ఆధ్యాత్మిక తేజోమూర్తి
>> Wednesday, February 15, 2012
ఆధ్యాత్మిక తేజోమూర్తి
ఆధునిక యుగ ప్రవక్తగా, ఉపనిషనత్ సందేశాన్ని పామర జనబోధకంగా, ఆధ్మాత్మికానుభూతిని ఆస్వాద యోగ్యంగా, ప్రపంచానికి ఆచరించి చూపిన శ్రీ రామకృష్ణులు జన్మించి రేపటికి 176 సంవత్సరాలు. తల్లి చంద్రమణీ దేవి, తండ్రి క్షుదీరామ్. సనాతన సంప్రదాయానుసారులైన పండిత వంశం వారిది. హుగ్లీజిల్లా దేవేర్‌పూర్ వారి స్వగ్రామం.
ఆ ఊరిలోని సంపన్న కుటుంబాల్లో వీరిదొకటి. కానీ, దేవేర్‌పూర్ జమీందారు కోసం అబద్దపు సాక్ష్యం చెప్పడానికి నిరాకరించిన ఫలితంగా జమీందార్ క్రోధానికి బలయ్యాడు క్షుదీరాం. ఆయన ఆస్థిపాస్తులన్నీ లాక్కొని గ్రామ బహిష్కారం చే యించాడు. చేసేదేమీ లేక సమీపం లోని మరొక గ్రామం కామార్‌పూర్ తరళి వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. శ్రీ రామకృష్ణులు జన్మించింది అక్కడే. తల్లిదండ్రులు పెట్టిన పేరు గంగాధర్.
కాళికాంబ పిలిస్తే పలికేది!
బాల్యంలో ఆయన చరిత్ర విచిత్రంగానే ఉండేది. గంగాధర్ పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన తండ్రి చనిపోయాడు. అన్న రామకుమార్‌తో పాటు కలకత్తాలో నివసించసాగాడు. రామకుమార్ ఊరి చివరి కాళికాలయంలో ప్రధాన అర్చకుడు. బ్రాహ్మణ బాలురు విధిగా విద్యను అభ్యసించాలి.అధ్యయన అధ్యాపనాలు మాత్రమే జీవితానికి ఉపకరిస్తాయన్న నమ్మకం వారిది. అయినా గంగాధర్‌ను చదివించాలని అతని అన్నయ్య బడిలో చేర్పించాడు.
అయితే, ఈ లౌకిక విద్యలు ధనసంపాదన, ఐహిక సుఖాల కోసమే తప్ప మరో ప్రయోజనం లేదని భావించి గంగాధర్ బడి మానేసి, ఆ«ధ్యాత్మిక జ్ఞానాన్వేషణకు పూనుకున్నాడు. అన్నగారి మరణానంతరం, కాళికాలయంలో అర్చక బాధ్యతలను సంపూర్ణంగా చేపట్టాడు. దక్షిణేశ్వరం ఆయన ప్రధాన కార్యక్షేత్రమయ్యింది. 12 ఏళ్లు నిర్విరామ దీక్షతో అన్వేషణ సాగించాడు. ఏరోజుకారోజు " తల్లీ! మరొక రోజు వృధా అయిపోయింది. నీ దర్శనం కాలేదు.
తల్లీ నీ మనస్సు కరగదా? అమ్మా! నీ ఉనికి నిజమా? మిథ్యయా? అని విలపించేవాడు. అర్చకుడిగా అతడి పూజా విధానాన్ని చూసిన జనం అతనికి మతి భ్రమించిందని అనుకోసాగారు. ఏమైనా, తన 23వ ఏట తనకన్నా 18 ఏళ్లు చిన్నదయిన శారదామణీ దేవితో వివాహమయ్యింది. అయితే, ధర్మపత్మితో ఆయన సంబంధం విచిత్రంగా, విలక్షణంగా పరిణమించింది. భార్యా భర్తల మధ్య ఉండే సహజ సంబంధమేదీ లేకుండా ఆధ్యాత్మిక సాధనలోనే గడిపేవారు.
భార్యాభర్తలు ఇలా కేవలం సహధర్మచారులుగా జీవించిన ఏకైక సన్నివేశం చరిత్రలో వీరొక్కరిదేనని చెప్పుకోవచ్చు. శారదామణీ దేవి ఉదాత్త భావనతో భర్త భావాలు గ్రహించి, సానుభూతి చూపించింది. సంసారంలో బంధించనని, తోడునీడగా ఉంటూ సేవలందిస్తూ, భర్తనే దైవంగా భావించసాగింది. ప్రతి స్త్రీని తల్లిగా భావించి స్త్రీలందరిలో జగన్మాతను సాక్షాత్కరింప చేసుకోవటం తన విధిగా భావించేజీవితంలో అమలు పరచిన స్థిరచిత్తుడు. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి కోల్‌కతాలో స్థిరపడిన నిరక్షరాస్యుడు, ఇక చిన్న గుడిలో అర్చకుడు -పరమహంసయై బోధించాడు. వేదశాస్త్రాలు చదవలేదు.
