి లక్ష్మీనరసింహం, ముమ్మిడివరం
ఏటి సూతకం అంటే పితృ దేవతలకు కర్మచేసిన కర్తలకు ఇంకా కొంత సూతక శేషం మిగిలి వుందని అర్థం. అందువల్ల, నిత్య పూజలను మించి వారు వేరే పూజాదులను చేసుకోవటానికి అర్హులుకారు. ఋత్త్విక్కులకు వరణం ఇవ్వటానికి కూడా అర్హులు కాదు. కష్టాలు మరీ ఎక్కువగా వుంటే, స్తోత్ర పారాయణలను సొంతంగానే చేసుకోవచ్చు. మరీ గత్యంతరం లేని పరిస్థితి ఐతే ఏటి సూతకం లేని ఇతరులచేత వరణం ఇప్పించి జపాదులు జరిపించుకోవాలి. కానీ, వీలైనంత వరకు ఈ పద్ధతిని ముట్టుకోకుండా వుండటం మంచిది.
ఇంట్లో ముళ్ళున్న చెట్లు, కొమ్ము విరిస్తే పాలుగారే చెట్లు పెంచుకోకూడదంటారు, ఎంతవరకు నిజం? - గంగుల శ్రీ్ధర్, మెట్‌పల్లి
ఆ నియమం శాస్త్రోక్తమే. కానీ దానికి కొన్ని మినహాయింపులున్నాయి. దేవతా నివాస భూతములు, దేవతా పూజకు విహితాలు అయిన చెట్లు ముళ్ళున్నా, పాలున్నా ఇంట్లో పెంచదగినవే. ఉదాహరణకు- మారేడు, గనే్నరు, మేడి, దానిమ్మ, నిమ్మ ఇటువంటివి ఇంట్లో పెంచుకోవచ్చు. ముళ్ళ తుమ్మ, జిల్లేడు వంటివి ఇంట్లో ఉండటం మంచిది కాదు. కానీ, ఇంట్లో దొడ్డి చాలా పెద్దదిగా వుండి, నివసించే ఇంటికీ దానికీ మధ్యన గోడ, పునాది వంటివి అడ్డం వుంటే, అలాంటి పెరట్లో తెల్లజిల్లేడు, సపోటా, నిమ్మ వంటివిగూడా పెంచుకోవచ్చు.
గోత్రాలలో కౌసికస గోత్రమనేది ఒకటి వుంది. కౌసికుడు అంటే విశ్వామిత్రుడు అని అర్థం చెబుతున్నారు. అటువంటప్పుడు విశ్వామిత్రస గోత్రం అని అనవచ్చుగదా! ఎందుకనటం లేదు?
- రమణమూర్తి, హైదరాబాదు
కుసిక వంశంలో పుట్టినవారంతా కౌసికులే. విశ్వామిత్రుడు కూడా ఆ వంశంలోనే పుట్టాడు. అంతమాత్రంచేత కౌసికుడంటే విశ్వామిత్రుడు మాత్రమే అనటం సముచితం కాదు. కుసిక వంశంలో పుట్టిన ఒకానొక మహర్షికి ఆయన తండ్రి కుసికుడు అనే నామధేయమే పెట్టాడు. తపస్సులు అనేక రకాలు. అందులో వంశ ఋషిత్వానికి కావలసిన తపస్సు చేసినవారే గోత్ర ప్రవరలోకి చేరతారు. కౌసిక మహర్షి అలాంటి తపస్సు చేశాడు కనుక, ఆ గోత్రానికి ఆ పేరే వచ్చింది.



* మంగళవారం రోజున తులసికి దీపం పెట్టవచ్చునా?
- ఎ.హర్షశ్రీ, విఘ్నరాజు, మెట్‌పల్లి
ఒక్క మంగళవారమే కాదు, ప్రతిరోజూ పెట్టాలి.
* దేముడికి దీపం ముట్టించాలంటే ఖచ్చితంగా తలంటు పోసుకోవలసిందేనా? - విఘ్నరాజు, మల్కాజిగిరి
అలాంటి నియమం లేదు. ఏదైనా అపవిత్రత కలిగిందని అనుమానం కలిగితే స్ర్తిలు తలంటు పోసుకోవాలి. పురుషులు తల స్నానంచేస్తే చాలు.
* సంక్రాంతి పండుగ శాస్ర్తియ ఆధ్యాత్మిక విశిష్ఠతను వివరంగా తెల్ప ప్రార్థన. - జి.నీలంనాయుడు, బర్కత్‌పుర
వివరంగా చెప్పేందుకు ఇది తగిన వేదిక కాదు. ఖగోళ పరంగా చూసుకుంటే, సూర్యుడియొక్క దీర్ఘ వృత్తగమనంలో ఒక రాశినుంచి మరొక రాశిలోకి ప్రవేశించిన శుభ దినాన్ని సంక్రాంతి అంటారు. అందులో మకర సంక్రాంతి అనేది సూర్యుడి యొక్క ఉత్తర గమనానికి ప్రారంభ దినం అవుతుంది. సూర్యుడి ఉత్తర గమన సమయంలో సూర్య మండలం భూమికి ఒకింత చేరువై, అత్యధికంగా శక్తిప్రదానం భూలోక వాసులకు అందుతుంది. అందువల్ల 12 సంక్రాంతులలోను మకర సంక్రాంతి మానవులకు చాలా ఆనందకారకమైనది. దీనినే సంక్రాంతి పండుగగా భారతీయులు ఆచరించుకుంటున్నారు. ఈ సంక్రాంతి జనవరి 14, 15 తేదీలలో రావటమనేది 1500 సం.ల కిందట వరాహమిహిరుడి కాలంలో ప్రారంభమైంది. సూర్యుడియొక్క అయనాంశలలో గల మార్పులవల్ల అది ఇప్పుడు డిసెంబరు 22, 23లలోకి వచ్చింది. దీనిని సాయన మకర సంక్రమణంగా మన పంచాంగాలలో చూపిస్తున్నారు. పాత అలవాటు ప్రకారం సంక్రాంతి పండుగను జనవరి 14, 15 తేదీలలోనే చేసుకొంటున్నారు. ఆధ్యాత్మికంగా చూసుకున్నప్పుడు సూర్యుడి యొక్క దక్షిణ గతి ధూమయానానికి, ఉత్తరగతిని దేవయానానికి సంకేతాలు. కనుక, ఉత్తర గతి ఎక్కువ శుభప్రదం. దాని ప్రారంభం కనుక మకర సంక్రాంతి మహా పర్వదినం.
* అంబేద్కర్, వైయస్‌ఆర్, ఎన్‌టిఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఇది శాస్ర్తియమా?
- బి.బసవరాజు, కాకినాడ
గీతలో శ్రీకృష్ణ భగవానుడు ‘‘యశ్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామ చారతః’’అంటూ శాస్త్రంలో చెప్పబడని విధానాలతో అర్చనాదులు చేస్తే, ప్రయోజనం ఉండదని నిష్కర్షగా చెప్పాడు. కనుక, మీరు చెప్పిన అభిషేకాలకు ఆధ్యాత్మిక ఫలితం ఉండదు.
* సాయిబాబా ఇతర దైవాలకు 1116/- బిందెలతో పాల అభిషేకం చేస్తున్నారు. ఇది అవసరమా?
- లక్ష్మి కుషాయగూడా
దైవానికి చేసే అర్చనలన్నీ భక్తుడి యొక్క శక్తిస్థాయినిబట్టి ఉంటాయి. దానిని ఆక్షేపించేందుకు శాస్త్ధ్రారం లేదు. ఐతే, ఇంత పెద్ద అభిషేకాలు చేసినప్పుడు ఆ క్షీరం వ్యర్థంకాకుండా చూసుకోవటం కార్యకర్తల బాధ్యత.
* దేవుడి గదిలో దేవుడి ఫోటోలు, విగ్రహాలతోపాటు తల్లిదండ్రీ, అత్తమామ, భార్యాభర్త, మొదలైనవారి ఫొటోలు పెట్టి ధూప దీప నైవేద్యాలు చేయవచ్చునా?
- ఎమ్.ఉమ, విజయవాడ
ఇంటిలోని పూజాగదిలో దైవస్థానీయులైన తల్లీదండ్రీ, గురువు, అత్తమామల, వగైరా పూజ్యుల ఫొటోలను పెట్టి పూజించటంలో తప్పులేదు. ఇతరుల ఫొటోలను పూజా స్థానంలో పెట్టటం సముచితం కాదు. ఐతే, బతికి వున్న గృహస్థుల ఫొటోలను పూజలో పెట్టుకోవటం సంప్రదాయంలో లేదు. గురువుల ఫొటోలను మాత్రం బతికి వున్నా పెట్టుకోవచ్చు. ఇళ్లు చిన్నవిగా ఉన్నప్పుడు పూజా గదిలోనే, పూజా స్థానానికి భిన్నంగా వేరే ఫొటోలు వున్నా పట్టించుకోనక్కర్లేదు. ప్రత్యేకంగా పెద్ద పూజా గదులను ఏర్పరచుకోవటం అందరికీ సాధ్యం కాదుకదా.
================

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP