శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విశ్వశాంతి కోసం అతిరాత్రం !

>> Friday, March 2, 2012

ఈ మధ్యనే, వేరొక గ్రూపులో ఒక భాగవతుడు మాతో పంచుకున్న ఒక గొప్ప యజ్ఞం గురించి వారు పంపిన సమాచారం యథాతథంగా మీతో పంచుకుంటున్నాను. ఈ యజ్ఞం గురించి యాగ నిర్వాహకులు ప్రచురించిన ఒక పాంప్లెట్ ఇక్కడ జతచేస్తున్నాను, దయచేసి చూడగలరు. అంతేకాక ఈ యాగమునకు సంబంధించిన వెబ్ సైట్ లంకె కూడా ఇక్కడ క్రింద ఇస్తున్నాను. ఇప్పటికే చాలా మందికి ఈ మహా యాగం గురించి తెలిసే ఉండొచ్చు. తెలియనివారికి, ఉపయోగపడుతుందని వ్రాస్తున్నాను.

http://www.athirathram2012apyagna.in/


అతిరాత్రం:
నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న అతిరాత్రం సోమయాగాన్ని రాష్ట్రంలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 21 నుంచి మే 2వ తేదీ వరకు ఖమ్మంజిల్లా భద్రాచలంలో సమీపంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం కొన సాగ నుంది. నాలుగు వేదాలలో నిక్షిప్తమై ఉన్న అనేక దృగ్విషయాలను ఈ కార్య క్రమం ద్వారా వెలికి తీయడానికి అవకాశం ఉంది.అత్యంత ప్రాచీన యాగ క్రతువుగా భావించే అతిరాత్రాన్ని 35 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరు వాత గత ఏడాది తొలిసారిగా కేరళలోని పంజాల్‌లో నిర్వహించారు. ఈ ఏడాది మన రాష్ట్రంలో నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

12 రోజుల పాటు యాగాలను నిరంతరాయంగా ప్రజ్వరిల్లింపజేస్తూ, రేయిం బవళ్లూ నాలుగు వేదాలనూ పారాయణం చేయడం ఇందులో విశిష్టత. అతి రాత్రం సోమయాగాన్ని సమతా లోక్‌సేవా సమితి నిర్వహించనుంది.

------------------------------

ప్రపంచంలో 84 లక్షల జీవరాసుల్లో మానవుడు తప్ప ప్రతి జీవి సృష్టి ధర్మానుసారంగా జీవిస్తాయని సమత లోక్‌సేవా సమితి నిర్వాహకులు కేసాప్రగడ హరినాధశర్మ అన్నారు. భద్రాచల దివ్యక్షేత్రంలోని ప్రముఖ చారిత్రక ప్రాంతం ఎటపాకలో నందననామ సంవత్సరం 2012 ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు 12 రోజులపాటు నిర్వహించతలపెట్టిన యజ్ఞరాజం అతిరాత్రం (మహోన్నత సోమయాగం) బ్రోచర్లను ఆదివారం దేవస్థానం పాలకమండలి చైర్మన్ కెపి రంగారావు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ, శాంతి, సర్వమానవ వికాసం, యావత్ జీవకోటి సంరక్షణ తదితర విషయాలను దృష్టిలో ఉంచుకుని అతిరాత్రం యజ్ఞాన్ని గత ఏడాది ఏప్రిల్ నెలలో కేరళ రాష్ట్రంలో నిర్వహించామని, తిరిగి రాష్ట్రంలో ప్రప్రథమంగా భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించతలపెట్టినట్లు తెలిపారు. గత 16 ఏళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి యజ్ఞాలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని విశ్వవ్యాపితమైన సకల జనులు, జీవరాసుల కోసం ఆరు రకాల యాగాలతో కూడిన యజ్ఞం చేయతలపెట్టినట్లు వెల్లడించారు. గత ఏడాది కేరళలో నిర్వహించిన యజ్ఞం ఫలితంగా అనంతస్వామి ఆలయంలో సంపద బయటకు వచ్చిందని చెప్పారు. ఈ యజ్ఞంలో కేరళకు చెందిన 41 మంది సంప్రదాయ వైదిక నంబూద్రీ నిష్టాగరిష్ఠులచే 23 గంటలపాటు యజ్ఞం చేస్తారని, ఇందుకుగాను ముందుగా 8 నెలలపాటు దీక్షలో ఉంటారన్నారు. ఎటపాకలోని జఠాయువు మండప సమీపంలో గల దేవస్థానం చైర్మన్ కురిచేటి పాండురంగారావుకు చెందిన 50 ఎకరాల విస్తీర్ణంలో గల ప్రదేశంలో మూడు కోనేరులు, అంతర్గత రహదారులు, ఇతరత్రా సౌకర్యాలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయనున్నామని తెలిపారు. భద్రాచల క్షేత్రంలో చేసే యాగాన్ని గరుడయాగం అని, ఈ యజ్ఞాన్ని చూసి తరించాలని కోరారు. లోక కల్యాణమే ధ్యేయంగా ధనార్జనాపేక్ష రహితంగా గత 16 ఏళ్లుగా ప్రతి చాంద్రమాన కార్తీక మాస శుక్లపక్షములో నిరవధికంగా శతచండీ - మహారుద్రయాగాదులు అనేకం నిర్వహించి ఆ పరంపరలో లోక సంస్కార్థమై శ్రీ్భద్రాద్రీశుని సన్నిధి సమీపంలో వేద నిర్థేశితమైన సప్త మహాక్రతువులో మహోన్నతమైన (ఉత్కృష్ట) అతిరాత్రం సోమయాగం నిర్వహించతలపెట్టినట్లు వివరించారు. ఈ మహాక్రతువు వైదిక ప్రామాణికంగా అత్యంత నియమ నిబంధనలతో సశాస్ర్తియ విధి విధానంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ యజ్ఞంలో అగ్నిహోమం - అత్యగ్నిష్టోమం- అప్తోర్యామం - ఉక్ద్యం - షోడశీ - వాజపేయం యజ్ఞాల పేరిట అతిరాత్రం నిర్వహించ తలపెట్టినట్లు హరిహరనాధశర్మ తెలిపారు. ఈ యజ్ఞానికి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగిందని, తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంబూద్రి కృష్ణన్, శివశంకర్ నంబూద్రి, కాశీప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ, సోమయాజుల మధుసూదన్, కోకా శ్రీనివాసకుమార్, శవగంన సోమశేఖర్ శర్మ, బండారు కృష్ణయ్య, శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------

లోకకల్యాణార్థం వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీ నుంచి భద్రాచలం వద్ద ఉన్న ఎటపాక వద్ద అతిరాత్రం (ఉత్కృష్ట సోమయాగం)ను నిర్వహించనున్నట్టు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి తెలియచేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ యాగాన్ని 30 ఏళ్లకోసారి నిర్వహిస్తారని అన్నారు. ఇప్పటి వరకూ ఇటువంటి యాగాలు కేరళలో మాత్రమే నిర్వహించేవారని, తెలుగునాట ప్రప్రథమంగా ఈయాగాన్ని భద్రాచలం వద్ద నిర్వహించనున్నామని ఆయన తెలియచేశారు.

ఈ ఉత్కృష్ట సోమయాగం అత్యంత నిష్టాగరిష్టంగా, నిబద్ధతలకు లోబడి, ఉపాసకులై ఉండి, కఠోర దీక్ష వహిస్తున్న నడువం నారాయణన్ సోమయాజి దంపతుల చేతుల మీదుగా జరుగుతుందని స్వరూపానందేంద్ర వివరించారు. గరుడపక్షి రూపంలో ప్రత్యేకంగా హోమ వేదికను నిర్మిస్తారని ఆయన చెప్పారు. వేదిక నిర్మాణ సమయంలో ఒక గద్ద, లేదా డేగ లేదా రాబందు యాగశాలకు ప్రదక్షిణం చేసి వెళ్లడం, యాగ పరిసమాప్తి తరువాత రుతువులతో సంబంధం లేకుండా కుంభవృష్టి కురియడం ఈ యాగ నిదర్శనాలని స్వామి వివరించారు.