జీవితానుభవం నుంచే పాఠాలు నేర్చుకున్నాడు. ఆధ్యాత్మిక సాధనలో అధిక భాగం స్వశక్తిపైనే ఆధారపడ్డాడు. తర్కవితర్కాలు కాదు- అనుభవం ఆత్మజ్ఞానం ముఖ్యమని వివరించాడు. తంత్రసాధనలో లోతులు చూసినా మగువ, మద్యం జోలికి పోకుండా కఠోర నిగ్రహం చూపేడు. సన్యాసి అయినా భార్యకు దూరంకాలేదు. కాషాయం ధరించ లేదు. పరివ్రాజకుడై తిరగలేదు. జాతి, మత, కుల, లింగ ప్రాంత దేశ బేధాలు యేమయినప్పటికీ అందరినీ ఆదరించి ఆధ్యాత్మిక మార్గోపదేశం చేసిన విశాల దృక్పథం ఆయనది. సర్వమత వాహినిలు సంగమించిన ఒక మహాసాగరం వలె భాసించింది శ్రీ రామకృష్ణుల జీవితం.
సకల శాస్త్రాల సజీవ భాష్యం
ఆయన ఆధ్యాత్మిక సాధనలో గల అన్ని మార్గాలనుఅనుష్టించి, ప్రతిమార్గంలో విజయం సాధించారు. అద్వైత సిద్ది ఆధ్యాత్మికానుభూతికి పరాకాష్ట అని, "సర్వం ఖల్విదం బ్రహ్మ'' అన్నది నిజమని నిరూపించే జగద్గురువై నాడు. ఇందుకు 'తొతాపురి'గురుత్వము నిమిత్త మాత్రముగా లభించినది. సకలశాస్త్రాల సజీవ భాష్యమే ఆయన జీవితం అంటారు వివేకానందులు. అన్ని మతాల గమ్యం ఒక్కటే అన్న అసత్యాన్ని - ముస్లిమ్, క్రిష్టియన్ వంటి మతాలనుఅభ్యసించి సాధన చేసి తెలియపర్చారు.
ఎన్ని మార్గాల ద్వారా, మతాల ద్వారా భగవద్దర్శనం పొందినా- కాళీమాతపై వెర్రిప్రేమ మాత్రం వదలలేదు. ఎంత జ్ఞానియో అంతభక్తుడు, అంత కర్మయోగి. 'ఏకమేవాద్వితీయం' అనేమహా సత్యమే అనాదినుంచి ఉన్నది. ఈ ధర్మమే నానా దేశాల నానా రూపాలను ధరిస్తోంది. ఈ రహస్యాన్ని గ్రహిస్తే మనకెవరితోనూ విబేధమూ, విరోధమూ ఉండదు అంటారు శ్రీరామకృష్ణులు. అద్వైత సిద్ధికైనా పరమాత్మ సాక్షాత్కారానికైనా పురుష ప్రయత్నం, శ్రమించటం ఎంతో అవసరం అని బోధించారా రామకృష్ణులు.
ప్రపంచాన్ని వదిలేయాలా?
చరమ దశ 7 సంవత్సరాల్లో అనేక మంది పండితులతో పామరులతో అనేక సంభాషణలు చేసేవారాయన. తన అనుభవాలను చిన్న చిన్న కథలుగా సులభ గ్రాహ్యమైన ఉపమానాలతో వెల్లడించేవారు. సన్యాసం స్వీకరిస్తాననే శిష్యులతో ఆయన ఇలా అనేవారు. "ప్రాపంచిక విషయ సుఖాలతో సంబంధం వదలగలిగితే చాలు... ప్రపంచాన్నే వదలి పోనక్కరలేదు. యమ నియమాలు అభ్యసించండి.
ఆత్మ సాక్షాత్కారానికి తీవ్ర యత్నం చెయ్యండి. ఫలితాల గురించి ఆతురత చెందకండి'' అని ఉపదేశించే వారు. ఆయన స్వయంగా ప్రవక్త కాడు, గ్రంథకర్త కాడు. కాని వారిని నీడ వలె అనుసరించి, ఆయన దినచర్యలో జరిగిన సంభాషణలను, సన్నివేశాలను గ్రంథస్తం చేసిన మాస్టర్ ఎం. (మహేంద్రనాథ్ దత్తా)శ్రమ ఫలితంగా పరమహంస బోధనలు లోకానికి అందాయి.
తన దివ్య సందేశ వ్యాప్తికై తగు శిక్షణనిచ్చి, నరేంద్రుని వివేకానందునిగా తీర్చిదిద్ది, తాననుభవంలోకి తెచ్చుకున్న ఆధ్యాత్మిక జ్యోతిని దేశ విదేశాలలో ప్రజ్వలింప చేసిన దార్శనికులు, ఆధునిక యుగ ప్రవక్త, ఆధ్యాత్మిక తేజో మూర్తి శ్రీ రామకృష్ణ పరమహంస.
- ప్రసాదవర్మ కామబుషి
0 వ్యాఖ్యలు:
Post a Comment