శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దైవభక్తిని జాతీయ శక్తిగా మార్చగలమా?

>> Tuesday, April 3, 2012

దైవభక్తిని జాతీయ శక్తిగా మార్చగలమా?

  • -చందు సుబ్బారావు
  • 31/03/2012
ఈ ప్రశ్న క్రొత్తదేమీ కాదు. విప్లవాత్మకమైన ఆలోచనా కాదు. ఇటీవల రుూ ప్రశ్న ఒక వ్యాసంలో లేవనెత్తిన వారు శాసన మండలి సభ్యులు, కాంగ్రెసు నాయకులు పాలడుగు వెంకటరావుగారు. తిరుపతిపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన ఓ వ్యాఖ్యపై చర్చిస్తూ మన దేశంలోని ‘దైవభక్తిని, దేశ ప్రయోజనాలకోసం వినియోగించుకోగలమా’ అన్నారు. ఒక్క క్షణం ఆశ్చర్యం లాంటిది కల్గినా మరుక్షణం సమస్య క్రొత్తదేమీ కాదు అని స్ఫురించింది. ప్రపంచంలోని ఇస్లామిక్ రాజ్యాలు తమ రాజ్యవ్యవస్థలను దేవుడు, మత గ్రంథాల సారాంశాలతోనే నడుపుతున్నట్లు ప్రకటించుతూనే వున్నాయి. 19వ శతాబ్దం చివరిదాకా క్రైస్తవం ఐరోపా దేశాల్లో పెద్ద పాత్రనే పోషించింది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని పరిశీలిస్తే యిక్కడ మత విశ్వాసం వందల రెట్లు అధికం. హిందూ మతంతోపాటు, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం కూడా స్వేచ్ఛగా వర్ధిల్లుతున్నాయి. మనుష్యులు లాభాన్ని, క్షేమాన్ని, ఇహపర సౌఖ్యాలను పొందగలరనీ పొరపాటుగా విశ్వసించటం వలన!! దైవభక్తికీ, మతానికీ ఉన్న వ్యత్యాసాన్ని మేధావులూ బుద్ధిజీవులూ కూడా గుర్తించలేని పరిస్థితి తలెత్తుతోంది. కొద్దిమంది ‘ఉన్నత భావుకులు’మాత్రమే దైవ విశ్వాసానికి మతాచరణ అవసరంలేదని భావిస్తున్నారు. సామాన్యుడికి తాత్విక చింతన కష్టం కనుక, భక్తిచింతన సులభంగా అలవడుతుంది. జీవహింస పాపమనే భావనకన్నా మత విశ్వాసాల ద్వారా హింసను తగ్గించటానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. జంతు బలులకు బదులు నారికేళ విచ్ఛేదనా, కుంకుమాగ్నీ అలాగే చోటుచేసుకున్నట్లు ఎరుగుదుం. సాంఘిక, సేవా కార్యక్రమాలలో, వ్యక్తిగత కార్యాలలో మతం విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇవికాక ఆచార్యులు, స్వాములు, పీఠాధిపతులు, బాబాలు, ప్రవక్తలు, సంకీర్తన సభానిర్వాహకులు దైవభక్తికి నిరంతర చైతన్య రూపాలుగా ప్రకాశిస్తున్నారు. భక్తులు సమర్పించే కట్నాలు కానుకలతోపాటు, యాత్రికులకై వెలసే వ్యాపార సంస్థలు కోట్లాది రూపాయల ‘టర్నోవర్’లతో నిర్వహించబడుతున్నాయి. తిరుమల తిరుపతి ‘వాటికన్’ స్థాయిని ఎప్పుడో దాటింది. ఆదాయంలో ప్రపంచ శిఖరాగ్ర సంస్థగా శ్రీ వెంకటేశ్వర సప్తశిఖరం రూపుదిద్దుకుంది. సరిగ్గా రుూ మహోజ్వల రూపాన్ని చూసే పాలకుడు ‘రుూ దైవభక్తిని దేశభక్తిగా మార్చుకోలేమా’ అన్న సంశయాన్ని వెలువర్చింది!