1975, 2011 సంవత్సరాల్లో కేరళలోని త్రిసూరు జిల్లా పంజా గ్రామంలో జరిగిన అతిరాత్రం మహోత్కృష్ట యాగాన్ని సందర్శించిన వారు ఈ నిదర్శనాలను చూడగలిగారని ఆయన చెప్పారు. ఈ యాగ నిర్వహణకు సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని స్వామి చెప్పారు.
కేసాప్రగడ హరిహరనాథ శర్మ పర్యవేక్షణలో సమతా లోక్‌సేవా సమితి నిర్వహణలో ఈయాగం జరుగుతుందని ఆయన తెలియచేశారు.


2012 సంవత్సరం భారత దేశానికి ఏమాత్రం అనుకూలంగా లేదని స్వరూపానందేంద్ర స్వామి తెలియచేశారు. భూకంపాలు, అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని అన్నారు. అతివృష్టి వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. అనైక్యత పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

అతి రాత్రం గురించి అంతర్జాలం లో వేవు సేకరించిన సమాచారం ....

విశ్వశాంతి కోసం అతిరాత్రం !  విశ్వశాంతి, మానవ శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అతిరాత్రం అనే అతిప్రాచీన వైదిక కర్మకాండ నిర్వహణకు కేరళ రాష్ట్రం ముస్తాబవుతున్నది. ఈ క్రతువులో అగ్నిహోత్రాన్ని రాత్రింబవళ్ళు ఆరిపోకుండా ఉంచడం ఒక విశేషం. మూడు దశాబ్దాల అనంతరం జరుగనున్న ఈ యజ్ఞానికి హాజరయ్యేందుకు శాస్తవ్రేత్తల నుంచి సామాన్యుల వరకూ అందరూ సిద్ధమవుతున్నారు. వైదిక సాంప్రదాయ క్రమానుగతిని అనుసరించి ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 15 వరకు కేరళలోని పంజాల్‌ గ్రామంలో నిర్విఘ్నంగా జరుపనున్న ఈ కార్యక్రమానికి విదేశీయులు కూడా హాజరవుతున్నారు. దీనివల్ల ప్రయోజనాలు ఏమైనప్పటికీ ఈ కార్యక్రమం అతి ప్రాచీనమైనది కావడం, అతి అరుదుగా నిర్వహించేది కావడంతో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏమిటీ అతిరాత్రం? దీనిని ఎలా నిర్వహిస్తారు?  హైందవ మతానికి అత్యంత మౌలికమైన ప్రమాణాలుగా పేర్కొనే వేదాలు భగవంతుడి ద్వారా తెలిసాయని, మానవుల రచనలు కావని సాంప్రదాయుల విశ్వాసం. వ్యాస మహర్షి వీటిని ఒక క్రమం ప్రకారం నాలుగు వేదాలుగా విభజించి, వాటికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని పేర్లు పెట్టాడని, అందుకే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా అనాదిగా వస్తున్న వేదాలకు సంబంధించి పేర్కొన్న ఒకానొక అతి ప్రాచీన సాంప్రదాయ కర్మ కాండే అతిరాత్రం. పన్నెండు రోజుల పాటు సాగే ఈ కర్మకాండ చివరి నాలుగు రోజులు పగలూ రాత్రీ కూడా అగ్ని హో మంతో నిర్వహిస్తారు.  ఈ ప్రక్రియ వైదిక కర్మకాండలన్నింటిలోకి అత్యంత సంక్లిష్టమైనది-మహోన్నతమైనదని, కేరళ రాష్ట్రానికి చెందిన అతిరాత్రం నిర్వాహక సంస్థ వార్తాతె సభ్యుడు డాక్టర్‌ శివశంకరన్‌ నంబూద్రి అంటున్నారు.అతిరాత్రం ఆచారాన్ని ప్రాచుర్యంలో తేవడానికి రూపొందించిన అధికారిక వెబ్‌ సైట్‌, వైదిక సాంప్రదాయిక యజ్ఞాలను గురించి ప్రస్తావిస్తూ, ఆ సాంప్రదాయాలన్నీ మానవ సమాజం ఆచరణలో పెట్టడానికి రెండు రకాల పద్ధతులను సూచించారని రాసింది. వాటిలో మొదటిది గ్రహ్య, రెండోది శ్రుత. వ్యక్తిగతంగా, సాంప్రదాయానికి కట్టుబడిన వారు పాటించాల్సిన ఆచార వ్యవహారాలైన ఉపనయనం, వివాహం వంటి విషయాలు మొదటి పద్దతికి చెందినవి.   సంస్కార పూర్వకంగా-అత్యంత ఉన్నత స్థాయిలో, శ్రుతి సాహిత్యంలో నేర్చుకున్న దాని ఆధారంగా, మౌఖిక సాంప్రదాయ బద్ధంగా, ఋగ్వేద-యజుర్వేద-సామవేదాలలో చెప్పిన దాని ప్రకారం తూ.చ. తప్పకుండా ఆచరించేదే రెండో పద్ధతి. ఉపనయన, వివాహ సంప్రదాయాలను భారత దేశమంతా చాలామంది ఆచరణలో పెట్తున్నప్పటికీ, కీలకమైన వైదికాచారాలను మాత్రం, ఎవరో కొద్దిమంది అక్కడో-ఇక్కడో అడపాదడపా పాటించడం జరుగుతోంది. అలా పాటిస్తున్న వారిలో నంబూద్రి బ్రాహ్మ ణులు ముందు వరుసలో వున్నారు. వైదిక ఆచారాలు అంతరించి పోకుండా, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. పన్నెండు రోజులు, అహోరాత్రులు, ఆరిపోకుండా అగ్నిహోత్రం వుంచడమనే ప్రక్రియ, నంబూద్రి బ్రాహ్మణులకు అత్యంత ఆకర్షణీ యమైన విజ్ఞాన-వినోద దృశ్యం వంటిది. సనాతన సంప్రదాయాన్ని ముమ్మూర్తులా ప్రతిబింబించే అతిరాత్రం, భారతీయ మతాచారాలకు-నాగరికతకు అసలు-సిసలైన రూపురేఖగా నంబూద్రీలు భావిస్తారు.   కాకపోతే, భారత దేశంలో ఆవిర్భ వించిన హిందు, జైన, బౌద్ధ మతాలపై అతిరాత్రం ప్రభావం ఏ మేరకు పడిందోనన్న అంశాన్ని అంచనా వేయడం అంత తేలికైన విషయంకాదు. అతిరాత్రం నిర్వహణ శారీరక శ్రమతో కూడుకున్నది. క్రీస్తు పూర్వం పదవ శతాబ్దిలో మొదలైన ఈ ఆచారం, ఆరవ శతాబ్దం వరకూ కొనసాగింది. ఆ తర్వాత కాలంలో, ఎందరో-ఎన్ని విధాలుగానో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేశారు. గుప్తుల, చోళుల కాలంలో పునరుద్ధరణకు నోచుకున్న అతిరాత్రాన్ని, పదకొండవ శతాబ్దం నాటికి, కేరళ నంబూద్రీ బ్రాహ్మణులు సజీవంగా కొనసాగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే ప్రక్రియ నేటికీ సాగుతోంది. మూడు దశాబ్దాల కిందట అతిరాత్రం: అనేక నెలల ముందస్తు సన్నాహాలు తప్పనిసరిగా అవసరమయ్యే అతిరాత్రం అగ్నిహోత్ర విన్యాసాన్ని నిర్వాహకులు తప్ప ఇతరులకు వీక్షించే అవకాశం వుండేది కాదు ఒకప్పుడు. అయితే, ముప్పై ఐదు సంవత్సరాల క్రితం, 1975 లో కేరళ రాష్ట్రం పంజాల్‌ గ్రామంలో, కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న ఇండాలజిస్ట్‌ డాక్టర్‌ ఫ్రిట్స్‌ స్టాల్‌, రాబర్ట్‌ గార్డినర్‌ ప్రేరణతో, నంబూద్రి బ్రాహ్మణులు పన్నెండు రోజుల పాటు నిర్వహించిన అతిరాత్రం కార్యక్రమాన్ని బయటి వారు చూసే అవకాశం కూడా లభించింది.  జైమినీ సామ వేదంలో దిట్ట, ఘనాపాఠి బ్రహ్మ శ్రీ ముట్టతుకట్టు మమ్మున్ను ఇట్టి రవి, ఋగ్వే దం-యజుర్వేదం ఆచారాలను- సాంప్రదాయాలను ఔపోసన పట్టిన బ్రహ్మశ్రీ చెరుముక్కు వైదికన్‌ వల్లభన్‌ సోమయా జిపాడ్‌ అనే వైదిక పండితులిద్దరు 1975 లో జరిగిన అతిరాత్రాన్ని నిరాటంకంగా జరిపిం చారు. స్టాల్‌, గార్డినర్‌లకు అనేక మంది అంతర్జాతీయ సంస్థలు-వ్యక్తులు సహ కరించారప్పుడు. తత్వ శాస్త్రంలో ఆచా ర్యుడుగా ఇప్పటికీ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న స్టాల్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి లభించిన నిధు లతో, అతిరాత్రం ఆచారానికి సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల కొరకు భద్ర పరిచారు. ఒక భారతీయుడు చేయాల్సిన పనిని విదేశీయుడు చేయడం అభినందనీయం.  అతిరాత్రం నిర్వహణ: అతిరాత్రం ఆచారం ఒక రకమైన అద్భుత విన్యాసం. ఆ విన్యాసంలో ప్రధాన భాగమైన అగ్ని హోమం ప్రక్రియను నిర్వహించడానికి 17 మంది ఋత్విక్కులు (పూజారులు) వుంటారు. పన్నెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజున హోమం చేసే యజమాని, ప్రత్యేకంగా తయారు చేసిన మూడు కుండలలో, పవిత్రమైన అగ్నిని నింపుకుని యజ్ఞ వాటికలో ప్రవేశిస్తాడు. బంకమట్టితో తయారు చేసిన ప్రత్యేకమైన కుండలవి. నామ మాత్రంగా-లాంఛనప్రాయంగా, వాయుదేవుడికి జంతు బలి జరిపించుతారు.  ఐదుగురు ప్రధాన పూజారుల ఎంపిక జరుగుతుందప్పుడు.  ఆ తర్వాత రాపిడి ద్వారా నిప్పు వెలిగించుతారు. యజమాని శిరస్సు కు తలపాగా లాంటిది కడతారు. ఇక ఆ క్షణం నుంచీ, యజమానిని ప్రత్యేక రక్షణలో వుంచుతారు ఆ పన్నెండు రోజులు. పిడికిలి బిగించిన చేతులతో, మౌనంగా ఆ పన్నెండు రోజులు యజమాని యజ్ఞాన్ని చేయాలి. కాకపో తే, ఆయన చేయాల్సిన మంత్రోచ్ఛారణలకు మౌనం వీడవచ్చు. అలానే, స్నానం చేసేటప్పుడు పిడికిలి సడలించవచ్చు. అగ్నితో నింపిన ప్రధాన కుండను తీసుకుని, మూడడుగులు నడవాలి యజమాని ఆ తర్వాత. రెండో రోజున బంక మట్టితో మరొక ప్రత్యేకమైన కుండను తయారు చేస్తారు. మూడో రోజున నైవేద్యం కొరకు ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని తయారు చేస్తారు.   వాల్మీకి రామాయణం బాల కాండలో, 14 వ సర్గలో, అశ్వమేధ యాగం ప్రస్తావనలో అతిరాత్రం గురించి పేర్కొనడం జరిగింది. అశ్వమేధ యాగంలో భాగంగా చివరి రోజైన మూడో దినాన, అతిరాత్రం ప్రక్రియ వుంటుంది. కేరళలో జరుగుతున్నదానికి, దీనికి కొంత తేడా వున్నప్పటికీ, రెండింటి భావం ఒక్కటే. ప్రక్రియ కూడా ఒకే తరహాలో వుంది. రెండింటిలోను, 17 మంది ఋత్విక్కులే వుంటారు.  అతిరాత్రం ప్రక్రియ:  మహావేదిగా పిలిచే యజ్ఞవాటికను వాస్తు ప్రకారం మంత్రోచ్ఛారణల మధ్య నిర్మిస్తారు. కొలతల ప్రకారం, లాంఛన ప్రాయంగా బలి ఇవ్వడానికి పక్షి ఆకారంలో బలిపీఠం నమూనాను తయారు చేస్తారు అదే రోజు న. నాలుగో రోజున దేవతల రాజైన ఇంద్రుడిని యాగానికి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. మహావేది వున్న ప్రదేశాన్ని నాగలితో దున్ని, అందు లో విత్తనాలు చల్లి, మొదటిరోజు నాటి ప్రధాన కుండను భూమిలో పాతిపెడతారు. పక్షి ఆకారంలో బలిపీఠం నిర్మాణం ఆరంభమవు తుంది అదే రోజున. ఐదు, ఆరు, ఏడు దినాల్లో, బలి పీఠం నిర్మాణాన్ని అంచెలం చలుగా కొనసాగిస్తూ, రాత్రివేళల అగ్నిహోత్రం పనిని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది.  