దుర్గాతత్వం
>> Thursday, October 13, 2011
దుర్గా దుర్గతి నాశిని అని అమ్మను స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం . దుర్గం అంటే శరీరం .ఈశరీరంలో ఉండే శక్తే దుర్గ . అదే ప్రాణశక్తి . ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం వలన మాత్రమే విశ్వమంతా నిలచిఉంది.
దుర్గాదేవి దశభుజాలు ,పంచప్రాణ,పంచోపప్రాణాలు దశప్రాణాలకు ,పంచజ్ఞానేంద్రియాలకు,పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం .దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది ..అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక .క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం .ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకుచేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే . మనలో అట్టి దుర్గాతత్వాన్ని పెంపొందించుకోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.
ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆశక్తిఉండాలి కానీ దివాంధం గుడ్లగూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు .దానిసూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరో పక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక .అది అత్యవసరం .అసత్ జ్ఞానం వీడి సత్ జ్ఞానంతో ఉండాలనేదానికి సంకేతం ఆవిడ వాహనం హంస.ాది నీటినివీడి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది . ఇంకోపక్కనుండే కుమారస్వామి దేవసేనాని ,ఆయనవీరత్వానికి ప్రతీక.ాట్టివీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి . నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు .అట్తిబ్రహ్మచర్యమందుండుటచే నెమలికన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ది గణపతి స్థానం.
అకారణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది . సిధ్ధికి భంగం కలుగకుండా ఉండాలంటే ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి . ఆన్నింటికీ అధిష్టాతగాఉన్న శివుడు త్యాగమునకు,అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిసూలం సత్వరజస్తమోగుణాలకు గుర్తు,వృషము అంటే ధర్మం .అదే ఆయనవాహనమైన నంది. అది నాలుగుకాళ్లపై ఉంటుంది .ఇలాపరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని సూచిస్తుంది.
0 వ్యాఖ్యలు:
Post a Comment