ఇలా మార్చుకోవటం కూడా మన దేశానికి క్రొత్తది కాదు. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో భగవద్గీత సంస్థలు బ్రిటిషు వ్యతిరేక పోరాటాల్ని తీసుకున్నాయి. గంగానది పవిత్రత, హిమాలయాల విశుద్ధత, మానస సరోవరం పౌరాణికత, కాశీ ప్రాధాన్యత, త్రివేణీ సంగమ యాత్రికోద్యమం, పుష్కరాలు, శివరాత్రి జాగరణలు, వినాయక చవితి ఊరేగింపులు కాంగ్రెసు ఉద్యమంలో ఆనాడు భాగాలేకదా! స్వాతంత్య్రానంతరం కమ్యూనిస్టుపార్టీ గ్రామాల్లో ‘శ్రీరామనవమి ఉత్సవాలు’ నిర్వహించటం మనమెరుగుదుం. నేటికీ గ్రామాల్లోని అమ్మవార్ల కొలువులో రాజకీయ నాయకులు తమ చిత్రపటాల్తోసహా, పార్టీ నామాల్తో సహా నిర్వహించటం చూస్తూనే వున్నాం. ‘రామజన్మభూమి’రాజకీయ స్వరూపాన్ని తీసుకోవటం జాతి బలహీనత మాత్రమేకాదు. దేశ చైతన్యంలో ఒక బలమైన అంశంగా కూడా పరిగణించవచ్చు.
మానవసేవే- మాధవసేవ అని, సంఘం- శరణం- గచ్ఛామి అని, తోటివారిని నిన్నునువ్వుగా ప్రేమించినట్లు ప్రేమించుము అని మత ప్రాథమిక సూత్రాలు ఉండనే ఉన్నాయి. వాటిని సమగ్రమైన ప్రభుత్వ కార్యక్రమాలుగా మార్చాలి. దేవస్థానాల ఆర్థిక, సాంఘిక నిర్వహణలకు మంత్రిత్వశాఖలుండగా ఈ చైతన్యం అసంభవం కాబోదు. ఎటొచ్చీ స్పష్టమైన ప్రాతిపదికా, విశిష్టమైన ఆచరణా, ఖచ్చితమైన ప్రభుత్వ నిర్వహణా కనిపించాలి. దేశభక్తికి ఎక్కడ ఎలా సాయపడగలమో నిర్వచించుకోవాలి.
ఎ) దైవ నిర్వచనంలో సామాన్యులకు ఒక అస్పష్టస్వరూపం మాత్రమే యివ్వగల్గుతున్నాం. జ్ఞానమార్గం అందని మార్గంగా వుండిపోతుంది. దైవం అంటే ప్రాధేయపడవలసిన వ్యక్తే తప్ప (!!) అర్థంచేసుకోవలసిన శక్తి అని భావించటం లేదు..!
బి) కరుణ, జాలి, సహాయం, ప్రేమ, అనురాగం, అభిమానం, సర్వజీవుల ఎడల సమాదరణ వంటి ‘దైవ’లక్షణాలు తనకు సంబంధించనివి గానూ; ఆస్తి,పదవి, ఆశ, కోరిక, లాభం, విజయం, సంతోషం, వస్తువుల పట్ల ఆపేక్ష, అధికారం, కించిదహంకారం వంటి జీవన లక్షణాలు తమవనీ, తమకు అత్యవసరమనీ భావిస్తున్నాడు. కోరితే దైవం ‘వరం’ అనుగ్రహిస్తుంది కనుక మానవుడు రెండవ జాబితానే కోరుతున్నాడు. ఈవివరణ యివ్వవలసిన ఆచార్యులు, ప్రవక్తలు, స్వాములు, మతాధిపతులు, మత పెద్దలూ చుట్టూఉన్న జనాన్నిచూసి మురిసిపోవటమూ, లేదా ‘వారు’ కూడా వ్యాపార దృష్టిలో పడిపోవటమో (!)జరుగుతుంది. అప్పుడు ఈ వివరణ మరెవ్వరు యివ్వగలరు..? పార్టీలా, ప్రణాళికలా, ప్రభుత్వమా, విద్యాలయాలా, పాఠ్యాంశాలా.. ఎవరు చెప్పగలరు! రామాయణం పారాయణ గ్రంథంగా దేశంలో ప్రవర్థిల్లినా ‘‘ఏకపత్నీవ్రతం’’ ఆచరించేవారు దేశంలో వేళ్ళమీద లెక్కబెట్టగల సంఖ్యలో ఉన్నారంటేనే రుూ విషయం స్పష్టపడుతుంది.