ఎనిమిదో రోజున, బలి పీఠంలో మరొక అంతస్తు వేయడంతో పాటు, దానికి ఉపయోగించిన ఇటుకలను గోవులుగా మారాలని యజమాని ప్రార్థన చేస్తాడు. రుద్రపూజ కూడా జరిపి స్తారు పూజారులు. అంతవరకూ ఉపయోగించిన పనిముట్లను, పూర్తి చేసిన బలి పీఠంలో, మానవ ఆకారంలో పేరుస్తారు తొమ్మిదో రోజున. ఆ ప్రదేశంలో మళ్లీ అగ్నిని వుంచడం జరుగుతుంది. మంత్రోచ్ఛా రణల మధ్య అగ్ని హోమంలో నెయ్యి పోసుకుంటూ అతిరాత్రం కొనసాగుతుంది. లాంఛనప్రాయంగా-నామ మాత్రంగా జంతు బలి ఇవ్వడం ఆ తర్వాత ప్రక్రియ.  చివరి మూడు రోజులు రాత్రింబగళ్ళు యాగం కొనసాగుతుంది. బలిపీఠం చుట్టూ, పదవ రోజున, యజమాని కొందరు పూజారులతో కలిసి, పాములలాగా తిరగాలి. నామ మాత్రంగా (వాస్తవంగా కాదు) పదకొండు జంతువులను బలి ఇవ్వడం జరుగుతుంది. పన్నెండో రోజున యజమాని భార్యా సమేతంగా అవభ్రత స్నానం చేసి, మేక బలిని (వాస్తవంగా కాదు) ఇచ్చి, ఇంటికి తిరిగొచ్చి మూడు చోట్ల అగ్నిని పేర్చి, ఆ అగ్నిహోత్రాన్ని జీవితాంతం చేస్తూ పోవాలి. పన్నెండు రోజులు ఒకే రకమైన కర్మ కాండలుండవు. అగ్నిలో ప్రధానంగా సోమ రసం ఉపయోగిస్తారు. వైదిక గ్రంథాల్లో చెప్పిన ప్రకారం రెండు రకాల కట్టెలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు.   అతిరాత్రం నిర్వహణ వెనుక: భారత దేశానికి-విదేశాలకు చెందిన కొందరు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పాటై, వార్తాతె ట్రస్టు పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అతిరాత్రం ఆచారాన్ని పునరుద్ధరించి, ఆ అద్భుత అపురూపమైన సనాతన సాంప్రదాయిక విన్యాసాన్ని మరి కొదది రోజుల్లో ప్రదర్శించబోతున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జిల్లాలో వున్న ఒట్టపాలెం కేంద్రంగా ట్రస్టు పని చేస్తుంది. ఏప్రిల్‌ 4-15, 2011 మధ్య నిర్వహించనున్న అతిరాత్రం రిహార్సిళ్ళు మొదలయ్యాయి. పంజాల్‌ గ్రామంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి, ఈసారి యజమానిగా పుటిల్లట్టు రామానజన్‌ సోమయాజి వుండనున్నారు.  నాలుగువేల ఏళ్ల క్రితం ఎలా జరిగిందో, అచ్చు అలానే ఏప్రిల్‌లో జరపడానికి అన్ని జాగ్రత్తలు ట్రస్టు తీసుకుంటున్నది. పనిముట్లన్నీ ఆ ప్రాంతం లో లభ్యమయ్యే కట్టెతోనే తయారు అవుతున్నాయి. ఏ రకమైన లోహ సామగ్రిని ఉపయోగించడం జరగదు. బలి పీఠానికి వాడే ఇటుకలు కూడా కట్టెతో తయారు చేసినవే. అవన్నీ అక్కడే తయారవుతున్నాయి. అతిరాత్రంలో పన్నెండు రోజులు కూచోగల సామర్థ్యం యజమానికి కలగడానికి చర్యలు చేపట్టారు. యజ్ఞంలో అతి భారమైన యజుర్వేద పఠన బాధ్యతను కాప్రా కుటుంబీకులు తమ భుజాలపై మోపుకున్నారు. ఋగ్వేదం నిర్వహణను నారాస్‌ కుటుంబీకులు, సామ వేదాన్ని తోట్టం కుటుంబీకులు చేపడుతున్నారు.  