బంజారాల ఆరాధ్యుడు 'సేవాలాల్'
>> Wednesday, February 15, 2012
బంజారాల ఆరాధ్యుడు 'సేవాలాల్'
- డా. సూర్యాధనంజయ్
'అహింసా పరమోధర్మః' అంటూ భారతదేశమంతటా ప్రచారం చేస్తూ, తన జాతి ప్రజలను సన్మార్గంలో నడిపిస్తూ జీవించిన మహాజ్ఞాని సేవాలాల్ మహరాజ్. సంత్‌సేవాలాల్ బాల్ బ్రహ్మచారినే బంజారాలందరూ సేవాలాల్ అని ప్రేమతో పిలుస్తారు. సేవాలాల్ అంటే బంజారాలకు అచంచలమైన భక్తి, కొండంత విశ్వాసం.
పదునెనిమిదవ శతాబ్దంలో పెద్ద కరవు సంభవించడం వల్ల ముఖ్యంగా బంజారాల బ్రతుకు దుర్భరమైంది. అంతా దిక్కుతోచని స్థితిలో ఉండగా బంజారా పెద్దలైన భృగురాజ్ బాణోత్, సాతీభవానీలైన తొళ్జా, మత్రాల్, హింగళా, ధ్వాళంగర్, కంకాళి, దండి, సీత్లాలనే సప్తమాతృకలను పూజించి, తమ జాతిని కష్టాల నుంచి గట్టెక్కించమని వేడుకున్నారు. వారి గోడు విన్నాక సప్తమాతృకలు ప్రత్యక్షమై మీ కష్టాలు రూపుమాపడానికి మీజాతిలోనే ఒక మహాపురుషుడు జన్మిస్తాడు కనుక చింతించవద్దని చెప్పి అదృశ్యమయ్యారు.
అది రాంజీనాయక్ తండా. ఆ తండాను స్థాపించిన రాంజీనాయక్ ముగ్గురు కుమారుల్లో ఒకడైన భీమానాయక్ దంపతులకు పన్నెండు ఏళ్ల దాకా సంతానం లేదు. వీరు చాలా పేదవారు. ఒకరోజు మేరామయాడి(దండి) భీమా దంపతులకు కలలో వచ్చి 'మీకు సంతాన ప్రాప్తిని కలుగజేస్తున్నాను. కాని మీకు పుట్టిన మొదటి బిడ్డకు పన్నెండు సంవత్సరాల వయ సు వచ్చిన తర్వాత అతన్ని నాకు సేవకునిగా నియమించవలసి ఉంటుంద ని' చెప్పింది.
లేకలేక సంతానం కలుగుతున్నందుకు సంతోషంగా ఉన్నా పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవతకు అప్పగించాల్సిన అవసరం వస్తున్నందుకు బాధపడతారు ఆ దంపతులు. ఇలా దేవి అనుగ్రహం వల్ల జన్మించిన బిడ్డే సేవాలాల్. సేవాలాల్ అనంతపురం జిల్లా గుత్తి తాలూకాలో క్రీ.శ. 1741 ఫిబ్రవరి 15న సేవా భీమానాయక్, ధర్మిణీబాయిలకు జన్మించారు. అదే బంజా రా జాతికి, మేరామ యాడికి సేవ చేయడానికి పుట్టిన బిడ్డ కాబట్టి సేవాదాస్ అని నామకరణం చేశారు. ఈ సేవాదాసే సేవాలాల్ మహరాజ్.
సేవాలాల్ పుట్టుకతోనే సంపూర్ణ జ్ఞాని. చిన్న తనంలోనే సకల విద్యలను ప్రదర్శించేవాడు. పశువులను కాసేవాడు. ఉదయాన్నే లేచి కాళోకూండ్ (నల్లకుంట)లో స్నానమాచరించి, సూర్యనమస్కారం చేసి తన దినచర్యను ప్రారంభించేవాడు. ఎవరికి ఏ కష్టమొచ్చినా పరిష్కరించేవాడు. తమజాతి జనుల మూఢనమ్మకాలను పారద్రోలడానికి ఉపదేశాలు చేసేవాడు. ముఖ్యంగా అహింసను ప్రబోధించేవాడు. సాధుజీవనమే ముక్తికి మార్గమని ఉపదేశించేవాడు. అంతలో సేవాలాల్‌ను మేరామభవానికి అప్పజెప్పే వయసు రానే వచ్చింది. భీమా దంపతులు పుట్టెడంత దుఃఖంతో భవానికి అతన్ని అప్పజెప్పడానికి సిద్ధమౌతారు కాని సేవాలాల్ మాత్రం వెళ్ళనని తెగేసి చెప్తాడు.
భవాని ఎందుకు రావని కారణం అడగగా 'హే జగదంబ! నీపై నాకు భక్తి ఉంది. కాని నీవు నీపూజకై బలిని కోరడం నాకు ఇష్టంలేదు. సకల చరాచర సృష్టికి మాతృమూర్తివైన నీవు నీ బిడ్డలను బలికోరడం నీకు తగునా?' అని ప్రశ్నించాడు. అ ప్పుడు భవాని శాంతించక సేవాలాల్ కుటుంబాన్ని మొత్తం నాశనం చేయతల పెట్టింది. సేవాలాల్ చిన తమ్ముడు భావాను, తను పుట్టిన రో జే పుట్టిన గరాసియ సాండ్ (ఆంబోతు)ను, తోళారాం అనే గుర్రాన్ని కూ డా చంపింది. తన కనుసన్నల్లో మెలిగే గోవులను ఎక్కడికో పంపించింది. అప్పుడు దేవిని శాంతింపజేయడానికి భీమా దంపతులు 'కడావ్'(ప్రత్యే క వంటకం)వండి భక్తితోకొలిచి అమ్మవారి సాక్షాత్కారాన్ని పొందుతారు.
ఆ తర్వాత అమ్మవారికి కొన్ని షరతులు పెట్టి తాను సేవకునిగా ఉంటానని మాట ఇస్తాడు. సేవా తన తమ్ముడిని తమకు జీవనాధారమైన 3751 ఆవులను 6400 ఎద్దులను, గరాసియసాండ్, తోళారం గుర్రాన్ని తిరిగి బ్రతికించాలని కోరుకుంటాడు. అలాగే బంజారాలు పదునాలుగు తరాల వరకు నీపూజను చేసుకోనివ్వాలి. సంవత్సరానికి ఒకసారి కడావో, చుర్మోతో నైవేద్యాన్ని సమర్పిస్తాం కాని జీవహింసను చేయబోమని అంటాడు. తన నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు అమలు కావాలని కోరుకోవడంతో దేవి అన్ని వరాలను ఆమోదించి సేవాలాల్‌ను అనుగ్రహించింది. బ్రిటీషువారు భారతదేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు బంజారాలకు ఆశనిపాతంగా మారాయి.
ప్రతిఘటించిన గోర్ బంజారాలను బ్రిటీషువారు విప్లవకారులుగా, సంఘ విద్రోహులుగా ముద్రవేశారు. వారిని బంధించి మతమార్పిడి చేశారు. అట్టి పరిస్థితుల్లో జాతి పునరుజ్జీవనానికి కంకణం కట్టుకున్న మహనీయుడు సేవాలాల్. నైజాం నవాబుతో పోరాటం చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. హైద్రాబాద్ నగరంలోని మహరాజ్ గంజ్ అతని పేర వ్యవహరింపబడడానికి ఇదొక కారణం. అలాగే సూరజ్‌ఖండ్‌రాజుతో యుద్ధం చేసిన ఉదంతం కూడా చరిత్రలో చోటుచేసుకుంది. సేవాలాల్ తన చివరి దశలోని యాత్మల్ జిల్లా డిగ్రాస్ తాలూకాలోని 'రుయి' అనే తండాలో నివసించాడు.
జగదంబ కటాక్షంతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన సేవాలాల్ ఏప్రిల్ 14 క్రీ.శ.1806న తన పార్థీవ శరీరాన్ని వదిలాడు. అది నాందేడ్ జిల్లాలోని పోహ్రదేవి ఆలయ సమీపంలో సమాధి చేయబడింది. ఇక్కడ విశేషమేమంటే సేవాలాల్ చనిపోతూ.. తాను మూడు రోజుల తర్వాత పునర్జీవితుడవుతానని, అయితే అంతవరకు ఈ విషయాన్ని ఇతరులకు చెప్పవద్దనీ, ముఖ్యంగా తన పార్థీవ శరీరాన్ని ఎవరూ తాకకుండా జాగ్రత్త తీసుకోవాలనీ తన అనుచరులకు చెప్పిన తర్వాత మరణించాడట.
తన శిష్యులు ఆ విషయాన్ని రెండురోజుల పాటు రహస్యంగా ఉంచారు. కానీ మూడవ రోజు తన తల్లికి కుమారుడు మరణించాడన్న విషయం తెలిసి రోదిస్తూ తాకిందనీ, అందువల్ల పునర్జీవితుడయ్యే అవకాశం కోల్పోయారని బంజారాల విశ్వాసం. సేవాలాల్‌ను సమాధిచేసిన స్థలం ఇప్పుడొక తీర్థస్థలిగా ప్రసిద్ధికెక్కింది. దసరా, శ్రీరామ నవమి నాడు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. దేశం నలుమూలల నుండి బంజారాలు వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు.
అంతేకాక ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి యేడాది ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తిలో జాతర జరుపుకొంటారు. సేవాలాల్ దేవాలయం ఆవరణలో 'భోగ్'ను నిర్వహిస్తారు. సేవాలాల్‌కు అత్యంత ప్రీతికరమైన లాప్సీ(పాయసం)నీ, చుర్మో(బియ్యం పిండితో రొట్టెనుచేసి అందులో బెల్లం, నెయ్యి తో కలిపి చేసిన వంటకం)ను గాడిపొయ్యిలో వేసి నైవేద్యాన్ని అర్పిస్తారు. ఈ భోగ్ అనేది మన పూర్వీకులు నిర్వహించే యజ్ఞం లాంటిది. ఇప్పుడు ఇక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించే ప్రయత్నాలు జరగడం విశేషం.
- డా. సూర్యాధనంజయ్
అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్శిటీ
(15 feb సేవాలాల్ జయంతి)
0 వ్యాఖ్యలు:
Post a Comment