సి) ఐశ్వర్యం అంటే ఈశ్వర స్వభావమే తప్ప, ఆస్తులు, గనులు, బంగారు నగలు, భవనాలూ, పదవులూ, సామ్రాజ్య విస్తరణలూ కావు అని దైవస్వభావం చెబుతూంటే- అదితప్ప అన్నీ కోరుకొంటున్నట్లు భక్తులు ప్రవర్తిస్తే ఏమిటి కర్తవ్యం?
డి) దేశమే దేవత. దేశమే తల్లి. ప్రజలే దేవుళ్ళు... వాళ్ళకు నీళ్ళు.. ఇళ్ళు.. పాఠశాలలు.. ఆసుపత్రులు.. రవాణా సౌకర్యాలూ, వినోద కార్యక్రమాలూ సమకూర్చటమే దేశభక్తి.. అదే దైవభక్తి..అని రుూ తరానికి, రానున్న తరాలకు నూరిపోయగలగాలి. దేవాదాయాలనుండి కొంతమేరకు రుూ కార్యక్రమాలు నిర్వహించాలి.
ఇ) కుల మతాల నిరసనే దైవభక్తి.. దైవసూక్తి..అని మెప్పించగలగాలి. పరమేశ్వరుని జీవితం ఏం సూచిస్తుంది.. కూర్మ, వరాహ, నరసింహ, మత్స్యాది అవతారాలు దేనికి సంకేతాలు? రామభక్తుడు ఆంజనేయుడెవరు? వానరుల్లో వర్ణ విభజన ఏముంది? వానరుల్ని రాముని అనుయాయులుగా చెప్పటంలో అర్ధమేమిటి? రావణ, హిరణ్యకశిప, బలి యిత్యాది రాక్షసులను పండితులుగా, పరమభక్తులుగా విశేష శక్తులుగా కీర్తించటం ఊసుబోకనా? అహంకారం ఎంతటి జ్ఞానాన్నయినా, నాశనం చేస్తుందన్న విశేషంకాదా? ప్రజలకు రుూ విశేషాలు తప్ప అన్ని వివరాలు అందుతున్నాయంటే అర్ధమేమిటి? దైవభక్తిలోని ‘మానవశక్తి’తప్ప లోకాతీత చమత్కృతి అంతా అందుతున్నదనమాట!!
ఎఫ్) అనుక్షణం దైవభక్తులుగా, మతస్తులుగా కనిపించే సామాన్యులు, అసాధారణ నాయకులు, విద్యావంతులు కూడా మోసానికి, అవినీతికి, అక్రమాలకు, దోపిడీ దురాగతాలకు పాల్పడుతున్నారంటే వారికి దైవతత్వం అర్ధంకానట్లా..? దేశభక్తి ఏమిటో తెలియనట్లా..? దైవాన్ని నమ్మినట్లుగా దేశ ప్రజలకు చెపుతూ నటిస్తూ వారిని నిలువునా దోపిడీ చేయవచ్చుననా? అంటే దేవుడు నిన్ను అస్సలు గమనించలేని, నీ చర్యలు పట్టించుకోలేని శిలావిగ్రహమనా తమ ఉద్దేశ్యం!! అంటే తమకు దైవభక్తీ, దేశభక్తీ రెండూ లేవన్నమాట!!

ఫ్రం .ఆంధ్రభూమి .డైలీ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP