అన్నింటినీ భగవంతునికి నివేదించాలా ?
>> Monday, September 12, 2011
నిత్య జీవితంలో మన ఉపయోగానికి ఏది తెచ్చుకున్నా, ఆ పదార్థాలన్నింటిని భగవంతునికి నివేదించాలన్నారు. ఎందువల్ల? -సి. విజిత, తిరువూరు , కృష్ణాజిల్లా
భగవద్గీత మూడవ అధ్యాయంలో 13వ శ్లోకం ఇది
యజ్ఞ శిష్టాశనస్సక్తోముచ్చయన్తే సర్వకిల్చిషైః
తేత్వఘం భుంజతే పాపాః యే పచాన్త్యాత్మకారణాత్
ఈ శ్లోకానికి రామానుజుల వారి వ్యాఖ్యానం ఇలా ఉంది. పరమ పురుషుని ఆరాధన కోసం ద్రవ్యముల నార్జించి, వండి వానిని స్వామికి నివేదించి, ఆ శేషముతో తన శరీరమును పోషించుకొనువాడు. అనాదికాలం నుంచి తానార్జించిన పాపములన్నింటి నుంచి విముక్తుడవుతాడు. అలా చేయక, వాటితో కేవలం తన కడుపునే నింపుకొనువాడు పాపాన్నే తింటున్నాడు అని సాయించిరి. ఇదే భగవానుని అభిమతం. ఇలా భగవన్నివేదిత పదార్థములనే మన మెల్లప్పుడు ఉపయోగించాలనే నియమం భగవద్రామానుజ సిద్ధాంతంలో ఒక ముఖ్యాంశం. మరల, 17వ అధ్యాయం 10వ శ్లోకంలో భగవానుడిలా ఆనతిచ్చాడు.
యాత యామం గత రసం
పూతి పర్యుషితం చయత్
ఉచ్ఛిష్ట మపిచాయేథ్యం
భోజనం తామసప్రియమ్
ఈ శ్లోకానికి శ్రీ వేదాంత దేశికుల వారి తాత్పర్యం ఇలా ఉంది. మేథ అనగా యజ్ఞం. అనగా భగవదారా«థనం. దానికి తగినది మేథ్యం. అందుకు తగనిది అమేథ్యం. అనగా భగవంతుని ఆరాధనకు, నివేదనకు తగనిది. భగవంతునకు నివేదించబడనిది
తామసాహారమునబడుతుంది. అది పాపవర్థకం . సత్త్వగుణం అభివృద్ధి పొందడానికి సాత్త్వికాహారం అవసరం. పదార్థం సాత్త్విం కావడానికి భగవత్సంబంధం అవసరం. భగవత్ సంబంధం కలిగేది అర్చారాధన వల్లనే. మనం ఇంట్లోకి కొత్తది, తాజాది ఏ వస్తువు తెచ్చుకున్నా అది న్యాయంగా ఆర్జించినదైతే, దానిని శుభ్రం చేసి, ఒక తులసీ దళాన్ని దానిపై ఉంచి భగవంతునికి నివేదనం చేసి, ఆ స్వామి చూసి తృప్తిపడినట్లు భావించి, ఆయన ప్రసాదంగా ఆ నివేదిత పదార్థాన్ని సేవించాలి. బయట ఉడికించి తెచ్చిన వస్తువులు ఆరాధనకు పనికి రావు. ప్రేమతో నివేదిస్తేనే ఫలితం ఉంటుంది.
0 వ్యాఖ్యలు:
Post a Comment