శుఖాపురం దేవాలయ అధికారుల అనుమతితో కార్యక్రమం ఏప్రిల్‌ నెలలో నిర్విఘ్నంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భౌగోళిక-వాస్తు పరమైన సిద్ధాంతాల ప్రాతిపదికగా యజ్ఞ వాటికను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల యాగాలకు-యజ్ఞాలకు కేంద్ర స్థానమైన పంజాల్‌ గ్రామం అద్భుత విన్యాసానికి ముస్తాబవుతోంది. అంతా బాగానే వుంది... సరిగ్గా నాలుగువేల సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే...ఏప్రిల్‌ నెలలో కూడా...అచ్చు.. అలానే అతిరాత్రం జరిగిందని ఇతమిద్ధంగా చెప్పగల ధైర్యం ఎవరికన్నా వుందా? అయితే జరిగిందనడానికి... శాస్త్ర ప్రకారం కొన్ని దాఖలాలు వున్నాయి. యజ్ఞం పూర్తవగానే, యజ్ఞశాలపై ఆకాశంలో ఒకే ఒక గద్ద ఎగురుతూ కనిపించితే, ఆ క్షణంలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిస్తే, దేవతలు సంతోషించారనడానికి నిదర్శనం అని అతిరాత్రం గట్టిగా విశ్వసించే ఒక నంబూద్రీ బ్రాహ్మణుడు అంటున్నారు. వాస్తవానికి 1975 లో అతిరాత్రం పూర్తవగానే కుంభవృష్టిగా వాన కురిసిందని ఆయన అంటున్నారు.  అతిరాత్రం గురించి రాస్తూ ప్రొఫెసర్‌ స్టాల్‌ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసు కోవడం మంచిది. దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగా యి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు-ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా ఒకరి నుంచి మరొకరికి-గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం- ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం! 77 సంవత్సరాల వయసున్న స్టాల్‌, తన సహచర బృందంతో సహా, ఏప్రిల్‌ నెలలో పంజాల్‌లో నిర్వహించనున్న అతిరాత్రం అద్భుతాన్ని వీక్షించడానికి రాబోతున్నారు.  యజ్ఞాలు వానలు కురిపిస్తాయా? ప్రాచీన మంత్రాలకు వర్షం కురిపించే శక్తి ఉన్నదా? వేద మంత్రాలకు పరిసరాలను ప్రభావితం చేయగల సామర్ధ్యం ఉన్నదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి కొచ్చిన్‌ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫోటోనిక్స్‌ మాజీ డైరెక్టర్‌ వి.పి.ఎమ్‌.నంపూరీ అధ్వర్యంలో ఒక శాస్తవ్రేత్తల బృందం అతిరాత్రానికి హాజరువుతోంది. ప్రకృతి, మానవుడు, ఇతర జీవజాలం పై ఈ వైదిక మంత్రాల ప్రభావాన్ని వీరు అధ్యయనం చేయనున్నారు.  ఈ అతిరాత్ర నిర్వహణలో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన సూత్రాలను వర్తింప చేయడం కనుపిస్తుందని ఆయన పేర్కొనడం విశేషం. తమ బృందంతో అతిరాత్రం నిర్వహణ సమయంలో అక్కడి ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులను, తేమ, పీడన శాతాన్ని అధ్యయనం చేయనున్నారు. మట్టిపై అది చూపే ప్రభావంతో పాటుగా మానవుల భౌతిక, మానసిక స్థితులపై చూపే ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తామని ఆయన చెప్పడం విశేషం. 
-------------------

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP